Monday, January 7, 2013

సంస్కృత కళాశాలలకు పట్టిన ఈ దుస్థితిని మాపండి. విద్యార్థినుల విజ్ఞప్తి


జైశ్రీరామ్.
శ్రీమదాంద్రభాషాభూషణులైన సహోదరీ సహోదరులారా! ఆంధ్రభాషామతల్లి వేడుకోలును (సదనం) విద్యార్థినుల విజ్ఞప్తిలో తిలకించండి.
ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల(సదనం)
రాజమహేంద్రవరము.
విజ్ఞప్తి.
రాష్ట్రంలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహోత్సవాల సమావేశాలలో అనేక మంది కవులు పండితులు వక్తలు, ప్రజా ప్రతినిధులు తెలుగును మరచిపో కూడదని, తెలుగు భాషను బ్రతికించుకోవాలని, అది మన మాతృ భాష అని, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, బోర్డులన్నీ తెలుగులోనే వ్రాయాలనీ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.ఇది చాలా సంతోషించ తగ్గ విషయము. ఐతే తెలుగు భాష నేర్చుకొనుటకు ఆయువుపట్టైన ప్రాచ్య కళాశాలల(ఓరియంటల్ కాలేజస్)పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో దక్షిణ కాశీగా పిలవబడే రాజమహేంద్రవరము పట్టణ నడిబొడ్డున పవిత్ర గోదావరీ తీరమున"ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల" క్రీ.శ.1931లో స్థాపించబడి, కుల మత వర్గ విచక్షణ లేకుండా బాలికలను చేర్చుకొని,తెలుగు సంస్కృత సంప్రదాయ భాషా బోధన గావించుచు, అప్పటి నుండి ఇప్పటి(2012)వరకు నిరాటంకంగా నిరంతర వాహిని గోదావరిలా కొనసాగుతూ, అనేకమంది విద్యార్థినులను ఉద్దండ పండితులుగా, అవధానులుగా తీర్చి దిద్ది, తెలుగు సంస్కృత సొగసుల గుబాళింపును, భాషా వికాసమును నలు దెసలా ప్రజ్వరిల్ల జేసిన యీ కళాశాల ఈ నాడు ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గిరియై, రేపో మాపో కళాశాల మూతపడే ప్రమాదమేర్పడినది. ఎందు చేతననగా ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తరువు సంఖ్య.35 ప్రకారము పదవీ విరమణ చేసిన ఖాళీలలో క్రొత్తవారిని నియమించక పోవుటయే. అందు వలన అధ్యాపకులు లేక బోధన కుంటువడు చున్నది.తత్ఫలితముగా కళాశాల మూతపడే ప్రమాదమేర్పడినది. అందువలన  తెలుగు, సంస్కృత భాషలు కనుమఱుగయ్యే ప్రమాదమున్నది.
ఒకప్పుడు భాషాప్రవీణగా, సాహిత్య విద్యాప్రవీణగా పిలువబడే ఈ చదువును పెఅస్తుతము B.A.O.L. DEGREE గా పిలుస్తారు.తెలుగు భాషాశాస్త్ర, వ్యాకరణ, అలంకార, కావ్యాదులను క్షుణ్ణంగా బోధిస్తారు.తెలుగు భాషా గౌరవమునకు ఆయువుపట్టైన అవధాన ప్రక్రియ కుంటుపడుతున్న ఈ రోజులలో మహిళలు అవధాన ప్రక్రియలో రాణిస్తూ, పెద్దపెద్ద నగరాలలో ప్రదర్శనలిస్తూ, అవధాన సౌరభాన్ని అంతటా వ్యాపింప చేస్తూ, పేరు ప్రఖ్యాతులు గైకొంటున్న మహిళా అవధానులకు ఆట పట్టు ఈ కళాశాల. నేడు కూడా SV channel మా విద్యార్తినుల అవధానములను ప్రసారం చేయుచున్న విషయము ప్రేక్షకులకు సువిదితమే.
శ్రీ నాళం రామలింగయ్య గారి ఆర్ధిక సహాయం, గౌరవనీయులైన బత్తుల కామాక్షమ్మ గారి సేవా దృక్పథంతో వృద్ధి చెందిన యీ కళా శాలలో పదవీ విరమణ చేసిన వారి స్థానములు ప్రభుత్వ ఉత్తరువు 35 కారణముగా ఖాళీగా ఉంచివేసిన కారణముగా  బోధన కరువైనది. దాతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ధార్మిక సంస్థలు సహకరిస్తూ అతి కష్టం మీద ఇప్పుడు ఈ కళా శాలలో బోధన సాగుచున్నది. సిబ్బందిని నియమింప వలసినదిగా ప్రభుత్వమునకు ఎన్ని పర్యాయములు విన్నవించుకున్నను, అరణ్య రోదనయే అగుచున్నది.
తెలుగు మహా సభలలో ఉపన్యసించు కవులు, వక్తలు, పండితులు, ప్రజా ప్రతినిధులు, తెలుగు భాషాధ్యయనమునకాటపట్టైన సంస్కృత కళాశాలలు మూత పడకుండా ఉండుటకై ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చి, సిబ్బంది నియామకము జరిగేలా చూడవలసిన అవసరమెంతైనా ఉంది. మన భాషా సంస్కృతీ సంప్రదాయాలను తరువాత తరముల వారికి అంద జేయ వలసిన కనీస ధర్మము అందరిపైనా ఉందని విన్నవించుకొనుచున్నాము. మీరూ ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించి మా విన్నపము యొక్క పరమార్థము నెరవేరే మార్గంలో కృషి చేసి తెలుగు భాషామతల్లిని రక్షిస్తారని ఆశిస్తున్నాము.
ఇట్లు
కళాశాల కమిటీ, మరియు విద్యార్థినులు.
చూచారు కదండి. మీ పరిధిలో ఏమి చేయగలరో అది చేస్తారనే విశ్వాసం నాకు ఉంది. మీ బ్లాగులద్వారా పదిమందిదృష్టికీ ఈ దుస్థితిని తీసుకురండి. ప్రభుత్వం నుండి సానుకూల స్పందనను సాధించండి. ఈ విషయంలో మీ సహాయ సహకారాలందించనున్న మీ అందరికీ నా కైమోడ్పులు.
జైహింద్.

Tuesday, January 1, 2013

ప్రపంచ తెలుగు మహా సభలు అత్యద్భుతంగా జరిగాయి. అందరికీ శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
సహృదయ సన్మిత్రులారా! ఆ పరమాత్మ ఎల్ల వేళలా సజ్జనులైనమీకు, మీ వంటి వారికందరికీ అండగా ఉండి, నిరాఘాట సత్ప్రయత్నసాఫల్యత ప్రాప్తింప చేయు గాక. అందరికీ శుభాకాంక్షలు
మీ అందరి అభినందనలతో తే.29-12-2012  మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో నిర్వహించిన 4వ ప్రపంచ తెలుగు మహా సభ - సాహిత్య ఉప వేదికపై " చమత్కారములు - చాటువులు " అనే అంశముపై నేను ప్రసంగించాను. మన సాహితీ మిత్రులు అనేక మంది శ్రమతీసుకొని ప్రత్యేకించి వచ్చి, అన్ను అభినందించి వేదికకు పంపించటం నాకెంతో సంతోషం కలిగించింది.వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ్ జేసుకొనుచిన్నాను. ఛాయా చిత్రములు కూడా ఆ విధంగా వచ్చిన ‘భాగవత గణనాధ్యాయి’ శ్రీ సాంబశివ రావు గారు తీసి నాకు పంపి యున్నారు. వారికి ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఛాయా చిత్రములను జతచేస్తున్నాను.
జైహింద్.

Monday, December 24, 2012

ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే సదవకాశం.

జైశ్రీరామ్.
సహృదయ భారాతీయ సహోదరులారా! ఆ జగన్మాత కటాఖ్శం వల్ల, మీ వంటి సన్మిర్తుల శుభాకాంక్షలవల్లా, "తిరుపతిలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహా సభలలో దిగ్దంతులవంటి తెలుగు సరస్వతీ, పుంభావ సరస్వతీ మూర్తులను చూచే భాగ్యంతో పాటు, అక్కడ వేదికపై ఉపన్యసించే సదవకాశం కూడా నాకు లభించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి నన్ను ఉపవేదికపై ఉపన్యసించ వలసినదిగా కోరుతూ ఆహ్వానం వచ్చింది.
ఈ సదవకాశం కలిగించిన ప్రభుత్వానికి నా ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను. 
అక్కడికి వస్తున్న మీ అందరిమీ ప్రత్యక్షంగా చూచే అదృష్టం నాకు కలుగుతున్నందులకు ఆనందంగా ఉంది.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
జైహింద్.

Friday, December 7, 2012

E బుక్

నేను చదువుకోడానికి ఆ పుస్థకాలు తెమ్మంటే మొయ్యలేనని చెప్పి Eపుస్థకం  పెద్దది తెచ్చాడమెరికానుంచి మా నాన్న, అబ్బా! ఇదీ బరువుగానే అనిపిస్తోంది నాకు. చిన్న పిల్లని కదా! అందుచేతనేమో!!!కొంచెం సాయంపట్టరూ?

Thursday, November 22, 2012

సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా? పద్య కవిత పోటీలో మన సోమార్క గారికి ప్రథమ బహుమతి

జైశ్రీరామ్.
సాహితీ పిపాసులారా! సుమనర్నమస్సులు.
ఇప్పుడు  రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొనిన శ్రీ అర్క సోమయాజిగారిని గూర్చి తియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. వారిని మనము హృదయ పూర్వకంగ అభినందిద్దాము. వారికి ఈ బహుమతి కైవసమైన వార్తను వారి మాటలలోనే చూద్దాము.
అయ్యా! నమస్కారాలు!
ఇటీవల సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా?అని ప్రశ్నిస్తూ,ఒక సంస్ఠ పద్య పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నా సమాధానాన్ని "పద్య శైలూషి "అనే పద్య ఖండికను పద్య కవిత రూపంలో పంపించాను.దానికి రాష్ట్ర స్తాయి పద్య కవితలపోటిలో ప్రధమ బహుమతి లభించినట్లు తెలిపారు.ఆ కార్యక్రమం "ఒంగోలు"లో ఏర్పాటు చేశారు.24/11/2012న ఆ బహుమతి అందుకోవడానికి మరియు అదే రోజు కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడానికి రేపు రాత్రి బయలుదేరుతున్నాను.మీ ఆశీర్వాదములు కోరుతున్నాను.
ఆ పద్యాలను ఇక్కడ మన అంతర్జాల వీక్షలకు కూడా అందజేస్తున్నాను. ఇట్లు మీ సోమార్క
తేనియలూటలూరు,తియ తియ్యని దేశిపదాల సౌరు,స
ద్గాన గుణమ్ము,తెల్గు నుడికారగణమ్ములనొప్పు,వాక్యవి
న్నాణములున్,మనోజ్ఞ కవనమ్ముకు పెట్టని సొమ్ములౌనుగా,
జానుతెనుంగుపద్యముల జాతికి సాటికవిత్వమున్నదే?
పదముల్ పేర్చి,బిగించికూర్చి,రసవద్భావమ్ములన్ పేర్చి,సొం
పొదవన్, శైలియు,వృత్తి,రీతి,రసవత్పాకాది,మేలౌ గుణా
భ్యుదయోల్లాస, కవిత్వ రూప నిగమ ప్రోక్తార్ష విజ్ఞాన సం
పదయై భాసిలు,తెల్గు భాషకు,మహద్భాగ్యంబు!పద్యంబెగా! 
నన్నయనాటి నుండి,యధునాతన రీతులు నేర్చుకొంచు,నె
న్నెన్నొ కవిత్వ ప్రక్రియలనింపగు,రూపుల దిద్దుకొంచు,న
భ్యున్నతిగొంచు,కావ్యవిభవోజ్వలమౌచును,తెల్గుసాహితిన్
యెన్నగ!హృద్య పద్యమది!యింపగు!తెల్గు సమృద్ధినందగన్.
పద్యము ప్రాతవడ్డదని,భావన సేయుటయేమొ గాని?!త
ద్విద్య సహస్ర రూపిణిగ,విస్తృత రూపము దాల్చియొప్పె,న
య్యద్యతనాంధ్రసత్కవులు,యాధునికత్వ,కవిత్వరూపమౌ,
హృద్య కవిత్వ రీతులకు,నింపగు మూలము!గాదనందురే?
సరస పద ప్రహేళికల జల్లిన భావరజమ్ముతో,నలం
కరణలనొప్పు వర్ణనల గప్పిన,యక్షర రధ్యపైని,మా
సరస కవీశు లందముగ,చక్కని పద్య రధమ్ము గూర్చిరా
దరమున,త్రిప్పినారలు!వధాన విధాన పధాన నెల్లెడన్.
నన్నయ సంస్కృతాంధ్ర సుగుణమ్ములనొద్దికదిద్దితీర్చి,వి
ద్వన్నుతుడయ్యె;నూతన విధానము నేర్పెను సోమయాజి,రూ
పోన్నతిజేసె,దేశికవితోద్యమసారధి;సోముడున్ పదా
ర్వన్నెల శొభగూర్పగను!పద్యము జానగు శోభ నొప్పెడిన్.
చింతింపంబనిలేదు!పద్యకవు లక్షీణ ప్రభావోన్నతిన్,
గొంతుల్విప్పుడు!పూర్వ వైభవము సంకోచమ్ముగా బొంద,మీ
వంతున్ సత్కృషిసల్ప,మేటి రసవత్పద్యమ్మనావద్యమై,
భ్రాంతుల్ దీర,రసజ్ఞశ్రోతృ జలధిన్ పర్వించు పద్యాపగల్.
డా.చంద్రశేఖరావధాని చేస్తున్న అష్టావధానంలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సోమార్క..
చూచాము కదండి! ఈ సాహితీ ప్రయాణంలో శ్రీ సోమార్కగారు మరిన్ని విజయ బావుటాలెగరవేయాలని కోరుతూ వారిని ఆంధ్రామృతం ద్వారా మరొక్క పర్యాయము అభినందిస్తున్నాను. ఇక 
ఈ అంశముపై మీరూ మీ భావలకు పద్య రూపాన్ని కల్పించి ఆంధ్రామృత్ం ద్వారాపాఠకులకు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.

Wednesday, November 21, 2012

మియాపూర్ హైస్కూల్లో25-11-2012న కవిసమ్మేళనమునకు ఆహ్వానము

జైశ్రీరామ్.
సాహితీ సన్మిత్రులారా! సాహితీ సమితి శేర్లింగంపల్లి శాఖ వారు వివిధ ప్రాంతములనుండి అనేకమంది కవులను ఆహ్వానించి, కవిసమ్మేళనము ఏర్పాటు చేసియున్నారు. సహృదయులందరూ ఈ కార్యక్రమమునకు  అహ్వానితులే.
మియాపూర్ లోగల ఈసేవా కేంద్రము ప్రక్కనే గల జిల్లాపరిషత్ హైస్కూల్ లో ఈ కార్యక్రమము జరుగుచున్నది. మియాపూర్ చౌరాస్తాకు, ఆల్విన్ చౌరాస్తాకు మధ్యగల ష్టాప్.రోడ్డుకు ఉత్తరంగా ఉన్న సందులో ఈ పాఠశాల కలదు.
జైహింద్.