Wednesday, December 29, 2010

భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య చరిత్ర (బుర్ర కథ)

భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య చరిత్ర 
(బుర్ర కథ)
 రచన
భాషాప్రవీణ బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ మూర్తి భాగవరార్.  M.A.
ప్రార్థన:-
శుక్లాంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం.
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
భజన:
1)జైజైజై గణ నాయక జైజై విఘ్న వినాశక.
హే శుభ మంగళ దాయక విద్యా బుద్ధి ప్రదాయక.
గజ వదన గౌరీ నందన గంగా ధర శివ శంభో నందన. జై జై జై ..........
హంస ధ్వని రాగం.
ప: 
జయహో జయహో జయహో  
కళామ తల్లికి జయహో. జయహో జయహో.....
చరణం:
పావనమైన భరత భూమిపై 
కళాకారులకు కన్న తల్లివై 
కల్ప వృక్షముగ కాపాడుటకై 
కదలి రావమ్మా కళామ తల్లీ!  జయహో.....
చరణం: 
కళారాధనకు నడుం కట్టితిమి 
కళామ తల్లికి కళా కానుకగ
సమర్పింతుము మా శక్తి
దీవించుము మము ఓ జననీ! జయహో.....
చరణం: 
జయముకై మేము జయభేరి మ్రోగించి
జయజయ ధ్వనులతో విజయ శంఖము ఊది
కర్పూర హారతులు మీకొసంగెదమమ్మా
కరుణించి కాపాడు కల్పవల్లీ మమ్ము. జయహో......
శ్లో:  
సభా కల్పతరుం వందే వేద శాఖోపజీవితం
శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం.
వచనం: 
సభ అనగా కల్ప వృక్షం వంటిది. వేదములనెడి శాఖలతోను, శాస్త్రములనెడి పుష్పముల తోను విద్వాంసులనెడి తుమ్మెదలతోను, అలరారుతున్న ఈ సభకు ముందుగా వందనం చేస్తూ.....
మన భరత మాత ఎటువంటిదో మనవాఁడు చెప్తాడు.
మధ్యమావతి రాగం:
కథకుఁడు:
అంద చందముల నందన వనమే ఆంధ్ర దేశమోయీ 
మన భరత దేశమోయీ     అంద.....
చరణం:
కళకళలాడే కళా ఖండము
కవుల గాయకుల కల్పతరువురా
రాజాధిరాజ విరాజమానితం
వీరాధి వీర విహార స్థానం 
అఖండ కీర్తిని అందిన దేశం
ఆంధ్ర దేశమేరా . మన భరత దేసమేరా!  అంద.....
చరణం:
నాట్య భారతికి నర్తన శాల 
కవన కన్య కల్యాణ మండపం
తేజరిల్లెడి కళలకు నిలయం
ఆంధ్ర దేశమేరా. మన భరత దేసమేరా.  అంద........
వచనం:
సగరుఁడు, పురూరవుఁడు, పురుకుత్సుఁడు మొదలైన చక్రవర్తులను కన్నది మన భరత మాత. శ్రీ కృష్ణ వేణు గానామృతములో పునీతమైనదీ భరత మాత. బుద్ధుఁడు ఆది శంకరాచార్యులు; రామ కృష్ణ పరమ హంస మొదలైన మహాత్ములను కన్న మాతృ మూర్తి మన భరత మాత. కాళిదాసు, వాల్మీకి, వ్యాసుఁడు, శ్రీనాథుఁడు, నన్నయ, తిక్కన, ఎఱ్ఱన మొదలైన సంస్కృతాంధ్ర కవులను కని కీర్తి పొందినది మన భరత మాత. సింధూ, గంగా, గోదావరి, కృష్ణ వేణిమొదలైన పవిత్ర నదీ జలాలతో తన కన్న బిడ్దలను పోషించుకొనుచున్న బాలింతరాలు మన భరత మాత. ఈమె తల్లులందరికీ తల్లి. సకల సంపదలకు కల్ప వల్లి. అందాలు చిందే మల్లి. అన్నార్తులను ఆదరించే చెల్లి. ఇటువంటిది మన భారత దేశం. ఈ రోజు మనం ఇక్కడికెందుకొచ్చామో మనవాఁడు చెప్తాడు.
కథకుఁడు:
సీ:
సాయి నాథుని అజ్ఞ సంతోషముగ చేయు సాయి సేవాదళ సభ్యులార!
పర్తి వాసుని నిత్య భజనలు గావించు  భక్తులార పవిత్ర శక్తులార!
నారాయణులకెల్ల నామ విభజన సల్పి  ఆహారమందించెడమ్మలార!
సాయి బోధల లోని సారాంశ మెల్లను బుద్ధియందున నిల్పు పెద్దలార!
తే.గీ.
బాలురందర జేర్చి పాఠాలు నేర్పు
గురువులార! బాల వికాస తరువులార!
ప్రేమ పంచిన సత్పథ గాములార! 
చేతు మీకు నమస్కృల్ చేతులార.
కల్యాణిరాగం:
ఓ భారత వీర కుమారా
సత్య సాయీశు చరితము వినరా!   సత్య సాయీశు చరితము వినరా....
ఆంధ్ర దేశమున పుట్టపర్తి యను గ్రామ మొకటి కలదు
ఆ గ్రామంబున పుణ్య దంపతులు ఈశ్వరమ్మ పెద వేంకమ రాజు
ఆ దంపతులకు నోము ఫలముగా కలిగెను ప్రేమ స్వరూపుఁడు. ఓ భారత.....
మానవాళికి మహోపకారము లెన్నో చేసిన ఘనుఁడు
సత్యము ధర్మము శాంతి ప్రేమలను ఇలలో నిలుపగ అవతరించెను.
ఆ మహనీయుని దివ్య చరిత్రము కథగా చెబుతా వినరండీ. ఓ.......
వచనం:
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ధర్మ సంస్థాపన కొఱకు ప్రేమ ద్వారా మానవాళిని మంచి మార్గమున నడిపించుట కొఱకు మానవాకారమున అనంత పురం జిల్లా పవిత్ర చిత్రావతీ నదీ తీరమున గల ప్రకృతి సహజ సౌందర్య విలసితమైన పుట్టపర్తి అనే గ్రామంలో 1926 వసంవత్సరం నవంబరు 23 వ తేదీన పరమ శివునికి ప్రీతికరమైన కార్తీక సోమవారము నాటి రాత్రి బ్రాహ్మీ ముహూర్త కాలములో వెంకావధూత కోరిక మేరకు రత్నాకర రాజ వంశంలో పెద వేంకమ రాజు ఈశ్వరాంబలకు నాల్గవ  సంతానముగా భగవంతుఁడు అవతరించెను.
(హాస్యం) 
ఆ సమయంలో
దేవ గాంధారి రాగం:
కథకుఁడు:
దేవ దుందుభులు మ్రోగెరా  సై
పుష్ప వృష్ఠి భువి కురిసెరా  సై
గంధర్వులు గానము చేసెరా    సై
మలయ మారుతము వీచెరా    సై
ఉల్లాసముగా పక్షులన్నియూ కూయసగెనపుడూ
వినరా ఆంధ్ర కుమారా ధీరా సాయి గాధ వినుడీ.
వచనం:
దేవతలు మంగళ వాద్యములు మ్రోగించగా, గంధర్వులు గానము చేయగా, అప్సరసలు ఆనందముతో నాట్యమాడగా, పుష్ప వృష్టి భూమిపై కురియగా, మలయ మారుతములు మానవాళి హృదయాలను పులకరింప చేయగా, సమస్త పక్షి జాలము అనందముతో కికిలారావము చేయగా, ప్రకృతి అంతా పులకరించి పోయింది.
బాలుని పొత్తిళ్ళలో పరుండబెట్టి ఎవరి పనిలో వారు నిమగ్నమై యుండగా ఒక పాము వచ్చి బాలుని చుట్టుకొని శిరస్సుపై పడగ విప్పి గొడుగు పట్టెను. ఆ దృశ్యన్ని ఇంటిలో ఉన్న వారు చూచి కంగారు పడిరి. ఏ విధంగా వచ్చిన పాము ఆవిధంగానే అదృశ్యమైపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంక బాలుని దివ్య స్వరూపమెలాగుందయ్యా అంటే
కన్నడ రాగం:
దిష్టి చుక్క వలె ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ కలదు.
తందానా తం దాన తందనా దేవ నందనానా.
అరికాళ్ళందున శంఖు చక్రముల గుర్తులు కలవచటా  తం.....
శ్రివత్సలాంచనమా యను నట్టుల గుండె పైన పుట్టు మచ్చా.  తం.....
శిరమున తేజము వెలుగులు జిమ్మగ బాలుడుండెనండీ.  తం.....
వచనం:
అందాలొలికే ఆ బాలుని వదనారవిందానికి ఎడమ బుగ్గ పైన దిష్టి తగుల కుండా ఉండుటకా అన్నట్లు పుట్టుమచ్చ ఉంది. పాదాల క్రింద భాగమున శంఖు చక్రాల గుర్తులు అవతార నిదర్శనంగా కనబడు చున్నవి. శ్రీవత్స లాంఛన మన్నట్లుగా హృదయమున నల్లనైన మచ్చ ఉంది. నిండు పున్నమి నాటి చంద్ర బింబము వలె బాలుని ముఖము ప్రకాశిస్తోంది.
బాలునికి సత్యనారాయన అని పేరు పెట్టారు.
(హాస్యం):
ఆ బాలుఁడు దినదిన ప్రవర్ధమానుడై శుక్ల పక్ష చంద్రుని వలె ప్రకాశిస్తున్నాఁడు.
బాల్యం నుండి ఈయన అనాథల పట్ల ప్రేమ, దయ చూపుతూ అడిగినవారి కోరికలు తీరుస్తున్నాఁడు. బాలునకు ఎనిమిదేండ్ల వయసు వచ్చింది. పుట్టపర్తికి రెందున్నర మైళ్ళు దూరములో కల బుక్కపట్ణం గ్రామంలో మూడవ తరగతిలో ప్రవేశ పెట్టారు. ఆ గ్రామానికి వెళ్ళాలంటే నదిని దాటాలి. ఒక రోజు ఏం జరిగిందంటే
శివరంజని రాగ:
చిత్రావతిలో నీరు జోరుగా పారుచుండెనపుడూ తం.....
జంకు లేక మన బాలసాయి మును ముందుకు సాగాడూ.  తం......
వద్దు వద్దనీ తోడి బాలురూ మొరపెట్టినా వినకా. తం......
ముందుకు సాగిన బాలుడు నీటిలొ మునిగిపోయినాఁడూ.  తం.......
వచనం:
బాలుఁడగు సత్యనారాయణ నదిని దాటుతుండగా ప్రవాహం ఉధృతమైంది. బాలుఁడు నదిలో మునిగిపోయాఁడు. ఈ వార్త తల్లిదండ్రులకు తెలిసింది. వారు లబో దిబో మంటూ ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో గాజుల సవ్వడి వినిపించింది. ఆ వైపే చూస్తున్నారు జనాలు. నది పై భాగం నుండి గాజులతో కూడిన హస్తం ఊపుతూ కనపడింది. ఈ విధంగా తన దివ్య లీల చూపుతూ ఆవలి వడ్డుకు క్షేమంగా చేరుకున్నాడు బాలుడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా పాఠశాలకు సెలవు పెట్టేవాడు కాదు. ప్రతీ రోజూ ప్రార్థన తానే చేసేవాఁడు. 
ఒక రోజు మన సత్యనారాయణ తరగతిలో పర ధ్యానంగా ఉన్నాడు. 
(హాస్యం): 
అది చూసిన ఉపాధ్యాయుడు ఆ బాలుని బెంచీ మీద నిలబెట్టాడు.పాఠం పూర్తయింది. ఆ పిరియడ్ అయింది. కుర్చీ నుండి ఆ ఉపాధ్యాయుడు లేవడానికి ప్రయత్నించాడు. కాని లేవలేకపోయాడు. ఆ కుర్చీకి అతుక్కుపోయాడు. తరువాత రావలసిన ఉపాధ్యాయుడు ఈయన పరిస్థితి చూసి సత్యం గొప్పతనాన్ని తెలిసి ఉన్న వాడు కాబట్టి బెంచీ నుండి దిగమన్నాడు.మన సత్యం దిగ గానే ఆ ఉపాధ్యాయుడు లేవ గలిగారు. ఇది వారి దివ్య లీల ప్రకటనకు నాంది. ఇంకా ఆ బాలుని లీలలు ఎట్టివనిన
కళావతి రాగం:
కథకుఁడు:
తోడి బాలురతొ కూడెరా   సై.
చిత్రావతిలో మునిగెరా.  సై.
చిత్రముగ మాయ మయ్యెరా.   సై.
కొంత దూరమున కొండపై .  సై.
సూర్య తేజమున కనబడీ.   సై.
అందర్ని రమ్మనీ పిలిచాడా.. భళానంటి భాయి తమ్ముడా  సై. మేలు భళానోయ్ దదానా.
వారంతా దగ్గర చేరగా  సై.
ఏది కావలెనో  కోరుడూ.   సై.
ఆనందమున వారడుగగా  సై.
అందరి కోరిక తీర్చాడా.  భళా......
వచనం:
ఈ విధంగా నదిలో మునిగిన బాలుడు దగ్గరగా గల కొండపై ప్రత్యక్షమై అందరినీ రమ్మని పిలుచాడు. వారడిగిన కోరికలు ఆ చింత చెట్టు దగ్గర నిలబడి తీర్చే వాడు. ఆ చెట్టునే నేడు కల్ప వృక్షమని పిలుస్తారు. 
తోడి రాగం:
జయ పాండు రంగ ప్రభూ విఠలా
జగదాధారా జయ విఠలా.  జయ......
పాండు రంగ విఠలా పండరి నాథ విఠలా. పాండు రంగ.......
శ్రీ రమణీ హృదయాంత రంగా 
మంగళ కర కరుణాంత రంగా
పాప విమోచన పావన రంగా .
ప్రభో పాండు రంగా.. విభో పాండు రంగా.  జయ పాండు......
నీ కనులా అలరారే వెలుగే
నీ పెదవులా చెలువారే నగవే
ఆశ్రిత దీన జనావన రంగా .
ప్రభో పాండు రంగా.. విభో పాండు రంగా.     జయ పాండు.......
వచనం:
ఈ విధంగా ఆడుతూ పాడుతూ భక్తితో కూడిన భాగవత కథలను నాటకాలుగా ప్రదర్శించే వాడు. నటనలలో, నాట్యములో, ఆఅలలో , పాటలలో ఆయనకు ఆయనే సాటి. 
ఋష్యేంద్ర మణి అను ఆమె ఆ నాడు పేరు పొందిన నాట్యగత్తె. ఆమె నాట్యమును ఒక రోజు గ్రామస్తులు ఏర్పాటు చేసారు. కాని ఆ సమయానికి ఆమె రాలేదు. ఆమె పాత్రను మన సత్యం ధరించి, ఆమె కన్నా అద్భుత విన్యాసాలు ప్రదర్శించి ప్రజల మన్నన గైకొన్నాడు. సర్వ కళా మయుడు అని చెప్పుకొనుటకు ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి.
అన్నగారైన శేషమ రాజుగారు ఉరవ కొండలో పని చేస్తూ ఉండే వారు. సత్యాన్ని ఇంగ్లీషు చదువు చదివిద్దామని ఉరవ కొండలో 8 వ తరగతిలో చేర్పించారు. ఆ రోజులలో మన సత్యం పరిస్థితి ఎలాగుందయ్యా అంటే
కళావతి రాగం:
కథకుఁడు:
ఒక్కొక్కమారు పాడునూ.  సై
వేరొక్క మారు నవ్వునూ.  సై
మరియొక్క మారు ఆడునూ.  సై.
ఇంకొకమారు ఏడ్చునూ.  సై.
స్డిగిన దానికి జవాబు నిచ్చుచు ఆశ్చర్యము గొలిపే.  భళానంటి భాయి తమ్ముడా సై మేలు భళానోయ్ దదానా.
ఒకరికి విభూతి యిచ్చురా.  సై.
మరొకరికి కుంకుమ నొసగురా.  సై.
కొందరికి లాకెట్లు నిచ్చురా. సై.
కొందరికి మణి మాల నొసగురా.  సై.
అడిగిన వారికి లేదనకిచ్చుచు ఆనందము చే కూర్చురా.  సై  భళానంటి  భాయి తమ్ముడా సై మేలు భళానోయ్ దదానా.
వచనం: 
ఈ విధంగా తాను వింత వింత చేష్టలతో నవ్వుతూ, ఆలోచిస్తూ ఉంటుండగా అన్నగారైన శేషమ రాజుగారు తమ్మునకు దయ్యం పట్టిందని భూత వైద్యుని పిలిపించారు. ఆ వైద్యుడు భయంకరమైన భూతం పట్టిందనికంట్లో కలికం వేసి నూట ఒక్క కుండ నీరు తలపై పోయించి; శిరస్సు నుండి కాళ్ళు వరకు గాట్లు పెట్టించి; అందులో నిమ్మ రసం పిండించాడు. ఇట్టి కఠినమైన బాధలను ఓర్చుకొని; సుఖ దుఃఖాలకు అతీతుడని నిరూపించుకున్నాడు మన సత్యం.
1940 సం. అక్టోబరు 20 వతేదీన పాఠశాల నుండి వస్తూ పుస్తకాలు విసిరేసి బిగ్గరగా నేను మీ సత్యంను కాను. సాయిబాబాను. అని కేకలు పెట్టాడు. అన్న,వదిన ఇంట్లోకి రమ్మని ఎంతబ్రతిమాలినా వినక ఆ వీధిలో ఉన్న అప్కారీ ఇన్స్పెక్టర్ గారి తోటలో ఉన్న రాయిపై కూర్చున్నాడు. ఆయనను చూడడానికి పండ్లు పాలు తీసుకొని భక్తులు అసంఖ్యాకంగా వెళ్తున్నారు. ఈ వింతను ఫొటో తీద్దామని వచ్చాడు ఒక వ్యక్తి. బాబా ముందున్న రాయిని తొలగించమన్నాడు. వీల్లేదన్నారు బాబా. ఫొటో అలాగే తీసాడు. తీరా ఫొటో కాపీ తీసి చూస్తే ఆ రాయి షిరిడీ బాబాగా కనిపించింది.
భక్తుల అనుమానం తీర్చడానికి దోసిలితో మల్లె పూలు తీసి విసరగా నేను సాయిబాబాను అని అందంగా అక్షరాలుగా తీర్చబడ్డాయి. ఆ షిరిడీ సాయి అవతారమే ఈ సత్యనారాయణుడని భక్తులకు విశ్వాసం కలిగింది. ఇది తన అవతార ప్రకటనకు నాంది.
ప్రతీ మనిషీ సద్గురువు యొక్క పాదాలను హృదయంలో నిలుపుకోవాలని పాడుతున్నారు.
కల్యాణి రాగం:
కథకుఁడు: 
మానస భజరే గురు చరణం.
దుస్తర భవ సాగర తరణం.
గురుమహరాజ్ గురు జైజై
సాయినాథ సద్గురు జైజై.
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శివాయ నమ ఓం.
అరుణాచలశివ అరుణా చలశివ అరుణాచల శివ అరుణ శివోం.
ఓంకారంభవ ఓం కారంభవఓంకారంభవ .ఓం నమో బాబా. మానస......
వచనం:
ఈ విధంగా భక్తులతో కలసి నిద్రాహారాలు లేక, మూడు రోజులు దీక్షలో ఉన్నారు. ఈ వార్త పుట్టపర్తి చేరింది. తల్లి వచ్చి ఏడుస్తూ భోజనం చేయమని బ్రతిమాలింది. తల్లి మనస్సు కష్ట పెట్టడం ఇష్టం లేక ఆమె మాట కొట్ట లేక ఆమె చేత్తో మూడు ముద్దలు తిన్నారు.
 
(హాస్యం)
ఇంక మాయ వీడిందని పలికారు. పుట్టపర్తి ప్రజల కోరిక మేరకు ఆ గ్రామం బయల్దేరారు. ఆ ఊరివారు బాబాకు స్వాగతం పలుకుతున్నారు. 
మోహన రాగం:
స్వాగతం. సుస్వాగతం.
స్వాగతం శ్రీ సాయిరామా. స్వా......
మందహాస ధర సుందర వదనా
వందనములతో సుస్వాగతం. స్వా.......
పత్తి గ్రామమున జన్మించి నట్టి ఈశ్వరాంబ ప్రియ నందన సాయి
నీదు సేవ లభియించు టెన్నడో
ఎన్ని జన్మముల పుణ్యమో యిదీ. స్వా.........
కన్నులార నిను గాంచు టెన్నడో.
వీనులార నీ మాట విన్ననూ
పుట్టపర్తి నుదయించిన దేవా.
సత్య సాయి భగవానుడ నీవే.
శేష సాయి అవతారము నీవే. స్వా........
వచనం:
ఈ విధంగా ఊళ్ళో ప్రవేశించారు బాబా. ద్వాపరం నాటి యశోదా దేవే పుట్టపర్తిలో కరణం సుబ్బమ్మగా అవతరించారు. ఆ భక్తురాలింట నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. వచ్చిన భక్తు లందరికీ వృద్ధాప్యం నెత్తిన పడ్డా విశ్రాంతి లేకుండా సుబ్బమ్మ గారు సేవలు చేస్తుండేవారు. భక్తుల సంఖ్య పెరగడం చేత ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్నే నేడు పాత మందిరంగా పిలుస్తున్నారు. అందులో స్వామిని ఉయ్యాలలో కూర్చుండబెట్టి భక్తులు ఈ విధంగా పరవశులై పాడుతున్నారు.
నాగిని రాగం:
ఊగవయ్యా. ఊగవయ్యా ఉయ్యాల సాయీ. ఊగ ........
ప్రశాంతివాసా పర్తి పురీశా
ప్రేమ స్వరూపా! ప్రేమావతారా   ఊగ.........
కైలాస వాసా భస్మ విభూషిత
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ   ఊగ.........
వటపత్ర సాయీ వైకుంఠ వాసా
సామ వేద ఉయ్యాల సంగీత ఉయ్యాలా .   ఊగ.......
వచనం:
ఒక రోజు భక్తిలందరితో కలిసి సమీపంలో ఉన్న తోట లోనికివెళ్ళారు బాబా. అక్కడ ఉయ్యాలలో కూర్చొని బాబా ఊగుతున్నారు. భక్తులు ఈ విధంగా గానం చేస్తున్నారు.
పూరీ కల్యాణి రాగం:
మధుర దరహాస మృదు కేశ పుట్టపర్తీశ సాయీశ.
వెలుగులను నింపు మామ దిలో జ్ఞాన కిరణాలు ప్రసరించి. మధుర..........
సిరులు భోగాలు లేకున్నా నీదు కృప చాలు పది వేలు.
నీదు నామం దివ్య ధామం నీదు చరణాలు భవ హరణం. మధుర..........
కానుకలు పూలు వలదనుచు భక్తియే నీవు కోరావు.
రక్తి తోడ భజన సేయ శక్తులను మేలుకొలిపావు.  మధుర...........
ఒకే ధర్మమ్ము బోధించి ఒకే సత్యమ్ము చుపించి;
ప్రేమ పంచి శాంతి నించి ముక్తి పథమందు నడిపావు.  మధుర............
వచనం:
ఏమి ఆ అద్భుతం! ఉన్నట్లుండి బాబా భక్తులందరికీ మురళీ కృష్ణుడుగా దర్శన మిచ్చారు. 
మురళీ గానం వినాలనే భక్తులను తన గుండెపై చెవినుంచి వినమన్నారు. ఆ గాన మాధుర్యానికి భక్తులు తన్మయత్వం చెందారు.ఒక రోజు కమలా పురం నుండి వచ్చిన భక్తునికి చిత్రావతి నదిలో దశావతారాలు చూపించారట. తన తండ్రికి ఉన్న అనుమానాన్ని పోకొట్టడానికి సుబ్బమ్మ గారి ఇంటి లోనే షిరిడీ లో గల మసీదు, ధుని, వేప చెట్టు మొదలగు దృశ్యాలన్నీ చూపించారు.
గూని వెంకన్న అనే సేవకుడు బాబా గారు చెప్పిన ప్రదేశంలో త్రవ్వగా శివ లింగముల యొక్క పాన పట్టములు బైట పడినవి. లింగములు ఏవని భక్తుడు అడుగగా తన పొట్టలో నున్న వని బాబా పలికెను.
నాటి నుండి ప్రతి శివ రాత్రికీ నోటి నుండి లింగములు తీసి భక్తులందరికీ పూజ కొఱకు ఇస్తూ ఉండేవారు. 1999ఫిబ్రవరి 14 వ తేదీన శివలింగాన్ని తీసి దానిని దర్శించిన వారికి జన్మ రాహిత్యమే యని పలికిరి.
పాట:
(శివునిపై ఏ పాటైనా పాడ వచ్చు)
వచనం:
ఒక రోజు మచిలీ పట్ణం నందు సముద్ర తీరంలో భక్తులు విహరిస్తూ బాబా సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంతలో అలలపై ఆదిశేషునిపై పవళించిన శేష శాయిగా దర్శన మిచ్చారు. ఆ భక్తులు ఎంత ధన్యులో కదా! ఆ మరు నాడు కూడా సముద్ర తీరానికి వెళ్ళి వెండి గిన్నె లోపలికి విసిరారు. అది అలలపై తేలియాడుతూ బాబాను సమీపించింది. అందులో తీర్థాన్ని భక్తులకు పంచారు. ఏమి ఆ మాధుర్యము! ఏమి యా సువాసన! 
(హాస్యం) 
వర్ణనాతీతము. ఆ సముద్రుడే ముత్యాల హారాన్ని బాబాకు సమర్పించాడు. బెంగుళూరులో ఒక భక్తుని ఇంటిలో భజన జరుగుచున్నది. అలంకరించిన ఆసనం మీద కూర్చున్నారు బాబా. స్వామి దివ్య లీలలు తెలుసుకొన్న భక్తులు లెక్కకు మిక్కిలిగా వస్తున్నారు. ఆ యింటికి ఎదురుగానే చెప్పులు కుట్టుకొనే వానికి బాబాని చూడాలని కుతూహలం కలిగింది. ద్వారాన్ని సమీపించాడు. జనం క్రిక్కిరిసి ఉన్నారు. అప్పుడు బాబాని తన కోరిక తీర్చమని మనసులో ప్రార్థించుకున్నాడు. భక్తుల మనో భావాన్ని గ్రహించే బాబా అతని దగ్గరకు వచ్చి బంగారు ఏమి కావాలి? అని అతని భాషలో ప్రశ్నించారు. తన యింట ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు అతడు. బాబా సరే నని వెనుతిరిగి పోయారు. తన యింటికి దారి చెప్ప లేదని అతడు బాధ పడుతూ తన కొట్టు దగ్గర నిలపడ్డాడు. ఇంతలో కారు వచ్చింది. తలుపు తెరచుకొంది. లోనికి రమ్మని బాబా సంజ్ఞ చేసారు. ఏమి చేయడానికీ ఆలోచన తట్టక లోన కూర్చున్నాడతడు. కారు పరుగెడుతోంది. 
దారి చెప్ప లేదనే ఆలోచన తనలో వేధిస్తుండగా అతని యింటి ముందు కారాగింది. తలుపు తీసి బాబా లోనికి ప్రవేశించారు. ఆ భక్తుడి ఆశ్చర్యం వర్ణనాతీతం. స్వామిని ఈ విధంగా వేడుకొంటున్నాడు. 
అభేరి రాగం:
సీ. 
కూర్చుండ మాయింట కుర్చీలు లేవు  నా ప్రణయాంకమే సిద్ధ పరుప నుంటి.
పాద్యంబు నిడ మాకు పన్నీరు లేదు. నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగ నుంటి.
పూజకై మా వీట పుష్పాలు లేవు. నా ప్రేమాంజలులె సమర్పింప నుంటి.
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు  హృదయమే చేతికందీయ నుంటి.
గీ.
లోటు రానీయ నున్నంతలోన దేవ. రమ్ము దయ సేయు మాత్మ పీఠమ్ము పైకి.
అమృత ఝరి చిందు నీ పాదాంకముల యందు కోటి స్వర్గాలు మొలిపించుకొనుము తండ్రి.
వచనం:
బాబా సేవలో భక్తుల సేవలో మునిగి తేలుతోంది సుబ్బమ్మ. ఆమెకు అంత్య కాలంలో స్వామిని దర్శనమిమ్మని ఆమె కోరింది. అంగీకరించారు బాబా. ఆ సమయం ఆసన్నమయింది. ఆమెను క్రింద బెట్టారు. అ సమయంలో బాబా బెంగుళూరులో ఉన్నారు. ఆమె పరిస్థితి విషమించింది. బాబా అక్కడ నుండి తిరుపతి వెళ్ళారు. ఇక్కడ ఆమె బంధువులు బాబాపై అనేక విమర్శలు చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నాంత కాలం రాసి రంపాన పెట్టి ఆఖరి క్షణంలో కనీసం చూడ్డానికి కూడా రాలేదని ఆడిపోసుకొంటున్నారు. ఆ సమయంలో బాబా రానేవచ్చారు. సుబ్బమ్మా! సుబ్బమ్మా! అని పిలిచారు. ఏడు రోజులుగా కంటి చూపు లేక గుక్కెడు మంచినీళ్ళు కూడా దిగని పరిస్థితిలో ఉంది సుబ్బమ్మ. స్వామి పిలుపు వినగానే కళ్ళు తెరిచింది. ప్రేమ భావంతో బాబా చెయ్యి నిమురుతోంది. భక్త వత్సలుడైన ఆ బాబా ఆమె నోటి దగ్గర తన వ్రేళ్ళుంచి గంగా జలాన్ని సృష్టించారు. తనివి తీరా స్వామిని చూస్తూ గుటకలు వేస్తూ తుది శ్వాస విడిచిపెట్టింది. ఆమె ఆత్మ పరమాత్మలో లీనమైంది.
భాగేశ్వరి రాగం:
కథకుఁడు:
ప్రణామ్ స్వీకార్ కరో సాయి మహాదేవా.
సాయి మహాదేవా! సత్య సాయి మహాదేవా!
అల్లా యీశ్వర ఏసు సాయి.
బుద్ధ జో రాష్ట్ర మహావీర్ సాయి
నటన సూత్రధారీ జగన్నాధ సాయీ. ప్రణాం.........
వచనం:
బాబా సర్వ మత సమాహార స్వరూపము.
కథకుఁడు:
మతములన్నికూడ మంచినే బోధించె.
మతము లేక మనిషి మనగ లేడు.
మనసు చెడ్డదైన మతమేమి చేయురా. 
ఉన్న మాట తెలుపుచున్న మాట.
వచనం:
హిందూ, ముస్లిం, క్రైస్తవ్, బుద్ధ, జో రాష్ట్రియన్, జైన్ మతాలను మిళితం చేసి, సర్వ మతముల సారం ఒక్కటే యని చాటారు.
కళావతి రాగం:
ఈ మాయ లోకం కథ వినరోరన్నోచిన్నన్నా
ఈ మాయ లోన పడకన్నో రన్నో పెద్దన్నా.
అనాథ శరణాలయాల పెట్టి
అభాగ్య జీవుల నందులో నెట్టి
విదేశస్తులకు తనఖా పెట్టి
అమాయకులకు సమాధి కట్టే  మాయ..........
ఓట్ల కోసమై ఆశలు పేర్చి
సీటు రాగానె మాటలు మార్చి
ఓటరు నెత్తిన టోపీ పెట్టి
అతని నోటనే మట్టిని కొట్టే.  మాయ..........
డబ్బు కోసమై సారా నుంచి
గుట్కా ఖైనీ గుడాకు పెంచి
పొగాకు తోటల లైసెన్సు పెంచి
వ్యసన పరులుగా తయారు చేసే  మాయ.........
వచనం:
అనాథ శరణాలయాల పేరు పెట్టి అక్కడి ఆడ పిల్లలను విదేశాల కమ్మడం, నాయకులు ఓట్ల కోసం ప్రజల్ని మాయ మాటలతో మోసం చెయ్యడం, మనిషి యొక్క మనుగడ కూర్చి చెబుతూ డబ్బు కోసం సారా, బ్రాందీ, పొగాకు, ఖైనీ, గుట్కా మొదలగు ప్రాణాంతక పదార్థాల్ని తయారు చేసేందుకు లైసెన్సులు ఇవ్వడం అనే యీ మాయ లోకం మోసాల్లో పడకుండా ప్రతీ వ్యక్తీ జాగ్రత్త పడాలని హెచ్చరించారు.
పద్యం:
మాటయందు తీపి మనసులో విషమున్న 
మచ్చ వచ్చు గాని మంచి రాదు.
మచ్చ లేని బ్రతుకు మహి లోన చెల్లురా
ఉన్న మాట తెలుపుచున్న మాట.
ఈ విధంగా ప్రబోధలు చేస్తూ మానవ జీవితం గురించి ఈ ప్రకారంగా చెబుతున్నారు.
కళావతి రాగం.
తైతైతైతైతై బొమ్మా
దీని తమాషా చూడర మాయ బొమ్మ.
ఖ్యాతిగ దీనికి ముందు వెన్క గల 
కథ వివరింతును విను జీవా.  తై తై తై..........
మాతృ గర్భమున మల మూత్రమ్ముల
రోతల జీవు రోదింప
ప్రీతిగ వీరలు పేరంటమ్ములు 
చేతురిదెంతటి చిత్రమురా. తైతైతై........
పుట్టితి మది గోల్పోయితి. దుర్గతి
పట్టితి నని నీ వేడువగా
అట్టె నవ్వుతూ ఆనందించెద
రిట్టి వీరు నీ కెవరయ్యా. తైతైతై...........
గుట్టుగ నీ చెడు కోర్కె చెల్లెనని
లొట్టలు వేయకురోరన్న.
చిట్టా వ్రాసే చిత్ర గుప్తు కం
డ్లెట్టుల గంతలు కట్టుదురా. తైతైతై........
వచనం:
మూడు నాళ్ళ ముచ్చటైన యీ తోలు బొమ్మని మానవుడు శాశ్వితమని నమ్మి, మాయలో పడి, నలుగుతున్నాడు. మానవ జీవిత పరమార్థాన్ని ఈ తత్వం ద్వారా అందించారు బాబా.
1950 వ సంవత్సరం నవంబరు 23 వ తేదీన ప్రశాంతి నిలయ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ప్రతీ సంవత్సరం దసరా నవరాత్రులలో షిరిడీ బాబా విగ్రహానికి విభూతితో అభిషేకం చేసే వారు బాబా. ఆ అద్భుతాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్ళారు. విగ్రహానికి పైన ఇద్దరు భక్తులు ఒక వెండి బిందెను బోర్లించి పట్టుకుంటే అందులో చేయి నుంచి బాబా గారు త్రిప్పుతుంటే అక్షయంగా విభూతి విగ్రహం పై పడేది. ఆ సమయంలో భక్తులు తన్మయులై గానం చేస్తున్నారు.
కల్యాణి రాగం:
వచనం:
ఈ నాడు చూడాలి. నీ ఆలయం ప్రశాంతి నిలయం. పదునాల్గు భువనమ్ముల భూతల స్వర్గం.
1)వేద ఘోష యందు ఆ గీత భాగ్య మేమందు
గీతాచార్యుడు సాయి నడచును ముందు.
2)పూర్ణ చంద్రు యందు పరి పూర్ణ చందమామ.
నవ్వుల కిరణాల జల్లు విర జిమ్ముచూ నడయాడును.
3)షిర్డీ శిరమునందు విభూతి కనుల విందు.
అక్షయమై వర్షించును సాయి హస్తమందు.
4)యజ్ఞ కలశె చేకొని ఆ దర్భలు చే నిడికొని 
అవపృధ స్నానంబు అందించును సాయీశుడు.
5)ఊయలలో స్వామి ఉయ్యాల లూగి ఊరించును
చిలిపి చిన్ని కృష్ణుండై షోడశ కళలతో నిండును. 
6)ఓం జై జగదీశ యనుచు జయ మంగళ హారతు లిడ
మంగళకరుడౌ సాయిభగవానుడు దీవించును.
ఈ విధంగా నవ రాత్రులలో భక్తులు ఆనంద డోలికలలో ఊగుతుంటారు. ఈ తొమ్మిది రోజులలో బాబా నవ రత్నాలు సృష్టించి యజ్ఞ గుండంలో వేస్తారు. లక్షలాది జనంతో కిటకిటలాడుతున్నా సరే పేరుకు తగినవిధంగా అంతటా ప్రశాంతత నిండి ఉంటుంది. 
(హాస్యం) 
ఎందరో యోగులకు జపము ధ్యానము చేసే విధానాన్ని తెలుపుతుంటారు. కొందరికి స్వప్నంలోను, కొందరికి బాహ్యంలోను, మరి కొందరికి కోరిన రూపంలోను వెళ్ళి సహాయ సహకారాలందిస్తుంటారు బాబా. 
భోపాల్ లో నిజాయితీ గల ఒక మిలటరీ ఆఫీసర్ తనకు ప్రమోషన్ రాలేదని కాల్చుకోడానికి పిస్తోలు గురిపెట్టుకున్నాడు. ఆ సమయంలో బాబా కొడైకెనల్ లో ఉన్నారు. భక్తుల మధ్యలోనున్న బాబా వద్దు కాల్చుకో వద్దు అని బిగ్గరగా కేక వేసారు. 
భక్తులు విషయం ఏమిటి? అని ప్రశ్నించారు బాబాను. తరువాత తెలుస్తుందిలెండి అని ఇనిష్ట్రిమెమ్ట్ నా వద్దనే ఉందని టెలిగ్రాం ఇవ్వండని ఆ ఆఫీసర్ ఎడ్రస్ ఇచ్చారు బాబా. కొడైకెనాల్ ఎక్కడ....భోపాల్ ఎక్కడ.... ఆ సమయంలో ఒక చిత్రం జరిగింది. మిలటరీ ఆఫీసర్ భార్యా పిల్లలని అత్తవారింటికిపంపి తాను పిస్తలుతో కాల్చుకుందా మనుకున్నాడు. అదే సమయంలో కరుణామయుడైన బాబా అతని స్నేహితుడుగా స్నేహితుని భార్యగా పనిమనిషైగా రూపములు ధరించి తలుపు తట్టారు. ఆ ఆఫీసర్ రివాల్వర్ దాచి తలుపు తీసాడు. చాలా కాలం తరువాత చూసిన తన మిత్రుని ఎంతో గౌరవించాడు. కొంతసేపు ఐన తరువాత వారు వెళ్ళిపోయారు. మరల తన ప్రయత్నం కొనసాగిద్దామని రివాల్వరు గురించి చూసాడు. అది అక్కడ లేదు. కంగారుపడ్డాడు. ఇంతలోగా బాబా నుండి టెలిగ్రాం వచ్చింది. బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పుట్టపర్తి వెళ్ళాడు. బాబా హిత బోధ చేసి సమాజంలో నీలాంటి నిజాయితీపరులు ఉండాలనే నిన్ను బ్రతికించాను. నీకు మేలు కరుగుతుంది. వెళ్ళు అని పంపించారు.
ఒక రోజు కృష్ణాష్టమి పర్వ దిన సందర్భంగా భక్తులు ఆనంద పరవశులై సాయి కృష్ణుని భజన చేస్తున్నారు.
కథకుఁడు:
గోవిందా కృష్ణా జై గోపాల కృష్ణా జై.
గోవింద గోవింద గోవింద గోపాల జై.  గోవిందా..........
కేశవా! మాధవా! సాయీ నారాయణా
గోవింద గోవింద నారాయణా
నందలాలా వ్రజ బాలా
హేసాయి నారాయణా కృష్ణా కృష్ణా గోవిందా.......
వచనం:
భజన పూర్తయింది. బాబా భక్తుల మధ్యలో నడుస్తున్నారు. ఎందరో తమ తమ బాధలను వ్యక్తం చేస్తూ ఉత్తరాలందిస్తున్నారు. చిఱు నవ్వులు చిందిస్తూ బాబా అవందుకొని ఆనందపరుస్తున్నారు. ఇంతలో ఒక విద్యార్థి లేచి కవరందించాడు. దాని నందుకొని బాబా తిరిగి ఆ విద్యార్థి మీదకే ఆ కవరు విసిరారు. విసిరి వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ కుర్రాడు అపరాధం చేసాడని, అందుకే బాబా తిరిగి వెళ్ళిపోయారని ప్రక్కనున్న భక్తులందరూ ఆ బాలుణ్ణి నిందిస్తున్నారు. ఆ బాలుడు విచారిస్తూ నా బాధలు మొరపెట్టుకున్నానే కాని నేను తప్పు చేయలేదు. పరీక్ష ఫీజు రూ.600 సాయం చేయమని వ్రాసి అందించాను. కావాలంటే చూసుకోండి అన్నాడు బాలుడు. వారు ఆ కవరు చించారు. అందులో రూ.600/ నోట్లు ఉన్నాయి.ఆ అద్భుతానికి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా భక్తుల కోరికలు తీరుస్తుంటారు బాబా.
బాధలలో ఉన్నవారికి బోధలు చేస్తే ప్రయోజనం లేదని వారి బాధలను తీరుస్తుంటారు. 
తే.16 - 7 - 1997.దీని ప్రపంచ సాయి యువజన సమ్మేళనం ఏర్పాటు చేసి యువకులంతా వ్యసనాలకు బానిసలు కాకుండా మానవతా విలువలు కలిగి సమాజ శ్రేయస్సుకి పాటుపడండి. అని హిత బోధ చేసారు బాబా.
మోహన రాగం:
పాట:
మానవ సేవే మాధవ సేవని మరి మరి తెలియండీ. తందానతాన.
నరుడే నారాయణుడని తలచి హరి నామమునే మదిలో నిలిపి
చిరిగిపోయిన బడుగు జీవుల చేరి ప్రేమతో సేవ చేయరా. మానవ...........
వికలాంగులకు చేయూతనిమ్ము ఆకలన్న వారికి అన్నము పెట్టు
గ్రామ సేవయే రామ సేవని ప్రేమ పంచి పరమార్థము తెలియు. మానవ.........
వచనం:
ఒక రోజు కారులో ప్రయాణిస్తున్నారు మన బాబా. కారులో పెట్రోలు ఐపోయింది. పెట్రోలు కోసం వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి. డ్రైవరుకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. స్వామి బకెట్టుతో నీళ్ళు తెమ్మన్నారు. అందులో వేలు ముంచారు. అటు ఇటూ త్రిప్పారు. కారు ఆయిల్ టేంకులో పోయమన్నారు. వెంటనే కారు ష్టార్టు అయింది. 
(హాస్యం) 
ఇంకా పుట్టపర్తిలో విశేషాలెలాగున్నాయంటే..
కథకుఁడు:
వినరయ్యా ఓ భారతీయ సోదరులారా!
సాయి నాథుని దివ్య మహత్యము.
చదువుకై విద్యాలయాలు భళిభళి....
చిత్రమగు నక్షత్ర శాల భళిభళి....
ముచ్చటైన మ్యూజియమ్ము.  భళిభళి.
క్రీడలకు మైదానమండి. భళిభళి.
సర్వ మతముల స్థూపమండి. భళిభళీ.
అందమగు ఆరోగ్య ధామం.భళిభళి.
సత్యసాయి నీటి పథకం. భళిభళి.
వింతలగు కట్టడాలెన్నియో కట్టించి
విశ్వంబునుఱ్ఱూతలూగించినా సాయి. వినరయ్యా....
వినరయ్య......
వచనం:
పుట్టపర్తిలో కేజీ నుండి పీజీ వరకూ విద్యాలయాలు నిర్మింప జేసారు బాబా. భారత దేశం లోనే పేరు పొందిన నక్షత్ర శాల, ప్రపంచ ప్రజ లందరినీ ఆకర్షించే మ్యూజియం, విశాలమైన ఆట స్థలం, ఉచితంగా వైద్యాన్నందించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 752 గ్రామాలకు నీరందించే సత్య సాయి వాటర్ వర్క్స్, విమానాశ్రయము, రైల్వే ష్టేషను, వింత వింత కట్టడాలతో విరాజిల్లుతోంది పుట్టపర్తి. శారీరక, మానసిక, అనారోగ్యవంతులకు ఆరోగ్యాన్నందించే ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. కాబట్టి భక్తులారా! కలియుగ అవతార దైవంగా విరాజిల్లుతున్న భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య మంగళ రూపాన్ని కనులారా తిలకించి ఆయన మధుర వాక్యాలను చెవులారా విని, వారి బోధనలను మనసారా ఆకళింపు చేసుకొని, జీవితాన్ని ధన్యత గావించుకోండి.
మోహన రాగం:
సాయి నామమే బ్రహ్మానందం.
సాయి భజనలే శ్రవణానందం.
సత్య సాయి రూపమే నయనానందం. 
లీలా వినోదమే సాయి సంకల్పము. 
ప్రేమానందమే సాయి సౌమ్య రూపము. సాయి.......
ఈ నాడుబాబా వారు ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడానికి ప్రతీ సత్య సాయి సేవా సమితిలో 4 భాగాలు ఏర్పాటు చేసారు.
1)భజన, 2)సేవ, 3)ఆధ్యాత్మిక చర్చ, 4)బాల వికాస్.
ప్రతీ మనిషీ ఏదో ఒక విభాగంలో చేరి జీవితాన్ని చరితార్థం చేసుకొమ్మని ప్రబోధ చేస్తున్నారు. అతి భాష మతి హాని, 
మిత భాష అతి హాయి. 
అణాల కన్నా గుణాలు మిన్న, 
పరోపకారమే పరమ ధర్మం,
నరులలో నారాయణుని చూడు 
మొదలగు సూక్తుల ద్వారా సత్యం, ధర్మం, శాంతి, అహింస, ప్రేమ అనునవియే ప్రతీ మనిషికీ పంచ ప్రాణాలు. అవి లేని ప్రాణి జీవచ్ఛవంతో సమానం అని బోధిస్తున్నారు.
ప:
మానవ సేవయే మంచిదిరా
మంచిదిరా భాయి మంచిదిరా. మానవ.........
1)పరోపకారమే పరమ ధర్మమని 
పరాపకారమే పరమ పాపమని,
మదిలో తలచీ మసలుమురా. మానవ........
2)ధనమే పరమార్థమని ఎంచక
ఉన్నదానిలో కొంతైనా
లేనివారికీ సాయము చేయుము. మానవ...........
3)అన్ని దానములలో అన్న దానము మిన్న
ఎన్న తరమా దాని మహిమ విన్న
కాబట్టి నారాయణ సేవలో పాల్గొనండి. మానవ............
ఈ నాడు 300 దేశాల నుండి భక్తులు వచ్చి స్వామి దర్శన, స్పర్శన, సంభాషణలతో పారవశ్యం చెందుతున్నారంటే ఆయనను విశ్వ నట చక్రవర్తి అని అనడానికి సందేహం లేదు.
బిలహరి రాగ.(ఆట తాళం):
ప:
ఇహ పరంబులు సౌఖ్యదాయకము
శ్రీ సత్య సాయి కథని విన్న కలదు ఫలితంబు.
1)పుట్టపర్తి పుణ్య క్షేత్రమున ప్రభవించె విష్ణువు.
భక్తులను దయ చేసి కాపాడ
ఈశ్వరాంబ పెద్ద వేంకమ రాజులే తన తల్లి తండ్రిగ
చేసుకొని జన్మించె సాయి సత్య నారాయణుండనగ. ఇహ........
2)సత్య మార్గమునందు పయనించి 
తనవారినెల్లర ప్రేమతో తన దరికి చేర్పించి
భక్తి భావము పాదు కొలిపే భజనలను చేయించి
వారిని ముక్తి మార్గమువైపు నడిపే సత్య సంధుని దివ్య చరితము. ఇహ.........
3)బహు విధంబుల రూపములు దాల్చి
తన భక్తులందరి బాధలని తెగటార్చి రక్షించి,
నీయింట జంట కంట వెంటను ఉండి కాచెదననుచు తెల్పి
భయము వీడుము భక్తుడా యని అభయమిచ్చిన సాయి చరితము. ఇహ...........
4)ఉచిత విద్యను, ఉచిత వైద్యమును,
అందించి లోకము నుద్ధరించగ అవని ప్రభవించె
దిక్కు లేని దీన జనులకు దిక్కుగా తానుండి నిలిచీ
పెక్కు విధముల సాయములనందించు సాయి దివ్య చరితము. ఇహ.........
5)మతములన్నియు మంచినే తెలుపు
మీ మనసులే విషమైన అది చెరుపు.
మతము లేకను మనిషి లేడు మానవత్వము కలుగ జేసిన
మతమునందలి మహిమ తెలిపే సత్య సాయి దివ్య బోధలు. ఇహ..........
ఈ కథ చెప్పిన వారికీ, విన్న వారికీ, సాయీశ్వరుడు సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చును గాక.
మంగళ హారతి.
ఓం జై జగదీశ హరే సాయీ సత్య సాయి హరే........( పాడ వలెను )
మంగళం సాయి నాధాయ. సత్య సాయీశ మంగళం.  

Wednesday, September 8, 2010

డాll దేవగుప్తాపు సూర్య గణపతి రావు ఛత్ర బంధము.



అత్యద్భుత విషయం ఏమిటంటే ప్రముఖ వైద్యులైన డా.సూర్య గణపతిరావు భిషగ్వరులే కాదు. ప్రముఖ కవి వరులు కూడా. ఈ విషయం పైన గల సీసపద్య గర్భిత ఛత్రబంధం తెలియఁ జేస్తుంది. 
వారికి అభినందనలు మరియు ధన్యవాదములు.
జైహింద్.

Sunday, September 5, 2010

HAPPY TEACHERS DAY { 05-9-2010 }

సుజన మనోభిరామముగ శోభిల శిష్యుల తీర్చి దిద్దుచున్;
సృజనతఁ గొల్పు చుండి; గుణ శేముషి వెల్గ ప్రబోధఁ జేయుచున్;
ప్రజల హితంబునే వలచు ప్రాజ్ఞులు వెజ్జలు. వారి కెల్లెడన్
ప్రజల విశేష గౌరవము భక్తి ప్రపత్తులు గల్గు గావుతన్.
జైహింద్.

Saturday, August 14, 2010

ఉత్సాహం ఉరకలు వేస్తున్న భారతీయ యువతకు స్వాతంత్ర్యదినీత్సవ శుభాకాంక్షలు.

Bharat Mata

వందే భారత మాతరమ్; సు గుణ దామ్! వందే జగన్మాతమ్!
Prayer of Bharat Mata
Bharat Mata Prayer
Meaning :
I pay my obeisance to mother Bharat, whose feet are being a washed by the ocean, who wears the mighty Himalaya as her crown, and who is exuberantly adorned with the gems of traditions set by Brahmarsis and Rajarsis.
ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న భారతీయ యువజన తరంగానికి; యావద్భారతీయులకూ; భారతమాత శ్రేయోభిలాషులకూ; యావదాంధ్ర ప్రజానీకమునకు; ఆంధ్రామృత పాఠకులకూ తేదీ.15 - 8 - 2010.  హిందూదేశ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా  శుభాకాంక్షలు. 
జైహింద్.

Sunday, August 1, 2010

ఆబాల గోపాలానికీ మైత్రీ దిన శుభాకాంక్షలు.

నిత్య నూతన చైతన్య ప్రవర్ధమాన సోదర భారతీయులారా!
మీ అందరికీ మైత్రీ దివస శుభాకాంక్షలు.
మనం పరస్పరం మైత్రీ భావ విరాజమాన హృదయులమై నిత్య నూతన చైతన్యంతో భారత మాత సత్కీర్తిజ్యోతి దిగాంతాల వరకూ వ్యాపింప జేసే విధంగా కలిసికట్టుగా పురోమార్గంలో పయనిమ్చాలని; పురోగతి సాధించాలనీ మనసారా కోరుకొంటున్నాను.
ఆ పరమాత్మ అనంత స్నేహ భావాన్నిప్రసాదించి;  మనం పరస్పరం సహకరించుకొంటూ మనమంతాఒక్కటే అని మన జాతీయ పతాకం క్రింద భారతాంబకు జేజేలు నిత్యం పలుకుతూ వర్ధిల్ల జేయాలని కోరుకొంటున్నాను.
జైహింద్.

Sunday, July 18, 2010

యువశక్తిని వెలుపలికి తీయడం ఎలా? 1.


ప్రియ భారతీయ యువకులారా! మీలో నున్న అనంత శక్తికి జోహార్!
మన దేశానికి అంతర్జాతీయంగా గుర్తింపును; ఖ్యాతిని తెచ్చినది యువకుడైన వివేకానందుడే కదా!
అశక్తి తనకెట్లొచ్చిందంటారు?
సహజంగా అతడు చిన్నతనంలో చేసిన అల్లరిలో మనం చేసేది ఏ మాత్రమూ కాదంటే మీకతిశయోక్తి అనిపించ వచ్చు. కాని అది చాలా యదార్థం. 
ఎవరిలోనైతే నిశితమైన జ్ఞానాధిక్యత ఉంటుందో వారి ప్రవృత్తి సరైన మార్గంలో పడే దాకా కూడా లోకానికి వింతగాను; ఒక్కొక్క సారి కంటగింపుగాను  ఉంటుంది.
అతనిలోని అదే శక్తిని ఋజుమార్గంలో పెట్ట గలిగిన వాడే గురువు. అది సామాన్యమైన విషయము కాదు. భవితకు  అనంతమైన దివ్య జ్యోతి ప్రజ్వలనమన్న మాట.
ఐతే అదృష్టవంతులైన కొందరు మేధావులకే అలాంటి బోధ గురువు లభించే భాగ్యం కలుగుతుంది. ఉదాహరణకు వివేకానందునికి లభించిన గురువు రామ కృష్ణ పరమ హంస.
అలాంటి గురువు దొరకక పోతే ఇంకంతేనా?
అసాధారణమైన అంతర్గత  అనంత శక్తి నిర్వీర్యమైపోవడమో; 
పెర్వర్ట్  ఐపోవడమో జరగవలసిందేనా?
మనమూ ఆలోచిద్దాం. 
మనలో గల శక్తిని మనమే ఎందుకు వెలికి తీయ కూడదు?
సాధన ఉంటే అన్నీ సాధ్యమే. 
ఏ వ్యక్తయినా అనుకొన్నది సాధించాలంటే ముందుగా ఆత్మ విశ్వాసం అత్యవసరం. 
అలాంటి ఆత్మ విశ్వాసం మనకు కలగాలంటే మనం ఏం చెయ్యాలి?
ఆత్మను స్వాధీన పరచుకోవాలి.
అలా స్వాధీన పరచుచుకోవడం ఎలా? 
అసలే మన మనసు కోతి. 
అందున యుక్త వయస్సు. 
దానికి తోడు మనం సంచరిస్తున్న సమాజం మనకన్ని విధాలా అపమార్గ ప్రేరకంగానే ప్రస్తుతం ఉంది. మరెలా???
ఎవరో వస్తారని; ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా; నిజం తెలిసి నిదురపోకుమా. అని  మన మధుర గాయకుడు ఎప్పుడో ఆలపించాడు. 
మనం ఆవిషయాన్ని మరువరాదు. ప్రయత్నం చేయడం మొదలెట్టితే  మార్గం అదే దొరుకు తుంది కదా.
ముందుగా మనం సెల్ఫ్ కంట్రోల్ లో ఉండ గలగాలి. అప్పుడే ఏపనైనా చేయగలం.
ఐతే అదెలా?
మనం మన కంటోల్లో ఉండాలి అంటే ముందుగా నిశ్శబ్ద వాతావరణంలో మనం స్థిరంగా కొంతసేపైనా కూర్చో గలగాలి.
ఆ తరువాత ఏం చెయ్యాలో - - - -?
మరొకపర్యాయం మనం కలుసుకొన్నప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ఆలోచనను ముందుగా మీ మనస్సులో స్థిరపరచుకోండి. అప్పుడు  సాధన చేసే మార్గం తెలుసుకొని  చేద్దురుగాని. అంతవరకూ మీకు ఈ సదాలోచనతో పాటు శుభాలు  తోడుగా ఉండి; మీ సదాలోచనకు సహకరించాలని  కోరుకొంటున్నాను.
జైహింద్.

Monday, July 12, 2010

A British School Makes Sanskrit Compulsory


In the heart of London, a British school has made Sanskrit compulsory subject for its junior division because it helps students grasp math, science and other languages better.
"This is the most perfect and logical language in the world, the only one that is not named after the people who speak it.  Indeed the word itself means 'perfected language." --Warwick Jessup, Head, Head, Sanskrit department

"The Devnagri script and spoken Sanskrit are two of the best ways for a child to overcome stiffness of fingers and the tongue," says Moss.  "Today's European languages do not use many parts of the tongue and mouth while speaking or many finger movements while writing, whereas Sanskrit helps immensely to develop cerebral dexterity through its phonetics.
"

Saturday, February 13, 2010




67.విషాద ప్యమృతం గ్రాహ్యం, బాలాదపి సుభాషితం.


అమిత్రాదపి సద్ వృత్తం, అమేధ్యాదపి కాంచనం.
68.స్త్రియో, రత్నా, స్తథా విద్యా , ధర్మం, శౌచం, సుభాషితం,

వివిధాని చ శిల్పాని, సమాధేయాని సర్వతః ll
69.రోగ, శోక, పరీతాప, బంధన, వ్యసనానిచ,

ఆత్మాపరధ వృక్షాణాం ఫలాన్యేతాని దేహినాం.
70సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమా.

కావ్యామృత రసాస్వాదః, సంగమ స్సజ్జనై స్సహ.
71.వస్త్రేణ , వపుషా, వాచా, విద్యయా, వినయేనచ,

నకారైః పంచభిర్హీనః వాసవోపి న పూజ్యతే.
72.కృత్వా పాపం హి సంతప్య, తస్మాత్  పాపాత్ ప్రముచ్యతే.
నైవ కుర్యాత్ పున రితి నివృత్యా పూయతే తు స:.
73.అయం నిజ:? పరో?వేతి గణనా లఘు చేతసామ్.
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.
74.ఖలానాం, కంటకానాంచ, ద్వివిధైవ ప్రతిక్రియా!

ఉపానన్ముఖ భంగోవా, దూరతోవా విసర్జనమ్.
75.గంగా పాపం శశీ తాపం దైన్యం కల్ప తరుస్తథా.
పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం.
76.జరాం మృత్యుం భయం వ్యాధిం యో జానాతి స పండిత:
స్వస్థ స్తిష్ఠే న్నిషేదే ద్వా స్వపేద్వా కేనచి ద్ధసేత్.
77.పరోపకారాయ ఫలంతి వృక్షా: - పరోపకారాయ దుహంతి గావ:
పరోప కారాయ వహంతి నద్య: పరోపకారార్థమిదం శరీరం.
78.ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా
వాస్యతే తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా!
79.బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా!

నిష్కృతిర్వహితాసద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః! 
80.ఏకేనాzపి కు వృక్షేణ కోటరస్థిత వహ్నినా
దహ్యతే తద్వనం సర్వం. కు పుత్రేణ కులం యథా.
81.మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో:
బంధనా విషయాసక్తం ముక్త్యై  నిర్విషయగ్ స్మృతమ్.
82.నారికేళ సమాకారా దృశ్యంతేహి సుహృజ్జనా:l
అన్యే బదరికాకారా బహిరేవ మనోహరా: ll 
83ప్రత్యాఖ్యానేచ, దానేచ,  సుఖ దు:ఖే, ప్రియాzప్రియేl
ఆత్మౌపన్యేన, పురుష: ప్రమాణ మధి గచ్ఛతిll
84.యత్యథోzథోవ్రజత్యుచ్చై: నర: స్వైరేవ కర్మభి:
కూపస్య ఖనితా యద్వ త్ప్రాకారస్యేవ కారక:ll
85.న గృహం గృహమిత్యాహు: గృహిణీ గృహ ముచ్యతే.
గృహంతు గృహిణీ హీనం అరణ్య సదృశం మతం.
86.పుత్ర పౌత్ర వధూ భృత్యై రాక్రాంతమపి సర్వత:
భార్యా హీనం గృహస్థస్య శూన్యమేవ గృహం భవేత్.
87.నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.