చ`తురంగ స్వస్తిక్ బంధ భావ గోపన చిత్ర లఘు కందము.
తురంగ గతిలో గోపిత భావము. మనమిల - నొకటిగ - మెలఁగిన - శుభమగు.
భావగోపన చిత్ర చ`తురంగ స్వస్తిక్ బంధ
లఘు కందము.
నిపుణత నొకటిగ మెలగిన
నిపుడిట ప్రథమ శుభమగు మహి వినఁగ, శుచితోన్
దపమిలను నొకటె నుతిగ ఘ
న పటిమఁ గన మెలగి, జగమున వెలుఁగఁగ వలెన్. 5.
మ. తనతోవచ్చెడివారలందరు నొకే దారిన్ బ్రవర్తింపగా
ఘనుఁడై రెడ్డి యొనర్పగల్గి, యచటన్ గణ్యాత్ముఁడై యోధుఁడై
మనగల్గెన్, మనునట్లు చేయఁగలిగెన్ మాన్యంబుగా నందరిన్,
మనమార్గంబది ధర్మ మార్గ మయినన్ బ్రఖ్యాతిగా వెల్గమే? 6.
శా. యోధాగ్రేసరుడైన యోబయయు, శ్రేయోదాయకుండైన స
న్మేధా మూర్తి మహత్వ శక్తియుతుఁడౌ మేల్ పైడి వేంకన్నయున్,
స్వాధీనంబుననుండుటన్ దొరయు నిస్వార్థంబుగా నిత్యమున్
బోధన్ గల్గుచు మెల్గుచుండె ధరకున్ బూర్ణంపు స్వేచ్ఛన్ గనన్. 7.
మ. భవితన్ గాంచెడి శక్తిఁ గల్గు ఘనుఁడౌ, భక్తాగ్రగణ్యుండునౌ,
స్తవనీయ ప్రతిభా సమన్వితుఁడునౌ, ధర్మాత్ముఁడౌ వేంకనన్
భువిపైఁ గల్గిన దైవమట్లు కనుచున్ బూజ్యంబుగా చూచు నీ
నవనీతాత్ముఁడు రెడ్డి, యీ ధరణిపైనన్ వెల్గె ధన్యాత్ముఁడై. 8.
మ.కో. పాలెగాండ్రుగనున్నవారలు పన్నులన్ గొను పద్ధతిన్
మూలమంటను మార్చివేసెను పూర్తిగా తన పాలనన్
బాలెగాండ్రవ్యవస్థ రద్దయి వారికిన్ భృతినిచ్చుటే
చాలటంచును చేసె మన్రొ విషాదమున్ గలిగించుచున్. 9.
ఉ. కొందరు పాలెగాండ్రు తమకున్ వలదీభరణంబటంచు తా
మందరునేకమైరి, తమదైన వ్యవస్థయె కోరుకొంచు, నీ
యందరునాంగ్లపాలకులనడ్డిరి మన్రొ విధానమేలటం
చిందుఁ గనంగనష్టమని యెగ్గులు పల్కి యెదిర్చిరుద్ధతిన్. 10.
గీ. అట్టివారిని బంధించి పెట్టినారు
పుడమి పయిని కారాగారములను ప్రభువు,
లచ్చటే వారు మరణించిరయ్యొ, చేత
కాక విలపించుచున్, దిక్కు లేకపోయె. 11.
ఉ. చేయఁగ లేక యేదియును, చేవయుడింగిన పాలెగాండ్రు ప్రా
ధేయ పడం దొడంగిరి విధేయత చూపుచు పెంచఁగా భృతిన్,
సాయము చేసినట్టులుగ సర్వము దోఁచి యొసంగుచుండిరే,
యీయవమాన భారము సహించుట కష్టమటంచు నెంచిరే. 12.
మ. భృతి మజ్జారికుటుంబమంతకునువారిచ్చున్ బదేడుల్ విధీ!
గతి యాకొంచెమె, పంచుకొందురదియే, గత్యంతరంబేది? యీ
స్థితిలోనన్ జయరామరెడ్డి సుతుగా చెల్వొందువాఁడౌటచే
నుతిగావారికి దక్కునట్టి భృతి తానున్ బొందునీరెడ్డియున్. 13.
గీ. తాత తదనంతరంబున తల్లికిచ్చి
రామె పిదపనా భృతి నీయరాయె దత్తు
డయిన నరసింహరెడ్డికి నతఁడు సుతుఁడు
కాడటంచును ప్రభువులు, కర్మ మిదియె. 14.
గీ. తండ్రి కందెడి భృతిలోనఁ దాను పదునొ
కండు రూప్యముల్ గొనుచును గడుపుచుండె.
నరసరెడ్డి యాకొంచెమున్ సరిగనొసఁగ
కుండ నాపెనా యధికారి కుత్సితుఁడయి. 15.
గీ. రాఘవాచారి యాతఁడు, రాజువోలె
తనదు కార్యాలయమునందు తలబిరుసుగ
వచ్చువారిని యదలించి వదరుచుండు,
కాలగతిలోన తానును రాలకున్నె? 16.
క. నరసింహుఁ డంప, కాసిము
నరసింహుని భృతి నడుగగ, నవ్వుచు నాచా
రరెరే రెడ్డియె భృత్యుఁడు,
ధర భృత్యున కితఁడు భృత్యుధర్మము నెరపెన్. 17.
గీ. అనుచు నదిలించి, యాతని నడుగుకొనగ
రమ్మటంచును పంపుము, రానియెడల
నీయఁబోనని తెల్పుము, నేతవోలె
సేవకునిపంపుటే తప్పు, చెప్పుమిటుల. 18.
గీ. రాఘవాచారి మాటలన్ రగిలి మనసు
నరసరెడ్డికి వినిపించి, దొరవు నీవు,
నిన్నె దూషించి భువిపైన నెన్నినాళ్ళు
బ్రతుకఁ గలఁ డతండనుచు తా బాధపడెను. 19.
శా. క్రోధజ్వాలలె కన్నులా యనునటుల్ కోపంబె రూపంబుగా
బాధాతప్త మనోవికారమున తా వ్రాసిచ్చె నో లేఖ, నీ
వే దీనిన్ గొనిపోయి చారికిడుమా, వేయేల మాటల్ సఖా!
ఆదిత్యుం డపరాద్రిపై పొడిచిన న్నాలేఖ సత్యంబగున్. 20.
గీ. చేతఁ గొని లేఖ రెడ్డికిఁ జేసి నతుల
నశ్వమునునెక్కి యరిగె తా నతులితముగ,
గర్వభంగంబు చారికి కచ్చితమిల
ననుచు భావించుకొనుచును మనమునందు. 21.
1846. జూలై 9 ని రెడ్డి ఇచ్చిన లేఖము కాసిం రాఘవాచారికందించుట.
సీ. ధరణి పద్ధెమ్దివందలనల్బదారున, జూలయి మాసాన, భీల రాత్రి
పదకొండు గంటల కదురునట్టుల నేల, యశ్వంబుపై చేరె నతఁడొకండు,
నరసింహు సఖుఁడు తా నరయుచు రాఘవాచారి కడకు వచ్చి చేరి యొక్క
లేఖనందించఁగా, లేని ధైర్యము చూపి యెవ రంపి రీలేఖ యిచటికంచు
గీ. నడుగు లోపలనే చనె నచటినుండి,
లేఖ తెచ్చినవాఁడు, నా లేఖ తీసి
రాఘవాచారి చదువుచు ప్రాణములను
విడిచినట్టులె చింతించె భీతిలుచును. 22.
ఉ. తానొక కాంతతోఁ గలిసి ధర్మవిరుద్ధముగా రమించుచున్
హీనచరిత్రుఁడై మసలు నింటనె యుండిన యట్టి చారియే
దీనముగాఁ గనంబడగ, దేవర! లేఖనెవండు పంపెనం
చేను గ్రహింపఁ దెల్పుఁడని యింతియె చారిని గోర, తా ననెన్. 23.
మ. నను చంపంగ నృసింహరెడ్డి కసితో నా వాసమున్ జేరి, తా
క్షణమందున్ వధియించి నన్ను, ధనమున్ గైకొంచు పోనుంటి నే
నని వ్రాసెన్, భయమొందుచుంటి ననగా నా కాంత దిగ్భ్రాంతితో
ఘనుడట్లన్నను కావ నెవ్వరి కగున్? గాపాడుతన్ దైవమే. 24.
మ. అనుచున్ బోవఁగ తా గృహ మ్మునకు, దేహభ్రాంతి నాచారి పో
యెను కార్యాలయ ప్రాంగణమ్మునకు, నే నిప్పట్టు నీ వార్తలన్
వినయంబొప్పగ పై నధీశుల కిదే విన్పింతు లేఖాకృతిన్
నను రక్షింపుడటంచు కోరుదును, లోనన్ దాగి యిందుండెదన్. 25.
ఆ. అనుచు లేఖవ్రాసి యధికారికంపగా,
నతడు పంపె వందలాది సైని
కులను మరియు ప్రతిభఁ గలుగు వార్సింగును
రక్షణమును గొలుప రహిని యఁటకు. 26.
1846 జూలై10వ తేదీని మధ్యాహ్నము 12 కి కోవెలకుంట్ల ట్రెజరీపై రెడ్డి దాడి చేయుట.
సీ. పదవతేదీ నాడు పదునెమ్ది వందల నల్బదార్ జూలయి నరస దొరయు
నైదువందల సైన్య మవని కంపించఁగా కోవెల కుంట్లకుఁ గోరివెడలు
సమయమందున జనుల్ సన్నుతించుచు రెడ్డి కాశీర్వచనములనందఁజేసి
విజయము కాంక్షించి విర్రవీగెడి పాలకులను వధించగా వలచినారు.
గీ. జయము నరసింహరెడ్డి దిగ్జయము మీకు,
సైనికాళికి జయమగు సన్నుతముగ
ననుచు భావించి దీవింప నందరటుల
సాగుచును వారు ముందున కేగినారు. 27.
గీ. రాఘవాచారి, వార్సింగు, ప్రస్తుత మట
నెడ్వరుడు తోడ కూర్చుండి రెపుడు రెడ్డి
వచ్చునోయంచు భీతితో నచ్చటికని,
తప్పు చేసినన్ శిక్షయు తప్పదుకద. 28.
గీ. భయముతో రాఘవాచారి వారుసింగు
నడిగె నరసింహరెడ్డిని వడిగ మీరు
చంపఁగలరా? యటంచును సందియముగ,
కోపముగఁ జూచె వార్సింగు క్రుంగ నతఁడు. 29.
క. కోశాధికారి! యాచా
ర్యా! శంకించెదవదేల ననుపమ రీతిన్
నీ శత్రుని మడియించెద
నా శక్తిని జూపి, చూడు నను ననె వార్సింగ్. 30.
చ. అతఁడటు చెప్పుచుండగనె యావల గుఱ్ఱపుడెక్కలధ్వనుల్,
మతి చెడి వారుసింగఁట ప్రమాదమునెంచుచు వచ్చె బైటికిన్,
క్షితిఁగల ధూళి రేగునటు చేరి నృసింహుని సైనికోత్తముల్
ప్రతిన యొనర్చినట్టులుగ పట్టి వధించుచునుండిరాంగ్లులన్. 31.
ఉ. ఏడి నృసింహరెడ్డి? యతఁడెక్కడ నుండె? నటంచు చూచుచున్,
వాఁడె మహాశ్వ మెక్కి యిటు వచ్చుచునుండె నటంచు, వారుసింగ్
పాడియ చంపు టీతనిని పంతముతోనని పట్టి కాల్చ నా
వాడు తుపాకిగుం డతని ప్రక్కగ పోయెను, తప్పె ముప్పటుల్. 32.
చ. మరియొకమారు పేల్చుట కమాంతము గుండును క్రుక్కుచుండగాన్
మెరుపన వచ్చి వేగమె యమేయ బలాన్విత రెడ్డి వారుసింగ్
శిరమును బట్టి త్రుంచె తన చేతిని గల్గిన కత్తితో వడిన్.
పరమ విరోధియై చెలగు పాపిని చంపక యెట్టులుండనౌన్? 33.
వధింపఁబడఁ దగినవాఁడు ఆతతాయి.
గీ. అగ్ని విషములు పెట్టెడి యధముఁడయిన,
నాయుధంబున జంపెడి యశుభుఁడయిన,
క్షేత్ర దారల హరియించు కౄరుఁదయిన
నాతతాయియె, ధర్మంబునరసి చూడ. 34.
క. గురువయిన, బాలుడయినను,
నిరుపమ వేదవిదుఁడయిన, నెలతియె యైనన్,
ధర నాతతాయి యైనను
కరుణింపక చంపుటొకటె ఘన ధర్మంబౌన్. 35.
క. తన ధనము నీయకుండగ,
తన మానము చెరచె నాతతాయి యితండం
చని తలఁచి, యితనిఁ జంపుట
ఘన మార్గమె యనుచు నెంచె ఘనుఁడగు సైరా. 36.
ఉ. గౌరవ హాని యన్నదిలఁ గాంచఁగ మృత్యువు కన్న మిన్న, నా
గౌరవభంగమున్ గొలిపె కారులు ప్రేలుచు సేవకాళితోన్,
వీరత నొప్పియుండియు నుపేక్ష వహింపక, యాతతాయి నే
దారుణమైన ఖడ్గమున తప్పక చంపెద వీరరాఘవున్. 37.
క. అని మనమున చింతించుచు
ఘనమగు ధర్మంబు నెరప కదలిన ఘనుఁడా
క్షణమున భీకర ఖడ్గము
తన హస్తమునందు రెడ్డి ధరియించి, చనెన్. 38.
మ. రిపుసైన్యంబది చూచి పర్విడగ, వారిన్ వీడి, యాచారిపై
కుపితుండై వధియింప వచ్చి, గదిలో కూర్చున్న వానిన్ గనెన్,
"విపరీతం బొనరించితిన్ క్షమను నీవే నన్ను రక్షింపుమం"
చపుడాచారి వచించుచున్ బడియె తా నా పాదపద్మాళిపైన్. 39.
ఉ. వాఁడి శరీరమొక్కటియె పాదములన్ గనవచ్చె, శీర్షమో
వీడుచు ఖడ్గఘాతమున వేరుపడన్ గనె నెడ్వరుండు తా
నీడనె యున్న కీడనుచు నేగఁగ ముందున కుద్యమింప, నె
వ్వాఁడవు పోవుచుంటివని పట్టె నృసింహుఁడు హుంకరించుచున్. 40.
ఉ. వానికి ముండనంబు ననివార్యముగా నొనరింపఁజేసి, య
వ్వానిని వస్త్రహీనునిగ పర్విడఁ జేయుచు వీథులందునన్,
జ్ఞానవిహీన! నీ ప్రభువు గారికి చెప్పుమిదంతయున్ వడిన్,
నే నయనాల కొండపయినే వసియింతును, చంప రమ్మనెన్. 41.
క. బొందిలి వంశపు హరిసిం
గందుండెను రక్షకుఁడయి యచ్చటి నిధికిన్,
కొందలమందెను రెడ్డియె
యం దక్కడకు నరుదెంచు నతనిని గనుచున్. 42.
గీ. ఎవ్వఁడవు నీవనుచడిగె నృహరి, యతఁడు
రక్షకుఁడ నిట, యనుచు, మీర లెవ రనెను,
ధనము గొనిపొమ్ము వలయుచో ధరణిఁ బ్రతుక
మనె నతనితోడ, కాకున్న మనవనియెను. 43.
శా. నే ధర్మంబును తప్ప, నాంధ్రుఁడనయా! నిత్యంబు కాపాడుదున్,
మేధామూర్తిగఁ దోచుచుంటివయ, స్వామిద్రోహమున్ జేయనా?
వాదౌమార్గము వీడఁబోను, ప్రభులన్ వంచింపఁగా లేను, నా
కాధారమ్ముగ జీతమిత్తురయ నా కద్ధానితోఁ దృప్తియే. 44.
మ. అనియాతండు వచింప, రెడ్డియనె నేలా నీవు నా మాటలన్
విన విట్లైనను చత్తు వీ వనగ నీవే గొప్ప యోధుండవా?
యనినే చేసి వధించు నన్ననెను, దేహభ్రాంతిదూరాత్ముఁడై,
కొని ఖడ్గమ్ములనిద్దరున్ వడివడిన్ ఘోరంబుగాఁ బోరిరే. 45.
గీ. కొంత తడవిట్లు సాగ నా చెంతనున్న
యొడ్డె యోబన్న సింగును నడ్డిపైన
శూలమును గ్రుచ్చ నెంచె నావేళలోన
నోబయను తిట్టె రెడ్డి యనుచితమనుచు. 46.
చ. తడబడ రిద్దరున్, రణము ధర్మముగా కొనసాగుచుండె, న
య్యెడ నరసింహరెడ్డి గ్రహియించి పరిస్థితి, యిప్పుడిచ్చటన్
దడయుట పాడి కాదనుచు, తా హరిసింగు శిరమ్ము త్రుంచగాఁ
బడెనది నేలపై, నకట పంతమదెంతటి ప్రాణహానియో? 47.
గీ. భారతాంబకు జయమంచు పలికి తుదను
ప్రాణములు వీడె సింగు, తద్ వాక్కులు విని
రెడ్డి దుఃఖించె, హరిసింగు దొడ్డగుణము
నెన్నసాధ్యము కానంత మిన్న యనుచు. 48.
ఆ. చావు నకును సింగు సంసిద్ధుఁడాయెను,
వృత్తిధర్మ మరసి విడువ లేక,
సీమగడ్డపైన చిగురించు మొక్కయు
చేవఁ గలిగియుండు చిత్ర మిదియె. 49.
గీ. రెడ్డి మనుజు లీలోపల దుడ్డు దాచు
చోటు వెదకుచు చేరిరి సుకరముగనె,
ధనము నాగారమందుండి కొనిరి వారు,
సాహసము గల్గ నేది యసాధ్యమగును? 50
ఆ. అష్టశతము మీద నైదు రూప్యంబులు,
పదియణాల నాల్గుపైసలుగొని
మూటకట్టి యచట ముందుగా సిద్ధమై
నరసరెడ్డితోడఁ దరలినారు. 51.
ఉ. ఖండిత శీర్షముల్ గొనిరి గర్వముతో, నటఁ గల్గు నన్నిటిన్
మండగ నిప్పుపెట్టి రవి మండుచు నన్నియు భస్మమయ్యె, మా
కండ శివుండెయంచు పరమాధ్బుతమౌ నయనాలపాద్రిపై
నుండు మహేశుమ్రొక్కి, యటనుంచిరి యాగుహలోన శీర్షముల్.52.
గీ. తానఁటేగి దువ్వూర్ఖజానాను కొల్ల
గొట్టె నరసింహ రెడ్డి, జై కొట్టఁ జనులు,
మనసునకుబాధ కలిగిన మానవుండు
మరచిపోవునె? ప్రతిచర్య? నరయకున్నె? 53.
క. ఇరువురి శిరములు నరికిన
భరియించుచు నూరుకొన నపప్రథ యనుచున్
నిరుపమ బలమున వచ్చెద
రరివర్గ మడంచ మమ్ము నని యనుకొనుచున్. 54.
ఉ. నొస్సముకోట ముట్టడి ననూహ్యముగా జరిపించవచ్చు, నే
నిస్సి! దురంత దుష్కృతుల నెట్లు సహింతును ముట్టడిన్? ధరన్
దుస్సహమిద్ది, రక్షణము దూరమునుండియు చేయువాఁడినై
యస్స లుపేక్ష చేయ కనుయాయుల సూచనలందు దిప్పుడే. 55.
గీ. అనుచు నరసింహరెడ్డి తా నాకుమళ్ళ
వినుత గోసాయి వేంకన్న ఘనునొకనిని,
యొడ్డెవంశజుండగు వీరరెడ్డినొకని
కలిసి మాటాడె రక్షణఁ గొలుపు పనులు. 56.
మ.కో. కోటచుట్టును కందకంబు లకుంఠితంబుగ త్రవ్వుచున్
నీటితో పరమాద్భుతంబుగ నింపునట్లుగ చేసెనే,
కోటపై మరిగించు తైలపు కుండలుండఁగఁ జేసెనే,
పోటుగా ళ్ళట నుండునట్టుల పూర్తిగా నొనరించెనే. 57.
గీ. కందకంబులలోపల కంటకములు
గుట్టలుగ బోయఁ జేసెను పట్టుపట్టి,
చుట్టు ప్రక్కల పొలములం జొరఁగ రాని
యట్లు బురదగా చేయించె ననుపమగతి. 58.
మ.కో. భీకరంపు పిరంగు లెన్నియొ పెట్టి యుంచిరి బుర్జులన్,
బ్రాకటంబుగ చంపగా రిపువర్గమున్ ధృతినొప్పుచున్,
లోకమాతను నమ్మి శాత్రవలోకమున్ మడియించఁగా
నేకమై రిల పాలెగాండ్రు రహింపఁ జేయగ స్వేచ్ఛనే. 59.
గీ. చుక్క మంచినీరైనను చూచువారి
కెక్కడను కాన రాకుండ చక్కగాను
బావులన్నియు పూడ్పించి, క్రేవలందు
గుంతలను పైన కప్పించె, కూల రిపులు. 60.
సీ. స్థానికులకు తోడు చక్కగా నౌకురాజయిన నారాయణ నయనిధాన
పరివారమును గూర్ప, పరమాద్భుతాయుధ సామగ్రితోడను శత్రుచయము
నుక్కడింపఁగ సిద్ధమక్కజంబుగనయి, యెదురుచూచుచునుండె నిటకు వచ్చు
వైరుల కొఱకు సుస్మేర ముఖుఁడు రెడ్డి, వారింపనతని నెవ్వారికగును?
ఆ. స్థానబలమె కాదు, సాధించు ధైర్యంబు
నాత్మశక్తిఁ గలిగి, యద్భుతమగు
దైవబలముకల్గి, దార్ఢ్యంబునున్ గల్గి,
రిపుల కొఱకు నరస రెడ్డి చూచె. 61.
గీ. కడపజిల్లాకె యధికారి కాక్రెనునకు
రాఘవాచారి హత్యవార్తయును, ధనము
దోపిడీవార్త చేరఁగా, గోపముబికి
హంతకులఁబట్టు యత్నంబు నతఁడు చేసె. 62.
గీ. రక్షకభటులు నరసింహు నాక్షణమునె
కలిసి, విషయంబు తెలిపిరి, తెలిసికొనఁగ
హంతకుని గూర్చి చెప్పుఁడంచడిగినారు,
తానె హంతకుఁడయ్యును మౌనమూనె. 63.
గీ. వారి నాడింపఁ దలచి తా పలికె నిట్టు
లౌకు రాజింత పనిఁ జేసె నంచు తలతు,
నిజము నెఱుగంగ యత్నించి నేర్పుతోడ
దోషులనుపట్టఁ జూడుడం చాసఁ గొలిపె. 64.
ఆ. అతని మాటలు విని యౌకురాజునతని
సోదరునిని బట్టి ఖేదమొదవ
చెరను బెట్టియుంచి, సరియగునాధార
ముల కొఱకని యత్నములను జరిపి. 65.
తోటకము.(స స స స . యతి 9.)
పరిశోధన చేసిరి వారలటుల్,
పరికింపఁగ దోషు లవస్యముగా
పరులంచు గ్రహించిరి, బంధితులన్
గరుణన్ విడిపించిరి, గణ్యముగాన్. 66.
గీ. ఔకురాజునున్, దమ్ముఁడున్ శ్రీకరుండు
హరియె రక్షించునని నమ్మి, యతని రక్షఁ
బొంది విడిపింపఁబడి, శాంతి పొంది మదిని,
వారి వాసంబులకునేగినారు వారు. 67.
గీ. దోషి నరసింహరెడ్డిగాఁ దోచి యతనిఁ
బట్ట యత్నంబుఁ జేసిరి గట్టిగాను,
పట్టుబడు రెడ్డి యన్నచో నుట్టిమాట,
యతఁడు సామాన్యుఁడా? కాడు క్షితిజ నృహరి. 68.
1846 జూలై 23 న నొస్సం కోటపై బ్రిటిష సైన్యం దాడి.
ఉ. పంపెను గూఢచారులను, పంపెను సేనల నట్టివేళ భూ
కంపము వచ్చినట్టులుగ కాల్బలమాపని చేయ నేగె, సా
ధింపఁగ బూనిరాజ్ఞల నధీశ్వరుఁ డిచ్చిన తీరు నెన్నుచున్,
బంపుటఁ జేయఁ గల్గినను బట్టుట యన్ననదంత సాధ్యమా? 69.
ఉ. కోటను ముట్టడించుట కకుంఠితరీతిని నొస్సమేగగా
దీటగు సైన్యమున్ గొనుచు తీరుగ వాట్సను సిద్ధమై చనెన్,
వేటకు పోవువారలకు వెఱ్ఱిగ దాహము వేయునట్టుల
చ్చోట దగన్ జలంబులకుఁ జూచిరి వారలు, కానరా వహో! 70.
ఉ. ధైర్యము చెప్పఁజూచి యట దారిని వాట్సను సైనికాళికిన్
గార్యము చేయఁ బూనితిమి, ఖడ్గములారిపు వర్గ రక్తమున్
శౌర్యమెలర్ప త్రాగునటు చక్కగ చేసినఁ, దీరు దాహమే,
శౌర్యము మీదు సొత్తు, గుణసన్నుత సైనికులార! యంచనెన్. 71.
ఉ. దాహము తీరునా యభినుతంబగు వాట్సను మాటలన్ వినన్?
సాహస వీరులే యగుత, సాధ్యమెటుల్ దగ తీరకుండినన్
దేహము నిల్పుకోఁ దగిన తీరు కనంబడదే రహింపఁగన్,
మోహ విదూరులౌచు చనిపోవుటతప్ప, విధిప్రభావమే. 72.
ఉ. నీరములుండు తావులు గణించుచు మట్టిని కప్పివేసె నా
ధీర నృసింహరెడ్డి, తనదేకద జ్ఞాన సమృద్ధి యన్న, నా
వీరుని చేత నోటమియుఁ బ్రీతియె నాకని యెంచె వాట్సనే,
కోరుచు మృత్యువున్ గొనెడి కోర్కెయు పండునొ? పండకుండునో? 73.
ఉ. చేరుచునుండ వాట్సను, సచేతనుఁడై నరసింహరెడ్డియున్
జేరెడివారిపైనఁ బడఁ జేసె ఫిరంగుల గుండ్ల వర్షమున్,
ధీరులు కొందరా యనిని తీవ్రముగా యెదిరించి నిల్చియున్
పోరు భయంకరంబగుటఁ బోయిరి మృత్యువు నాశ్రయించుచున్, 74.
శా. ఉద్వేగంబున ముందుగా నడచి యుద్ధోన్మాదులౌ కొంద రా
పద్వారమ్మగు గుంతలందుఁ బడి రేపాపంబులన్ జేసిరో?
యధ్వానంబగు నాంగ్లపాలనమునన్ హాయన్నదే లేక, యు
ద్ధధ్వాంతమ్మునఁ గొట్టుకొంచు బ్రతుకుల్ ధ్వంసంబుగాన్ జచ్చిరే. 75.
చ. బిలబిల నాంగ్లసైనికులు వీరులవోలె పురోగమించగా
సలసల కాగు తైలమును చక్కఁగఁ జూచుచుఁ బోయ వారిపై,
జలజలరాలిపోయిరట చర్మము కాలినవారలందరున్,
వెలవెలఁబోయిరంద రట వింతగు నీపరిణామమెన్నుచున్. 76.
నరసింహారెడ్డి వాట్సనును వెంబడించి దండింపఁ బూనుట.
చ. తొలిదగు యుద్ధమందు వినుతుల్ గొను శ్రీనరసింహరెడ్డినే
గెలుచు టసాధ్యమంచు పరికించుచు, పర్విడినారు శత్రువుల్,
సులభము కాదు గెల్పనుచుఁ జూచుచు వాట్సను పర్వుతీయుచున్
బలుమరు చూచె వెన్కకును, వచ్చుచునుండెనొ రెడ్డి? యంచు తాన్. 77.
ఉ. సైనికపాళి కొందరటు సాగిరి వాట్సనుతోడ, గిద్దలూర్
సేనలు చేరు లోపలనె చేరె నృసింహుఁడు సైనికాళితోన్,
దీనత నాంగ్ల సైన్యము వధింపఁబడెన్ రిపుపాళి చేతిలోన్,
బ్రాణములొడ్డ తప్పదుగ భండనమందున నెట్టివారికిన్. 78.
క. నరసింహుని సైనికులును
మరణించిరి యుద్ధమున ప్రమాద వశమునన్,
గరుణకు తావే యుండదు
నిరుపమముగ నొప్పు ధర్మ నిష్ఠుల యనిలోన్. 79.
చ. పరుగిడుచున్న వాట్సనును పట్టెను రెడ్డి, దురాత్మకుండ! యెం
దరిగెద వీవు? నన్ దునుమ నాశగవచ్చిన నిన్ను వీడ, నా
కరమున నున్న ఖడ్గమున కంఠముఁ ద్రుంచెద నీకటంచు సు
స్థిరమగు నిర్ణయంబున వధింపగ నాతని, నెత్తె ఖడ్గమున్. 80.
చ. బలమగు ఖడ్గఘాతమది, వంగగ వాట్సను ముప్పు తప్పె, దు
ర్బలుఁడయి పర్వు తీసె తనవాహనమైన తురంగమెక్కి, యా
ఖలుని వధింపఁ బోవు తరి గాఢతరంబగునట్టి శబ్ద మా
వల వినిపించ రెడ్డి యటుప్రక్కకు చూచె నదేమిటంచు తాన్. 81.
గీ. చేరె వాట్స నా సైన్యమున్ సెట్టివీడు,
ముండ్లపాడుకున్ జేరెను పూజ్యుఁడయిన
రెడ్డి తనసైన్యమున్ గొని, గడ్డుకాల
మందు దాగియుండుటె తగుననుచుఁ దలచి. 82.
గీ. నాట్టు, రసెలులన్ కెప్టెన్లు నవ్యరీతి
సైన్యమును గొని మరునాడు గణ్యముగను
ముండ్లపాడున కేగిరి, పోరు సలిపి,
రెడ్డినే బట్టుకొనుటకై ప్రీతితోడ. 83.
రెడ్డి కంబం తహసీల్దార్ జంగంరెడ్డి శ్రీనివాసరావును నరుకుట.
మద్రకము. (భ ర న ర స స న గ. యతి 11. )
ఘోరపు యుద్ధమే జరిగె, సంకులంబగు యుద్ధమునం దిరు తెగల్
తీరని నష్టమున్ గనుట నార్తినేఫలితంబుగ నందిరి, మహో
ద్ధారకుఁడైన యా నృహరి యుత్తరించెను ఖడ్గముతోడ తహసీ
ల్దారు శిరంబునే, యతఁడు నేత, కంబము నేలెడి శ్రీననుచు తాన్ . 84.
ఆ. కరమునఁ గల రక్త ఖడ్గంబుఁ గొనిపోయి
యల జగత్పతి గుడి వెలుపలున్న
కత్తులన్ని కడుగు నెత్తురుకుంటలో
కడిగినాడు రెడ్డి వడిగనపుడు. 85.
ఆ. ఆలయంబు వెనుక నలరారు చున్నట్టి
పాలకుంట జలము గ్రోలి రెడ్డి
దన్నునిల్పు శ్రీ జగన్నాథు దర్శించి
ప్రార్థనంబు చేసె భక్తితోడ. 86.
ఉ. మే మొనరించినట్టి యుపమింపఁగ రాని రణంబునందునే
యేమరుపాటు లేక వధియించితి మిప్పు డవారితంబుగాఁ
దాము ప్రతిక్రియన్ జరుపఁ దప్పక వచ్చెద రాంగ్ల పాలకుల్,
హే మహిమాన్వితా! కనికరించి యుపాయము నెన్నఁ జేయుమా! 87.
ఆ. అనుచు వేడుచుండ నచటికి గోసాయి
వచ్చి పిలిచినట్లు, పరవశించి
విజయ గర్వమునను విర్రవీఁగఁగ రాదు
పొంచియుండె ముప్పు కాంచుమనెను. 88.
మ. వినె గోసాయి యొసంగు సూచనలు, భావిన్ జూపు దేవుండ వో
మునిమాన్యా! తమరన్నటుల్ జరిగెడున్, బోధించుఁడీ మార్గమున్,
వినుదున్, మీ దగు మార్గమున్ నడతు నేన్, విజ్ఞాన సంపన్నిధీ!
యనుచున్ రెడ్డి వచించె తద్గురునితో నానందమొప్పారఁగాన్. 89.
ఆ. వచ్చె నపుడె యటకు వడ్డె యోబన్నయు
చెప్పె నాంగ్ల సైన్య మప్పుడె మన
కొఱకు వెదకుచుండ్రి, ఘోరంబుగా మనన్
బట్టి చంపనెంచి పట్టుపట్టి. 90.
మ. విని యోబన్న వచించినట్టి పలుకుల్, వేగంబె యోచించి యా
వనదుర్గంబున కేగుటొప్పుననుచున్ వాక్రుచ్చె వేంకన్న, త
ద్వనదుర్గంబును కట్టె నల్లమల ప్రాంతంబందు మీ తాతయే,
మన మాచోటికి వెళ్ళుటుత్తమము సమ్మాన్యా! నృసింహా! త్వరన్. 91.
శా. ఆ మాటల్ నరసింహరెడ్డి విని చింతాక్రాంతుఁడై దీనతన్
బ్రేమన్ జీవన మార్గమందు ప్రజలన్ విఖ్యాతిగాఁ బ్రోచుచున్
ధీమంతుల్ భరతావనిన్ వెలుగఁగా దేదీప్యమానంబుగా
క్షేమంబొప్పఁగ నుండ కుండ మనకీ శిక్షేల ప్రాప్తించెనో? 92.
క. ఇష్టముతోఁ గట్టించితి
కష్టంబును లెక్కఁ గొనక, ఘనమగు కోటన్
స్పష్టంబుగ నొస్సామున,
నష్టంబగుచుండె నేడు నా మది కృంగన్. 93.
గీ. అనుచు నందున్న తనవారి నంపివేసె
క్రొత్తకోటలో నుండుటే యుత్తమమని,
తాను తనసైన్యమును కూడి తరలిపోయి
చేరె వనదుర్గమును నరసింహరెడ్డి. 94.
శా. ఆ మాన్యుండు జయింప నాంగ్లులను తా నా ప్రాంతమందుండె, సు
క్షేమంబున్ దన మిత్రపాళి కనగాఁ జిత్తంబునందెంచుచున్,
ధీమంతుల్ తమ స్వార్థమున్ మరచి ధాత్రిన్ మిత్రులున్ బేదవా
రేమాత్రంబును బాధలం గనక శోభింపంగ వాంఛింతురే. 95.
ఉ. కానన మేలునట్టి యధికారిగ పీటరు దుర్మదాంధుఁ డా
కానలలోన వంటకని కట్టెల కేగెడి పేదవారలన్
హీనపు దృష్టితోఁ గనుచు, హేయపుమాటలతోడ తిట్టుచున్,
జ్ఞానవిహీన వాగ్ఝరిని, కష్టము కొల్పుచు వేచు పాపియై. 96.
గీ. పల్లె రుద్రవర మడవి ప్రక్కనుండె
ప్రజలు వంటకై కట్టెలన్ బడయు చోటు,
పీటరధికారిగా వచ్చి వీరినఁటకు
రావలదటంచు శాసించె, రాక్షసుండు. 97.
క. పీటరు పెట్టెడి యాంక్షలు
దాటగ శక్యంబు కాగ, తల్లడపడుచున్
నోటికి తిండియె కరువయి,
పాటులు పడుచుండి రకట, ప్రజలాపల్లెన్. 98.
గీ. అచటివారిని గాంచిన యానృసింహుఁ
డడిగె మీరిట్టులుండి రాహార లోప
ముండెనా? యన, తిండికి నుండె దినుసు,
వంటకట్టెలే లేవని పలికిరపుడు. 99.
క. జంగమ మల్లయ చెప్పెను
సంగతి మొత్తము నృసింహ సహృదయమణికిన్,
బెంగను తీర్చగ వచ్చిన
బంగారపు కడ్డిమీరు పావన చరితా! 100.
గీ. పీటరధికారి యడవికి, వీఁడు మమ్ము
వంటకట్టెలన్ గొనిపోవ వలదటంచు
నాంక్షలను బెట్టి వేధించునయ్య, యేమి
చేయఁగలమయ్య వానిని ? చెప్పుడయ్య! 101.
చ. పొరపడి యెవ్వరైన నటుపోయిన వారినిఁ బట్టి కొట్టు, దు
స్తరమగు హింసఁ బెట్టుచును, చంపుచు పృథ్విని పాతిపెట్టు, నా
దరికిని మేతమేపుటకుఁ దా పసరంబుల తోడనేగినన్
గరువముతోడ గైకొనును కాపును చంపి, దొరా! దురుద్ధతిన్. 102.
ఉ. స్త్రీ లటు వంటకట్టెలకుఁ జేరిన యంతనె చూచి వారలన్
బాలికలంచు, వారు పరభామలటంచును నెంచఁబోడు, దు
శ్శీలుఁడు, వారలన్ జెరచు, చేతికి వచ్చినయట్లు కొట్టుచున్,
గాలికొలంది తన్నుఁ, గొరగాములు చేయుచు బాధపెట్టునే. 103.
గీ. పంటలున్నవి, గింజలు పండెమాకు,
వంటకట్టెలు లేక మేముంటిమయ్య
తిండి తిప్పలు లేక యీ పండుముసలి
వారు, బాలురున్ బోదు రే దారి లేక. 104.
నరసింహారెడ్డి అటవీ అధికారి పీటర్ ను సంహరించుట.
శా. ఆ మాటల్ విని, నర్సరెడ్డి మదిలో నాక్రోశమున్ బొంది, మీ
క్షేమంబున్ గనువాఁడ, రండనుచు, దుశ్శీలున్ వధింపంగ, తా
నేమాత్రంబును జాగుచేయ కరిగెన్, హీనుండు పీటర్ వనిన్
కాముండై పరకాంతతో గడుపుచున్ గానంబడెన్ రెడ్డికిన్. 105.
గీ. ఎదుట నిలిచిన రెడ్డి నిదేమి? యెవరు
నీవు? నాకడ కేతెంచినా వదేల?
ననగ నరసింహుఁ డనియె, గర్వాంధ! నిన్ను
చంపవచ్చిన యముఁడను, చత్తువిపుడె. 106.
ఉ. రెడ్డిని మాయ చేసి, బెదిరించు తెరంగునఁ జేరి, పారగా
నడ్డుచు పీటరాఖ్యుని, మదాంధుఁడ! యెందులకేగఁ గల్గు దీ
రెడ్డి కృపాణధాటి కని పృథ్విని వీడక ముందె? యంచు పైఁ
బడ్డ నృసింహమ ట్లతనిపైఁ బడి ఖండనఁ జేసె శీర్షమున్. 107.
మ. జనులా దృశ్యము చూచి పొంగి, పరమేశా! మాకు నీవే యిటుల్
ఘనుఁడౌ శ్రీ నరసింహ నామముననే కాపాడఁగా వచ్చితే?
వినయంబొప్పఁగ నీకు మ్రొక్కెదమయా! విశ్వాసమొప్పారఁగా,
ఘనతన్ వెల్గెడి నీవె మా ప్రభువువై కాపాడు మమ్మందరిన్. 108.
చ. అనుచు ప్రశంసచేసి, పరిహారము చేసితివయ్య కష్టముల్,
ఘనుఁడగు నారసింహ! నినుఁ గాదని పోవగలేము, నీకు మే
మనయము వెంటనుండెద మహంబును వీడుచు సైన్యమై ధరన్,
వినతి గ్రహింపుమంచతని వేడిరి యా ప్రజ భక్తినొప్పుచున్. 109.
ఉ. కంబము, చుట్టుప్రక్కఁ గల గ్రామములం గల వారలెల్లరున్
సంబరముల్ మహోద్ధతిని జక్కగఁ జేసిరి, పీటరంతమే
యంబరమంటు సంబరము హాయి నొసంగ నృసింహరెడ్డియే
సాంబుఁడటంచు మెచ్చి, విలసన్నుత రీతి సుఖాబ్ధిఁ దేలిరే. 110.
మ. ఘనదావానలమట్లు వ్యాప్తమగుచున్ గంపింపఁగాఁ జేసె నీ
వనిలోఁ బీటరు హత్యవార్త ప్రభులన్, పట్టంగ నా రెడ్డి నీ
వని కెవ్వారును రారు సాహసముతో, వాని ప్రభావంబు దు
ర్జన కారాడవిలోన చిచ్చనుచు నాశన్ గల్గి ప్రాణంబులన్. 111.
మ. దురహంకారముతోడనున్న దురితుల్ దుర్మార్గులౌ పాలకుల్
స్థిరమై భారత దేశమేలవలెనన్ దీపించు నాకాంక్షకున్
జరమాంకంబును జూపినట్టి ఘటనల్ జాజ్వల్యమానంబుగా
వరలం జొచ్చె నృసింహరెడ్డి యసిలోన్, వారింపనెవ్వారికౌన్? 112.
చ. భయము జనించె, పాలకుల భద్రతకే యిల దిక్కులేక, సం
శయముగ నుండె యున్కికిని, సాగవు మాదు కుయుక్తులింకపై,
జయమిక కల్ల మాకు, గుణసాంద్రుఁడు శ్రీ నరసింహరెడ్డియే
భయముగ మారె మాకనుచు పాలకవర్గము క్రుంగఁ జొచ్చెనే. 113.
గీ. రహిని కాక్రేను, నార్టను, రసెలు, డాని
యలును, జోసప్ఫులొకచోట, కలుసుకొనిరి,
మంతనంబులు జరిపి రవ్వంతయైన
ననుసరించెడి మార్గంబునమలు చేయ. 114.
ఉ. పాలకులందరేకమయి పట్టవలెన్ నరసింహునంచు, వే
యేల నృసింహరెడ్డి నిల నెవ్వడు పట్టి యొసంగ నేర్చునో
మేలుగ నైదువేలతని మేలును గోరి యొసంగ నుంటిమం
చాలము వీడి యో ప్రకటనందరికిన్ దెలియంగఁ జేయనౌన్. 115.
ఉ. అంతయె కాదు రెడ్డినిల నంతము చేసిన వారికింతకో
యింత ధనంబుఁ జేర్చి గణియించుచు నిచ్చెదమంచుఁ దెల్పినన్
సుంత ధనంబుపైఁ గలుగుచుండిన కోర్కెను వీడలేక తా
పంతము పట్టి రెడ్డినిల పట్టియొసంగక యుందురే ప్రజల్? 116.
క. అనఁగనె కాక్రేన్ ప్రకటన
వినుడని ప్రజ కెఱుకపరచ, విని ప్రజలొకటై
ధనమున కాశింపక, తా
వినయముతోఁ దెలియదనిరి, వినిన ప్రజలఁటన్. 117.
చ. ప్రజలు నృసింహరెడ్డిపయి భక్తిని కల్గినవారటంచు, నా
ప్రజలకు రెడ్డి నేతయని, వద్దనుకొన్నను వానితోడనే
ప్రజలు మెలంగఁ జూతురని బాగుగ నమ్మిన యాంగ్లపాలకుల్
ప్రజలకు భీతిఁ గొల్పుటకవారిత యత్నము చేయుచుండిరే. 118.
ఆశ్వాసాంతము.
ఉత్సాహ. జయము జయము శ్రీనృసింహ జయమునీకు నెప్పుడున్,
భయముఁ బాపి భక్తతతిని పాలనంబు చేయుమా,
ప్రియముతోడ నిన్నుఁ గొల్తు, విశ్వశాంతిఁ గొల్పుమా,
నయనిధాన! నీవు సతము నామదిన్ వసింపుమా . 119.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట పుత్రుఁడును,పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున తృతీయాశ్వాసము సమాప్తము.
చతుర్థాశ్వాసము.
లఘుకందము.
కరుణను మముఁ గను నరహరి!
నిరుపమ గుణగణుఁడ! మదిని నిలువుము సతమున్,
చరణములను కొలిచెదనయ
పరిపరి ననుఁ గనుచును శుభ ఫలదుఁడవగుమా. 1.
నరసింహరెడ్డిని పట్టుటకు ఆంగ్లేయుల ప్రయత్నాలు.
క. నరసింహరెడ్డి ప్రభువై,
నరులకెపుడు మేలుచేయు నాయకుఁడతఁడే,
పరపరిపాలనఁ బాపఁగ
నిరతము కృషిచేయునట్టి నేర్పరి యతఁడే. 2.
గీ. ఆంగ్లపాలకుల్ బహుమతులందఁజేయు
ప్రకటనంబును జేసినన్ బ్రజల మదుల
దేవుఁడైనట్టి నరసింహుఁ దెలిసి కూడ
రాడొకండను నాతని జాడఁ దెలుప. 3.
గీ. రుద్రవరము తాసీల్దారు ద్రోహియైన
శ్రీనివాసులరెడ్డి నృసింహరెడ్డి
నెటులనైననుఁ బట్టింప నెత్తువేసి,
రోశిరెడ్డిచే రప్పించె మోసగించి. 4.
ఎల్లమ్మ జాతరలో రెడ్డిని చంపు ప్రయత్నము.
సీ. ఎల్లమ్మ జాతర కెటులైన రమ్మని దువ్వూరు రప్పింప, ద్రోహబుద్ధి
నెఱుఁగ జాలక, రెడ్డి హితుఁడె పిలిచెనంచు వచ్చినాఁ డచటికి పండుగనుచు,
మోసంబు గ్రహియించి గోసాయి వెంకన్న హెచ్చరికను చేసె, వచ్చియుండి
రిచ్చట శత్రువుల్ మచ్చికతో నిన్ను మట్టుఁ బెట్టగను ప్రమాదమంచు
గీ. పలికె, వెంటనే రెడ్డి తా మెలకువొప్ప
మసలి తప్పించుకొనినాడు మరు నిమిషము
నందె, "దైవంబు తోడున్న మందమతియు
నాపదలనుండి రక్షణనందఁగలఁడు". 5.
అన్న మల్లన్న రెడ్డికి చేసిన ద్రోహము.
శా. దైవంబెంతగ తోడుగా నిలిచినన్ దాయాదులే శత్రులై
క్రేవన్ నిల్చి, సతంబు ద్రోహమతులై కీడున్ ధరన్ గొల్పుచో,
నే వంకన్ గ్రహియింప సాధ్యమగు? నింకెవ్వండు దిక్కౌను? దు
ర్భావుండైన నృసింహునన్న యగు దౌర్భాగ్యుండు మల్లన్నయే. 6.
పం.చా. మహాత్ముఁడైన యానృసింహు మాన్యునెన్ని వారికిన్
సహాయమింతఁ జేయకుండ సన్నుతాత్ముఁడైన యా
మహమ్మదైన యిబ్రహీంను, మాన్యుఁడైన కందనోల్
మహాత్ముఁడౌ నవాబు గార్ని మల్లరెడ్డి కట్టెనే. 7.
ఆ. ఇంటిలోని శత్రు నీశుఁడున్ గన లేడు
పాలవంటి కులము ప్రగతి నణచు
"నింటిలోనివాఁడె యిల శత్రువైనచో
గుట్టు రట్టు కా కదెట్టులుండు?" 8.
క. మల్లన తెలిపెను సర్వము,
గుల్లయి కులమంత ధృతిని కోల్పడ, నొస్సం
బల్లిదుని బంధుల యునికిఁ,
దెల్లదొరల మాట విని, మదించినవాఁడై. 9.
ప్రమితాక్షర వృత్తము.(స జ స స. యతి-9)
నరసింహరెడ్డికి ననంత ముదం
బరయంగఁ బుత్రుపయి, భార్యపయిన్,
హరణంబుఁ జేయుఁడయ! నాతిఁ గొనన్
వరపుత్రుఁ జేకొనఁగ వత్తురయా! 10.
రెడ్డి భార్యను, పుత్రుని ఆంగ్లేయులు బంధించుట.
క. మల్లన పలుకులు విని, తమ
యుల్లంబులు పొంగగను మహోత్తమమార్గం
బెల్లి యొనర్చుదు మీపని
తెల్లంబయె ననుచు బయలుదేరిరి వారల్. 11.
క. నరసింహుని యర్థాంగిని,
వరమగు తత్ పుత్రకునిని బంధించిరి యా
దురితులు లాల్ బంగ్లాలో,
నరసింహుని జాడ కొఱ, కనర్థ మొదవదే? 12.
ఉ. తప్పును చేసినా రకట, దండన తప్పదు వారి కెత్తరిన్,
ముప్పు ఘటిల్లు వారలకుఁ, బూజ్యులు స్త్రీలును, చిన్నపిల్లలున్,
గొప్పగ తెచ్చినామని యకుంఠిత రీతిని చెప్పుచుండి రే
తిప్పలు కల్గనుండెనొ, మతిన్ గనఁ జూచిన భీతిఁ గల్గెడున్. 13.
ఒడ్డె ఓబయ్య రెడ్డి భార్యాపుత్రుల అపహరణవార్తను రెడ్డికి తెలుపుట.
చ. రయమున వచ్చి యోబయ, దొరా! దొరసుబ్బయ నమ్మగార్ని, ని
ర్దయను బ్రిటిష్షువారు కనరాని ప్రదేశమునందు దాచినా
రయ! కనుగొంటినా స్థలి, ధరన్ కడపన్ గల లాలుబంగ్ల, తి
ప్పయ వచియించెనద్ది యసిఁ బట్టుచు కుత్తుకపైనఁ బెట్టఁగాన్. 14.
తన భార్యను కుమారుని రెడ్డి రక్షించుకొనుట.
గీ. భార్యసుబ్బమ్మ, సుతుఁడు సుబ్బయ్య యిటుల
బంది యగుటను గ్రహియించి బాధపడుచు,
నరసరెడ్డి చేయ దగిన దరసి, త్వరగ
చేరె లాల్ బంగ్ల ఖడ్గమున్ జేతఁ బట్టి. 15.
మంజుభాషిణి వృత్తము. (స జ స జ గ. యతి 9.)
నరసింహుఁ డుగ్రుఁడయి నా మహోగ్రమౌ
కరవాల ఘాతమున ఖండనంబుగాఁ
నరుకంగ నుంటి మిము నాకునడ్డుగా
నరుదెంచువాని ననె నాంగ్ల జాతితోన్. 16.
ఉ. ఒక్కఁడు రాడు ముందునకు నొక్కఁడు కూడను మారుపల్కఁ డే
యొక్కఁడు కూడ ధైర్యముగ నుంటిని నేనిట, రా యనండు, పెం
పెక్క నృసింహరెడ్డిపయి నీప్సితమున్ బ్రకటించువార లా
టక్కరి యాంగ్లమూర్ఖుల కొడంబడి యుండుట చేసి పల్కరే. 17.
క. తన భార్యను, తన పుత్రుని
తనతోఁ గొనిపోయె నృహరి, ధైర్యాత్ముండై,
మనమున ధైర్యము కలిగిన
మనకెయ్య దసాధ్యమగు? సమస్తము శుభమౌన్. 18.
రెడ్డి సహచరులతో అజ్ఞాతముననుండుట.
మ. నరసింహుండును మిత్రులున్ జనిరి యజ్ఞాతంబుగా నుండగాన్,
వరకార్యంబులు సాధ్యమౌనె విలసద్భావంబుతో నిత్యమున్
వరలన్ నేర్వక యున్నచో, కనుకనే వారట్టులజ్ఞాతమం
దరయంజాలని మార్గమున్ గొనుట మేధాశక్తితో నిత్తరిన్. 19.
ఆ. ముండ్లపాడు చేరి ముందునకును సాగి
కొండ కోనలందు గుప్తముగను
దాగుకొనుచు, వారు వేగులమూలాన
జరుగుచున్నదెఱుఁగుచరుల జాడ. 20.
రెడ్డి జాడకై ఆంగ్లేయులు చేయుచున్న ప్రయత్నము.
అపరాజిత వృత్తము.(న న ర స వ. యతి 9.)
సరిగ నరసరెడ్డి జాడనెఱుంగమిన్,
దెరువుఁ గనఁగఁ జొచ్చి దీక్షను బూనుచున్,
బరిసరముల లోని వారిని తెల్పుఁడం
చరయ నడుగుచుండి రాంగ్లులు బేలగాన్. 21.
మనోజ్ఞ వృత్తము.(న జ జ భ ర. యతి 10.)
తెలిసియుఁ జెప్పరు భక్తిఁ దేలుచు నొక్కరున్,
దెలుఁగు ప్రజల్ ధరపైన దీపిత ధర్మమే,
ఫలితముశూన్యమె కాగ, భావనఁ జేసిరా
కలుషితులాంగ్లులు ఘోర కార్యముఁ బూనిరే. 22.
క. నరసింహారెడ్డి యెపుడుఁ
బరహితమే కోరుచుండు, ప్రజల సుఖమునే
నిరతంబాశించు కతన
చెరఁబట్టినఁ జాలు ప్రజను, చేరఁగ వచ్చున్. 23.
గీ. అనుచు నాంగ్లేయ దౌర్భాగ్యులమితముగను
ప్రజలఁబట్టి వేధించుచున్, బ్రాణములను
తీయుటన్ జేయుచుండిరి, తెలియఁ జేయు
టకని నరసింహరెడ్డికిన్ బ్రకటితమవ. 24.
ప్రియకాంత వృత్తము.(న య న య స గ. యతి 11.)
ప్రజలను బాధించుటయె, స్వభావం బనున ట్లా
కుజనులు దుర్వారఫణితి ఘోరంబులు చేయన్,
నిజమగు భక్తిన్ గలుగుచు నీతిన్ సతతంబున్
ప్రజలిల రెడ్డిన్ దెలుపక బాధల్ పడిరయ్యో. 25.
శా. అజ్ఞాతంబున నున్న రెడ్డి యుని కెట్లైనన్ గ్రహింపంగ నా
యజ్ఞానుల్ రచియించు నా పథకముల్ వ్యర్థంబులై, వారికిన్
సుజ్ఞేయంబుగ నాయె నాంధ్రుల జగ చ్ఛోభాయమానంపు స
ద్విజ్ఞానంబు, సుధీమహత్వము జగద్విఖ్యాతమం చత్తరిన్. 26.
రెడ్డిని అజ్ఞాతం నుండి బైటకు లాగు ప్రయత్నములో కెప్టెన్ నార్టన్ నొస్సం కోటను కూల్చివేయుట.
ఉ. కూలిచివేసె నొస్సమున కోటను నార్టను క్రూర చిత్తుఁడై,
పేలిచి యగ్నిగోళములు, భీతిల నా పురవాసులెల్లరున్,
బేలినశబ్దమా యడవి వేలుపుగాఁ గలనర్సరెడ్డికిన్
లీలగ మానసంబునకు లేశము తోచెను బాధనింపుచున్. 27.
గీ. వేగులరుదెంచి చెప్పిరి పేల్చి రగ్ని
గోళములతోడ నొస్సాము కోటననుచు
నార్టననువాఁడు సేనకు నాయకుఁడయి
యనుచు నరసింహరెడ్డికి నడవిలోన. 28.
గీ. కోటనే కూల్చివేసినన్ గోరినట్లు
రెడ్డి జాడ కానక వారు పడ్డకష్ట
మంతయున్ మట్టిపాలాయెనంచు మిగుల
బాధనేపొందిరవ్వా రభాగ్యులగుచు. 29.
వంశపత్రపతిత వృత్తము.(భ ర న భ న వ. యతి 11.)
ఐనను గాని వానిఁ గనగా ననితరమగు నే
దైనను నున్నదా యనుచుఁ బాయక వెతకు తరిన్
కానగనయ్యె వారి మది పొంగగఁ వెరవు మదిన్,
దీనదయాళువైన హరి యేది తలచునొ కదా? 30.
గీ. ఇంటి గుట్టును తెలిపిన తుంటరి యగు
నన్న మల్లన్న, వనదుర్గమందు నుండ
వచ్చు నరసింహరెడ్డంచు చిచ్చుపెట్ట
నాంగ్లు లతనిఁ జంపఁగఁ జేయ యత్నమపుడు. 31.
కుసుమిత లతావేల్లిత వృత్తము.(మ త న య య య . యతి 12.)
నా చేతిన్ ఖండించె నతఁడె, తనన్ నా మనోవాంఛ తీరన్
ధీ చాతుర్యంబే తెలియునటు బంధించి నే బట్టి తెత్తున్,
నీచుం డాతం డింక నెటుల వనిన్ నేర్చు? దాటన్, నృసింహున్
వేచన్ నార్టన్ బల్కె, దొర మదితో వించు నౌనంచనంగాన్. 32.
ఆ. ఆరువేల సైన్య మతనికి నొసగుచు
పంపె నధిపుఁడపుడు తెంపరియగు
నరసరెడ్డి మూర్ఖుఁ బరిమార్చిరమ్మన,
నార్టను వెడలెను వనమున కపుడు. 33.
భూతిలక వృత్తము.(భ భ ర స జ జ గ. యతి 12.)
కొండకు పైననె యుండె నా యనుకొన్న దుర్గము, రెడ్డి తా
నుండెడి దచ్చటె, మెండుసైన్యమె యుండ తోడుగఁ బ్రేమతోన్,
గొండకు క్రిందను సైన్యమే యనుకొన్న తీరున నిల్చి రు
ద్దండ బలాన్వితుఁడైన నార్టనుదంచితంబుగ నుంచగా. 34.
క. మారమ్మ కొండ దరికిన్
జేరెను నార్టన్ను సేన, చేయుదు మిఁక రే
పారసి యుద్ధమటంచును
వీరుని వలె నార్టననియె విశదము కాగన్. 35.
రెడ్డి తమను నార్టన్ ముట్టడించనున్న వార్త తెలిసికొని తీసికొనిన ప్రతీకారచర్య.
ఖచరప్లుత వృత్తము.(న భ భ మ స స వ. యతి 12.)
నరసరెడ్డి కనుంగొనె ముందే నార్టను వచ్చెనటంచు, మే
దురగతిన్ తనవారిని నిల్పెన్, ధూర్తులఁ జంప సముద్ధతిన్
గరుణ వీడుచు ముందుగనే యా నార్టను సైనికులన్, బ్రభా
కరుఁడు తూర్పునఁ గన్బడు లోఁగాఁ, క్రౌర్యము తోడఁ బ్రశాంతిగాన్. 36.
క. ఖలులను చంపగ రాత్రియె
నలుదెసలన్ - రాసరెడ్డి - నరసింహుండున్.
బలుఁడగు కాసెం సాహెబ్,
బలయుతుఁ డోబయ్య యుక్తి పన్నిరి యపుడే. 37.
గీ. కొండ దరికి రానుండిన దండు పయిని
గుళ్ళవర్షము కురిపించి ఘోరముగను,
నార్టననువాని సైన్యము నాశనమ్ము
చేసె నరసింహుఁడుద్ధతిన్ జేవఁ జూపి. 38.
ఆ. ప్రాణభయముతోడ పరుగిడి పోయెను
నార్టనపుడు సేన నాశనమవ,
మసలుచుండె సేన మారమ్మ గుట్టపై
నంచు తెలిసి, చంప నెంచె రెడ్డి. 39.
ఆ. అర్థరాత్రివేళ నారెడ్డి సైన్యమ్ము
మారమ గుడిగుట్ట చేరి, యచట
కాగడాలనార్పి కనఁబడకుండ నా
శత్రుసైనికులను చంపినారు. 40.
గీ. వేల రిపుసైన్యమున్ జంపి వేల్పు కత్తి
రక్తసిక్తమై యుండ, నాసక్తితోడ
మారమాంబ చెరువునకుఁ జేరి కడిగి
పెట్టెనొరలోన నరసింహ వీరుఁడెలమి. 41.
వసంతతిలక వృత్తము.(త భ జ జ గగ. యతి 8.)
గోసాయి వేంక ననె కూర్మిని రెడ్డితోడన్
భాసించినాము రిపువర్గముపై జయంబై
వాసంబు మార్చవలె, పాలకు లెన్ననట్లున్,
నా సూచనన్ గని మనంబిడి చేయుమయ్యా! 42.
శా. శత్రుల్ ముష్కరులెన్నగా, విపులమౌ సైన్యంబుతో వార లీ
ధాత్రిన్ శోధన చేసి పట్టుదురహో! దండింపఁగా నందరిన్,
మిత్రద్రోహము చేయ వచ్చునుగదా మిత్రుల్ ధరన్? గాన నీ
క్షేత్రంబున్ విడు టుత్తమం బనియె నా శ్రీమంతుఁడాలించగా. 43.
ఉ. బోధను చేయవేంకన, సముజ్వల తేజుఁడు రెడ్డి శ్రీజగ
న్నాథుని గుట్టపైన తమ స్థావరమున్ రచియింపనెంచి, యీ
బాధల నెన్ని బాపఁగల భాస్కరతేజమునొప్పు శ్రీజగ
న్నాథుఁడటంచు చేరెను మనంబున సన్నుత రీతినెమ్మితోన్ . 44.
శా. దైవానుగ్రహమున్ననాడు మదిలో ధైర్యంబుతోఁ బాటుగా,
శ్రీవత్సాంకునిపైన భక్తి కలుగున్, జేఁబట్టు కార్యంబులం
దేవిఘ్నంబును లేక సాగు, భళిరా! యీశా! జగన్నాథుఁడా!
మా విశ్వాసమె నీ వటంచుఁ దలచెన్ మాన్యుండు సైరా మదిన్. 45.
చ. దినములు సాగుచుండెనిటు, దీక్షను వీడక సైర "భారతం
బనియెడి నాదు దేశమున నన్యులపాలనఁ బారద్రోల" నే
తృణముగ నెంతు ప్రాణమును, దేశము కన్నను దేహమేమియున్
ఘనమని యెంచఁబో ననుచు గట్టిగ పట్టెను పట్టునాత్మలోన్. 46.
గీ. నాకు గురువయి వేంకన్న నన్ను నడుప,
కాపుగా నాకు కాసిముఖాను నిలువ,
నొడ్డె యోబన్న తోడుగా నుండ, నేను
జయము సాధించి తీరుదున్, సత్యమిదియె. 47.
అశ్వలలిత వృత్తము.(న జ భ జ భ జ భ వ. యతి 13)
అనుకొనుచున్ నృసింహుఁడు మనంబునందునను ధైర్యమూనుచుఁ దగన్
ఘనమగు యత్న సాధన శుభంబుగా జరుగు తీరునే వెదకుచున్,
వినుతులు చేసె దేవునకు సంభవించునటు చేయగా జయములన్,
ఘనుఁడగు దైవమే నడుపు చక్కగాఁ జరుప నెంచినట్టి విధమున్. 48.
ఆ. భక్తవరులఁగాచు భవ్య జగన్నాథు
గుట్ట చేరువుననె గొల్లవిండ్ల
పల్లి నుండు కాంత వంటలు చేయుచు
పెట్టుచుండెడిదట వీరులకును. 49.
చ. మన నరసింహరెడ్డికిని, మందికి కూడ సమీప గ్రామమం
దున నివసించు చుండిన వధూటి యొకర్తుక వంటకంబులన్
వినుతిగ వండి పెట్టెడిది, వీరుల కాకలి తీర్చుటన్న యా
ఘనత సమస్తదానములకన్నను గొప్పదియే తలంపగన్. 50.
మ. తమ సైన్యంబును కత్తితో నరుకుచున్ దప్పించుకొన్నట్టి, దా
ర్ఢ్యముతో నొప్పు నృసింహరెడ్డి కొఱ కా రాజ్యాధినాథుల్ క్షితిన్
క్షమనే కోల్పడి, గుట్టలన్ గరువులన్ గాలించుచున్, గాంచ నే
రమి నెంతేనియు ఖేదమంది, నెరవేర్చన్ దృష్టి సారించిరే. 51.
శా. ఆహారంబు లభించుచుండినకదా యానందమొప్పారఁగా
మోహాదుల్ మది సంభవించు మనకున్, పూర్ణంబుగా భోజనం
బాహా! లేని దురంత దుస్థితులలో నా క్షుత్తుతో నుండలే
కోహో దైవము చూపలేదు దయయం చుద్వేగమున్ బొందమే? 52.
చ. అనుచుఁ దలంచి ధూర్తులు, మహాత్ముఁడుగా మదినెంచి రెడ్డికిన్
ఘనముగ భోజనంబు నిడు కాంతను గూర్చి యెఱుంగఁగా వలెన్,
గనుఁగొనఁ గల్గ నామె నల కన్గొనవచ్చును రెడ్డి జాడనే,
యని తలపోసి, యా దిశగ నాంగ్లులు సాగిరి యత్నసిద్ధికై. 53.
చ. కనుగొని రా నృసింహునకు గౌరవమొప్పగ భోజనంబునే
దినదినమున్ బ్రమోదముగఁ దృప్తిగఁ బెట్టెడి జానకమ్మనే,
వినయ, నయంబులన్ మరియు విస్తృతరీతి భయంబుఁ గొల్పుచున్,
మనము చలింపఁ బల్కి రభిమాన ధనన్ నిలదీసి పాలకుల్. 54.
ఉ. ఎచ్చటనుండు రెడ్డి? యతఁ డెచ్చట విశ్రమమందుచుండు? తా
నెచ్చటసంచరించుచు మహిన్ దన కార్యములెల్లఁ జూచు? నీ
విచ్చట తెల్పఁగా వలయు నిన్నియు తప్పక, చెప్పకున్నచో
చచ్చెదవీవు, చెప్పుమన, చప్పున తప్పక చెప్పె నిట్టులన్. 55.
చ. దొరలగు మీకె వారి గతి తోచదు, నాకెటు తోచునద్ది? నే
నరిఁగెద పెక్కు చోటులకునన్నము పెట్టగ వారు చెప్పఁగా,
చెరచెర గుఱ్ఱమెక్కి చను జిత్తము వచ్చిన చోటనుండగా,
నిరుపమ రీతి వారు, కరుణించి ననున్ దయఁ చూడుడంచనెన్. 56.
మ. ఒకచోటన్ వసియించఁడయ్య ధరపైనొక్కొక్క చోటుండు తాన్
ప్రకటింపన్ దగనయ్య నే నతఁడిలన్ వర్తించు చోట్లెన్నుచున్,
సకలంబున్ గ్రహియించఁ గల్గుదురుగా, చక్కంగ మీరల్, దొరా!
యికనన్ వీడుడు పోయి వత్తుననె తా నీశున్ మదిన్ దల్చుచున్. 57.
గీ. తెల్లదొరలేమి పాల్పోక తెల్లమొగము
వేసి నరసింహరెడ్డికై వేచియుండి
రంతలో రెడ్డి జాడయే వింతగాను
తెలిసె నొక్కింత తెలిసియు తెలియనటుల. 58.
శా. ఆకొండన్ వసియించునంచొకఁడు, తా నచ్చోటలేడం చొకం
డా కాటిన్ వసియించునంచొకఁడు, తా నాకోనలో నుండునం
చా కల్యాణగుణాత్మకున్ గనినవా రాయా ప్రదేశంబులన్
లోకుల్ చెప్పఁగ పాలకుల్ వెదకుచున్ లోలోనఁ జింతించిరే. 59.
భాస్కరవిలసితము. (భ న జ య భ న న స గ. యతి 13.)
సైరను కనుఁగొనఁ గొండలయందున్, సల్పిరి వెదకుట, కలుగులయందున్,
పారెడు జలముల యందును ధాత్రిన్ బల్లములను గల తలముల యందున్,
తీరుగఁ గనఁబడు కోనలయందున్, దెల్లదొరలు నరహరిఁ గని పట్టన్,
ధీరుఁడు నరహరి కానఁగరాడే, దేవియొసగిన వర ఫలితమేమో? 60.
ఉ. చేతికిఁ జిక్కినట్టి నరసింహుని సైనికులందు కొందరిన్
నీతిగ రెడ్డి జాడ గణనీయముగా వచియింపుడంచు, వి
ఖ్యాతిగ మీకు సొమ్ములను గైకొన నిచ్చెదమంచుఁ బల్కుచున్
నేతలు కుంఫిణీలు గన నేర్చిరి రెడ్డి వసించు చోటులన్. 61.
గీ. మూడు మాసము లీ రెడ్డి జాడ కొఱకు
వెదకి వేసారి వేసారి తుదకు వారు
పేరుసోమల కొండలన్ వెదకి వెదకి
శ్రీ జగన్నాథు గుట్టనే చేరినారు. 62.
1846 అక్టోబరు 6 న ఓబయ్య, వేంకన్నలు కాల్చఁబడుట.
మ. అఁటనే రెడ్డి వసించి యుండునని, ధ్యేయంబొప్ప కాక్రేనుఁ డ
చ్చటకున్ సైన్యము మోహరించె, నపుడా సందర్భమున్ గాంచుచున్
జటిలంబైన సమస్యగాఁ దలచి గోసాయి ప్రభారాశియౌ
నిటలాక్షున్ సతికంజలించి యికపై నీవే దొరన్ గావుమా. 63.
గీ. అనుచు నోబననున్ గూడి యచటివారు
చూచుచుండఁగ ముసుగులన్ జొచ్చి పరుగు
పెట్టుచుండి రింకొకవైపు, వీఁడె రెడ్డి
పారి పోవుచునుండెను పట్టుకొనుఁడు. 64.
గీ. అనుచు కాక్రేను పల్కగా నటుగ సేన
వారినే బట్టి మరలఁగా, వీరుఁడయిన
రెడ్డి స్వామి వెన్కనె యుండి, గడ్డుసమయ
మిపుడు, దైవంబె నాకు తోడెన్నఁగననె. 65.
చ. పరుగునఁ బోవుచుండెఁ బగవాఁడగు రెడ్డియు, మిత్రుఁడాదెసన్,
సరగున కాల్చుఁడిద్దరిని, చంపుడు వారినటంచు నాయకుం
డరచుటతోడ సేనలు భయావహమౌనటు కాల్చిరిద్దరిన్.
నరహరి మిత్రులిద్దరు పణంబుగప్రాణము పెట్టి పోయిరే. 66.
గీ. కాల్పు శబ్దంబువిని రెడ్డి కంటనీరు
పెట్టె నోబయ్య, వేంకన్న, తుట్టతుదకు
నన్ను కావంగ ప్రాణమ్ములున్ననాళ్ళు
నెన్నియో బాధలొంది నే డీగినారు. 67.
జలదము.(భ ర న భ గ. యతి 10.)
పోయినవారు వేరుకట, పోవఁగ లే
దాయె నృసింహుఁ డిచ్చటనె దాగెనహో,
నా యనుమానమే నిజము, నా మదిలో
ధ్యేయము నేడుతీరవలె, ధీప్రతిభన్. 68.
గీ. అనుచు కాక్రేను సైన్యమ్ము నఁటకుఁ జేర్చి,
గుట్ట కన్నివైపులనుంచి గుళ్ళవర్ష
మతనిపై కురిపించగా మతిని దలచి,
సిద్ధముగ నిల్పె నందరిన్, క్షేత్రపతిగ. 69.
కవికంఠభూషణము.(స జ స స స జ గ. యతి 9.)
నరసింహరెడ్డి "తగునా జన నష్టము? పాపమేకదా?"
పరివారమంతయును పాపము నన్ మది నమ్మి వచ్చెనే,
పరమేశ్వరుండ! కనవా? తగు మార్గము చూప రావయా!
సరి నేటికిద్ది, మనసా విరమింతును యుద్ధమింతతోన్. 70.
చ. అనుచు దలంచి ఖడ్గము మదంబ యొసంగుటఁ జేసి యామెయే
ఘనమగు దీని శక్తిఁ గొనగా నిట నుంచెద నంచు దేవతన్
మనమున నెంచి యుంచె పరమంబగు ఖడ్గము దేవళమ్మునన్,
ప్రణవ మహాస్వరూపముగ పావనఖడ్గము నెంచు రెడ్డియే. 71.
ప్రభాకలిత.(న జ జ భ ర స వ. యతి 13.)
పవరము కాక్రెను నన్నుఁ జంప నవారితంబగు సేనతో
నవనియె దద్దరిలంగ వచ్చె ఘనంబుగా కుపితాత్ముఁడై,
చవిఁ గనఁ జేసెద వీరికంచు ససంభ్రమంబుగ గుండ్లనే
భువి కురిపించెను శత్రుసంహతి పూర్తిగా నిల వ్రాలగాన్. 72.
ఉ. ఆధునికాయుధంబులను హస్తములన్ ధరియించి శాత్రవుల్
శోధనఁ జేసి శత్రులను చూచుచు కాల్చుచునుండఁ గాంచుచున్
బాధను పొందె రెడ్డి తనవారు రణంబున కూలుచుండగాన్,
మాధవ! లొంగిపోదును, సమస్థము నీకృప యంచుఁ బల్కి తాన్. 73.
లొంగిపోవఁ జూచిన రెడ్డిని సమీపించుటకును భయపడుచున్న శత్రువులు.
తన్వి.(భ త న స భ భ న య. యతి 13.)
తానఁట లొంగన్ నిలువఁగ, తనలో ధైర్యము చూచి బెదరి రిపులెల్లన్
బ్రాణములెట్లైన నిలుపుకొనుటే భాగ్యము, వీని దరి నిలుచుటేలన్?
మౌనముగా దూరమయిన తమకున్ మానము ప్రాణము మిగులునటంచున్,
శ్రీ నరసింహున్ దఱియఁగ నఁటకున్ జేరరు శత్రులు భయము దలిర్పన్. 74.
ఆ. ఆత్మశక్తితోడ నతఁడు లొంగునె కాని,
పట్టజాల రొరులు వసుధపైన,
నుర్వి కీర్తిఁ గాంచె నుయ్యాలవాడ శ్రీ
నృహరిరెడ్డి యనుచు, నిరుపమునిగ. 75.
ఉపజాతి వృత్తము.(1&3 పాదములలో ఇంద్రవజ్ర - త త జ గగ. యతి 8.
మరియు 2&4 పాదములలో ఉపేంద్రవజ్ర. జ త జ గగ. యతి 8.)
స్వాతంత్ర్య సంపాదన వాంఛతోడన్
సతంబు దీక్షన్ గొని సత్ప్రవృత్తిన్
భీతిల్లనాంగ్లేయుల నే యొనర్చెన్
ధృతిన్ నృసింహుండను రెడ్డి ధాత్రిన్. 76.
సుగంధి.(హ హ హ హ హ హ హ గ. యతి 9.)
పట్టఁబోడువ్యర్థమైనవాటినెన్నడున్ ధరన్
బట్టెనా జయంబె పొందువాఁడె రెడ్డి, చూడగా
నట్టి గొప్పవాఁడు నేడహంబు వీడి లొంగుటే
యెట్టివారికైన నీ మహిన్ విచిత్రమేయగున్. 77.
ఆశ్వాసాంతము.
మయూరసారి.(ర జ ర గ. యతి 7.)
ఓ నృసింహ దేవ! యుండుమాత్మన్,
నీ నవోజ్వలంపు నిత్యదీప్తిన్
నేను జూడనుంటి నిర్వికారా!
జ్ఞానదీప్తి నిమ్ము కంబుకంఠా! 78.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున చతుర్థాశ్వాసము సమాప్తము.
పంచమాశ్వాసము.
శా. శ్రీమద్భారతదేశమాతను రిపుల్ చేపట్టి పాలించుటన్
ధీమంతుల్ భరియింపలేరుకద? మా దేవా! జగన్నాయకా!
నీ మాహాత్మ్యము చూపి స్వేచ్ఛ కొఱకై నిత్యంబు యత్నించు నీ
ప్రేమన్ గోరెడివారి రక్షణము నీవే చేయుమోదేవరా! 1.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయులకు లొంగిపోవుట.
గీ. శ్రీ జగన్నాథు గుట్టపై చేతులెత్తి
దైవమును గొల్చిస్వేచ్ఛకై, తాను లొంగె
శత్రు వితతికి స్వయముగా, మిత్రకోటి
విగతజీవనులయిరని వెతను పొంది. 2.
గీ. తనను బంధింప నొక్కఁడున్ దగ్గరకును
రాఁడు భయపడి, తనకు తా రేడు వెడలె
శాత్రవులవెంట, కాక్రేను మాత్రమపుడు
బంధనము చేయుఁడనె, రెడ్డి ప్రజ్ఞ నెఱిఁగి. 3.
ఉ. తొమ్మిదివందలొక్కరిని దోషులుగా చెరసాల నుంచి, వా
దమ్మున కొందరిన్ విడిచి, తక్కిన వందకు పైన దోషులన్
సమ్మతి తోడ వారి చెరసాలను బంధనమందు నుంచి, ధ
ర్మమ్మును చర్చ చేసిరి, సమంచిత రీతినిశిక్ష చేయగన్. 4.
క. న్యాయవిచారణ జరిగెను,
వేయఁదగినశిక్ష లెన్ని వేసి, చెరలలో
కాయంబులు మాయువరకు
ధ్యేయంబునఁ గొందరి నిడు తీర్పు వెలువడెన్. 5.
ఉ. కొందరి నండమాన్ చెరలకున్ గొనిపోయిరి దోషులంచు, నిం
కొందరి నక్కడే చెరలకున్ గొనిపోయిరి, వారి తప్పు లే
నందున కొందరిన్ విడిచి, రానరసింహ సుయోధునెన్ని, గ
ర్వాంధులె యాంగ్లపాలకులహంబును జూపుచు శిక్ష వేసిరే. 6.
09 - 01 - 1847న ఇచ్చిన తీర్పు నరసింహారెడ్డికి ఉరిశిక్ష.
చ. ప్రవరుఁడు, దేశభక్తుఁడును, భక్తవరుండగు నారసింహునిన్
బ్రవిమల చిత్తశోభితుని బంధన చేసి చెరన్ విధించియున్
జివర కురిన్ విధించిరయ శిక్షగ, రెడ్డి పరాక్రమప్రభల్
భవితను ముప్పుగొల్పునని పట్టి వధించుటె ధర్మమంచహో! 7.
ఉ. భీకరమౌచు రెడ్డికురి వేసెడివార్త చెలంగె నంతటన్,
లోకములోని శత్రువులె లోపల లోపల క్రుంగుచుండగా
శోకసముద్రమై ప్రజలు స్రుక్కుచునుండుట వింత కాదుగా?
మాకిల దేవుఁడీతఁడని మాన్యులు కూడ వచించుచుండిరే. 8.
ఉ. భారత జాతికంతకును భారమె చూడగ కుంఫిణీలు, వి
స్తారము చేయుచుండిరి యసంగత రీతిని రాజ్యపాలనన్,
స్మేరముఖారవిందుఁడగు శ్రీ నరసింహుఁడు వీరి పాలనన్
ధీరతఁ జూపి మాపుటకు దీక్షగ నిల్చి, యురిన్ వరించెనే. 9.
ఉ. ఎంతటి గొప్పవాఁడితఁడు, హృద్య మనోహర సద్గుణాఢ్యుఁడై
శాంతి విఘాతులైన పరశక్తుల పాలనఁ బాపనెంచి, యొ
క్కింత తెగింపుచూపి పరికించి దురాత్ముల శీర్ష ఖండనల్
పంతముతోడఁ జేసి పరపాలకులందు భయంబు నింపెనే. 10.
ఉ. కంతుని తమ్ముఁడందమున, జ్ఞానసుధానిధి పాలనప్రభన్,
జెంతను జేరు మిత్రుల నజేయులుగా నిలుపంగనేర్చు, క
వ్వింతలు చేయఁజూడ నరివీర భయంకరుఁ డీనృసింహుఁడే,
శాంతికి మారు పేరనఁగఁ జక్కని పాలనఁ జేసె నాఁడిలన్. 11.
ఉ. దానము ధర్మమున్ సలుపు తానిట వేంగళరాయుఁడే యనన్,
మాన ధనుండు చూడఁగను, మాన్యులలోపల మాన్యుఁడీతఁడే,
దీనజనాళి బాధలను తీర్చుచుఁ గాచిన పుణ్యమూర్తి, యీ
క్షోణి స్వతంత్ర సాధనకు గొప్పఁగ యత్నము చేసి వీగెనే. 12.
ఉ. నాయకుఁడన్న నీతఁడె, యనారత మిద్ధర పేదసాదకున్
జేయఁగనొప్పు సాయమును జేసిన సౌమ్యుఁడు, శత్రువర్గమున్
ధ్యేయముతోఁడఁ జంపు మగధీరుఁడు శ్రీ నరసింహరెడ్డి, యే
మాయలెఱుంగఁడీతఁడు, సమాదరలీల నురిన్ వరించెనే. 13.
మ. పరమార్థంబగు నిండు స్వేచ్ఛ కొఱకున్ బ్రఖ్యాతిగాఁ గొల్పగన్
వరసద్భాషణశేముషీ నిపుణతన్ భాషించి చైతన్యమున్
దరికిన్ వచ్చెడివారికిన్ గొలుపుచున్ దక్షుండుగా నిల్చె నీ
భరతాంబన్ తగు స్వేచ్ఛతో నిలుపఁగా, వర్ధిల్లఁగాఁ జేయగన్. 14.
పంచచామరము.(జ ర జ ర జ గ. యతి 10.)
అరాచకప్రవృత్తిఁ గల్గ నాంగ్లపాలకాధముల్
భరంబు కాగ ధాత్రిఁ బేదవారిఁ గట్టి, వారలన్,
గరంబునందుఁ గల్గినట్టి ఖడ్గధారఁ జూపుచున్
శిరంబులెన్ని ఖండనంబుఁ జేసె రెడ్డి వీరుఁడై. 15.
చ. ఒకటిగఁ జేసి యందరిని యుజ్జ్వల తేజము కొల్పి వారిలోఁ
బ్రకటితమై రహించునటు భవ్య సమైకతఁ గొల్పి, యాంగ్ల సై
నికులకు ప్రశ్నయై మిగిలి, నేడిటు తా నురినే వరించె, పా
లకులకు తానె చిక్కె, మదులన్ మహనీయుఁడుగా రహించుఁగా? 16.
గీ. ఘనుఁడు నరసింహుఁ డాస్థాన కవిగ నిలిపె
నోబళాచారినే ధాత్రి నొప్పిదముగ,
పెక్కు కావ్యముల్ రచియించి పేరుగనిన
వానికావ్యమొక్కటికూడఁ బడయమైతి. 17.
గీ. తాను కుందుర్తి రామావధాని కొఱకు
కోటగడ్డను దానంబు కోరి చేసె
నతఁడు మంత్రిగా తనకుండి యలరఁజేసి
కోటలను గట్టఁ జేయుటన్ కూర్మినిచ్చె. 18.
గీ. పెక్కు దేవాలయమ్ములనక్కజముగ
తాను కట్టించె రెడ్డియే ధరణిపైన,
నట్టినర్సింహరెడ్డికీ మట్టిపైన
నురిని తీయుట బాధయే యరసి చూడ. 19.
ఆ. పట్రకులమువారు పట్టుగా నైక్యమై
నరసరెడ్డి సేనను రహియించి
యున్నహేతువుననె యుయ్యాలవాడయున్
దోపిడీలు చేయు దొంగ యనిరి. 20.
మ. తనవారే తనకోసమై యసువులన్ తా వీడుటన్ జూచి యీ
ఘనుఁడౌ రెడ్డి సహింపలేక దొరికెన్ గాక్రేనునే చేరి, వే
దననే పొందెను తోటివారి కొఱకై, ధన్యాత్ముఁడీతండిలన్
మనినన్నాళ్ళును మానవత్వమెలయన్ మాన్యుండుగా వెల్గెనే. 21.
శా. అయ్యో యంచు జనాళి యీ విధముగా నారెడ్డినే గూర్చి తా
నెయ్యంబారఁగఁ బల్కుచుండి రకటా! నిర్వేదమున్ బొందు నా
యుయ్యాల్వాడ నృసింహరెడ్డి కథ యీ యుర్విన్ స్వతంత్రేచ్ఛనే
చయ్యన్ గొల్పక యుండునెట్లు? కనఁగా సంస్తుత్యుఁడీతండిలన్. 22.
రెడ్డికి పడిన ఉరి శిక్షకు 06 - 02 - 1847న గవర్నర్ ఆమోదముద్ర.
మ. ఆమోదించె ప్రభుండు శిక్ష నరసింహారెడ్డికిన్వేయుటన్,
ధీమంతుండగు రెడ్డి క్రుంగక మహా తేజంబుతో నొప్పుచున్
క్షేమంబీభరతాంబకున్ గొలుపఁగా స్వేచ్ఛన్ సదా కోరుదున్,
మీ మాయల్ పని చేయవింక త్వరగా మీరందరున్ బోవలెన్. 23.
గీ. అనుచు నాంగ్లేయులందరిన్ బనుపనెంచి
పలుకుచుండగ మాటలే ములుకులగుచు
నాంగ్ల జాతికి గుండెలో నలుఁగులటుల
గ్రుచ్చుకొనుచుండి వారినే రెచ్చఁగొట్టు. 24.
22 - 02 - 1847న ఉదయం 7గంటలకు ఉరి శిక్ష అమలు.
క. ప్రకటించిరి యురిశిక్షను,
సకల జనులు చూచుచుండ జరుపమనుచు నో
ప్రకటనఁ జేయుచు ప్రజలకు
నొకపరి గనరండటంచు నుద్ధతి తోడన్. 25.
క. చాటింపు వేయఁబడె నీ
మేటిగ నన్నిటనునుండి మించెడి రెడ్డిన్
గాటికి పంపఁగ నురినే
పాటించుచు తీయుదురను వార్త వెలువడెన్. 26.
గీ. నేటి కోయిలకుంట్ల, జుర్రేటి దరిని
నాడు పద్ధెమ్దివందలనలుబదేడు
ఫిబ్రవరి సోమవారము వేకువననె
యిరువదియురెండు తేదీన యురిని తీయు. 27.
క. దావానలంబు పోలుచు
నీ వార్త జనాళిఁ జేరె నీ నరసింహుం
డే వారల నెదిరించుచు
పోవఁగఁ దగువాఁడె, కాని, పోడటు లరయన్. 28.
గీ. వీర నరసింహుఁడాతఁడు, పేడి కాడు,
పౌరుషముతోడ నెదిరించి పట్టుపడెను
తనకు తానుగ రిపులకున్, ధరణి జనుల
స్వేచ్ఛనాశించి, పోరాడి విసిగిపోయె. 29.
మ. తన ఖడ్గంబునఁ ద్రుంచెఁ గుత్తుకలనే దండింపగా నాంగ్లులన్,
మనమందున్ దురితాత్ములంచుఁ గనెనా మానండు చంపన్, బ్రతి
క్షణమున్ భారతమాత స్వేచ్ఛ కొఱకై సాగించె నీ పద్ధతిన్,
ఘనుఁడై వెల్గె నృసింహరెడ్డి కడకున్ గాంక్షించె తానీ యురిన్. 30.
గీ. వచ్చె నురితీయు రోజది, వచ్చినారు
రెడ్డినురితీయువారలు రెడ్డితోడ,
జనుల సందోహమఁటఁ జేరె జాలిగాను,
శిక్షతప్పింప నెవరికి చేతనగును? 31.
గీ. కరుణ జాల్వార దుఃఖసాగరమునందు
సీమ జనులెల్ల మునిగిరి, చేయుట కిఁక
నేమియును లేక, బాధతో స్వామి నచటఁ
జూచి జుర్రేటి చెంతను, శోకిలుచును. 32.
గీ. అచట కాక్క్రేన్ సమక్షాన నమలు చేయ
నురికి సిద్ధంబు చేసి రా తరుణమందు
రెడ్డి ముఖమున చింతయే లేదు చూడ
నెదురు తిరుగుటయును లేదు, బెదురు లేదు. 33
చ. చివరిగ నేమి కావలెను చెప్పుమటంచనె కాక్కిరేను, నీ
కివె చివరి క్షణంబులనె నీప్సితమున్ నెరవేర్తునంచనెన్,
ప్రవరులు నా ప్రజాళి, కని వారిని నేనిఁట పల్కరించెదన్,
భవితను చూడఁ జేసెదను, పల్కగనిండనె రెడ్డి వానితోన్. 34.
శా. భీతిన్ జెందెను కాక్కిరేను, యితఁ డే ప్రేలాపనల్ పేలునో?
యేతన్మాత్ర జనాళి విప్లవము తా మీనాడె చేపట్టునో?
ఖ్యాతిన్ వెల్గెడి యాంగ్లపాలనకిలన్ కాలంబె చెల్లింతురో?
యీతండింక వచింపరాదు ప్రజతోనిప్పట్టునంచెంచె తాన్. 35.
చ. సమయము మించిపోవు నిక చప్పున వీనిని తీయుడీ యురిన్,
క్షమ తగదింక, చెప్పినటు సాంతము చేయుఁడటంచు నాజ్ఞనే
యమలునుఁ జేయుఁడంచనియె నయ్యెడ కాక్క్రెను, రెడ్డి గట్టిగా
ప్రముదముతోడ భారతము వర్ధిలు గావుత స్వేచ్ఛనంచనెన్. 36.
శా. స్వాతంత్ర్యోద్యమమాగ దీభరత భూవాసుల్ సమైక్యంబుగా
నాతత్త్వంబు గ్రహించి, స్వేచ్ఛ కొఱకై నా మార్గమున్ బూని, స
చ్చైతన్యంబును రెచ్చఁ గొట్టి ఫలమే సాధించు నందాక తా
భీతిన్ గొల్పుచు నాంగ్లపాలకులనే వీడంగఁ జేయన్ గనన్. 37.
ఉ. పోయెడివాఁడనొక్కడినె, పోరును సల్ప ననేకు లిద్ధరన్
న్యాయ పథంబునన్ నుత మహత్తర శక్తిగ నొక్కటౌచు స
ద్ధ్యేయముతో స్వతంత్రమును తెత్తురు నిక్కము మిమ్ము పంపి, య
న్యాయములాచరించు మిము నందరినిం కడదేర్త్రు కాక్కిరేన్! 38.
పఙ్క్తి వృత్తము.(భ భ భ గ. యతి 7.)
భారత మాతకు పల్కెద నే
ధీరత జై యని దిక్తటులన్
మారుగ మ్రోగఁగ, నాకురినే
మీరు బిగించుచు మీరునెడన్. 39.
మ. అనుచున్ రెడ్డి జయంబు పల్కుతరి, నాహాకారముల్ మిన్నుఁ దా
కెనె యచ్చోట తలారి రెడ్డి కురి శక్తిన్ జూపుచున్ వేయ, నా
జనసందోహము చేయుటన్, శివశివా! సాధింప స్వాతంత్ర్యమున్
తన ప్రాణంబులుపెట్టె తా పణముగా ధన్యాత్ముడౌ రెడ్డియే. 40.
మ. ఉరిత్రాటిన్ బిగియించఁ గొంత వడికా యుచ్ఛ్వాసనిశ్శ్వాసలున్
బరమాత్మన్ వడిఁ జేరిపోయె, కనుపాపల్ కాంతినే వీడగా,
పరికించెన్ భువి కాక్కిరేన్ నరహరిప్రాణంబులే పోవుటన్,
సరిగా ఖండనఁ జేయు మీ శిర మనెన్, శాశించి తల్వారినే. 41.
ఆ. తీర్పు ననుసరించి తెగఁదీసి శిరమును
కోట లోననె యురి కొయ్య చివర
వ్రేలదీయవలయు, భీతిల్ల జనులెల్ల,
ననెను కాక్కిరేను ఘనముగాను. 42.
గీ. చేసెను తలారి కాక్క్రేను చెప్పినటులె,
కోటగుమ్మాన నురికొయ్యకు నరసింహు
శీర్షమును వ్రేలఁ దీసె, నశించిపోక
యట్టులే ముప్పదేడులు కట్టియుండె. 43.
ఉ. దీనిని చూచుచుండిన మదిన్ భయమందుచు నాంగ్ల జాతిపై
మౌనముతోడనుందురని, మాటికిమాటికి స్వేచ్ఛవాంఛతోఁ
బ్రాణముతీయ రారనుచు భావనఁ జేసిరి కుంఫిణీ ప్రభు
త్వాన గలట్టి పాలకు లవారిత రీతిని తీర్పునిచ్చిరే. 44.
సీ. సుద్దుల కథలోన శోభించె నుయ్యాలవాడ నృసింహుని ప్రవర చరిత,
పిచ్చుకుంటల వారి విఖ్యాతమగు పాట లయి వెల్గె సైర నృహరి సుచరిత,
కోలాట పాటలన్ గొప్పగా కలదెన్న నరసింహరెడ్డి ఘనమగు చరిత,
వరలెను గ్రుడ్డిదాసరుల పాటలలోన వీరనృసింహుని విపులచరిత,
గీ. ప్రథమముగను స్వాతంత్ర్యసంగ్రామమునకు
మూలమగు నీ పదేండ్లకు ముందె జరిగి
యున్న సైరానృసింహుని యుజ్వలకథ,
దేశమాతకు స్వేచ్ఛను తెచ్చిన కథ. 45.
సీ. నరసింహునురితీయుటరసిన ప్రజలలో స్వాతంత్ర్య సత్కాంక్ష ప్రబలసాగె,
నల్లూరి రామరా జిల్లువాకిలి వీడి తెల్లవారికి పోరు తీరు చూపి,
యూపిరాడక చేసి, యుత్సాహ భరితుఁడై మన్యంపు దొరయంచు మహిని వెలిగె,
తాంతియాతోపియా ధైర్యంబుతో నాంగ్ల జాతితోపోరాడె ఖ్యాతిగాను,
గీ. భారతావనిన్ బ్రతియింటఁ బ్రబలినారు
స్వేచ్ఛకైపోరుసల్పంగ వీరులగుచు,
స్వార్థమును వీడి ప్రతివారు భారతాంబ
స్వేచ్ఛనాశించి త్యాగముల్ చేసినారు. 46.
గీ. రెడ్డి నడచిన పథమునన్ బ్రీతితోడ
సాగఁ జొచ్చిరి ప్రజలెల్ల సన్నుతముగ
నో పదేండ్లకుపూర్తిగా నొప్పిదముగ
మహితసంగ్రామ రూపమ్ము మహిని పొందె. 47.
ఉ. తొంబది వర్షముల్ రిపులతో నొనరించిరి యుద్ధమిట్లు, లో
కంబున తెల్లవారలు కకావికలౌనటు రెచ్చిపోయి, ఖే
దంబును గొల్పినారు, బహుధా తమశక్తులనొడ్డినారు, వా
దంబులు చేసి యాంగ్లుల మదంబును డుల్చిరి భారతీయులే. 48.
తరళము. (న భ ర స జ జ గ. యతి 12.)
తిరుగుబాటులకోర్వఁ జాలక తెల్లవారలె భీతితోఁ
బరుగుఁ దీసిరి భారతావని వారు వీడుచు, నయ్యెడన్
బరువునే మదినెంచి వారలు ప్రస్ఫుటంబగు పద్ధతిన్
స్థిరముగా మన భారతాంబకు స్వేచ్ఛనే ప్రకటించిరే. 49.
ఉ. సైర నృసింహరెడ్డి కల సన్నుతిగా నెరవేరె నేటికిన్,
వీరుల త్యాగ సత్ఫలము నేటికిఁ బూర్తిగ లభ్యమయ్యె, వి
స్తార మనోజ్ఞభారతము సాధ్యము కాక, లభించె కొంతయే,
కోరుచు పాక్కుదేశముగ కొంత విడెన్ బరితాపహేతువై. 50.
సీ. ప్రారంభమాయెను పద్ధెమ్ది వందలనలుబదారున స్వేచ్ఛ వలయుననుచు,
రేనాటి సూరీడె యానాడు మొదలిడి ప్రాణములర్పింపఁ బ్రతిఫలముగఁ
బ్రఖ్యాతమౌ స్వేచ్ఛ పందొమ్ది వందల నలుబదేడున వచ్చి వెలయఁ జేసె
భారతాంబ సుకీర్తి పరగ దిశాంతముల్, ప్రజలుస్వేచ్ఛగనిఁట ప్రబలునటుల,
గీ. చక్కనైనట్టి రాజ్యాంగ మొక్కటగుచు
చేసి నారిఁట పెద్దలు ధ్యాసఁ బెట్టి,
పంచవర్షప్రణాళికన్ బ్రగతి కొఱకు
నేర్పరచినారు పాలనన్ నేర్పుఁ జూప. 51.
శా. స్వాతంత్ర్యంబొకమారు కోల్పడితిమా సర్వంబు శూన్యంబగున్,
స్వాతంత్ర్యంబు లభించెనంచు మదిలోనన్ బొంగ వచ్చున్, సదా
స్వాతంత్ర్యంబును నిల్పుకోవలయు, దుస్స్వార్థంబునే వీడుచున్
స్వాతంత్ర్యంబిల భారతీయులెలమిన్ సద్భాతి భోగింపనౌన్. 52.
ఉ. భావి తరమ్మువారె పరివర్ధిలు దీప్తులు, వారె సమ్మతిన్
భావమునందు నిత్యమును భారతమాత శుభాస్పదంబుగా
దేవతగా రహించుచు, ప్రదీపిత శాంతమనోజ్ఞ తేజయై
సేవితపాదయై, యిలఁ బ్రసిద్ధిని గాంచఁగ నెంచఁగావలెన్. 53.
ఉ. ప్రకృతి విరుద్ధమౌ పనులు భారతవాసులు చేయ నొప్ప దే
వికృతపు చేష్టలున్ దగవు, వేల్పుల నెప్పుడు గౌరవించుచున్,
బ్రకృతమునందు మెల్గవలె భక్తిగ నీ వర దేశ వాసమే
సుకృతి ఫలంబటంచు మది శోభిలఁ గాంచుచు మెల్గఁగావలెన్. 54.
శా. ప్రాచీనంబగు దేవళంబులనిలన్ వర్ధిల్లఁ జేయన్ వలెన్,
శ్రీచక్రాంకితపాదపద్మరజమే ప్రీతిన్ గనున్ భారతిన్,
నీచంబైన ప్రవర్తనన్ ధరణిపై నిత్యంబు ఖండించుచున్
బ్రాచుర్యంబును భారతావనికిలన్ వర్ధిల్లఁ జేయన్వలెన్. 55.
సీ. పాశ్చాత్యులిద్ధరన్ బాతుకు పోవుటన్ బరిపాలనంబును బట్టినారు,
వారట్లు మనదేశ వాసులమధ్యనే చిచ్చును బెట్టుచుఁ జెలగినారు,
మనలో ననేకతన్ ఘనముగా కల్పించి విడిపోవఁగాఁ జేసి పెరిగినారు,
మనవారె తమవారు, మనకు మనమె శత్రువులగా ప్రవర్తించి కలియకుండ
గీ. నుండుటనుజేసి స్వేచ్ఛతోనుండ్రి వారు,
స్వేచ్ఛఁ గోల్పోయినామట్టి స్వేచ్ఛకొఱకు
నెందరెందరో ప్రాణమ్ములిచ్చినారు,
నాటి స్థితియె రాకూడ దేనాటికినిల. 56.
గీ. ప్రజలు సత్సమైకతఁ గల్గి ప్రబలవలయు,
దేశపు రహస్య విషయముల్ తెలుపరాదు
పరులకెన్నడున్, దెలిపినన్ వాఁడె దేశ
శత్రువుగనెన్ని యురితీత జరుప వలయు. 57.
గీ. దేశభద్రత ముఖ్యము, దీనిలోన
తరతమాంతరమ్ములకింక దారి లేదు,
భారతావనిన్ బ్రతుకుచు, పరులకొఱకు
జయముపల్కెడి మూర్ఖులన్ జంపుటొప్పు. 58.
గీ. పెద్దలును బాలురును కూడ పృథ్విపైనఁ
జొక్కవలయును సతతంబు శుభచయమున
నాయురారోగ్యములతోడఁ నంతమంది
వర్ధిలన్వలె, భక్తి సద్భాగ్యమొదవి. 59.
ఆ. త్యాగధనులనెంచి ధన్యులు వారంచు
త్యాగబుద్ధిఁ గలిగి ధన్యతఁ గను,
భోగభాగ్యములను బొందవచ్చును కాని
యోగసిద్ధి మనకు యోగ్యమెఱుఁగ. 60.
గీ. దేశపున్ స్వేచ్ఛకొఱకునై తెల్లవారి
కెదురు నిలిచి ప్రాణంబులనొదిలినట్టి
ధన్యులకు తర్పణంబిడి తలచు కొనుచు
ఋణము తీర్చుకో వలయు, ధరణిని మనము. 61.
గీ. సైర నరసింహు నాత్మకున్ జక్కనైన
దేశభక్తి నివాళియౌ, దివ్యమైన
భారతావనిన్ నిరతంబు భక్తిఁ గొలుచు
భవ్య భక్తులకర్పింతు వందనములు. 62.
పంక్తి.(భ భ భ గ. యతి 7.)
జై భరతాంబకు జై యనరా!
శోభను గొల్పఁగఁ జూడుమురా
శోభిలు సన్నుత శుద్ధమతిన్,
జై భరతాంబకు జై యనరా! 63.
ఆశ్వాసాంతము.
స్రగ్విణి. (ర ర ర ర. యతి 7.)
నారసింహప్రభూ! నాదుదేశంబునున్
వీర భక్తావళిన్ బ్రేమతోఁ గాకావరా!
భారతాంబన్ గృపన్ వర్ధిలన్ జేయరా!
వీర కావ్యంబిదే ప్రీతితోఁ గాంచరా! 64.
ఆ. స్వస్తి జనులకెల్ల, స్వస్తి మా భూమాత
భారతాంబకెపుడు, భక్తతతికి,
స్వస్తి పాఠకులకు, స్వస్తి రేనాటికిన్,
స్వస్తి కాంతలకును, బాలలకును. 65.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును చిత్రకవితా సమ్రాట్ బిరుదాంకితుండును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున పంచమాశ్వాసము సమాప్తము.
సర్వము సంపూర్ణము.
స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర ఆషాఢబహుళ పాడ్యమీ భౌమవారమ్.
తే. 30 - 6 - 2026.