Tuesday, May 6, 2025

ప్రాతస్స్మరామి హృది సంస్థితమాత్మ తత్త్వమ్.

జై శ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

ప్రాతస్స్మరామి హృది సంస్థితమాత్మ తత్త్వమ్.

పరమాత్మా! బ్రహ్మ ముహూర్తంలో నన్ను అజ్ఞాన యుతమైన నిద్ర నుండి లేపుము. అట్టి పవిత్ర సమయమున అంతరంగంలో నిన్నే స్మరించు నిర్మల బుద్ధిని నాకు కలుగజేయుము.

పరమేశ్వరా! పర్వతాల వలె సుఖదుఃఖాలు భయపెట్టినను, చివరి శ్వాస వరకు త్రికరణశుద్ధిగా నీ ప్రార్ధనలోనే నిలువగల శక్తి సామర్ధ్యాలను నాకు ఒసగుము.

సర్వేశ్వరా! ప్రతినిత్యమూ భక్త సాంగత్యంలో పాల్గొను భాగ్యాన్ని ఇవ్వు.  నాకు భక్తి,  జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించు.

సర్వజ్ఞా! ఇంద్రియ భోగాలపైన, బలీయమైన వాంఛలపైన, పరిపూర్ణ విరక్తిని నాకు కలిగించు. నీవు నా హృదయంలో నిరంతరం ప్రకాశిస్తూ... గమనిస్తూ... కొలువై ఉన్నావనే జ్ఞానాన్ని ప్రసాదించు. నీతో మమేకము అగునట్టి పూర్ణ భావాన్ని కలిగించు.

ఈశ్వరా! తెలిసి గానీ, తెలియక గానీ నా వలన  ఏ ప్రాణికి హాని జరుగని విధంగా నడుచుకొనునట్లు నన్ను అనుగ్రహించు. ఆత్మ స్తుతి, పరనిందలు అనెడి పాప కూపంలో పడకుండా నన్ను కాపాడు.

ప్రేమైక మూర్తీ!  ప్రేమ, కరుణ, త్యాగం నా హృదయంలో నిరంతరం నిండి ఉండే లాగున నన్ను అనుగ్రహించు.

హే దీనబంధూ!  దేహాభిమానాన్ని, స్వార్ధాన్ని నా నుండి తొలగించు. విషయ సుఖాలు నన్ను బంధించుచున్నవనే జాగృతి నిరంతరం నాలో ఉండేటట్లు కరుణించి నాకు త్రికరణ శుద్ధిని ఇమ్ము.

కరుణాసాగరా!  కీర్తి ప్రతిష్టల మీద, ధన ధాన్య సంపాదన మీద, లౌకిక భోగాలపైన నా చిత్తంలో... కాంక్ష కలుగని రీతిగా దయ చూడు.

సర్వాంతర్యామీ!  ఈ కనబడే ప్రపంచంలో నామరూపాలు అన్నిటియందు నీవే సత్యంగా... ఒక్కటిగా ఉన్నట్లు నాకు గోచరించే లాగున స్ఫురింప జేయుము.

ఓ సదానందా!  సర్వ ప్రాణుల యందు దయ, సాటి మానవుల యందు అకారణమైన సహజ ప్రేమ నాలో పొంగేలా నన్ను అనుగ్రహించు. రాగద్వేష, అసూయలు నాలో పొడసూపనీయకు తండ్రీ...

అచ్యుతా!  దూషణ, భూషణ తిరస్కారాల వలన నా మనసు చలించకుండునట్లు నన్ను అనుగ్రహించు. భక్త బృందంతో ఎల్లకాలము కూడి యుండునట్లు చేయుము.

 భగవంతుని ఇష్ట దైవ రూపంలో గానీ, గురు రూపంలో గానీ ఆరాధించుచున్న నన్ను ఆయా రూపాలతోనే అనుగ్రహించు. అన్ని రూపాలు నీవే కనుక నాలో అభేద భావం కలుగజేయుము తండ్రీ!

పాహిమాం.... రక్షమాం..... పాహిమాం ప్రభో!

అమ్మ దయతో

చింతా రామకృష్ణారావు.

జైహింద్. 

No comments: