Saturday, September 3, 2011

గురువంటే ఇలాగుండాలి(పెద్దల అభిప్రాయాలు)

ఆర్యులారా!
ఉపాధ్యాయ దినోత్సవం వస్తున్న సందర్భంగా అనేకమంది అనుభవజ్ఞులయిన కవి పండితులు గురు శిష్యుల విషయంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను పద్య, గద్య రూపంలో ప్రకటించారు. గురువులు తమ మూర్తిమత్వానికి మెఱుగులు దిద్దుకోడానికి అవశ్యాచరణీయ యోగ్యమైన భావనలను వీరంతా వెలువరించారనడంలో సందేహం లేదు.
వాటిని చూద్దాం. 
పండిత నేమాని అన్నారు...
గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్,
సరసోత్సేకమయాంతరంగుడగుచున్ ఛాత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు, సాధు బోధనములన్ గావించుచున్, జ్ఞాన భా
స్కర బృందంబులుగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నందగున్! 
వీరు గురువు అనే పదానికి చాలా అద్భుతమైన నిర్వచనాన్ని తప పద్యం ద్వారా వివరించడం సహృదయులైన గురువుల అదృష్టంగా భావిస్తున్నాను.
వీరే నన్ను ఉద్దేశించి మరొక పద్యం కూడా వ్రాసి నన్ను ఆశిర్వదించారు. అదీ ఇక్కడ చూద్దాము.   
అయ్యా!
గురులన్ మించిన విద్వదుత్తముడవై కొండంత లక్ష్యంబుతో
పరితోషంబున శిష్యకోటిని కళాపారీణులన్ జేసి భా
సుర యోగంబుల నొంది ఛాత్రులలరన్ శుద్ధాంతరంగమ్ములో
పరితృప్తింగని యొప్పు నీ సుగుణ శోభాదీప్తి వర్ధిల్లుతన్!
పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు అవధాని వర్యుల అవ్యాజానురాగానికి పొంగిపోతూ వారికి  ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 
మందాకిని గారు తమ అభిప్రాయాన్ని చక్కగా మన"కందం"గా వివరించారు. చూడండి.
గురువుల నుపదేశింపగ
గురువుల కేఁదగును.వారిఁ గొలువగఁ, దనపై
కరుణాదృక్కులఁ గొనుమని
దరిజేర వలయును. శిష్య ధర్మంబిదియే.
గురు ధర్మాన్ని నిర్వచింప తనకు అర్హత లేదని, శిష్యధర్మాన్ని చక్కగా వివరించారు మందాకిని గారు. ఓహో! ఎంతటి విధేయత!
చదువులు నేర్పుచు,శిష్యులు
ముదముగ నున్నత గతులును,మోక్షపు దారుల్
వెదకెడి పరిణతి నిత్తురు.
సదయులు గురువుల నుతింప శక్యమె మనకున్?
అని వ్రాసి తమ హృదయాన్ని ఆవిష్కరించారు.
తానే గురువైతే ఏం చేస్తారో అన్న విషయాన్ని వివరించడం ద్వారా గురువుకు నిర్వచనం చెపారు మందాకిని గారు.అదీ చూదండి.
ఆర్తిగ నేను నేర్పెదను, హాయిగ భీతులనెల్లవీడుచున్
నేర్తురు, పిల్లలందరిట నిత్యము నిష్ఠగ మక్కువెక్కువై
కీర్తులు కోరనెప్పుడును కీరపుఁ బల్కుల చిన్నవాండ్రకు
న్పూర్తిగ, నాశతీరగనుఁ, బొందుదు నేనిక నాత్మతృప్తినే.
కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్ 
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.
నిజంగా ఎంతటి ఔన్నత్యం తొణికిసలాడుతోందో చూచారా మందాకిని గారి అభిప్రాయంలో?
ఇంత చక్కటి వివరణ నిచ్చిన మందాకిని గారికి ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను.
రాఘవ అన్నారు...
సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్త్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్త్యా సమేతమ్,
దమ్భాసూయాదిముఖ్యం జితవిషయగణం దీర్ఘబన్ధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్.
-- శ్రీశ్రీశ్రీ వేదాంతదేశికాచార్యులవారు

మన రాఘవ దేశికులకు ఉండవలసిన లక్షణాలను  శ్రీశ్రీశ్రీవేదాంత దేశికాచార్యులవారు చెప్పిన నిర్వచనాన్ని మనకందించారు.
ఎంత చక్కని నిర్వచనమిది!
దేశికులు(గురువులు) సత్సంప్రదాయసిద్ధి కలవారై ఉండాలి. సుస్థిర జ్ఞానులై యుండాలి. పాపరహితులై ఉండాలి. శ్రోత్రియులై ఉండాలి. సత్వము కలవాడై ఉండాలి. సత్యవాకై ఉండాలి. సమయ పాలకుఁడై ఉండాలి. సాధు ప్రవృత్తి కలవాఁడై ఉండాలి. దంభము, అసూయ మున్నగు వాటిని జయించినవాడై ఉండాలి. దీర్ఘ బంధువై ఉండాలి. దయాళువై ఉండాలి. స్వ పర హితుఁడై ఉండాలి.
ఒక ఉపాధ్యాయుఁడు గురువు అవాలి అంటే ఇన్ని సల్లక్షణాలూ ఉండి తీరవలసిందే. అట్టి గురువును శిష్యులు నిరతమూ ఆరాధించ వలసిందే. ఎంతటి చక్కని నిర్వచనము! 
ఇంతటి చక్కని శ్లోకాన్ని అందించిన చిరంజీవి ఆపరమాత్మ కృపామృతాన్ని గ్రోలుతూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
గోలి హనుమచ్ఛాస్త్రి అన్నారు...
గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.
గురువనఁబడే వ్యక్తి త్రి మూర్తులకన్న నధికుఁడని, ఎప్పుడూ మంచినే తా నాచరిస్తూ, మంచినే నేర్పుతూ, నిష్ఠా గరిష్ఠుడై లోకంలో స్థిరుఁడవాలనీ, లోకానికి వెలుగు నీయాలనీ మన ప్రియ మిత్రులు శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రిగారు చిన్న ఆటవెలది పద్యంలో అనంతమైన భావాన్ని పొందుపరచి, వివరించారు.  
అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయగలిగేవాఁడే కవి అని మన ఆలంకారికుల వివరణ.
ఆ లెక్కన మన హనుమచ్ఛాస్త్రిగారు మన ముందున్న చక్కని కవి అనడంలో సందేహం లేదు. వారికి పరమాత్మతోడు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.
మిస్సన్న అన్నారు...
విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి - బంగరు భవితకు బాట వేయు. 
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి - అన్యభాషాసక్తి నాదరించు.
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి - యుత్తమ పౌరులౌ యునికి తెలుపు. 
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు - మార్గాన చనియెడు మనికిఁ గలుగు.
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన - వృత్తికి బద్ధుడై వెలయు చుండు. 
విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ 
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు? 
కాని నాడా గురువు కొఱగాని బరువు. 
మన మిస్సన్న గారు కూడా గురువుకు ఉండవలసిన గురుతర బాధ్యతలను చక్కగా వివరించారు. అలా లేని నాడు అతఁడు గురువు కాదని, భూమికి బరువనీ నిష్కర్షగా చెప్పారు. కొంచెం నిష్టూరంగా ఉన్నా వీరి మాటలు యదార్థం.
మిస్సన్నగారికి ఆ పరమాత్మ అనుకూలుఁడై ఉండాలని ఆశిస్తున్నాను. 
శ్రీపతిశాస్త్రి అన్నారు...
శ్రీగురుభ్యోనమ:
మహానుభావులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సుమాంజలుల నర్పిస్తూ,ఆ మహనీయుని జయంతి సందర్భముగా నేటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరకు శుభాకంక్షలు తెలియజేస్తున్నాను.
గురువై దేశపు పరువై
గురుతర బాధ్యతలనెపుడు గుర్తించుచు తాన్
పరవశమున పాఠములను
మురిపింపగజెప్పునట్టి మూర్తికి జేజే
బడినే గుడిగా దలచుచు
బడి పిల్లలె బిడ్డలనుచు వాత్సల్యముతో
బుడతల నడతలు దిద్దగ
నడుగిడు యొజ్జలకు భక్తి నంజలులిడుదున్.

శ్రీపతి శాస్త్రి గారు గురువును గురువు కాదు అతఁడు దేశము యొక్క పరువు అని చెప్పడంలోనే ఉంది గురువుకుండే బాధ్యత ఎంతటి మహత్తరమైనదోనన్న విషయం.అట్టి ఉపాధ్యాయులకు జేజేలుకొట్టారు మన కవి. అంతే కాదు. బడి పిల్లలకు మనస్పూర్తిగా విద్యాబోధన చేసే గురువులకు జేజేలు కొట్టుతున్నారు మన కవి. 
చాలా చక్కని గౌరవాన్ని ఇచ్చారు గురువులకు మన శాస్త్రి గారు.
వారికి నా అభినందనలను తెలియ చేసున్నాను.
గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు.
గురువుల యెడ భక్తి భావము మాకుంటుంది అని చెబితే మా ఊరిలో గురువులు ( టీచర్లు ) చాలా ఆశ్చర్యపోతారు.ఇక్కడ అంతా ఉద్యోగ ధర్మము,వ్యాపారమే గాని విశేష భావాలకు తావు లేదు. చక్కని గురువులు నాకు లభించారు. నేను అదృష్టవంతుడినే !
స్థిరమగు జ్ఞానసంపదలు శిష్యుల కిత్తురు పూని శ్రద్ధతో
గురుతర బాధ్యతల్ గొనుచు కోమలహృద్యులు దివ్యసద్గురుల్   
వరమది సద్గురుల్ గలుగ, వారిని గొల్చెడి శిష్యపాళియున్. 
పరమ పవిత్ర బంధ మిది, ప్రాకట మయ్యెగ పూజ్యభూమిలో !       
డా.గన్నవరపు నరసింహ మూర్తి గారు దివ్యమైన సద్గురువులు ఏమి చేస్తారో చెప్పడం ద్వారా ఏమి చెయ్యాలో చెప్పారు తమ పద్యం ద్వారా. భారతావనిపై గురు శిష్య పవిత్ర బంధాన్ని అద్భుతంగా వివరించారు.
వారి మనోహర భావనా సంపత్తిని అభినందిస్తున్నాను. 
ఇంకా ఇంకా అనేకమంది  తమ హృదయంలో గురువుకు గల అసాధారణమైన స్థానాన్ని గూర్చి, గుధర్మం వ్షయంలో తమ అభిప్రాయాలను ఎంతో చక్కగా వివరించి వ్రాసారు. అందరికీ నా కైమోడ్పులు.
గురుస్థానంలో ఉండి ప్రశంసింపఁ బడుతున్న ప్రతీ ఒక్క గురువుకూ నా హృదయ పూర్వక అభినందనలు, కైమోడ్పులు.
రేపే కదా గురు పూజా దినోత్సవము. శిష్య ప్రశిష్యాళిచే సద్గురువులందరూ పశంసింపఁబడి పూజింపఁ బడుదురు గాక. 
జైశ్రీరాం.
జైహింద్. 

Friday, September 2, 2011

గురు దేవో భవ అని పూజింపబడటానికి గురువు ఎలాగుండాలంటారు?(నవ భారత నిర్మాణంలో గురువు పాత్ర.)

ఆర్యులారా! సెప్టెంబరు ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం.
ఆచార్య దేవో భవ! అని అందరిచే ఆచార్యుఁడు గౌరవింప బడుతున్నాడు.
మన సమాజం ఎనలేని గౌరవాన్ని ప్రప్రథమంగా తల్లికి, పిదప తండ్రికి, ఆతరువాత గురువుకి ఇస్తోంది. ఇది చాలా సముచితం. ఎందు చేతనంటే విద్యార్థులకు జ్ఞాన జ్యోతులను తన మాటద్వారా, తమ అకళంక సత్ప్రవర్తన ద్వార్వా విద్యార్థులను తీర్చి దిద్దేదీ, జీవన మార్గాన్ని నిర్దేశించేదీ గురువే. అట్టి గురువు తల్లిదండ్రులతో పాటు గౌరవింపబడ వలసిందే.
ఈ సందర్భంగామీ అభిప్రాయాలను కూడా సమాజానికి పంచాలని అభిప్రాయపడుతున్నాను.
అట్టి అసాధారణ గౌరవం పొందడానికి ఆచార్యులు కలిగి ఉండ వలసిన అర్హతలను, అచార్యుని బాధ్యతలను వివరిస్తూ మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా పద్యాల రూపంలో గాని, వచన రూపంలో గాని వివరించండి. ఆచార్యులు అకళంక మూర్తులుగా వెలుగొందే మార్గం సూచించండి. 
ఇందు నిమిత్తము నేను మీకు ముందుగానే కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.