జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
పితృదేవులు.
1. శా. శ్రీమన్మంగళసృష్టిలో జననియున్, చిన్మూర్తియౌ తండ్రియున్
క్షేమంబున్ గలిగించు దేవతలు, రాశీభూత ప్రేమాంశువుల్,
భూమిన్ సంతతి వృద్ధికై తపనతో పూజల్ ప్రపూజ్యాత్ములై
ప్రేమన్ జేయుచు దైవమున్ గొలుచు సద్విఖ్యాతులే యిద్దరున్.
2. ఉ. కండను కొండచేయఁగల గండర గండడు తండ్రి ధాత్రిపై
మెండగు ప్రేమతో నడుగు మేదినిపై పడనీక, గుఱ్ఱపుం
బండి యటంచు వీపుపయి పండగబెట్టి వహించి భారమున్,
గుండెకు హత్తుకొంచు కడు కూర్మిని చూపెడి తండ్రి దైవమే.
3.ఉ. తండ్రి యొకింత హెచ్చు, మన తల్లికి మించిన వారు తండ్రియే,
పుండ్రములున్న దైవమగు పూజ్యుఁడు వేంకట నాయకుండె నా
తండ్రిగ నే దలంచెదను, ధాత్రిని నా కొరకెంత యేని నా
తండ్రి యొనర్చి చూపిరి, గతంబును నేమరువంగ నెట్లగున్?
4.ఉ. తా తినకుండ పెట్టుటది తల్లికి తండ్రికి తప్ప నన్యు లే
రీతిగఁ జేయఁగల్గుదురు? ప్రీతికి రూపము తల్లిదండ్రులే,
ఖ్యాతిగ శిక్షణంబునిడు, కష్టమెవారికి కల్గుచుండినన్,
భాతిని వెల్గఁ జేయుటకు పాటుపడున్ జనకుండు నిత్యమున్
5ఉ. బాధ్యత నొప్పుతండ్రి భగవానుఁడు ధాత్రిని, బ్రహ్మ యాతఁడే,
విద్యలు నేర్పబూని తన విత్తమునంతయు ధారపోయు, స
ద్విద్య ను వృత్తినొంది, మన విత్తము తండ్రికొసంగి, ధాత్రిపై
సద్యశమున్ గడింప మనసా ముదమందును తండ్రి గొప్పగా.
జైహింద్.
No comments:
Post a Comment