Saturday, June 16, 2012

సర్వానుగ్రహ హనుమద్ధ్యానము.

జైశ్రీరామ్. 

ప్రియ భగవద్బంధువులారా! 
భగవద్భక్తులకు భగవంతుని సేవకంటే కూడా భగవద్భక్తుల సేవ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. రాముని సేవ కంటే కూడా రామ భక్తుఁడైన హనుమంతుని సేవ మంచి ఫలితాన్నిస్తుంది. ఆ హనుమంతుని తలచుకొనినంతనే మనకు ఎటువంటి సత్ ఫలితాలు కగుతాయో, ఆ పరమ రామ భక్తుని మనం ఏ విధంగా ప్రార్థించాలో  క్రింది శ్లోకాల ద్వారా తెలుస్తుంది.
శ్లో:-
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
ఆ.వె:-
బుద్ధి, బలము, కీర్తి, పూజ్యమౌ ధైర్యము,
నిర్భయత, యరోగ నిగ్రహములు,
కన యజాఢ్యతయును, కమనీయ వాగ్ధాటిఁ
గొలుపు హనుమ తలపు, గురు తరముగ.
భావము:- 
హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రోగ రాహిత్యమును, అజాఢ్యమును, మంచి వాగ్ధాటిని, సంప్రాప్తింప చేస్తుంది.
శ్లో:-
ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః శ్రద్ధాః పుత్రా సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ  కపి నాథ నమోస్తు తే.
తే.గీ:-
ఆయువును, ప్రజ్ఞ, కీర్తియు, నమర చేసి,
శ్రద్ధ, పుత్ర సుశీలత లొద్దిక నిడి,
సౌఖ్య మారోగ్యమమరంగ చక్కఁ గనుమ!
ప్రార్థనలుసేతు గనుమయ్య! భక్త హనుమ!
భావము:-
ఓ రామ భక్త హనుమా! నిన్ను ప్రార్థన సేతును. నాకు ఆయుర్దాయమును, మంచి ప్రజ్ఞను, సత్కీర్తిని, శ్రద్ధను, సత్పుత్రులను, సౌశీల్యాది సద్గుణములను, సౌఖ్యమును, ఆరోగ్యమును, అమరునట్లు కరుణతో చూడుము.

చూచారుకదండీ! మీరు ఆ హనుమద్వరసిద్ధులగుదురుగాక.
జైహింద్.

No comments: