ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో ! సృష్ఠి అంతం చెందినా మత్స్యములు జీవించి ఉంటాయి ! తిరిగి సృష్ఠి ఉద్భావించాలంటే మత్స్యముల మూలంగానే జరుగుతుంది !
వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓరాజర్షీ! నీవు దయాత్ముడివి... నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడాని కి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆచేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించుశ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి? " అని రాజుప్రశ్నించాడు.
అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పు డు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడ ు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకునౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్న ాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకుతీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడ ు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)--
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
ఆ శ్రీమన్నారాయణున ి సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)--
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్ శయ్యాపహా!
మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజ హితానికి, అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం భరత జాతికందేలా అనుగ్రహించాడన్న ది పురాణగాథల సారాంశం. చైత్ర శుద్ధ తదియ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన రోజు. ఆనాడు మత్స్య జయంతి జరపడం ఆనవాయితీగా వస్తోంది. మత్స్యావతారంలో విష్ణువు పూజలందుకునే ఏకైకదేవాలయం మనరాష్ట్రంలోనే ఉంది. చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని వేదనారాయణుడిగా కొలుస్తారు. వేదరక్షణను పారమర్ధక భావనతోనే కాక, మరోరకంగానూ విశ్లేషిస్తారు. ఉప్పునీటితో నిండి ఉండే సముద్రంలో లోతుకు వెళ్లినకొద్దీ ఆణిముత్యాలు, అరుదైన నిధులు లభ్యమవుతాయి. సముద్రానికి అట్టడుగున ఉన్న వేదాలను శ్రీహరి తీసుకువచ్చి బ్రహ్మకందించాడు . సముద్రాన్ని అజ్ఞానానికి అర్ధంగా తీసుకుంటే, వేదాలు విజ్ఞాన సర్వస్వం! ఇందులోని సందేశం ఏమిటంటే- అజ్ఞానపు తెరలు తొలగించుకుని, లోపలికి వెళ్లినకొద్దీ, మనకు అత్యంత ఆవశ్యకమైన, ఉపయుక్తమైన జ్ఞాననిధి సొంతమవుతుంది! ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని, మానవాళి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించుకుని, విజ్ఞానపు దివ్వెలు వెలిగించుకోవాలన ి ‘మత్స్యావతారం’ ప్రబోధించినట్లు గా భావించాలి
No comments:
Post a Comment