Friday, August 17, 2012

ఉపాధ్యాయులకుండవలసిన లక్షణాల విషయమై మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పక తెలియజేస్తారా?

జైశ్రీరామ్.
తమ శిష్యులని సచ్ఛీలవంతులుగను, అవధానులుగను తీర్చిదిద్ధిన 
అభినవ మల్లినాథ బిరుదాంకితులైన శ్రీ ధూళిపాళి మహాదేవమణి.
ప్రియమైన భారతీయ సోదరీ సోదరులారా! సహృదయులైన మీకు నా నమస్కృతులు.
సెప్టెంబర్ ఐదవ తేదీ డా. సర్వేపల్లి రాధా కృష్ణ గారి జన్మదినం సందర్భంగా యావత్ ఉపాధ్యాయ వర్గమే గౌరవింప బడుతుండడం అత్యంత ముదావహం.
ఉపాధ్యాయోత్తము లందరికీ నా కైమోడ్పులు.
ప్రియ మిత్రులారా! నాదో మనవి. దయ చేసి స్పందించి నా మనవినాలకించి నా కోరిక నెరవేర్చ గలరా? ఐతే వినండి.
అన్ని వృత్తుల లోను తల్లిదండ్రుల తరువాత గౌరవింపఁబడే ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని  "ఆచార్య దేవోభవ" అన్నవాక్యమే తెలియజేస్తోంది. అట్టి గౌరవప్రదమైన ఆచార్య వృత్తి జీవితంలో లభించడం పూర్వ జన్మ పుణ్య ఫలంగా చెప్పుకున్నా అతిశయోక్తి కానేరదు.
సమాజం ఇంతటి మహోన్నత స్థానం కల్పించిన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వారు ఏ మహనీయత కలిగి ఉండడం ద్వారా ఈ గౌరవానికి అర్హులౌతున్నారు?
SCHOOL అన్న పదం ఎంతో మహోన్నత ఆశయంతో నెలకొల్పఁబడినది.
S = సేక్రిఫైజేషన్ = త్యాగనిరతి.
C = కేరక్టర్ = సత్శీలత.
H = హానెష్టీ = హుందాతనము.
O = ఒబీడియన్సీ = అణకువ.
O = ఆర్గనైజేషన్ = కార్య నిర్వహణ సామర్ధ్యము.
L = లీడర్షిప్ = నాయకత్వ లక్షణములు.

ఈ విధమైనవి పాఠశాలలో చేరిన పిల్లలకు పాఠశాల చదువు పూర్తయేసరికి అలవడి ఉండాలి. అలా అలవడేలాగ ఆ SCHOOL లో విద్యను బోధించే ఉపాధ్యాయులు శిక్షణను ఇవ్వాలి.

ఇట్టి విధంగా శిక్షణను ఇవ్వడానికి  యదార్థమైన ఉపాధ్యాయుఁడు కలిగి యుండ వలసిన పరిపూర్ణమైన లక్షణాలు ఏమిటేమిటి?
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వ్యక్తి తన వృత్తికి పరి పూర్ణమైన న్యాయం చేకూర్చడానికి ఏమి చేయాలి?
ఒక ఉత్తమ ఉపాధ్యాయుని సత్ ప్రవృత్తి  విద్యార్థులపై ఎంతటి మహోన్నత ప్రభావం చూపుతుంది?

ఒకవేళ ఉపాధ్యాయుఁడే దుష్ప్రవృత్తి కలిగి ఉన్ననాడు సమాజం ఏదిశగా పయనిస్తుంది?
మీరు శ్రమగా భావించకపోతే కొంచెం ఓపికగా మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యాఖ్య ద్వారా తెలియజేసినట్లైతే భావితరాలకు మేల్తరమైన సూచన చేసినవారౌతారు.
మీరు తెలియఁ జేసిన మేలైన అభిప్రాయాలను ప్రభుత్వం గుర్తించ వచ్చును. వాటిని ఉపాధ్యాయలోకానికి అందజేయ వచ్చును.మహోన్నత భావి భారతావని నిర్మాణానికే మీ సూచనలు మార్గదర్శకం కావచ్చును.
మీ అభిప్రాయం మీ పేరుతో సహా పంపండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరుతో ప్రకటిస్తాను. కానినాడు మీ సూచన ననుసరిస్తాను. అత్యంత విలువైన భావిభారతపౌరులనిర్మాణాన్ని బాధ్యతగా స్వీకరించు ఉపాధ్యాయులకు మీ సూచనలు శిరోధార్యాలుగా నిలుస్తాయి.
దయచేసి తెలియ జేస్తారు కదూ?
నమస్తే.
జైహింద్. 

Tuesday, August 14, 2012

యావద్భారత జాతికీ 66 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
యావద్భారతీయ సోదరీ సోదరులారా! భారత దేశ 66 వ 
స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.
ఎందరో మహనీయుల మహనీయమైన ధన మాన ప్రాణ 
త్యాగ ఫలంగా  సంపాదించిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ 
ఉన్న మనం మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా 
మనసులో ఉంచుకొని సమాజంలో మెలగుదాం. తద్వారా 

ఏ ఒక్కరి స్వేచ్ఛకు మనం ఆటంకం కలిగించకుండా మెలకువతో ప్రవర్తిద్దాం. ఉత్తమ భారతీయులుగా జీవనం సాగిద్దాం.
జైహింద్.

Wednesday, August 1, 2012

యజ్ఞోపవీత ధారణ విధానము.

జై శ్రీరామ్.
యజ్ఞోపవీత ధారణ.
ప్రియ హైందవ సంప్రదాయానువర్తులారా! మీ అందరికీ జంధ్యాల పౌర్ణమి సందర్భంగా నా శుభాకాంక్షలు.
యజ్ఞోపవీత ధారణ క్రమము ఈ క్రింది చిత్రములలో గల విధానముననుసరించి గ్రహించ వచ్చును.
చూచారు కదండీ! వీటిలోని అక్షరాలు ఇంకా పెద్దవిగా కనిపించాలంటే ఆ చిత్తరువులమీద క్లిక్ చెయ్యండి.
శుభమస్తు.
జైహింద్.

రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.


జైశ్రీరామ్.
రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.
అకళంక సోదర సోదరీ భావనా సంభరిత హృదయారవిందులైన భారతీయుల ఈ సత్ సంప్రదాయము నిష్కళంకమై కల కాలమూ విరాజిల్లుతూ ఉండు గాక. సోదరీ సోదరులు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుతురు గాక.
జైహింద్. 

Sunday, July 22, 2012


శ్రీ ప్రణబ్ ముఖర్జీ.
భావి భారత ఆశా కిరణంగా భారత దేశ 25వ ప్రథమ పౌరునిగాఎన్నికయి,  అఖండవిజయం సాధించిన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
మన కన్న తల్లి భారతాంబ తన ముద్దు బిడ్డలను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. 
అదే సమయంలో తాను తన ముద్దు బిడ్డలు యావద్భారతావనినీ ఆశ్రయించి జీవిస్తున్న తోటి బిడ్డలను దృష్టియందుంచుకొని అందరికీ ఆనందం కలిగించే విధంగా ధర్మ యుతంగా మెలగాలని ఆకాంక్షిస్తోంది.
ఐతే నేడు అనంత దురంతాలతో ఒకరినొకరు మోసం చేసుకోవటమే కాక సహృదయులైనవారి కెందరికో బాధాకరంగా ప్రవర్తిస్తూ శిక్షలనుండి తప్పించుకొంటూ, ఒక వేళ శిక్షలు పడినా రాష్ట్రపతి నుండి క్షమాభిక్ష పొందుతూ నిర్లజ్జగా యధాపూర్వకంగా ప్రవర్తిస్తున్న దుష్ట సంతతిపట్ల కఠినాతికఠినంగా ప్రవర్తించే, న్యాయాన్ని నాలుగు పాదాలా నడప గలిగే బిడ్డలు తనకు ఉండాలని కోఱుకుంటోంది.
అన్ని విధాలా ఆదర్శవంతమైన సరళిని అనుసరిస్తూ, సామాజిక ఆర్థిక, వైయక్తిక  జీవన విధానంలో ఆదర్శవంతమైన ప్రథమ పౌరుఁడుగా మన ప్రణబ్ ముఖర్జీ యావద్భారతీయులకూ ఆదర్శమూర్తి కావాలనీ, యావద్భారతీయులూ, ఆదర్శ వంతులైనవారి ఆదర్శ జీవన మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆదర్శవంతమైన జీవితం గడుపుట ద్వారా మన భారతాంబ కలలు పండించాలని మనసారా కోరుకొంటూ 
మరొక్క పర్యాయం 
25వ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీని మనసారా అభినందిస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

Saturday, June 16, 2012

సర్వానుగ్రహ హనుమద్ధ్యానము.

జైశ్రీరామ్. 

ప్రియ భగవద్బంధువులారా! 
భగవద్భక్తులకు భగవంతుని సేవకంటే కూడా భగవద్భక్తుల సేవ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. రాముని సేవ కంటే కూడా రామ భక్తుఁడైన హనుమంతుని సేవ మంచి ఫలితాన్నిస్తుంది. ఆ హనుమంతుని తలచుకొనినంతనే మనకు ఎటువంటి సత్ ఫలితాలు కగుతాయో, ఆ పరమ రామ భక్తుని మనం ఏ విధంగా ప్రార్థించాలో  క్రింది శ్లోకాల ద్వారా తెలుస్తుంది.
శ్లో:-
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
ఆ.వె:-
బుద్ధి, బలము, కీర్తి, పూజ్యమౌ ధైర్యము,
నిర్భయత, యరోగ నిగ్రహములు,
కన యజాఢ్యతయును, కమనీయ వాగ్ధాటిఁ
గొలుపు హనుమ తలపు, గురు తరముగ.
భావము:- 
హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రోగ రాహిత్యమును, అజాఢ్యమును, మంచి వాగ్ధాటిని, సంప్రాప్తింప చేస్తుంది.
శ్లో:-
ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః శ్రద్ధాః పుత్రా సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ  కపి నాథ నమోస్తు తే.
తే.గీ:-
ఆయువును, ప్రజ్ఞ, కీర్తియు, నమర చేసి,
శ్రద్ధ, పుత్ర సుశీలత లొద్దిక నిడి,
సౌఖ్య మారోగ్యమమరంగ చక్కఁ గనుమ!
ప్రార్థనలుసేతు గనుమయ్య! భక్త హనుమ!
భావము:-
ఓ రామ భక్త హనుమా! నిన్ను ప్రార్థన సేతును. నాకు ఆయుర్దాయమును, మంచి ప్రజ్ఞను, సత్కీర్తిని, శ్రద్ధను, సత్పుత్రులను, సౌశీల్యాది సద్గుణములను, సౌఖ్యమును, ఆరోగ్యమును, అమరునట్లు కరుణతో చూడుము.

చూచారుకదండీ! మీరు ఆ హనుమద్వరసిద్ధులగుదురుగాక.
జైహింద్.

Friday, June 8, 2012

పాఠ్య పుస్తకాలలో వందేమాతరం గీతం భావి భారత పౌరుల్ని పాడు చేస్తుందా???


జైశ్రీరామ్. 
హరి సేవ బ్లాగులో 
ముందు వీళ్ళకు నేర్పాలి మనదైన చదువును. అనేశీర్షికతో
దుర్గేశ్వర రావు గారు వ్యక్తం చేసిన ఆవేదన చూడండి.
ఈరోజు రాజీవ్ విద్యామిషన్ తరపున  ఉపాధ్యాయులకిస్తున్న వృత్యంతరశిక్షణలో   నేను మాట్లాడవలసి వచ్చినది . మారిన    పాఠ్య పుస్తకాలలో  వందేమాతర గీతం   తొలగించినా  ఎవరికీ   చీమ కుట్టినట్లు లేదు . ఇక  అన్నం పెడుతున్న  ప్రభుత్వ పాఠశాలలను బ్రతింకించుకోవాలంటే  తెలుగు భాషను బ్రతికించుకోవాలనే విషయాన్ని గూర్చి గట్టిగా వాదనలు లేవు.
 ఇక మూడవతరగతి తెలుగువాచకంలో ఇతిహాసకథలలో భీముడు రాణివాసంలో పుట్టినట్లుగా పెరిగినట్లుగా వ్రాసారు.  కోట్లరూపాయలు వెచ్చిస్తున్న పాఠ్యపుస్తక నిర్మాణంలో ప్రమాణాలు ఎలా తగలబడుతున్నాయో ఇదొక ఉదాహరణ. కనీసం భారతంగూర్చి అవగాహన కూడా లేదా వీల్లకు అనే అనుమానం కలుగుతుంది .  మొదటి పాఠంలో ఉన్న పాటలో పదాలు ప్రాసకోసం కూర్చినట్లుందిగాని  ప్రామాణికంగా లేదు. సఎ మూడొతరగతికే కదా అనుకున్నా వ్రాసిన పంతులుగారికి భాషపై ఉన్న  అవగహన  ఇంతేనా అనిపిస్తుంది తెలిసినవారికి.
ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం ఎండకు మాడిపోతూ రావటం పోవటమే  పెద్ద శిక్ష[ణ]గాఉంది అని వాపోతున్న పంతుల్లశాతం ఎక్కువ. 
 ఇక కుర్రకారు పంతుళ్ళసంగతి  చెప్పనక్కరలేదు .మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల  సరైన అవగాహనా ,అభిమానం ఉన్నట్లనిపిమ్చటం లేదు .  వీళ్ళలో ఎక్కువమందికి  ఇంగ్లీషు చదువులు ,మార్కుల పరిక్షల విధానంలోనే చదువులు సాగాయనిపిస్తున్నది . 
ఇప్పుడే  ఓ ఆలోచనచేస్తున్నాను . మానవీయ విలువలు బోధించే భారతభాగవత రామాయణా దులను విరిచే వచనభాగంగానైనా చదివిమ్పచేయాలి . అందుకోసం ముందుగా వచన రామాయణాన్ని సాధ్యమైనంత మందికి అందించాలి . వీరిచే  చదివించాలి 
జైశ్రీరాం.
ఇది చదివి స్పందించని హిందువు ఉండడంటా అతి అతిశయోక్తి కానేరదు.
వందేమాతర గీతం   తొలగించిన అంశం చదివిన శ్రీ రాజ శేఖరుని విజయ శర్మ గారి స్పందన చూడండి.   
నిన్న దుర్గేశ్వర్ గారినుండి వచ్చిన మెయిల్ చదివాను. అందులో పాఠ్యపుస్తకాలనుండి " వందేమాతర గీతం" తొలగించారన్న విషయం చదివి చాలా బాధ కలిగింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏదైనా కార్యక్రమం వంటిది రూపొందిస్తే బాగుంటుంది. ఎన్ని జరుగుతున్నా చూస్తూ కూచుంటే త్వరలో మన దేశంలో రామా అనడం కూడా నేరమౌతుంది. ఏదో ఒక కదలిక రావాలి. ఏమిచేద్దామనేది సూచించండి. నేను సిద్ధం.    
భారతీయుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించి, ప్రజల గుండెల్లో అఖండ స్వేచ్ఛా జ్యోతిని వెలిగించిన గీతం వందేమాతరం. ఈ గీతం 7 నవంబర్ 2011 తో 134 ఏళ్లు పూర్తి చేసుకుంది. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1877 నవంబర్‌ ఏడో తేదీన బెంగాలీ నవల 'ఆనంద్‌ మఠ్‌'లో భాగంగా దేశాన్ని కీర్తిస్తూ రాసిన పధ్య ప్రబంధమే వందేమాతరం.
ఈ వందేమాతరం... సుమారు అర్థ శతాబ్దం పాటు దేశ స్వాతంత్రోద్యమ స్పూర్తి గీతమై, కోట్లాది మంది భారతీయుల హృదయాలు, రక్తంలో జీర్ణించుకుపోయింది. అలాగే.. అనంతర కాలంలోనే కాలంతో పాటు.. కుంచించుకుపోయింది. ఛటర్జీ రాసిన వందేమాతరం ఆరు చరణాలతో, అనంత రాగ ఐక్యతా సుగంధమై భాసిల్లిన ఈ గీతాన్ని 1896 కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. 1905 బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో ఈ గీతం ఊపందుకుంది.
భారత స్వాతంత్ర్య తారక మంత్రంగా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత వందేమాతరానికి ప్రధమ ప్రాధాన్యమివ్వాలని పెద్దలు ఆలోచించినా వందేమాతరం వివాదాల సుడిలో చిక్కుకోవడం ఇష్టం లేక ఆ ప్రయత్నాన్ని మన పాలకులు విమరించుకున్నారు. అయినా అడపాదడపా వందేమాతరంపై వివాదాలు మాత్రం ఇప్పటికీ చెలరేగుతూనే ఉన్నాయి.
గత 2006, ఆగస్టు 22న దేశంలోని ఉభయ సభలలో విస్తృత చర్చ జరిపి పాఠశాలలో వందేమాతరం తప్పనిసరి కాదని తేల్చాయి. అంతేకాకుండా.. భారత మాతను కీర్తిస్తూ సాగే ఈ గీతాన్ని ముస్లీంలు వ్యతిరేకించడంతో, 1935లో జరిగిన సమావేశంలో వందేమాతరాన్ని రెండు చరణాలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం మనం పాడుకుంటున్న వందేమాతర గీతం కుదించబడినది.
ప్రస్తుత వందేమాతర గీతం:-
వందేమాతరం! వందేమాతరం!
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం !
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ !
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం !
వందేమాతరం! వందేమాతరం!
పూర్తి వందేమాతర గీతం (సంస్కృతం):-
వందేమాతరం వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
షష్ఠీకోటి-కణ్ఠ-కల-కల-నినాద-కరాలే
ద్విషష్ఠికోటి-భుజై ధ్రుత-ఖరకరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల-ధరిణీం నమామి తారిణీం
రిపుదల-వారిణీం మాతరం ||
తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వాం హి ప్రాణాహ్ శరీరే ||
బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే ||
త్వాం హి దుర్గా దశప్రహరణ ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |
శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం భరణీం మాతరం ||
వందే మాతరమ్. వందే మాతరమ్||
చూచారు కదా! ఇటువంటి పునీత హృదయులకు అంద్సరూ అండ దండగా ఉండి న్యాయాన్ని, ధర్మాన్ని నిలపెట్ట వలసిన బాధ్యత ప్రతీ భారతీయుఁడు మీదా ఉంది. 
నమస్తే.
జైహింద్