Sunday, September 8, 2024

సప్త చిరంజీవులు.

జైశ్రీరామ్. 

సప్త చిరంజీవులు.

శ్లో.  అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।

జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥

వివరణ.

శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు 

వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి 

లోకహితముకై వ్యాసుడు 

శ్రీరామభక్తితో హనుమంతుడు 

రామానుగ్రహమువలన విభీషణుడు 

విచిత్రజన్మము వలన కృపుడు 

ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు 

సప్తచిరంజీవులైరి । 

వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని 

ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై 

శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము.

జైహింద్.


Thursday, September 5, 2024

గణపతి పాట. రచన, సంగీతం,గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
శ్రీమతి వల్లూరి సరవతి గారు చక్కని సంప్రదాయకుటుంబీకులు. భక్తి తత్పరతతో రచించిన వారి పద్యాలయినా పాటలయినా మనోహరంగా పాడే సుస్వభావం ఉన్న జనని. వారే స్వయముగా రచన చేసి వారే అద్భుతంగా పాటగా అందరికీ పంచే ఉదార స్వభావులు. గణపతిపై వీరు రచించి పాడిన పాట ఎంత బాగుందో చూడండి.
శ్రీమతి వల్లూరి సరస్వతిగారికి నా అభినందనలు.
జైహింద్.

Tuesday, September 3, 2024

“మాయదారి...” డా. పేరి రవికుమార్ గారి కొత్త కథ

జైశ్రీరామ్.

“మాయదారి...”

     బృందావనంలో గాలి మందగించింది. చడీ చప్పుడు లేకుండా ప్రవహిస్తోంది యమునా నది.

పగలు రాత్రి కూడా కళకళలాడుతూ త్రుళ్ళిపడే ఊరు మొత్తం నిశ్శబ్దంగా కనబడుతోంది

అందరూ ఎవరి పనులలో వారు ఉన్నారు. కాని, మొత్తంగా ఏదో గుబులు మేఘం కమ్ముకున్నట్లు అవుతోంది. 

అవును మరి, ఎందుకు కాదు? కారణమా తెలియదు. అప్పటికి ఒక వారం దినాలు అయి ఉంటుంది. ఏ అల్లరి చేయక కృష్ణుడు బుద్ధిగా ఉన్నాడాయె. ఎవరైనా అల్లరి చేస్తే కష్టంగా ఉంటుంది. కాని, కృష్ణుడు అల్లరి చేయకుంటే నష్టంగా అనిపిస్తోంది. 

యశోద మాత్రం సంతోషంగా ఉంది. కృష్ణుడు పొద్దుటనే, లేపకుండానే నిద్ర లేస్తాడు. అమ్మ పెట్టిన వెన్ననే తింటాడు. చద్ది మూట కట్టుకుని, ఆవులను తీసికొని వెళ్ళి, సాయంకాలం ఇంటికి చేరుకుంటాడు. ఇక ఎక్కడికి పోడు. పెందలకడనే అన్నం తిని పడుకుంటాడు. రాత్రి మధ్యలో ఎప్పుడు చూసినా తన పక్కలోనే ఉంటాడు. అలుక, అల్లరి లేవు. ఇంటి మీదకు తగవులు లేవు. యశోదకు సంతోషమే కదా. 


కాని ఇంకెవరికీ అలాగ లేదు. ఏ ఇంట్లో చూచినా వెన్న కుండలు అలానే ఉంటున్నాయి. పెరుగు కుండలు పగలట్లేదు. కృష్ణునితో తిరిగే పిల్లలు కూడా నెమ్మదిగా ఉంటున్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. అందరూ తేలికపడాలి. అయినా ఎందుకో బరువుగా అనిపిస్తోంది. ముందు రెండు దినాలు బాగుంది. తరువాత అసంతృప్తి మొదలైంది. ఇలా బాగా లేదని ఒకరు అన్నారు, ఆ మాట క్రమంగా వ్యాపించింది. ఇప్పుడు అందరికీ అలాగే అనిపిస్తోంది. 

ఆవులు సరిగా పాలు ఇవ్వటం లేదు. కుండల వంటి పొదుగులతో కుండల నిండుగా పాలు ఇచ్చేవి. ఇప్పుడు ఏమిటో తగుమాత్రంగా ఇస్తున్నాయి.

అత్తలకు తమ కోడళ్ళ గురించి చింతలేదు. రాత్రుళ్లు ఇంటి పట్టున ఉంటున్నారు అని. కోడళ్ళు మాత్రం దిగులుగా ఉన్నారు. వారి కారణం వారికి ఉంది.

రాత్రుళ్లు దొరలిపోతున్నాయి నిశ్శబ్దంగా. వేణుగానం వినబడుట లేదు. హృదయం వెలితిగా, బరువుగా అనిపిస్తోంది. 


కామన్నగారి బొవ్వప్పకు కూడా తెలియని చిరాకుగా ఉంది. ఆవిడ అసలు పేరు ఎవరికీ తెలియదు. ఏనాడో కాలం చేసిన ఆమె పెనిమిటికి తెలుసునేమో. అందరూ ఆమెను బొవ్వప్ప అనే అంటారు. ఆవిడ నోరు విప్పితే నాలుగు వీధులు వినబడాలి. అంత ధాటీగా లంకించుకుంటుంది. అదెందుకో కాని, ఆ ఇంట్లో కృష్ణుడు ఎక్కువగా అల్లరి చేస్తాడు. 

ప్రతిదినం పొద్దుట బొవ్వప్ప తన ఇంటి అరుగు మీద నిలబడటం, అరవటం. ఆమె ఎప్పుడూ యశోద ఇంటి మీదకు పోదు. తన గుమ్మంలో నిలబడి, గొంతు పెద్దగా చేయటమే. తన మాటలు వినబడతాయి అని లేదా విన్నవారు యశోదకు చెప్తారు అని నమ్మకం. ఆవిడ ఎప్పుడూ, మిగిలిన పిల్లకాయలను ఏమీ అనదు. 'వానితో తిరిగి చెడిపోతున్నారు పాపం' అంటుంది. కృష్ణుని మీదనే అన్ని తిట్లూ. 'మాయదారి సంత' అని ఒక మాట చివర్లో  తగిలిస్తుంది.


అవును మరి, కృష్ణుడు చేసే పనులు అలాగే ఉంటాయి.

ఒకనాడు చిట్టి బూరెలు చేసింది బొవ్వప్ప. కొడుకు, కోడలు, తను, ముగ్గురే ఇంట్లో. అయినా హెచ్చుగానే చేసి, చిన్న గంపలో పెట్టి అటకమీద దాచింది. ముందు జాగ్రత్త అనుకున్నది కాబోలు. మధ్యాహ్నం ఒక కునుకు తీసి లేచేసరికి, ఇంటి ముంగిట కృష్ణుడు. 

"బూరెలు తియ్యగా ఉన్నాయి" అంటున్నాడు.

ఉలిక్కిపడి, ఆశ్చర్యపడి, గభాల్న లేచి అటకమీద గంప తీసి చూచింది. మూడంటే మూడే ఉన్నాయి. 

"హారినీ, పగలు కూడా వస్తున్నావూ" అని గొంతు పెంచింది.

"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.

'నువ్వే ఇచ్చి ఉంటావు' అన్నట్లు కోడలి వైపు చూచింది.

అత్తగారి భారీ విగ్రహం ముందు బక్క పలుచని కోడలు భయంగా నిలబడి, 'కాదు' అన్నట్లు తలాడించింది.

"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.

మరింత ఆశ్చర్యం, "అదేమిటి, నేను కారం బూరెలు చేస్తే" అని బొవ్వప్ప గొంతు తడబడుతోంది.

"నాకోసం నైవేద్యంగా పెట్టే ఉంటావు అన్ని బూరెలు. ప్రసాదంగా నీకు మూడు మిగిల్చానులే బొవ్వప్పా ! " అన్నాడు కృష్ణుడు తీపి గొంతుకతో.

"ఏవిటీ నైవేద్యం, ప్రసాదం అంటూ. పైగా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు బొడ్డూడని గుంటడివి"  బొవ్వప్ప గొంతులో మాత్రం కారం వినబడుతోంది.

పకపకమని నవ్వాడు కృష్ణుడు,"నాకు బొడ్డూడితేనే అన్నీ పుట్టుకు వచ్చాయి తెలుసా" అన్నాడు.

ఆ నవ్వులో క్షణకాలం అంతా మరచింది బొవ్వప్ప.

తేరుకొని చూస్తే, కృష్ణుని వైపు పరవశంగా చూస్తోంది కోడలు.

అప్రయత్నంగా ఒక బూరె తీసి నోట్లో వేసుకుంటే, తియ్యగానే ఉంది.

'బెల్లప్పాకం పట్టుకొచ్చి కలిపేసి మరీ తినేసాడు గావాల్ను' అని గొణుక్కుంది.

"మళ్లీ చేసినప్పుడు వస్తాలే" అని పరుగెత్తాడు కృష్ణుడు.

బొవ్వప్ప ఏం చేస్తుంది? మిగిలిన రెండు కూడ నోట్లో వేసుకుంది. తియ్యగా రుచిగా ఉన్నాయి.

కోపం, ఆశ్చర్యం పెరిగిపోయాయి. అరుగు మీద నిలబడి రెండు ఘడియలు తిట్టిపోసింది. "మాయదారి సంత" అని ముగించింది.


యశోదమ్మ చెవికి సోకదూ. అప్పటికి ఇల్లు చేరాడు కృష్ణుడు.

"ఏరా కృష్ణా, నన్ను అడిగితే అవేవో నేను చేయనూ, చూడు ఎలా తిడుతోందో" అన్నది.

"బొవ్వప్ప నోరు చెడ్డది కాని చెయ్యి మంచిదే అమ్మా. బాగా రుచిగా చేస్తుంది. నా కోసమే అన్ని చేసింది" అని నవ్వాడు కృష్ణుడు.

ఆ నవ్వు చూస్తే అన్నీ మరచిపోతుంది యశోద.

బొవ్వప్ప మాత్రం ఏదీ మరచిపోదు. ఒకటి జరిగినప్పుడల్లా పాతవి అన్నీ తలచి ఏకరువు పెడుతుంది.

అలాగ బొవ్వప్పకు నోరు చేసుకునే అవకాశం ఇస్తాడు కృష్ణుడు.

ఇప్పుడు బొవ్వప్ప నోటికి పనిలేనట్లు అయింది. గంపలు, కుండలు అన్నీ పెట్టినవి పెట్టిన చోటనే ఉంటున్నాయి నిండుగా. 

మంచిదే కదా, కాని కానట్లు ఉంది. ఏమీ తోచట్లేదు బొవ్వప్పకు. ఏదైనా వండబోతే, 'చాలులే మన ముగ్గురికి అంతంత ఎందుకు' అని గదమాయిస్తోంది. ఊరకే అరుగు మీద కూర్చుంటుంది. ఇంటి లోపలికి బయటకు తిరుగుతుంది. 

అత్తగారి అవస్థను చూసినా ఏమీ అనదు కోడలు. ఆమె దిగులు ఆమెకు ఉంది.

బొవ్వప్ప మునుపటిలా నిద్రలో ఏ అలికిడి విన్నా, వెంటనే లేచి చూడట్లేదు. అసలు సరిగా నిద్ర పట్టడం లేదు. ఏమిటో ఊపిరి ఆడనట్లు ఉంది.


చంపావతికి ఊపిరి తీసుకోవటమే బరువుగా ఉంది. రాత్రి నిశ్శబ్దంగా కదలకుండా ఉంది. తన ఒంటరితనాన్ని  పరిహసిస్తున్నట్లు రాత్రి, వెన్నెలతో నవ్వుతోంది.

కృష్ణుడు ఎక్కడ అని ప్రతిరేయి వెదుకులాట. అదే మధురం అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు వెదకనక్కర లేదు. 

మల్లెపొదల చెంత నిలిచి ఏమని అడుగను? 

'మీ పొదల మాటున ఎందుకు లేడు చెప్పరే' అని అడుగనా.

భృంగములను ప్రశ్నింతునా.

కృష్ణుడు తన ఇంటి లోనే ఉన్నాడు. ఇక్కడ ఎక్కడా లేడు.

కృష్ణుని ఎల్లప్పుడూ చూడకుండా చేస్తున్నాయి ఈ కనురెప్పలు అని ఒకనాడు అనుకున్నాను. నేడు విచ్చిన కన్నులు. కనుపాపలలో లేడే ఆ పాపడు.

అక్కడే కూలబడింది చంప. కొంతసేపటికి పక్కన కదలిక తెలిసి చూస్తే, కుముద. ఇద్దరూ ఏమీ మాటాడుకోలేదు. మౌనంగానే వేదన పంచుకున్నారు. 

రాత్రి గడచిన కొద్దీ, అష్టమి నాటి వెన్నెల చల్లగా చిక్కగా కమ్ముకుంటోంది. ఆకాశంలో తారలు ఒకటొకటిగా బయటపడి మెరుస్తున్నాయి. 

పద్మ, కుసుమ, రమణి ఇలా ఒకరొకరుగా చేరుకున్నారు.

"ఈ వెన్నెల..." అన్నది ఒకామె గొంతు పెగల్చుకొని. 

"శుక్లపక్షమే కాని మనం ఇప్పుడు కృష్ణపక్షంలో లేము కదా" అన్నది ఒకామె.

సహింపలేని చల్లని వెన్నెలను పంచలేక రాత్రి గడచింది. నులివెచ్చని సూర్యుడు తొంగి చూచేవేళ అందరూ కాళ్ళీడ్చుకొని ఇళ్ళకు మళ్ళారు.

పగలు రాత్రి మరల అదేవిధంగా తిరిగాయి.

మధ్యాహ్న వేళ.

తాటితోపులో ఒక చెట్టు మొదట్లో పడుకొని ఉన్నాడు బలరాముడు.

మనిషి పొడుగు. పెద్ద పంచను గోచీలాగ చుట్టుకొని ఉన్నాడు. 

అసలే ఎర్రని వాడు. చెట్ల ఆకుల మధ్యనుండి పడే ఎండకు మరింతగా కంది ఉన్నాడు. 

పక్కనే ఒక ముంత. ఉండుండి కదులుతోంది, గాలికి కాబోలు.

ఎండ, మాటుపడి, నీడ తగిలేసరికి కనులు తెరచాడు. 

చుట్టూ నిలబడిన వారిని చూచి, లేచి కూర్చున్నాడు.

'ఏమిటి' అన్నట్లు చూపు.

"రామా" అంది వల్లి.

"ఏంటి నా దగ్గరకు వచ్చారు? " బలరాముని మాట స్థిరంగానే ఉంది. 

"ఏం లేదు, తమ్ముడు... కనబడట్లేదు..." అని గొంతు సవరించింది ఒకామె.

"నాతోనే వస్తున్నాడుగా. ఇవాళ ఇంట్లో ఉన్నాడు, అంతే " అని పెళుసుగా అన్నాడు అన్న.

"అది కాదూ..." తలవంచుకుని అంటోంది ఒకామె.

లేచి నిలుచున్నాడు బలరాముడు. చేతిలో ముంతను ఎత్తి మిగిలిన నాలుగు గుక్కలు నోట్లో వేసుకొని, పారేసాడు. 

"నాకేం తెలుసు? తమ్మునే అడగండి" అని వెళ్ళిపోతున్నాడు. 

"ఆగవయ్యా కోపం తెచ్చుకోకు" అన్నది చంప. ఆమె గదమాయింపుతో తగ్గాడు రాముడు.

చిన్నవాడే కాని మనిషి ఎత్తరి.

అతని ముఖంలోకి చూస్తూ అంది చంప

" నీ తమ్ముని గురించి అంతా తెలిసేది నీకే అని మాకు తెలుసు.

నువ్వే చెప్పాలి.. ఏమయ్యింది?"

ఒక నిమిషం ఆగాడు అన్న.

"చెప్పు రామూ" మరొకరి లాలన.

"ఏంలేదు, మొన్నెపుడో అమ్మ కన్నీరు పెట్టుకుంది తమ్ముని దగ్గర "

"అయ్యో ఎందుకని " నాలుగైదు గొంతుకలు.

"ఇంటి మీదకు తగవులు తేవద్దురా, భరించలేకున్నాను, అంది. సరేనమ్మా అన్నాడు తమ్ముడు. అదీ సంగతి " అని బయలుదేరుతున్నాడు రాముడు.

"ఆగాగు" అని అడ్డుకుంది చంప, " మరి మేమేం చేసాము? " 

'అవును సుమా ' అన్నట్లు అందరి చూపులు.

బలరామునికి నేల చూపులు.

"ఒరే మల్లా" అంది కుముద.

అప్పటివరకు ఆమె వెనక ఉన్న మల్లడు ముందుకు వచ్చాడు.

సన్నగా పొట్టిగా ఉన్నాడు. ఒక గోచి,  వాని కన్న పొడుగ్గా ఉన్నట్లు వేలాడుతోంది.

చిన్న ముంతను సందేహంగా అన్న చేతులో పెట్టి తుర్రుమని పరుగెత్తాడు.

నేలమీద కూర్చున్నాడు రాముడు. కొత్త ముంతను పక్కన పదిలంగా పెట్టుకున్నాడు. ఏ ఒక్కరిని కాక అందరినీ చూస్తున్నట్లు మెల్లగా అన్నాడు, "మీరు కూడా ఏమైనా అనుకున్నారేమో"

"ఏమీ అనలేదే" చప్పున ఒక గొంతుక.

"పైకి అనకున్నా, లోపల ఏమైనా అనుకున్నారేమో, ఆలోచించుకోండి" 

"అదికాదు..." ఎవరో అనబోయారు.

"చెప్పానుగా, ఇంక వెళ్ళండి" అని ఎర్రని కనులతో అందరినీ చూసాడు. 

ముంతను నోట్లో ఒంపుకొని రెండు గుటకలు వేసి, కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

అతను చెప్పగలిగినది చెప్పాడని, ఇంక మాటాడడు అని అందరికీ అర్థం అయింది.

దగ్గరలో చెట్ల వద్దకు వెళ్ళి నీడలో కూర్చున్నారు. ఎవరికి వారికే ఆలోచనలు.

ఎండ ఉంది. కాని వేడి లేదు, తాపం లేదు. తాపం అంతా లోలోపలే ఉంది. చెట్టు నీడ ఇచ్చే చల్లదనం తెలియనట్లు, చాలనట్లు అనిపిస్తోంది. గాలి రివ్వున వీస్తోంది. అంతకన్న ఎక్కువగా ప్రశ్నలు, సమాధానాలుగా తలపుల కదలిక.


"ఒకసారి నేనే అనుకున్నాను... ఎందుకు అని..." గొంతు పెగల్చుకొని అన్నారెవరో.

"..‌. నేను కూడా... ఎందుకో..." మరొకరు.

"సంసారం ఒక పక్క.. అని సందేహం"

"మొగుడు, ఇల్లు..."

"రాత్రి నిద్ర ఉండట్లేదని..."

"... ఎందుకో తప్పు అనిపించి... "

ఇలా ఒకటొకటిగా మాటలు పైకి వచ్చాయి.

"కాని, ఆ వేణుగానం... "

"కృష్ణుడు... "

" లేకుంటే ఎలా? "

సంశయ స్వరాలు.

లేచి నిలబడింది చంప, " అందరమూ ఏదో ఒకటి అనుకున్నవారమే, అందుకే ఇలా..." అంది.

"మరి ఇప్పుడు ఏం చేద్దాం" ఆత్రంగా, ఆశగా అడిగింది కుసుమ.

"కృష్ణుని ఇంటికి వెళ్దామా? " చిన్నపాటి ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూండగా అంది పద్మ.

"వెళ్ళి... ఏమని చెప్పాలి? " ఎదురు ప్రశ్న.

నిశ్శబ్దం.

"కృష్ణుని ఇంటికే పోనక్కరలేదు" అని, ఏదో తెలిసినట్లు చెంగున లేచింది కుముద.

'అయితే ఏమిటి ' అని అడిగే లోపలే, " మనం ఇళ్ళకు పోదాం. కృష్ణుడే వస్తాడు" అంది ధీమాగా.

మెల్లగా అందరికీ అర్థం అయింది.

"అవును"అన్నారెవరో, "మనం లోపల అనుకున్నాం. ఇప్పుడు పైకే మాటాడుకున్నాం... చాలు" 

'సరియే' అన్నట్లు అందరూ లేచారు. కదిలారు వడివడిగా.

చెట్లను, లతానికుంజములను చూస్తూ, 'రాత్రి వస్తాం' అనుకుంటూ, వాటిని చేతులతో  నిమురుతూ నడిచారు.

ఎక్కడనుండో కోయిల కూత వినవచ్చింది.

కృష్ణుని ఇంటికి ఎవరూ వెళ్ళలేదు కాని, అక్కడ వేరొక గుంపు కనబడుతోంది.

కారణం బొవ్వప్ప.

మధ్యాహ్న వేళకు ఇంటి ముంగిటికి వచ్చి నిలబడింది. 

వీధి అంతా కనబడుతోంది. ఎవరి అలికిడి లేదు.

ఎందుకనో ఆమె అడుగులు ముందుకు పడ్డాయి.

తనకు  తెలియకుండానే నడుస్తోంది.

ఎప్పడో కాని బయటకు రాదు. ఇవాళ ఎండ ముదురుతున్న వేళ రావటం! 

చూస్తూనే ఆవిడ వెనుక ఒకామె.

'ఎక్కడికి' అని అడగలేదు.

మరో నాలుగు అడుగులు వేసేసరికి ఇంకొకరు. మొత్తానికి యశోద ఇంటికి చేరేసరికి ఒక గుంపులా తయారయింది.

ఇందరిని చూడగానే యశోద కంగారు పడింది. 'కృష్ణుడు ఇంటిపట్టునే ఉన్నాడే' అనుకుంటూ నిలుచుంది.

"కృష్ణుడు లేడా ఇంట్లో" అని ముందుగా బొవ్వప్ప పలకరింపు.

"ఉన్నాడూ " అని మెల్లగా" ఏమయింది " అంది యశోద.

"ఏంలేదు, నాలుగు నాళ్ళనుండి కనబడలేదు ఎక్కడానూ "

"అవును" అంది మరొకతె, "ఏమిటో కృష్ణుణ్ణి చూడకుంటే ఏదోలా ఉంటేనూ... " అని సాగదీసింది.

"బావుందమ్మా" చప్పున అందుకుంది యశోద, తనవంతు వచ్చింది కదా, గొంతు పెరిగింది, "మావాడు వస్తే ఇవి చేసాడూ అవి చేసాడూ అని తగవుకు రావటమా? మీ జోలికి రాకుంటే, ఇలా అడగటమా? విడ్డూరం " అన్నది.

ఆమె చెప్పింది నిజమే కదా, ఎవరూ ఏమీ అనలేకపోయారు వెంటనే.

నెమ్మదిగా మాట కలిపింది పక్కింటి రంగనాయకి, " అది కాదే యశూ, పిల్లాడికి ఏమైనా ఒంట్లో బాలేదేమో అని... "

"ఏం లేదు " మధ్యలోనే మాట ,తుంచివేసింది యశోద," చక్కగా ఇంటిపట్టునే ఉన్నాడు. మీరింక వెళ్ళచ్చు"

"ఓసారి పిలుద్దూ, చూచి పోతాము"

"ఎందుకూ, ఇంట్లో నేను చేసిన మా ఇంటి వెన్న వేసుకొని తింటున్నాడు. మీ చూపులు పడక్కర్లేదు"  అంది యశోద.

ఇన్నాళ్ల తగువులకీ చెల్లింపు చేసే అవకాశం వచ్చింది కదా. ఆమె మాట సూటిగా పుల్లవిరుపుగా ఉంది. దాంతో ఎండ మరింత వేడిగా తగులుతోంది. 

ఆమెకు దగ్గరగా వచ్చి, నచ్చచెప్తున్నట్లు 

"మాట వినవే" అంటోంది ఇంకొకతె, "మా పిల్లలు కూడా ఏమిటో మందకొడిగా అయ్యారు..." 

"అయితే కానీ నాకేంటి" అని యశోద ఇంకేదో చెప్పేలోగా మెల్లగా వచ్చాడు కృష్ణుడు. తల్లి వెనకే నిలబడ్డాడు.

కృష్ణుని చూడగానే, ఎండ చల్లగా అనిపించింది అందరికీ.

"ఏవిరా కిట్టయ్యా! మా ఇంటికి రావట్లేదు? " ఎవరో గబుక్కున అన్నారు.

అదే ప్రశ్న అక్కడ ఉన్న అందరి చూపులలో కనబడుతోంది.

"ఎందుకూ" అన్నాడు కృష్ణుడు.

ఏమని చెప్తారు. నిశ్శబ్దం.

నవ్వాడు కృష్ణుడు.

'వస్తానులెండి' అన్నాడా!?

ఆ నవ్వులో అలా వినిపించిందో, అనిపించిందో. 

"ఇంక వెళ్ళండి" అంది యశోద.

ఒకరొకరు వెనక్కు తిరిగారు. ముందుకు నడుస్తున్నారు కాని అందరికీ వెనకచూపులే. కృష్ణుడు అక్కడే నిలబడి ఉన్నాడు. తన మీదనే కృష్ణుని దృష్టి ఉన్నట్లు ఎవరికి వారికే అనిపిస్తోంది.


ఇంటికి వచ్చింది బొవ్వప్ప. కోడలు ఇంట్లోనే ఉంది.

 "ఎక్కడికి వెళ్ళారూ, గుమ్మం తలుపు గడియ కూడా పెట్టకుండా... " అంది కోడలు.

"దొంగ, తన ఇంటిలోనే ఉన్నాడు. ఇంక మన ఇంటికి ఎందుకు గడియలు, తాళాలు?" అంటూ లోపలికి నడిచింది బొవ్వప్ప.

ఆశ్చర్యంగా చూసింది కోడలు.

అదే విస్మయం అన్ని ఇళ్ళల్లో, ఊరిమీద మేఘంలా కమ్ముకుంది. ఉండీ ఉండీ నాలుగు చినుకులు పడ్డాయి.


పొద్దు వాటారింది. రాత్రి కొరకు అందరి ఎదురుచూపును అర్థం చేసుకున్న భానుడు, గబగబా పడమటి కొండలలోకి జారుకున్నాడు.

మినప్పిండి, బియ్యప్పిండి నానబెడుతోంది కోడలు.

"మరికాస్త వెయ్యి" అంటోంది బొవ్వప్ప వీధి అరుగు మీదనుండి, "మరీ మూడోనాలుగో కాదు, ఎక్కువ చెయ్యి"

మాటాడకుండా చెప్పినట్లు చేసింది కోడలు. కారం బూరెలు తయారయ్యాయి.

గంపలో అటకెక్కి కూర్చున్నాయి.

రాత్రి చల్లగా సాగి వచ్చింది. 

మింట చుక్కలు తమతమ స్థానాలలో ప్రకాశిస్తున్నాయి.

చంద్రోదయమే ఇంకా కాలేదు.

తొందరగా భోజనం చేసి, నిద్రకు చేరింది బొవ్వప్ప.

రాత్రి, చీకటి, వెన్నెల, నిద్ర... ఆన్నీ కలిపి ప్రసరిస్తున్నాయి.


రాత్రి ఏ జాములోనో, అలికిడికి మెలకువ వచ్చింది. అటకమీద గంప కదిలినట్లు, పక్కింట్లో పెరుగుకుండ పగిలినట్లు, పరుగులు పెట్టిన అడుగుల సవ్వడి... వినవచ్చాయి.

'మాయ' అనుకుంటూ ఒత్తిగిలి పడుకుంది బొవ్వప్ప.

కోడలి గురించి చూడలేదు.

మరి, అత్తకు కూడా ఇప్పుడు వినబడుతోంది... నిద్దట్లో...  వేణుగానం!

శుభం.

ఇంత చక్కగా రచించి అందించిన శ్రీమానా పేరి రవి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్.


Thursday, August 29, 2024

నుదుట కుంకుమబొట్టు మదినిల్పు తొలిమెట్టు. మెట్టుకొనుడు మంచి బొట్టు మీరు... సమర్పణ మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

జైశ్రీరామ్

 తిలక ధారణ 

బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటారు పెద్దలు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,

ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు..

రెండూ కూడా స్మశానంతో సమానం..అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి...అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు కూడా ఉంటాడు.

కుంకుమ ఎఱుపు రంగు. రంగులలో ఎఱుపునకు అత్యంత ప్రాధాన్యత. ఎఱుపు కరుణకు (దయ) గుర్తు. శక్తిని సూచిస్తుంది. అరుణాం కరుణాం....... అమ్మవారి ధ్యాన శ్లోకం. అలాగే .అమ్మ వారికి కుంకుమ రాగ శోణే అనే ప్రార్ధన ఉంది కదా..

స్త్రీలు కుంకుమ ధరిచడం వేద కాలము నాటి ఆచారం. పురాణతనమైనది..

వివాహిత స్త్రీ పాపిట (రెండుగా విభజించిన తల కేశములు మొదలు ) నుదిటి మధ్య  కుంకుమ ధరించుట సంప్రదాయం గా వస్తున్న పరంపర.

స్త్రీకి నుదిటి కుంకుమ ఒక శోభను ,నిండుతనమును కలుగచేస్తుంది.

మహిళలకు పెళ్లయింది అని గుర్తుకోసం పాపిట బొట్టు పెట్టుకోవడం, పక్క పాపిడి కాకుండా మధ్య పాపిడి తీసుకోవడం, పరికిణీ కాకుండా చీర కట్టుకొని ముఖాన పెద్దగా ఎర్ర బొట్టు పెట్టుకోవడం, మెడలో నల్లపూసలు , మంగళ సూత్రాలు వేసుకోవడం, కాలికి మట్టెలు పెట్టుకోడం చేస్తారు. . కనీసం అవన్నీ చూసి అయినా, పరాయి మగవారు ఈవిడకి పెళ్లయింది ఈవిడ జోలికి పోవద్దు అనుకుంటారు . ఇవన్నీ చాలా పాత ఆచారాలు. స్త్రీలని అందరూ గౌరవంగా చూడాలనే ఉద్దేశ్యంతో పెట్టిన ఆచారాలు. పాతకాలం నించీ ఇప్పటికీ ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని గుర్తులు ఉన్నా ఎగబడే కీచకులు రావణాసురులు ఉన్నారు . మగవారికి పెళ్లయింది అని గుర్తుగా ఏమీ లేనప్పుడు మాకు మాత్రం ఎందుకు ఇవన్నీ? అని వీటిని వ్యతిరేకించే మహిళలు కూడా ఉన్నారు.  

పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సు అయినా గాని నిష్ఫలము అవుతాయి. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు.

ఇంచు మించుగా చాలామంది భౄమధ్యంలో లేక కాస్త పైన బొట్టు పెట్టుకుంటారు .స్త్రీలు మాత్రమే కాదు పురుషులూకూడా.

ఎందుకూ అంటే అక్కడ ఆఙ్ఞా చక్రం ఉంటుంది . అక్కడే ధ్యానం చేసేటప్పుడు దృష్టి పెట్టాలని చెబుతారు అలా చేస్తే మంచి ప్రశాంతత లభిస్తుంది .

ఏముంటుంది ఆఙ్ఞాచక్రం మీద ?

నమ్మకం ఏమిటంటే సహస్రారంలో మహా కామేశ్వరాంక స్థిత యైన జగజ్జనని ఉంటుంది .వారిపాదాలు ఆఙ్ఞా చక్రం లో ఉంటాయి

బొట్టు పెట్టుకుంటే ఆ శ్రీమాతకు కుంకుమార్చన చేసినట్లే కదా .

అసలు ఆభావన లో ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఆనందతన్మయత్వం కలుగుతుంది.ఆ ఆనందతన్మయత్వంలో కన్నీరు వస్తుంది.

 కళ్ళలో నీళ్ళు ఏంటి ఎందుకొచ్చాయీ .ఓహో గంగమ్మ పుట్టింటికొచ్చిందా ఆవిడ నా కళ్ళ లోంచి బయటకొచ్చిందా

ఇలా మధుర మధురభావాల పుట్టినిల్లు ఆ బొట్టు కదా

ఉదయిస్తున్న భాను బింబం చూస్తే జగన్మాత నుదిటి సింధూరం లా ఉండదూ .పరుచుకున్న ఎరుపు కాంతులు అందరినీ బొట్టు పెట్టుకోమని చెప్పడం లేదూ

స్పందించే మనసుంటె అన్నీ అనుభూతులౌతాయి

బొట్టు పెట్టుకున్న ముఖం ఎంత కళగా ఉంటుంది.

జైహింద్.

Monday, August 26, 2024

గురువాయురప్ప .. గురువాయూరు.

జైశ్రీరామ్. 

గురువాయూరు.

గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.

పాతాళశిల!

ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ, తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

నారాయణీయం!

గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి వ్రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.

భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.

అన్నప్రాశన

గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.

గజేంద్ర సేవ!

గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్‌, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్‌ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్‌. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్‌ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు

శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. శ్రీకృష్ణ దేవుడిని 'గురువాయూరప్పన్' అని భక్తిభావంతో పిలుస్తారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.  

జైహింద్.