Friday, June 20, 2025

ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత ..... శ్రీపద్మమహాపురాణంలో....

 ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత  శ్రీపద్మమహాపురాణంలో ఇలా వివరింౘబడింది.


# పూతాం పుణ్యతమాం స్వీయాం, భార్యాం త్యక్త్వా ప్రయాతి యః|

  తస్య పుణ్యఫలం సర్వం, వృధా భవతి నాన్యధా॥అ.59,శ్లో.8

# ధర్మాచారపరాం పుణ్యాం, సాధువ్రత పరాయణామ్|

  పతివ్రతరతాం భార్యాం, సుగుణాం పుణ్యవత్సలామ్॥అ.59,శ్లో.9

# తామే వాపి పరిత్యజ్య, ధర్మకార్యం ప్రయాతి యః|

  వృధా తస్య కృత స్సర్వో, ధర్మో భవతి నాన్యధా॥అ.59,శ్లో.10

# సర్వాచారపరా భవ్యా, ధర్మసాధనతత్పరా|

  పతివ్రతరతా నిత్యం, సర్వదా జ్ఞానవత్సలా॥అ.59,శ్లో.11

# ఏవం గుణా భవే ద్భార్యా, యస్య పుణ్యా మహాసతీ|

  తస్య గేహే సదా దేవా, స్తిష్ఠన్తి చ మహౌజసః॥అ.59,శ్లో.12

# పితరో గేహమధ్యస్థాః, శ్రేయో వాఞ్ఛన్తి తస్య చ|

  గంగాద్యాః పుణ్యనద్యా శ్చ, సాగరా స్తత్ర నాన్యధా॥అ.59,శ్లో.13

# పుణ్యా సతీ యస్య గేహే, వర్తతే సత్యతత్పరా|

  తత్ర యజ్ఞా శ్చ గావ శ్చ, ఋషయ స్తత్ర నాన్యధా॥అ.59,శ్లో.14

# తత్ర సర్వాణి తీర్థాని, పుణ్యాని వివిధాని చ|

  భార్యాయోగేన తిష్ఠన్తి, సర్వాణ్యేతాని నాన్యధా॥అ.59,శ్లో.15

# పుణ్యభార్యా ప్రయోగేన, గార్హస్థ్యం సంప్రజాయతే|

  గార్హస్థ్యా త్పరమో ధర్మో, ద్వితీయో నాస్తి భూతలే॥అ.59,శ్లో.16

# గృహస్థస్య గృహం పుణ్యం, సత్యపుణ్య సమన్వితమ్|

  సర్వతీర్థమయం వైశ్య, సర్వదేవ సమన్వితమ్॥అ.59,శ్లో.17

# గార్హస్థ్యం చ సమాశ్రిత్య, సర్వే జీవన్తి జన్తవః|

  తాదృశం నైవ పశ్యామి, అన్య మాశ్రమ ముత్తమమ్॥అ.59,శ్లో.18 

---పవిత్రురాలు, పుణ్యతమురాలు అయిన తన భార్యను విడిచి వెళ్ళినవాడు ఆచరించిన పుణ్యఫల మంతయూ వ్యర్థమగును. ధర్మాచారపరురాలు, పుణ్యురాలు, సాధువ్రతపరాయణురాలు, పాతివ్రత్యరతురాలు, సుగుణవతి, పుణ్యమునందు అనురక్తి గలది అయిన భార్యను విడిచి, ధర్మకార్యమును ఆచరించినౘో, అత డాచరించిన ధర్మమంతయూ వ్యర్థమగును. సర్వాచారపరాయణురాలు, శుభకరురాలు, ధర్మసాధకతత్పరురాలు, సదా పాతివ్రత్య రతురాలు, జ్ఞానవత్సలురాలు, పరమపుణ్యురాలు అయిన భార్యఎవరికి లభింౘునో అతని ఇంటిలో దేవతలు సర్వదా నివసింతురు. అతనింటి మధ్యలో పితృదేవతలుండి, అతని శ్రేయస్సును వాంఛించెదరు. గంగాది పుణ్యనదులు, సాగరములు కూడా అతనింటిలో వసింౘును. సత్యతత్పరురాలైన పుణ్యసతి ఉన్న ఇంటిలో యజ్ఞములు, గోవులు, ఋషులు అౘటనే యుందురు. అౘటనే అన్ని తీర్థములు, పలువిధములైన పుణ్యములు భార్యతోనే ఉండును. పవిత్రురాలైన భార్యాయోగముతో గృహస్థాశ్రమ మేర్పడును. గృహస్థాశ్రమమును మించిన ధర్మము ఈ భూమండలములో మరొకటి లేదు. సత్యపుణ్యములతో కూడియున్న గృహస్థుని ఇల్లు పావనమైనది. ఆ ఇల్లు సర్వతీర్థమయము, సర్వదేవమయము! గృహస్థాశ్రమము నాశ్రయించియే సకల ప్రాణులు జీవింౘుౘుండును. అటువంటి ఉత్తమాశ్రమము వేరొకటి లేదు.

# మంత్రాగ్నిహోత్రం దేవా శ్చ, సర్వేధర్మా స్సనాతనాః|

  దానాచారాః ప్రవర్తన్తే, యస్య పుంస శ్చ వై గృహే॥అ.59,శ్లో.19

# ఏవం యో భార్యయాహీన, తస్య గేహం వనాయతే|

  యజ్ఞా శ్చైవ నసిద్ధ్యన్తి, దానాని వివిధాని చ॥అ.59,శ్లో.20

# భార్యాహీనస్య పుంసోఽపి, నసిద్ధ్యతి మహావ్రతమ్|

  ధర్మకార్యాణి సర్వాణి, పుణ్యాని వివిధాని చ॥అ.59,శ్లో.21

# నాస్తి భార్యా సమం తీర్థం, ధర్మసాధనహేతవే|

  శృణుష్వ త్వం గృహస్థస్య, నాన్యో ధర్మో జగత్త్రయే॥అ.59,శ్లో.22

# యత్ర భార్యా గృహం తత్ర, పురుషస్యాపి నాన్యధా|

  గ్రామేవా ప్యధవారణ్యే, సర్వధర్మస్యసాధనమ్॥అ.59,శ్లో.23

# నాస్తి భార్యాసమం తీర్థం, నాస్తి భార్యాసమం సుఖమ్|

 నాస్తి భార్యాసమం పుణ్యం, తారణాయ హితాయ చ॥అ.59,శ్లో.24
# ధర్మయుక్తాం సతీం భార్యాం, త్యక్త్వాయాసి నరాధమ|
  గృహం ధర్మం పరిత్యజ్య, క్వా స్తే ధర్మస్య తే ఫలమ్॥అ.59,శ్లో.25
# తయా వినా యదా తీర్థే, శ్రాద్ధదానం కృతం త్వయా|
  తేన దోషేణ వై బద్ధాః, తవ పూర్వపితామహాః॥అ.59,శ్లో.26
# భవాం శ్చోరో హ్యమీ చోరా, యై స్తు భుక్తం సులోలుపైః|
  త్వయా దత్తస్య శ్రాద్ధస్య, అన్నమేవం తయా వినా॥అ.59,శ్లో.27
# సుతుత్త్ర శ్శ్రద్ధయా యుక్తః, శ్రాద్ధదానం దదాతి యః|
  భార్యా దత్తేన పిండేన, తస్య పుణ్యం వదా మ్యహమ్॥అ.59,శ్లో.28
---సతి(భార్య) ఉన్న ఇంటిలోనే మంత్రములు, అగ్నిహోత్రములు, దేవతలు, సనాతనమైన సర్వధర్మములు, దానములు, ఆచారములు-అన్నీ ప్రవర్తింౘును. భార్యలేని ఇల్లు అడవితో సమానము. యజ్ఞములు, వివిధదానములు సిద్ధింౘౙాలవు. భార్యలేని పురుషునికి మహావ్రతములు సిద్ధింౘౙాలవు. ధర్మకార్యములు, సర్వపుణ్యకార్యములు సిద్ధింౘౙాలవు. భార్యతో సమాన తీర్థము లేదు. ధర్మమును సాధింౘవలెనన్న భార్యయే ఉత్తమతీర్థము. గృహస్థునకు భార్యను మించిన మరొక ధర్మము లేదు. పురుషునికి భార్య ఉన్నౘోటే ఇల్లు. గ్రామమైనా, అరణ్యమైనా సర్వధర్మ సాధనము భార్యయే! భార్యతో సమానమైన తీర్థము లేదు. భార్యకు సాటిరాగల సుఖము లేదు. భార్యతో సమానమైన పుణ్యము లేదు. తరింపజేయు నదీ, హితమును కలిగింౘునదీ భార్యయే! నరాధమా! ధర్మయుక్తురాలైన భార్యను విడచి వెళ్ళుౘున్నావు. గృహమును, ధర్మమును విడచి వెళ్ళుౘున్నావు. ఇక నీకు ధర్మఫల మెక్కడున్నది? భార్య లేకుండగా తీర్థమున నీవు శ్రాద్ధము పెట్టినందున, ఆ దోషముతో నీ పూర్వపితామహులు బంధింౘబడిరి. శ్రాద్ధము పెట్టిన నీవు దొంగవు. శ్రాద్ధభోజనము చేసిన వీరు దొంగలు. నీవు చేసిన శ్రాద్ధమునకు భార్య లేనిదే అన్నము లభింౘదు. శ్రద్ధతో సుపుత్త్రుడు శ్రాద్ధము చేసినౘో, భార్య ఇచ్చు పిండముతో అతనికి కలుగు పుణ్యమున చెప్పుదును.
# యథామృతస్య పానేన, నృణాం తృప్తి ర్హి జాయతే|
  తథా పితౄణాం శ్రాద్ధేన, సత్యం సత్యం వదా మ్యహమ్॥అ.59,శ్లో.29
# గార్హస్థస్య చ ధర్మస్య, భార్యా భవతి స్వామినీ|
  త్వయైషా వంచితా మూఢః, చౌరకర్మకృతం వృధా॥అ.59,శ్లో.30
# అమీ పితా మహాచోరా, యైర్భుక్తం చ తయా వినా|
  భార్యా పచతి చేదన్నం, స్వహస్తే నామృతోపమమ్॥అ.59,శ్లో.31
# తదన్న మేవ భుంజన్తి, పితరో మృష్టమానసాః
  తేనైవ తృప్తి మాయాన్తి, సంతుష్టా శ్చ భవన్తి తే॥అ.59,శ్లో.32
# తస్మా ద్భార్యాం వినా ధర్మః, పురుషస్య న సిద్ధ్యతి|
  నాస్తి భార్యా సమం తీర్థం, పుంసాం సుగతిదాయకమ్॥అ.59,శ్లో.33
# భార్యాం వినా చ యో ధర్మః స ఏవ విఫలో భవేత్॥అ.59,శ్లో.34
---అమృతపానముతో నరులకు తృప్తి కలుగునట్లు, శ్రాద్ధముతో పితృదేవతలకు తృప్తి కలుగును. నేను ముమ్మాటికీ నిజమునే చెప్పుౘున్నాను. గృహస్థధర్మమునకు భార్యయే యజమానురాలు. మూఢా! నీవు నీ భార్యను మోసగించి, వ్యర్థముగా చోరకర్మను చేసితివి. ఈ పితరులు మహాచోరులు. భార్యలేకుండా తిన్నవారు కూడా చోరులే! భార్య తన చేతితో అమృతప్రాయముగా వండినదానినే పితృదేవతలు సంతోషము నిండిన మనస్సుతో భుజించెదరు. ఆ భోజనముతోనే తృప్తి పొందెదరు, సంతోషించెదరు. కావున పురుషునికి భార్య లేనిదే ధర్మమే లేదు, సిద్ధింౘదు. పురుషులకు సుగతిని ప్రసాదింౘు భార్యాసమతీర్థము మరొకటి లేదు. భార్య లేకుండగా ఆచరించిన ధర్మము వ్యర్థమైనది.

No comments: