Sunday, June 29, 2025
Saturday, June 28, 2025
ఆంధ్రామృతంలో నా రచనలు లేబిల్ తో ఉన్న గ్రంథములు.
రామ కృష్ణ నీతి శతకము.
శ్రీ అవధానశతపత్ర (ఏకప్రాస శతకము)
శ్రీమద్భగవద్గీత చింతా(తనా)మృతం.
శ్రీయాజ్ఞవల్క్య శతకము.
శ్రీరామాష్టోత్తరశత నామాంచిత అష్టోత్తరశతచ్ఛందశ్శ్రీ రాఘవ శతకము.
వృద్ధ బాల శిక్ష ( నీతి శతకము )
శ్రీ వేణు గోప (కంద గీత గర్భ చంపకోత్పల) శతకము.
చంపకభారతీశతకము.
శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.
శ్రీలలితా చంద్రమౌళీశ్వర శతకము.
శ్రీ శివాష్టోత్తరశత పంచచామరావళి. (శివ శతకము)
అష్టోత్తరశత సతీ అశ్వధాటి సతీ శతకము.
సువర్ణమాలాస్తుతి.
శాంభవీ శతకము మధ్యాక్కఱ గర్భ ఉత్పల- చంపకములు.
శ్రీరామ పట్టాభిషేకము.
చంపకభారతీశతకము.
పురుషసూక్తము ఆంధ్ర పద్యానువాదము.జనవరి 23, 2025
చంపకభారతీశతకము14, అక్టోబర్ 2024,
శ్రీ లలితా సహస్రనామాంచిత పద్యసహస్రదళపద్మార్చన.
శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.
అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము)22, జులై 2024,
శ్రీలలితా చంద్రమౌళీశ్వర శతకము.22, జులై 2024,
శ్రీ శివాష్టోత్తర శతనామ శివశతకము. 22, జులై 2024,
శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.22, జులై 2024,
శ్రీ వసంత తిలక సూర్య శతకము.
వృద్ధ బాల శిక్ష ( నీతి శతకము )19, జూన్ 2024,
సౌందర్యలహరి.. ఆంధ్రానువాదము.
అష్టోత్తరశత రాఘవ నామాంచితాష్టోత్తరశత ఛందముల రాఘవా శతకము3, మే 2024,
క్షీరాబ్దిపుత్రీ! రమా! శతకము.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము. 17, మార్చి 2019,
Thursday, June 26, 2025
భీమవరంలో సామాన్యజనానికి అసామాన్య బోధ గొలుపుచున్న అల్లూరి వంశస్థ బ్రహ్మమమ్మ.......నవరత్నమాలిక..... రచన... చింతా రామకృష్ణారావు.
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏻
నవరత్నమాలిక.
ఐం. క్లీం. సౌ. నుత బీజవర్ణ కలితాం ఐశ్వర్య సంధాయినీమ్,
ఐం. క్లీం. సౌ. జగదేక రక్షణచణాం ఆరోగ్య సంవర్ధినీమ్,
ఐం. క్లీం. సౌ. వరపాదపద్మయుగళాం ఆర్యాం మహాదేవతామ్,
ఐం. క్లీం. సౌ. నిజభక్త పాలనపరాం, ఆత్మస్థితాం భావయే. 1
అమ్మా! బ్రహ్మమమ్మా! మాయాతీత ప్రశాంత రూపమా!
అల్లూరి వంశ రత్నదీపమా! నమో నమః.
శా. శ్రీమన్మంగళ మానవుండుగ నిలన్ శ్రీకార రూపంబునన్
బ్రేమన్ దల్లి కనంగఁ బుట్టి, గతమే జిత్రంబుగా మాయచే
నేమాత్రంబును గుర్తు లేక, మదిలో నెన్నెన్నియో యోచనల్
భూమిన్ బుట్టిన హేతువున్ గనుటకై పుట్టున్, విచిత్రంబిదే. 2
భావము
ప్రాణి శుభప్రదమయిన మానవునిగా శ్రీకారరూపములో తల్లి ప్రేమతో ప్రసవించగా
పుట్టి, భూమిపై తనను క్రమ్ముకొనిన మాయ కారణముగా తన గతము ఏమాత్రము
గుర్తు లేక పోవుటచే, భూమిపై తన జన్మకు కారణము తెలుసుకొనుప్రయత్నములో
ఎన్నెన్నో ఆలోచనలుచేయును. ఇదే విచిత్రము.
ఉ. బంధు జనంబుతో పెరుగు బంధములన్ విడిపోవ నేరమిన్
సంధి వశంబునన్ మనసు సత్యము గానగలేక, మాయలో
బంధనమొంది, బంధములు వాయక హెచ్చగుచుండ, దుఃఖముల్
పొందుచు తల్లడిల్లి, గురు పూజ్యపదంబుల నెన్ని జేరునే. 3
భావము.
పుట్టుకతో సంభవించిన బంధువులతో పెరుగుచున్న బంధనములను వీడిపోవుట
తెలియఁజాలక, ఈ పూర్వాపరముల సంధి కారణముగా సత్యమును కనఁజాలక
మాయకారణముగా ఐహిక బంధమునమునకు లోనగుచు దుఃఖించుచు
పరిష్కారమునకై పూజ్యమయిన గురుపాదాశ్రయము పొంద యత్నించును.
ఉ. బ్రహ్మమె యమ్మ రూపమయి భక్తిగ వచ్చిన వారిఁ గాతువే,
బ్రహ్మవివేక సంపదను భక్తులకందఁగఁ జేయుచుందువే,
బ్రహ్మ నిజస్వరూపముగ భక్తులకున్ గనిపించు మాత వా
బ్రహ్మమె నీవు, భీమవర పట్టణమందలి కల్పవృక్షమా! 4
భావము.
భీమవర పట్టణములో వెలసిన ఓ కల్పవృక్షమా! బ్రహ్మం అమ్మా!. సాక్షాత్
బ్రహ్మమే అమ్మ స్వరూపమని భావించుచు భక్తితో నీ వద్దకు వచ్చు
భక్తులను కాపాడుదువుకదా తల్లీ! భహ్మజ్ఞానము అనెడి సంపదను భక్తులకు
అందించు దయామూర్తివి. అమ్మగా ఉండియున్న నీవు బ్రహ్మం గా
సాక్షాత్కరించు తల్లివైన నీవు బ్రహ్మకదా.
ఉ. బాధలఁబాపు బ్రహ్మవిల, వచ్చెడి పీడిత మానవాళికిన్
సాధన చేయు మార్గమును చక్కగ చెప్పెడి అల్లురి ప్రభా!
మోదముతోడ మాయతెర పూర్తగ వీడగఁ జేసి, శాంతితో
నీదుచు జీవితమ్ము నడిపించగ జేతువు నీదు వాక్కులన్. 5
భావము.
అల్లూరి వంశమునందలి తేజస్స్వరూపమా! ఐహికమైన ఈతిబాధలను పోఁగొట్టు
బ్రహ్మమే అని నిన్ను భావించుచు నీ దగ్గరకు వచ్చెడి మానవులకుచక్కని
కమ్మని మాటలతోనే మాయను వీడు సాధన మార్గమును చూపించుదువు.
మాయ అనెడి తెరను పూర్తిగా పోవునట్లుగా చేసి, జీవితమును శాంతముగా
సాగునట్లుగ చేయుదువు.
ఉ. నీటనె యుండు తామరకు నీర మొకింతయు నంటనట్లుగా
సాటియెలేని నీకిల నసత్యపు బంధములంటఁ బోవుగా,
చేటును గొల్పు బంధములు శీఘ్రమె పాయువిధంబు దెల్పుచున్
నోటను బల్కు మాటలనె నొవ్వును బాపుదు వమ్మ మాకిలన్. 6
భావము.
నీటిలో ఉండే తామరాకునకు నీరు అంటని విధముగా సాటిలేని అమ్మకు
అస్త్యమైన ఐహికబంధములేవియు అంటఁబోవు.ఈ తల్లి చెడునే కలిగించెడి
ఈ ఐహిక లంపటములను వెన్వెంటనే వీడఁ జేసుకొను పద్ధతిని కేవలము
మాటలతోనే తెలుపుచు, బాధితుల బాధలన్నిటిని భక్తులకు పోగొట్టు బ్రహ్మము.
ఉ. ఐహికమందె బ్రహ్మమును హాయిగ చేర్చెడి మార్గ మీవెయై,
మోహము పాపి భక్తులకు పూర్తిగ ముక్తికిని గొల్పు శక్తివై,
స్నేహముతోడ శాంతముగ నిత్యము గాచెడి బ్రహ్మమమ్మవై,
మోహవిదూరవైన గురుమూర్తి! స భక్తి నమస్కరించెదన్. 7
భావము.
ఈ శరీరముతో ఈలోకములో ఉండగనే బ్రహ్మస్వరూపమును చేర్చెడి
మార్గమే నీవయి, మోహమునకు దూరమగునట్లుగా ఆశ్రయించినవారిని చేసి,
ముక్తిని పూర్తిగా కలిగించు గొప్ప శక్తివి అయియుండి, భక్తులను నిత్యము
స్నేహభావముతో శాంతముతో చూచుచు కాపాడెడి, మోహమంటని ఓ
గురుమూర్తివయిన బ్రహ్మమమ్మా! నీకు భక్తితో నమస్కరించెదను
స్వీకరింపుము.
ఉ. మా గురుపూజ గైకొనుము, మాయని బ్రహ్మ నిజస్వరూపమా!
యోగమె మాకు నీదు పదయుగ్మము గొల్చుట ధాత్రి నిత్తరిన్,
రాగల ముక్తి చూపితివి, రమ్య మనోహర వాఙ్నిధానమా!
హే గురు రూపిణీ! జయమహీన శుభప్రద! బ్రహ్మమమ్మరో! 8
భావము.
రమ్యమయినట్టియు మనోహరమయినట్టియు వాక్కులకు నిధివయిన
ఓ బ్రహ్మమ్మా! మేము చేయుచున్న గురుపూజను స్వీకరింపుము. ఈ భూమిపై
ఇట్టి విధముగా నీ రెండు పాదములకు ఈ విధముగ సేవించుట అన్నది మాకు
లభించిన యోగమే సుమా. మేము పొందబోయే ముక్తినే మా కనులకు చూపించిన
తల్లివమ్మా నీవు. ఓ గురుస్వరూపిణీ! అంతులేని శుభములు కలిగించు తల్లీ!
నీకు జయమగుగాక.
ఉ. మంగళమమ్మ నీకు, జయమంగళ సద్వర బోధ గొల్పు నీ
మంగళ పాదపద్మ నిగమంబులకిద్ధర మంగళంబగున్,
మంగళమౌత నీ చరణ మార్గము పట్టిన భక్తపాళికిన్,
మంగళమమ్మ సర్వశుభమంగళ భారత దేశ మాతకున్. 9
భావము.
అమ్మా నీకు మంగళమగుగాక. జయప్రదమై మంగళమును కూర్చుమంచి
శ్రేష్టమైన జ్ఞానమును కలుగజేయు నీ పాదములనెడి వేదములకు ఈ భూమిపై
మంగళమగుగాక. నీ పాదములనాశ్రయించిన భక్తకోటికి మంగళమగుగాక.
సమస్త శుభమంగళ స్వరూపిణియైన భారతమాతకు మంగళమగుగాక.
జైహింద్.
Friday, June 20, 2025
ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత ..... శ్రీపద్మమహాపురాణంలో....
ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత శ్రీపద్మమహాపురాణంలో ఇలా వివరింౘబడింది.
# పూతాం పుణ్యతమాం స్వీయాం, భార్యాం త్యక్త్వా ప్రయాతి యః|
తస్య పుణ్యఫలం సర్వం, వృధా భవతి నాన్యధా॥అ.59,శ్లో.8
# ధర్మాచారపరాం పుణ్యాం, సాధువ్రత పరాయణామ్|
పతివ్రతరతాం భార్యాం, సుగుణాం పుణ్యవత్సలామ్॥అ.59,శ్లో.9
# తామే వాపి పరిత్యజ్య, ధర్మకార్యం ప్రయాతి యః|
వృధా తస్య కృత స్సర్వో, ధర్మో భవతి నాన్యధా॥అ.59,శ్లో.10
# సర్వాచారపరా భవ్యా, ధర్మసాధనతత్పరా|
పతివ్రతరతా నిత్యం, సర్వదా జ్ఞానవత్సలా॥అ.59,శ్లో.11
# ఏవం గుణా భవే ద్భార్యా, యస్య పుణ్యా మహాసతీ|
తస్య గేహే సదా దేవా, స్తిష్ఠన్తి చ మహౌజసః॥అ.59,శ్లో.12
# పితరో గేహమధ్యస్థాః, శ్రేయో వాఞ్ఛన్తి తస్య చ|
గంగాద్యాః పుణ్యనద్యా శ్చ, సాగరా స్తత్ర నాన్యధా॥అ.59,శ్లో.13
# పుణ్యా సతీ యస్య గేహే, వర్తతే సత్యతత్పరా|
తత్ర యజ్ఞా శ్చ గావ శ్చ, ఋషయ స్తత్ర నాన్యధా॥అ.59,శ్లో.14
# తత్ర సర్వాణి తీర్థాని, పుణ్యాని వివిధాని చ|
భార్యాయోగేన తిష్ఠన్తి, సర్వాణ్యేతాని నాన్యధా॥అ.59,శ్లో.15
# పుణ్యభార్యా ప్రయోగేన, గార్హస్థ్యం సంప్రజాయతే|
గార్హస్థ్యా త్పరమో ధర్మో, ద్వితీయో నాస్తి భూతలే॥అ.59,శ్లో.16
# గృహస్థస్య గృహం పుణ్యం, సత్యపుణ్య సమన్వితమ్|
సర్వతీర్థమయం వైశ్య, సర్వదేవ సమన్వితమ్॥అ.59,శ్లో.17
# గార్హస్థ్యం చ సమాశ్రిత్య, సర్వే జీవన్తి జన్తవః|
తాదృశం నైవ పశ్యామి, అన్య మాశ్రమ ముత్తమమ్॥అ.59,శ్లో.18
---పవిత్రురాలు, పుణ్యతమురాలు అయిన తన భార్యను విడిచి వెళ్ళినవాడు ఆచరించిన పుణ్యఫల మంతయూ వ్యర్థమగును. ధర్మాచారపరురాలు, పుణ్యురాలు, సాధువ్రతపరాయణురాలు, పాతివ్రత్యరతురాలు, సుగుణవతి, పుణ్యమునందు అనురక్తి గలది అయిన భార్యను విడిచి, ధర్మకార్యమును ఆచరించినౘో, అత డాచరించిన ధర్మమంతయూ వ్యర్థమగును. సర్వాచారపరాయణురాలు, శుభకరురాలు, ధర్మసాధకతత్పరురాలు, సదా పాతివ్రత్య రతురాలు, జ్ఞానవత్సలురాలు, పరమపుణ్యురాలు అయిన భార్యఎవరికి లభింౘునో అతని ఇంటిలో దేవతలు సర్వదా నివసింతురు. అతనింటి మధ్యలో పితృదేవతలుండి, అతని శ్రేయస్సును వాంఛించెదరు. గంగాది పుణ్యనదులు, సాగరములు కూడా అతనింటిలో వసింౘును. సత్యతత్పరురాలైన పుణ్యసతి ఉన్న ఇంటిలో యజ్ఞములు, గోవులు, ఋషులు అౘటనే యుందురు. అౘటనే అన్ని తీర్థములు, పలువిధములైన పుణ్యములు భార్యతోనే ఉండును. పవిత్రురాలైన భార్యాయోగముతో గృహస్థాశ్రమ మేర్పడును. గృహస్థాశ్రమమును మించిన ధర్మము ఈ భూమండలములో మరొకటి లేదు. సత్యపుణ్యములతో కూడియున్న గృహస్థుని ఇల్లు పావనమైనది. ఆ ఇల్లు సర్వతీర్థమయము, సర్వదేవమయము! గృహస్థాశ్రమము నాశ్రయించియే సకల ప్రాణులు జీవింౘుౘుండును. అటువంటి ఉత్తమాశ్రమము వేరొకటి లేదు.
# మంత్రాగ్నిహోత్రం దేవా శ్చ, సర్వేధర్మా స్సనాతనాః|
దానాచారాః ప్రవర్తన్తే, యస్య పుంస శ్చ వై గృహే॥అ.59,శ్లో.19
# ఏవం యో భార్యయాహీన, తస్య గేహం వనాయతే|
యజ్ఞా శ్చైవ నసిద్ధ్యన్తి, దానాని వివిధాని చ॥అ.59,శ్లో.20
# భార్యాహీనస్య పుంసోఽపి, నసిద్ధ్యతి మహావ్రతమ్|
ధర్మకార్యాణి సర్వాణి, పుణ్యాని వివిధాని చ॥అ.59,శ్లో.21
# నాస్తి భార్యా సమం తీర్థం, ధర్మసాధనహేతవే|
శృణుష్వ త్వం గృహస్థస్య, నాన్యో ధర్మో జగత్త్రయే॥అ.59,శ్లో.22
# యత్ర భార్యా గృహం తత్ర, పురుషస్యాపి నాన్యధా|
గ్రామేవా ప్యధవారణ్యే, సర్వధర్మస్యసాధనమ్॥అ.59,శ్లో.23
# నాస్తి భార్యాసమం తీర్థం, నాస్తి భార్యాసమం సుఖమ్|
ఆపస్థంబుడు” అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)
”ఆపస్థంబుడు” అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)
యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడువంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాం:~
ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలాసేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు.
కర్త, భోక్తగారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతా సాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు.
బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు.
కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్కచెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.
అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా "ఇంకా పెట్టు ఇంకా పెట్టు" అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయినా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.*
దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసాడు. "ఇంక తృప్తి అయిందా?" అని అన్నాడు. ( భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సంప్రదాయం కదా) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు
~కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది.
'ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు' అని కోపం తెచ్చుకున్నాడు.
కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్తగా వచ్చిన బ్రాహ్మణుడిని శపించడానికి చేతిలో జలం తీసుకొని అభిమంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.
అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ‘ఆగు’ అని ఆపేసాడు.
*
కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "*నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణులమీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో" అన్నారు.
దానికి కర్త 'స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు.
దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత ‘పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది’ అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.
జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది
ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు