Sunday, July 22, 2012


శ్రీ ప్రణబ్ ముఖర్జీ.
భావి భారత ఆశా కిరణంగా భారత దేశ 25వ ప్రథమ పౌరునిగాఎన్నికయి,  అఖండవిజయం సాధించిన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
మన కన్న తల్లి భారతాంబ తన ముద్దు బిడ్డలను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. 
అదే సమయంలో తాను తన ముద్దు బిడ్డలు యావద్భారతావనినీ ఆశ్రయించి జీవిస్తున్న తోటి బిడ్డలను దృష్టియందుంచుకొని అందరికీ ఆనందం కలిగించే విధంగా ధర్మ యుతంగా మెలగాలని ఆకాంక్షిస్తోంది.
ఐతే నేడు అనంత దురంతాలతో ఒకరినొకరు మోసం చేసుకోవటమే కాక సహృదయులైనవారి కెందరికో బాధాకరంగా ప్రవర్తిస్తూ శిక్షలనుండి తప్పించుకొంటూ, ఒక వేళ శిక్షలు పడినా రాష్ట్రపతి నుండి క్షమాభిక్ష పొందుతూ నిర్లజ్జగా యధాపూర్వకంగా ప్రవర్తిస్తున్న దుష్ట సంతతిపట్ల కఠినాతికఠినంగా ప్రవర్తించే, న్యాయాన్ని నాలుగు పాదాలా నడప గలిగే బిడ్డలు తనకు ఉండాలని కోఱుకుంటోంది.
అన్ని విధాలా ఆదర్శవంతమైన సరళిని అనుసరిస్తూ, సామాజిక ఆర్థిక, వైయక్తిక  జీవన విధానంలో ఆదర్శవంతమైన ప్రథమ పౌరుఁడుగా మన ప్రణబ్ ముఖర్జీ యావద్భారతీయులకూ ఆదర్శమూర్తి కావాలనీ, యావద్భారతీయులూ, ఆదర్శ వంతులైనవారి ఆదర్శ జీవన మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆదర్శవంతమైన జీవితం గడుపుట ద్వారా మన భారతాంబ కలలు పండించాలని మనసారా కోరుకొంటూ 
మరొక్క పర్యాయం 
25వ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీని మనసారా అభినందిస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

Saturday, June 16, 2012

సర్వానుగ్రహ హనుమద్ధ్యానము.

జైశ్రీరామ్. 

ప్రియ భగవద్బంధువులారా! 
భగవద్భక్తులకు భగవంతుని సేవకంటే కూడా భగవద్భక్తుల సేవ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. రాముని సేవ కంటే కూడా రామ భక్తుఁడైన హనుమంతుని సేవ మంచి ఫలితాన్నిస్తుంది. ఆ హనుమంతుని తలచుకొనినంతనే మనకు ఎటువంటి సత్ ఫలితాలు కగుతాయో, ఆ పరమ రామ భక్తుని మనం ఏ విధంగా ప్రార్థించాలో  క్రింది శ్లోకాల ద్వారా తెలుస్తుంది.
శ్లో:-
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
ఆ.వె:-
బుద్ధి, బలము, కీర్తి, పూజ్యమౌ ధైర్యము,
నిర్భయత, యరోగ నిగ్రహములు,
కన యజాఢ్యతయును, కమనీయ వాగ్ధాటిఁ
గొలుపు హనుమ తలపు, గురు తరముగ.
భావము:- 
హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రోగ రాహిత్యమును, అజాఢ్యమును, మంచి వాగ్ధాటిని, సంప్రాప్తింప చేస్తుంది.
శ్లో:-
ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః శ్రద్ధాః పుత్రా సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ  కపి నాథ నమోస్తు తే.
తే.గీ:-
ఆయువును, ప్రజ్ఞ, కీర్తియు, నమర చేసి,
శ్రద్ధ, పుత్ర సుశీలత లొద్దిక నిడి,
సౌఖ్య మారోగ్యమమరంగ చక్కఁ గనుమ!
ప్రార్థనలుసేతు గనుమయ్య! భక్త హనుమ!
భావము:-
ఓ రామ భక్త హనుమా! నిన్ను ప్రార్థన సేతును. నాకు ఆయుర్దాయమును, మంచి ప్రజ్ఞను, సత్కీర్తిని, శ్రద్ధను, సత్పుత్రులను, సౌశీల్యాది సద్గుణములను, సౌఖ్యమును, ఆరోగ్యమును, అమరునట్లు కరుణతో చూడుము.
్

చూచారుకదండీ! మీరు ఆ హనుమద్వరసిద్ధులగుదురుగాక.
జైహింద్.

Friday, June 8, 2012

పాఠ్య పుస్తకాలలో వందేమాతరం గీతం భావి భారత పౌరుల్ని పాడు చేస్తుందా???


జైశ్రీరామ్. 
హరి సేవ బ్లాగులో 
ముందు వీళ్ళకు నేర్పాలి మనదైన చదువును. అనేశీర్షికతో
దుర్గేశ్వర రావు గారు వ్యక్తం చేసిన ఆవేదన చూడండి.
ఈరోజు రాజీవ్ విద్యామిషన్ తరపున  ఉపాధ్యాయులకిస్తున్న వృత్యంతరశిక్షణలో   నేను మాట్లాడవలసి వచ్చినది . మారిన    పాఠ్య పుస్తకాలలో  వందేమాతర గీతం   తొలగించినా  ఎవరికీ   చీమ కుట్టినట్లు లేదు . ఇక  అన్నం పెడుతున్న  ప్రభుత్వ పాఠశాలలను బ్రతింకించుకోవాలంటే  తెలుగు భాషను బ్రతికించుకోవాలనే విషయాన్ని గూర్చి గట్టిగా వాదనలు లేవు.
 ఇక మూడవతరగతి తెలుగువాచకంలో ఇతిహాసకథలలో భీముడు రాణివాసంలో పుట్టినట్లుగా పెరిగినట్లుగా వ్రాసారు.  కోట్లరూపాయలు వెచ్చిస్తున్న పాఠ్యపుస్తక నిర్మాణంలో ప్రమాణాలు ఎలా తగలబడుతున్నాయో ఇదొక ఉదాహరణ. కనీసం భారతంగూర్చి అవగాహన కూడా లేదా వీల్లకు అనే అనుమానం కలుగుతుంది .  మొదటి పాఠంలో ఉన్న పాటలో పదాలు ప్రాసకోసం కూర్చినట్లుందిగాని  ప్రామాణికంగా లేదు. సఎ మూడొతరగతికే కదా అనుకున్నా వ్రాసిన పంతులుగారికి భాషపై ఉన్న  అవగహన  ఇంతేనా అనిపిస్తుంది తెలిసినవారికి.
ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం ఎండకు మాడిపోతూ రావటం పోవటమే  పెద్ద శిక్ష[ణ]గాఉంది అని వాపోతున్న పంతుల్లశాతం ఎక్కువ. 
 ఇక కుర్రకారు పంతుళ్ళసంగతి  చెప్పనక్కరలేదు .మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల  సరైన అవగాహనా ,అభిమానం ఉన్నట్లనిపిమ్చటం లేదు .  వీళ్ళలో ఎక్కువమందికి  ఇంగ్లీషు చదువులు ,మార్కుల పరిక్షల విధానంలోనే చదువులు సాగాయనిపిస్తున్నది . 
ఇప్పుడే  ఓ ఆలోచనచేస్తున్నాను . మానవీయ విలువలు బోధించే భారతభాగవత రామాయణా దులను విరిచే వచనభాగంగానైనా చదివిమ్పచేయాలి . అందుకోసం ముందుగా వచన రామాయణాన్ని సాధ్యమైనంత మందికి అందించాలి . వీరిచే  చదివించాలి 
జైశ్రీరాం.
ఇది చదివి స్పందించని హిందువు ఉండడంటా అతి అతిశయోక్తి కానేరదు.
వందేమాతర గీతం   తొలగించిన అంశం చదివిన శ్రీ రాజ శేఖరుని విజయ శర్మ గారి స్పందన చూడండి.   
నిన్న దుర్గేశ్వర్ గారినుండి వచ్చిన మెయిల్ చదివాను. అందులో పాఠ్యపుస్తకాలనుండి " వందేమాతర గీతం" తొలగించారన్న విషయం చదివి చాలా బాధ కలిగింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏదైనా కార్యక్రమం వంటిది రూపొందిస్తే బాగుంటుంది. ఎన్ని జరుగుతున్నా చూస్తూ కూచుంటే త్వరలో మన దేశంలో రామా అనడం కూడా నేరమౌతుంది. ఏదో ఒక కదలిక రావాలి. ఏమిచేద్దామనేది సూచించండి. నేను సిద్ధం.    
భారతీయుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించి, ప్రజల గుండెల్లో అఖండ స్వేచ్ఛా జ్యోతిని వెలిగించిన గీతం వందేమాతరం. ఈ గీతం 7 నవంబర్ 2011 తో 134 ఏళ్లు పూర్తి చేసుకుంది. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1877 నవంబర్‌ ఏడో తేదీన బెంగాలీ నవల 'ఆనంద్‌ మఠ్‌'లో భాగంగా దేశాన్ని కీర్తిస్తూ రాసిన పధ్య ప్రబంధమే వందేమాతరం.
ఈ వందేమాతరం... సుమారు అర్థ శతాబ్దం పాటు దేశ స్వాతంత్రోద్యమ స్పూర్తి గీతమై, కోట్లాది మంది భారతీయుల హృదయాలు, రక్తంలో జీర్ణించుకుపోయింది. అలాగే.. అనంతర కాలంలోనే కాలంతో పాటు.. కుంచించుకుపోయింది. ఛటర్జీ రాసిన వందేమాతరం ఆరు చరణాలతో, అనంత రాగ ఐక్యతా సుగంధమై భాసిల్లిన ఈ గీతాన్ని 1896 కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. 1905 బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో ఈ గీతం ఊపందుకుంది.
భారత స్వాతంత్ర్య తారక మంత్రంగా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత వందేమాతరానికి ప్రధమ ప్రాధాన్యమివ్వాలని పెద్దలు ఆలోచించినా వందేమాతరం వివాదాల సుడిలో చిక్కుకోవడం ఇష్టం లేక ఆ ప్రయత్నాన్ని మన పాలకులు విమరించుకున్నారు. అయినా అడపాదడపా వందేమాతరంపై వివాదాలు మాత్రం ఇప్పటికీ చెలరేగుతూనే ఉన్నాయి.
గత 2006, ఆగస్టు 22న దేశంలోని ఉభయ సభలలో విస్తృత చర్చ జరిపి పాఠశాలలో వందేమాతరం తప్పనిసరి కాదని తేల్చాయి. అంతేకాకుండా.. భారత మాతను కీర్తిస్తూ సాగే ఈ గీతాన్ని ముస్లీంలు వ్యతిరేకించడంతో, 1935లో జరిగిన సమావేశంలో వందేమాతరాన్ని రెండు చరణాలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం మనం పాడుకుంటున్న వందేమాతర గీతం కుదించబడినది.
ప్రస్తుత వందేమాతర గీతం:-
వందేమాతరం! వందేమాతరం!
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం !
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ !
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం !
వందేమాతరం! వందేమాతరం!
పూర్తి వందేమాతర గీతం (సంస్కృతం):-
వందేమాతరం వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
షష్ఠీకోటి-కణ్ఠ-కల-కల-నినాద-కరాలే
ద్విషష్ఠికోటి-భుజై ధ్రుత-ఖరకరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల-ధరిణీం నమామి తారిణీం
రిపుదల-వారిణీం మాతరం ||
తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వాం హి ప్రాణాహ్ శరీరే ||
బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే ||
త్వాం హి దుర్గా దశప్రహరణ ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |
శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం భరణీం మాతరం ||
వందే మాతరమ్. వందే మాతరమ్||
చూచారు కదా! ఇటువంటి పునీత హృదయులకు అంద్సరూ అండ దండగా ఉండి న్యాయాన్ని, ధర్మాన్ని నిలపెట్ట వలసిన బాధ్యత ప్రతీ భారతీయుఁడు మీదా ఉంది. 
నమస్తే.
జైహింద్

Sunday, April 8, 2012

సేవా లైవ్ వారి అభ్యర్ధనచూడండి. సహకరించండి.సహకారం పొందండి.


అభ్యర్ధన 
నమస్తే!
' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.comమెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.
మా అభ్యర్ధనను  మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ... 
సదా సేవలో,
-కంచర్ల సుబ్బానాయుడు,
సంపాదకులు, సేవ
http://sevalive.com/ 

Tuesday, April 3, 2012

శ్రీ నందన ఉగాది శుభాకాంక్షలు. వత్సర ఫలం వీక్షించండి.

ఓం. శ్రీ గురుభ్యోనమః.
ఓం శ్రీ మహా గణాధిపతయేనమః.   ఓం శ్రీ మాత్రేనమః.   ఓం శ్రీసరస్వత్యైనమః.
ప్రియ పాఠక మహాశయులారా! 
స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పడ్యమీ శుక్ర వారం ఆంధ్ర వత్సరాది సందర్భంగా ఆంధ్రామృత పాఠకులైన మీ అందరికీ, యావదాంధ్రులకూ, యావద్భారతీయులకూ, యావజ్జనానీకానికీ శుభాకాంక్షలు తెలియ జేసుకొంటున్నాను.
శ్రీకల్యాణ మనోజ్ఞ భావ విలసత్ శ్రీ నందనాఖ్యాబ్ధిలో
శోకాతీత విశిష్ట సౌఖ్య ఫలముల్ శోభిల్లఁ జేయున్ మిమున్.
లోకేశుండు మదిన్ వసించు కుమతిన్, లోలత్వమున్ బాపుచున్.
శ్రీకారంబును జుట్టఁ జేయు తమచే శ్రేయంబులన్ జేయగా.
ఉగాది సందర్భముగా పంచాంగ  పఠన శ్రవణ ఫలము లసాధారణమైనవి.
తిథేశ్చ శ్రియమాప్నోతి - వారా దాయుష్య వర్థనం,
నక్షత్రాత్ హరతే పాపం, - యోగాద్రోగ నివారణం,
కరణాత్ కార్య సిద్ధిశ్చ. - పంచాంగ ఫలముత్తమమ్.
కాలవిత్ కర్మకృత్ ధీమాన్ - దేవతానుగ్రహం లభేత్.
తిథియ శ్రీలను కలిగించుదివ్యముగను
వారమాయువు నొసగును, ప్రగణితముగ
పాపహరణము నక్షత్ర మోపి చేయు
యోగమది రోగములు బాపి యోగములిడు,
కరణ మది కార్య సిద్ధిని కలుగఁ జేయు.
ఇట్టి పంచాంగమును విను దిట్టలకును.
కాల మెఱిగి కర్మలుచేయు ఘనుల కెపుడు
దేవతానుగ్రహము కల్గు దివ్యముగను.
ఈ రోజు తిథ్యాది పంచాగములం గూర్చి తెలుసుకొందము.
శ్రీ నందన నామ సంవత్సరం.
తిథి: చైత్ర శుద్ధ పాడ్యమి రాత్రి  గం.08.35 ని.ల వరకు,
వారము: శుక్ర వారము.
నక్షత్రం: ఉత్తరాభాద్ర నక్షత్రము. పగలు గం. 12.34ని.ల వరకు.
యోగము: బ్రహ్మ యోగము ఘ.౫౧.౨౦ వరకు.
కరణము: కింస్తు కరణము. ఘ.౦౭.౨౪. వరకు.
ఈ  నందన  సంవత్సర ఫలము.
నందనాబ్దే ఖిలా పృథ్వీబహు సస్యార్ఘవృష్టిభిః.
ఆనందాఖిలానాంచజంతూనాంచ మహాభుజామ్.
నందన సంవత్సరమున భూమి అన్ఏక పంటలతోను, వెలతోను, వర్షములతోను వర్ధిల్లును. అంతటా ఆనందము నిండి యుండును. 
నవ నాయకులు - కలిగే ఫలితములు.
౧. రాజు. శుక్రుఁడుః  
సమృద్ధ సస్యా వసుధాతివృష్టిః. -  గావోహి సంపూర్ణ పయః ప్రదాస్స్యుః
స్త్రియః ప్రియాణాం జనయంతి తోషం - కామోపచారైః భృగుజేబ్ధనాధే.
భూమి సస్యములతో నిండి యుండును. వానలు అధికముగా కురియును. ఆవులు, పసువులు సమృద్ధిగా పాలనిచ్చును. స్త్రీలు కామోపచారములతో తమ ప్రియులను ఆనందపరచెదరు.
౨. మంత్రి. శుక్రుఁడు.
సువృష్టిః సర్వ సస్యాని, - సర్వే ధర్మ రతాః ప్రజాః.
క్షేమారోగ్యే  సుభిక్షం స్యాత్ - మంత్రణ్యబ్దే భృగౌ యది.   
సర్వ సస్యములకు అనుకూలముగా వర్షములు కురియును. ప్రజలు ధర్మమునందు ఆసక్తి కలిగి యుందురు.ప్రజలందరూ ఆరోగ్యముగా సుభిక్షముగా నుందురు.
రాజు మంత్రి ఒకరే. ఐనచో కలుగు ఫలము.
స్వయం రాజా స్వయం మంత్రీ - యస్మిన్నబ్దే యదా భవేత్
చోరాగ్ని శస్త్ర బాధాచ - పీడ్యంతే భూభుజాదయః.
రాజు మంత్రి ఒకే గ్రహమునకు సంభవించినచో రాజులు అగ్ని, చోర, శస్త్రములచే బాధింప బడుదురు.
౩. సేనాధిపతి. గురుఁడు 
నృపాస్సదా సద్విధి సంప్రవృత్తాః - విప్రాస్సదా వేద విధి ప్రవృత్తాః.
జనాస్సదా సంభృత ధర్మ వృత్తాః - సైన్యాధిపత్యే సురమంత్రిణశ్చ.పాలకులు సత్కర్మలయందు శ్రద్ధ చూపెదరు. బ్రాహ్మణులు వేద ప్రోక్త యజ్ఞ యాగాదులనాచరించెదరు.ప్రజలు ధర్మమునందు ఆసక్తి చూపెదరు.
౪. సస్యాధిపతి. చంద్రుఁడు.
జల ధాన్యాని సర్వాణి స్థల ధాన్యాని యానిచ
వృక్ష జాతిస్సుఫలితా చంద్రే సస్యాధిపతే.
జల  ధాన్యములు, స్థల ధాన్యములు, వృక్ష జాతులు చక్కగా ఫలించును.
౫. ధాన్యాధిపతి. శని.
కృష్ణ ధాన్యాని సర్వాణి సూక్ష్మ ధాన్యాని యానుచ
కృష్ణ భూమిస్సుఫలితా ధాన్యాధీశే శనైశ్చరే.
నల్లని ధాన్యములు, చిఱు ధాన్యములు, నల్ల రేగడి భూములు చక్కగా ఫలించును.
౬. అర్ఘాధిపతిః గురుఁడు.
సువృష్టి ర్ధాన్య ధనైర్విరాజితా - భూమిర్మహా యజ్ఞపరైర్మహీసురైః.
నిత్యోత్సవైర్మంగలతూర్యనిస్వనైః - అర్ఘాధిపే దేవగురౌచ శశ్వత్.
భూమి వర్షముల చేత ధన ధాన్య సంపదల చేత నిండి యుండును. బ్రాహ్మణులు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుచుందురు. మంగళ వాయిద్యములచేత నిత్యము ఉత్సవముల్ జరుగు చుండును.
౭. మేఘాధిపతిః గురుఁడు.
సస్యార్ఘ వృష్టిభిస్తుష్టా - భవేద్ధాత్రీ నిరంతరం.
వీత రోగ భాయాస్సర్వే - మేఘాధీశే బృహస్పతౌ.
రోగములు లేనివారై ప్రజలు నిరంతర సస్యముల చేయ, వర్షముల చేత సంతోషముగా ఉందురు. ధరలు అందుబాటులో ఉండును.
౮. రసాధిపతి. బుధుఁడు.
శశి తనయే రస నాధే సుపిప్పలీశొంఠి హింగులశునాని
ఘృత తైలాద్యం నిఖిలం దుర్లభ మిక్షూద్భవంశకలమ్.
పిప్పళ్ళు, శొంఠి, ఇంగువ, ఉల్లిపాయలు, నెయ్యి, నూనెలు, బెల్లము మున్నగు రస వస్తువులు దుర్లభముగా నుండును.
౯. నీరసాధిపతిః చంద్రుఁడు.
ముక్తాఫలం రత్న బీజకాంస్యాది వస్త్రాభరణాని సర్వం
వృద్ధిం గత్యాశు భవన్తి లోకే చంద్రో యదా నీరస నాయకో భవేత్.
ముత్యములు, రత్నములు, సువర్ణము, కంచు, మున్నగు లోహములు వస్త్రములు, ఆభరణములు మున్నగునవి విరివిగా లభించును.
ఉప నాయకులు ౨౧ మంది.
౧.పురోహితుఁడు - చంద్రుఁడు.
౨. పరీక్షకుఁడు - రవి.
౩. గణకుఁడు - కుజుఁడు.
౪. గ్రామ పాలకుఁడు - శుక్రుఁడు.
౫. దైవజ్ఞుఁడు - గురుఁడు.
౬. రాష్ట్రాధిపతి - శుక్రుఁడు.
౭. సర్వ దేశోద్యోగపతి  - శుక్రుఁడు.
౮. అశ్వాధిపతి - శుక్రుఁడు.
౯. గజాధిపతి - చంద్రుఁడు.
౧౦. పశువులకధిపతి - గురుఁడు.
౧౧. దేవాధిపతి - చంద్రుఁడు.
౧౨. నరాధిపతి - గురుఁడు.
౧౩. గ్రామాధిపతి - రవి.
౧౪. వస్త్రాధిపతి - బుధుఁడు.
౧౫. రత్నాధిపతి - శుక్రుఁడు.
౧౬. వృక్షాధిపతి - శని.
౧౭. జంగమాధిపతి - చంద్రుఁడు.
౧౮. సర్పాధిపతి - కుజుఁడు.
౧౯. మృగాధిపతి - గురుఁడు.
౨౦. శుభాధిపతి - శుక్రుఁడు.
౨౧. స్త్రీలకధిపతి - గురుఁడు.
క్రూరగ్రహ ఫలం క్రూరమ్ - శుభ గ్రహ ఫలం శుభం.
పురోహితాది సర్వేషాం - భవేదీశ సముద్భవమ్.
పురోహితాది ఉపనాయకులు క్రూరగ్రహములు క్రూర ఫలమును, శుభ గ్రహములు శుభ ఫలమును కలుగ జేయుదురు.
ఈ సంవత్సరము  పశు పాలకుఁడు, గోష్ట ప్రాపకుఁడు, గోష్ట బహిష్కర్త శ్రీ కృష్ణుఁడు. 
దాని ఫలితము.
పశువృద్ధిస్సుభిక్షంచ బహు సస్యార్ఘసంపదః.
సంపూర్ణ తృణ వృద్ధిశ్చ గోపాలే పశు నాయకే.
పశువులు ఆరోగ్యముగా నుండును.సుభిక్షముగా నుండి అభి వృద్ధినిపొందును. తృణ సమృద్ధి కలుగును. పసువులు సుఖముగా పాలను ఇచ్చును.  ధరలు అనుకూలముగా ఉండును.
ఆఢక నిర్ణయము:
ఈ సంవత్సరము ౪ కుంచముల వాన. ౮భాగములు సముద్రమున, ౯ భాగములు పర్వతములందు, ౩ భాగములు భూమిపైన పడును.
కుంచము౨౩-౩-౨౦౧౨ నుండి౧౬-౫-౨౦౧౨ వరకు బాల గోప హస్తమందు, ఫలితము వర్ష లేమి.గోప హస్తమగుటచే సుభిక్షము.
అప్పటి నుండి ౪-౮-౨౦౧౨ వరకువృద్ధ బ్రాహ్మణుని చేతియందు, దుర్భిక్షము, సస్య నాశము.
నాటి నుండి ౮-౧౧-౨౦౧౨ వరకు బాల గోపకుని చేతి యందు, ఫలితము వర్ష లేమి.గోప హస్తమగుటచే సుభిక్షము.
నాటి నుండి వత్సరాంతము యౌవన గోపకుని చేతు యందు ఉండును.సుభిక్షము, ఆరోగ్యము, సంపదలు కలుగును.
పుష్కర్తములు.: ౮.౫.౨౦౦౧౧ నుందె ఇ ౧౯.౫.౨౦౧౧ వరకు.ఆ ప్రాంతము వారికి శుభ కార్యములు నిషిద్ధము.
మూఢము:
వైశాఖ శు.౮ఆది వారము౨౯-౪-౨౦౧౨ నుండి జ్యేష్ట శు.౮మంగళవారం ౨౯-౫-౨౦౧౨ వరకు గురు మూఢము.
జ్యేష్ట శు.౧౧శుక్రవారం ౧-౬-౨౦౧౨ నుండి జ్యేష్ట బ.౭ ఆదివారం ౧౦-౬-౨౦౧౨ వరకు శుక్ర మూఢము.
మాఘ శు.౬ శనివారం ౧౬-౨-౨౦౧౩ నుండి వత్సరాంతము శుక్ర మూఢ్యమి.
వివాహాది శుభ కార్యములు నిషిద్ధము.
మకర సంక్రాంతి: ౧౪.౧.౨౦౧౩ సోమ వారము, ధనిష్టా నక్శత్రమున మేష లగ్నమున పగలు గం.౧౨.౦౯ని.లకు రవి మకరమున ప్రవేశించును.
గ్రహణములు:
తే.20-5-2012.దీని సూర్య గ్రహణము. 
౪-౬-౨౦౧౨ చంద్ర గ్రహణము.
౧౩-౧౧-౨౦౧౨ సూర్య గ్రహణము.
౨౮-౧౧-౨౦౧౨చంద్ర గ్రహణము.
పై నాలుగూ మన దేశమున కనిపించవు.
ఆదాయ వ్యయములు:

మేషమునకు       ఆదాయము 2 వ్యయము 8. 
వృషభమునకు    ఆదాయము 11 వ్యయము 14.
మిధునమునకు   ఆదాయము 14 వ్యయము 11. 
కర్కాటకమునకు  ఆదాయము  8 వ్యయము 11. 
సింహమునకు      ఆదాయము 11 వ్యయము  5. 
కన్యకు                 ఆదాయము 14 వ్యయము 11.
తులకు                ఆదాయము 11 వ్యయము 14.
వృశ్చికమునకు    ఆదాయము   2 వ్యయము  8. 
ధనుస్సునకు       ఆదాయము   5 వ్యయము 14. 
మకరమునకు      ఆదాయము   5 వ్యయము  5. 
కుంభమునకు      ఆదాయము   5 వ్యయము  5. 
మీనమునకు        ఆదాయము   5 వ్యయము 14. 

రాజ పూజ్య అవమానములు: 
మేషం .              రాజపూజ్యము 1 అవమానము 7.
వృషభం             రాజపూజ్యము 4 అవమానము 7
మిధునం.          రాజపూజ్యము 7 అవమానము 7.
కర్కాటకం          రాజపూజ్యము 3 అవమానము 3.
సింహం              రాజపూజ్యము 6 అవమానము 3.
కన్య                   రాజపూజ్యము 2 అవమానము 6
తుల                  రాజపూజ్యము 5 అవమానము 6.
వృశ్చికం             రాజపూజ్యము 1 అవమానము 2. 
ధనుస్సు            రాజపూజ్యము 4 అవమానము 2.
మకరం               రాజపూజ్యము 7 అవమానము 2.
కుంభం               రాజపూజ్యము 3 అవమానము 5.
మీనం                  రాజపూజ్యము 6 అవమానము 5.
కందాయ ఫలములు: 
అశ్విని           2   .   1   .   0.
భరణి             5   .  2   .   2.
కృత్తిక            0   .  0   .   4.
రోహిణి           5   .   2   .   2.
మృగశిర         0   .  0   .   4.
ఆరుద్ర            3   .   1   .   1.
పునర్వసు      6   .   2   .   3.
పుష్యమి         1    .   0  .    0.
ఆశ్లేష             4    .  2   .   1.
మఖ              7    .  2   .   4.
పుబ్బ            2    .  0   .   1.
ఉత్తర             5    .  1   .   3.
హస్త               0   .  2   .   0.
చిత్త                3    .  0  .   2.
స్వాతి             6    .  1  .   4.
విశాఖ            1   .   2   .   1.
అనూరాధ       4   .   0  .   3.
జ్యేష్త               7   .   1    .   0.
మూల             2   .   2   .   2.
పూర్వాషాఢ     5  .   0   .   4.
ఉత్తరాషాఢ       0  .    1    .   1.
శ్రావణం           3  .    2    .  3.
ధనిష్ట              6  .    0    .  0.
శతభి               1   .   1     .   2.
పూర్వాభాద్ర     4    .   2    .   4.
ఉత్తరాభాద్ర       7   .   0    .    1.
రేవతి.              2   .   1    .    3.
బేసి సంఖ్య ధన లాభము
సమ సంఖ్య సమ లాభము.
సున్న సూన్య ఫలము.
ఒకటి, రెండు సున్నలు భయము.
మూడవ సున్న  హాని.
సంవత్సర ఫలము:
అశ్విని . పుష్యమి . స్వాతి . అభిజిత్తు వారలకు ధన లాభము.
భరణి . ఆశ్రేష . విశాఖ .  శ్రవణం వారలకు మనస్తాపం.
కృత్తిక . మఘ . అనూ . ధనిష్ఠ వారలకు రాజపూజ్యము.
రోహిణి . పుబ్బ . జ్యేష్ఠ . శతభిషం వారలకు యుద్ధభయం.
మృగశిర . ఉత్తర . మూల . పూర్వాభాద్ర వారలకు అలంకార ప్రాప్తి.
ఆర్ద్ర . హస్త . పూర్వాషాఢ . ఉత్తరాభాద్ర వారలకు రోగ భయం.
పునర్వసు . చిత్ర . ఉత్తరాషాఢ . రేవతి వారలకు ఆయుర్వృద్ధి.
సర్వాణి సన్మంగళాని భవంతు.
స్వస్తి

Tuesday, March 6, 2012

శ్రీ నడుపూరి దేముడు మాష్టారికి అభినందన నవరత్న మాలిక.


జైశ్రీరామ్.
శ్రీరస్తు                         శుభమస్తు                అవిఘ్నమస్తు.
ప్రభుత్వ పట్టభద్ర కళాశాల, చోడవరం పౌరశాస్త్రోపన్యాసకులు, ప్రియ మిత్రులు,  
శ్రీ నడుపూరి దేముడు
తే. 29- 02 - 2012దీని పదవీ విరమణ చేయుచున్న  సందర్భముగా 
చింతా రామ కృష్ణా రావు
అందఁజేసిన 
అభినందన నవరత్న మాలిక.     
1) శా:- శ్రీ దేవీ హృదయాబ్జ భృంగ! రమణా! ప్రేమామృత స్వాంతుఁడై
భూదేవీ వరపుత్రుఁడై వెలుగు నీ పుణ్యాత్ముఁడౌ దేముఁ డీ
వేదాత్ముం డిట పొందుచుండె పదవిన్ విశ్రాంతి నీవేళలో
భూదేవీ వర పుత్రు దేముని కృపన్ పూజ్యుండ! దీవింపుమా!
2)సీ:-నడుపూరి నూకన్న నయవర్తి యగు సము
ద్రము కన్న ముద్దుల తనయుఁడవయ!
దేవాలయము కాగ గోవాడ, యంభేరు
పురమున జనియించి పెరిగితివయ.
గోవాడలో కొంత, కొంత చోడవరము
న ననకాపల్లిలో, నయ, వినయద
విద్యనేర్చి, విశాఖ విశ్వ విద్యాలయ
మున చదివి, నెగడి ఘనుఁడవైతి.
గీ:- చిన్న నాటనె దైవాంశ మిన్న యగుచు
నీదు వర్తనన్ వెలుగొంద, నిన్నుఁ జేరి
నీదు నీడగా మెలిగిరి నేర్పరులిల.
పూర్ణ సత్ పుణ్య! దేముఁడా! పూజ్య తేజ!
3) సీ:- ఎనుబదియైదులో వినుత ప్రియాగ్రహా
రమున జేయల్లుగా సుమతిఁ జేరి,
నాలుగేండ్లచ్చట జ్ఞాన బోధను చేసి,
ఎన లేని సత్కీర్తి నెదిగినావు.
ఎనుబది తొమ్దిలో ఘనుఁడ! నర్సీపట్ణ
మును జేరి, ఏడేండ్లు మనితి వచట.
తొంబది యైదులో సంబరంబున చోడ
వరముచేరి పదేండ్లు వరలితీవు.
గీ:- పదవి నున్నతిపొందితి. పట్టభద్ర
కళలశాలకు చేరి సద్ఘనత చూపి
రెండువేలారు నుండి నీవుండితివిట
చోడవరమున వరమయి, సుజన పూజ్య!
4)ఉ:-అక్షయ సుప్రసన్నసుమహాద్భుత భారతి నేలుదీవ!య
ధ్యక్షుఁడవీవె దీనుల మహద్వర సంస్థలకెల్లచోట్ల. య
ధ్యక్షుఁడవీవె బోధకుల ధైర్యము గొల్పెడి సంస్థకున్. సదా
రక్షణ భారమున్ వలచి రాజిల స్నేహ గవర్ణరైతివే!
( చంపక, కంద, తేటగీతిద్వయ, ఆటవెలది గర్భ సీసము )
5)సీ:-భువి మన దేముఁడే కవుల పుణ్య నవాశ్ర
య క్రాంతి రేఖయై యమరె నిచట.
ప్రవిమలుఁడైన యీ ప్రవర రంజక పుణ్యుఁడు
ప్రాగ్వివర్థియౌ సుప్రవరుఁడు.
భవ జను లెన్ననౌ సవిధ భాగ్య నవోజ్వ
ల క్షాంతి వార్థియౌ శ్రయ ధనుండు.
సువినుతుఁడైన యీ సుజన శోధిత దేవుఁ
డు శ్రోత్రియుండునౌ. సుశ్రుతమిది.
తే.గీ:- సకల సుగుణ కలిత సరసమతి యితఁడు.
సకల సుజన వర ధిషణ సుకరుఁడు నగు.
సుకృత ఫలములితఁడు శోభిత కృతియౌను.
వందనీయుఁడితఁడు భవ్య వర్తి భువిని.
5a)చ:-భువి మన దేముఁడే కవుల పుణ్య నవాశ్రయ క్రాంతి రేఖయై,
ప్రవిమలుఁడైన యీ ప్రవర రంజక పుణ్యుఁడు ప్రాగ్వివర్థియౌ.
భవజను లెన్ననౌ సవిధ భాగ్య నవోజ్వల క్షాంతి వార్థియౌ
సువినుతుడైన యీ సుజన శోధిత దేవుఁడు, శ్రోత్రియుండునౌ.
5b) క:- మన దేముఁడే కవుల పు 
ణ్య నవాశ్ర య క్రాంతి రేఖయై, ప్రవిమలుఁడై ,
జను లెన్ననౌ సవిధ భా 
గ్య నవోజ్వల క్షాంతి వార్థియౌ సువినుతుఁడై.
5c) తే.గీ:- కవుల పుణ్య నవాశ్రయ క్రాంతి రేఖ. 
ప్రవర రంజక పుణ్యుఁడు ప్రాగ్వివర్థి.
సవిధ భాగ్య నవోజ్వల క్షాంతి వార్థి. 
సుజన శోధిత దేవుఁడు శ్రోత్రియుండు.
5d) ఆ:- సకల సుగుణ కలిత సరసమతి యితఁడు. 
సకల సుజన వర ధిషణ సుకరుఁడు.
సుకృత ఫలములితఁడు శోభిత కృతియౌను. 
వందనీయుఁడితఁడు భవ్య వర్తి.
6)చ:-ఎద యెదలో వసించు వర మీశ్వరుడిచ్చెనొ? సద్గుణాంబుధీ!
మృదుల వచోవిలాసమున మేలుగ బోధన చేయు నిన్ను స
ద్బుధులును, బోధకుల్, ప్రజలు, బుద్ధిగ పాఠమునేర్చు పిల్లలున్
మధురగుణాలమంచు తమ మానసమందు వసింప జేసిరే !
7) సీ:- కష్టంబులందున్న కఠినాత్మునైనను 
కాచెడుగుణ మీకు కలుగుటరుదె?
దుష్టాత్మునైనను దురిత దూరుగ చేయు 
విజ్ఞానివగుటది వింత యగునె?
అప్పులిప్పించి యా యప్పులు తీర్చగ  
భూములమ్మెడి నీకు  పోలొకెవరు?
దేవేరి లేనట్టి దేముఁడ! నీతోడ 
దేవేరులున్న యా దేవు లగునె?
నిత్య సంతోష, సద్భావ, నిరుపమ దయ, 
జ్ఞాన, బోధన, భాషణ, కలయ గలిపి
దేవుఁడుండ, నంతకు మించి దేముఁడుండు 
ననుచు ప్రజ నిన్నుఁ బొగడంగ యమరితీవు.
8)చ:-నిరుపమ ధీ విశాల! కడు నేర్పున నోర్పున నీ ప్రజాళికిన్
వరముగ నిల్చి, కావగ నవారిత శక్తిసమన్వితుండవై
ధర శత వర్షముల్ బ్రతికి, ధన్యత గూర్చుము నీ ధరిత్రికిన్.
స్థిరముగ నీదు కీర్తి నలు దిక్కుల వ్యాప్తిల వృద్ధి నొందుమా!
9) క:- మంగళమగు సజ్జనులకు.
మంగళమగు దేవులకును! మాన్యుఁడ! నీకున్
మంగళమగు! జీవింపుము
మంగళ కరముగ నిరతము. మంగళ రూపా!
మంగళం                           మహత్.                            శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ.
జైహింద్.

Monday, February 27, 2012

చినపాచిలిలో అష్టావధాన ప్రశ్నలు.

జైశ్రీరామ్.
సదసద్వివేక సంపన్నులారా!
తే.౩౦ - ౧౧ - ౨౦౧౧ దీ న  విశాఖపట్టణం జిల్ల రావికమతం మండలం చినపాచిలి గ్రామంలో శ్రీ వైష్ణవీదేవి ప్రతిష్టాపన సందర్భంగా అష్టావధానం జరిగింది.
అవధాని శ్రీమాన్ భద్రం వేణు గోపాలాచార్యులు గారు.
ఈ అవధానంలో పృచ్ఛకుల ప్రశ్నలను ముందు చూద్దాము.
తరువాత అవధానం జరిగిన విధానం మీ ముందుంచగలను.
౧. సమస్యా పూరణముః-
భార్యకు మీసముల్ మొలిచె. బాపురె భర్తకు గర్భమయ్యెనే.
౨. దత్త పదిః-
తాజా. - బాజా. - వాజా. - రాజా.
కందపద్యంలో వైష్ణవీదేవి స్తుతి.
౩. వర్ణనముః-
విదేశీ వ్యామోహంలో కొట్టిమిట్టాడుతున్న మనవారికి మన దేశ ఔన్నత్యాన్ని తెలుపుతూ సందేశమివ్వండి.
౪. ఉద్దిష్టాక్షరిః-
వైష్ణవీ పీఠ వ్యవస్థాపకులు సత్యనారాయణమూర్తి గారిని ఆశీర్వదించండి.
౩వ అక్షరం -  నా.
౮వ అక్షరం - ర్తి.
౧౨వ అక్షరం - ల్లి.
౧౫ వ అక్షరం - న్వ.
౨౧ వ అక్షరం - ఖ.
౧౪ వ అక్షరం - తి.
౨౭ వ అక్షరం - లి.
౩౧ వ అక్షరం - ద్మ.
౫. ఆశువుః-
౧. హిందూ దేశమునకు మూల బిందువేది?
౨. వైయ్యస్మరణముపై మీ అభిప్రాయం?
౬. పురాణముః-
౧. హరియను రెండక్షరములు పద్యం ఎందులోనిది? భావమేమిటి.
౨.హరిశ్చంద్రుఁడు ధీరోదాత్తుఁడు.నాటకములో ఎందుకు దుఃఖిస్తాఁడు?
౭. ఘంటా గణనముః-
౮. అప్రస్తుత ప్రసంగముః-
౧. శ్రీ రాముఁడు ఏక పత్నీ వ్రతుఁడు కదా! మరి ఈ వైష్ణవీదేవి రాకతో రాముఁడు ఏక పత్నీవ్రతుడుగా ఉంటాడా?
౨. గొఱ్ఱె పిల్ల గన్నది గొఱ్ఱె గొఱ్ఱె.
బఱ్ఱె పిల్ల గన్నది బఱ్ఱె బఱ్ఱె. అంటే ఏమిటి?

మిత్రులారా! చూచారు కదా? ప్రశ్నలు.
మీరు వీటికి సమాధానాలు వ్రాసి పంపగలిగితే పాఠకులకు అపురూపమైన సాహిత్యానుభూతి కలిగించినవారవతారు.
మీ సమాధానాలకై ఎదురు చూడనా? నమస్తే.
శ్రీమాన్ భద్రం వేణుగోపాలాచార్యులవారి అవధాన విశేషాలను నరువాత మీ ముందుంచ గలను.
జైహింద్.