జైశ్రీరామ్.
బొట్టు ఎందుకు పెట్టుకోవాలి.
హిందూ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మంలో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారముంది. ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. ఇది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది. బొట్టు లేదా తిలకం అనేది హిందూ ధర్మంలో ఒక సంప్రదాయ సంస్కృతిగా ఆచరిస్తూ వస్తున్నారు. ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది.
కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుం' అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో 'తిలకమ్' అని, తెలుగులో 'బొట్టు' అని అర్థం. మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరిస్తారు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టులేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.
పురాణాల్లో బొట్టు గురించి ఏముంది:
పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలో స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ ఊర్ధ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్థకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్' అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి. జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు.
క్షత్రియ వంశానికి చెందిన వారు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదటన ధరించే వారు. వర్తక వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు. శూదులు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు. విష్ణుఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ త్రిపునాన్ని, దేవి(అమ్మవారి) భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరిస్తారు.
పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలము అవుతాయి.
మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటకు బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం (బొట్టు) పెట్టుకుంటారు. బొట్టులేని ముఖము ముగ్గులేని ఇల్లు ఒక లాంటివే అంటారు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు ఈ రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.
బ్రహ్మదేవుడు నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యం కాదు. కాని ఎవ్వరు ముఖాన బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మ రాసిన రాతను చెరిపి మంచిరాత వ్రాసుకుంటారనే నమ్మకం కొంత మంది లో ఉంది. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది. నుదుటి యందు సూర్య కిరణాలు సోకరాదు, ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహ్యతచక్రంలో ఉంటాడు.
మానవ శరీరము మొత్తము ప్రత్యేకించి కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానమును విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపజేస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది. శరీరానికి చల్లదనానిచ్చి తేజస్సును పెంచుతుంది.
ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ ఎనర్జీ అంటారు అది మనపై పడుతుంది నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. కవి ఆరుద్ర నూరేళ్ళ పెట్టు నొసటి బొట్టు అది నోచే నోముల కలిమి పెట్టు" అన్నాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం అనవాయితీగా వస్తోంది.
ఏవేలు తో బొట్టు పెట్టుకోవాలి:
ఏవేలు తో బొట్టు పెట్టుకోవాలన్నప్పుడు ఒకొక్కరు ఒకోవిధంగా చెబుతారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది.
హిందువులు ఏదేశంలో ఉన్నను భరత సంస్కృతి అనేది శాస్త్రీయ పరంగా ఎంతగొప్పదోతెలుసుకుని, దానిని మరువకుండా ఉన్నప్పుడు ఆచార సాంప్రదాయలను ఆచరించినప్పుడు, మనదేశ హిందూ సంస్కృతిని గౌరవించినవారు అవుతారు మరియు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ బొట్టు (తిలకం) ధరించడం వలన మనిషి భక్తి, ముక్తి కలిగి నిజాయతీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు నుదుటి పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది, గౌరవాన్ని కూడా పొందుతారు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. మీ ఉన్నతిని కాపాడుకోండి.
జైహింద్.
No comments:
Post a Comment