జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు. భండాసురుడు ఏ విధంగా జన్మించాడు? లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది? ఆమె భండాసురుని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెల్పవలసింది." అని అగస్త్య మహర్షి హయగ్రీవుని ప్రశ్నిస్తాడు.
హయగ్రీవుడు లలితాదేవి ఆవిర్భావం వివరిస్తాడు.
దక్షుని కూతురైన సతీదేవికి శివుడితో వివాహం అవుతుంది. కాని క్రమేపి శివుని పట్ల విముఖత పెంచుకున్నదక్షుడు శివుని ప్రమేయం లేకుండా యాగం చేయటానికి సంకల్పిస్తాడు. కూతురైన సతీదేవిని కూడా ఆహ్వానించడు. తండ్రి అంతరంగం తెలియని సతీదేవి ఆయన తలపెట్టిన యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగి పోతూ, భర్త వెళ్ళొద్దని వారిస్తున్నా లెక్కచేయక యాగానికి వెళ్ళుతుంది.
కూతురి మమకారం పట్టించుకోని దక్షుడు ఏర్పరుచుకున్న ద్వేషభావంతో పదేపదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానాలని తట్టుకోలేని సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆవహించి ప్రాణత్యాగం చేస్తుంది. జరిగిన ఘోర సంఘటన గురించి విన్న పరమశివుడు మహెూగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకను పీకి అందునుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుని మీదకు పంపిస్తాడు. వీరభద్రుడు దక్షుని యాగస్థలిని సర్వనాశనం చేసి, విష్ణుచక్రాన్ని కూడా మింగేసి, దక్షుని తల తెగనరుకుతాడు. అది చూసిన దక్షుని పత్నులు వీరభద్రుడి కాళ్ళ మీద పడి శరణు వేడుకోగా ఒక మేక తలను తెచ్చి దక్షుని మొండానికి అతికించి అతనిని పునరుజ్జీవుని చేస్తాడు. అట్లా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు.
ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన సతీదేవి, పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది. పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. హిమవంతుడు.
********************************
నారదుడు హిమవంతుడి వద్దకు వస్తాడు. "హిమవంతా, సాక్షాత్ ఆదిపరాశక్తిని సంతానంగా పొందిన నువ్వు నిజంగా ధన్యుడవి. సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తరువాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి స్థాను ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించావంటే నీకు శ్రేయస్కరం." అన్న నారదుని మాటలకు హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. శివుడు తన కుమార్తెను వెంటబెట్టుకొని తపస్సు చేసుకుంటున్న స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకొని శివుని వద్దకు వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వియోగించటానికి అనుమతి వేడుకుంటాడు. తన సమ్మతి తెలిపిన శివునికి ఆ నాటి నుండి సేవలు చేయసాగింది పార్వతి. పరమేశ్వరుడు నిరంతరం యోగదీక్షలో ఉంటాడు.
ఆ విధంగా సమయం గడుస్తూండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేతలను బాధించటం మొదలెడతాడు. అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా, ఆయన, "శివునికి పార్వతికి కలిగే పుత్రుడే ఆ అసురుడిని చంపగలుగుతాడు. కాబట్టి మీరంతా కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి." అంటాడు.
బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి చెందక పోవటంతో శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమైన లక్ష్మీ నారాయణులు బ్రహ్మ మనస్సులోని కోరిక తెలుసుకుంటారు. లక్ష్మీ శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జనిస్తాడు. అతనికి పుష్పబాణాలు, చెరుకు విల్లు ఆయుధాఅలగా ప్రసాదిస్తారు. ఇంద్రుడు మన్మధుడిని పిలిపిస్తాడు. మాటలతో మన్మధుడి గొప్పదనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి,
"మన్మధా! శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు. మేమందరమూ తారకుని వలన ఎన్నో బాధలు పడుతున్నాము. అతనికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు. తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడిని పార్వతి సేవించుకుంటున్నది. నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహానికి దారి తీసేలాగా చూడ శక్తి కలవాడివి." అని మన్మధుని ప్రేరేపిస్తారు. శివునిలోని వైరాగ్యం అంతరించి, వివాహానికి సన్నద్ధుడిని చేయమని ఆదేశిస్తాడు.
*******************************************
ఇంద్రుడి పొగడ్తలతో ఉబ్బితబ్బిబైన మన్మధుడు, భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న స్థాను ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైన వసంతఋతువు వంటి వాతావరణం సృష్టిస్తాడు. అందమైన ఆవతావరణం చూసిన శివుని ప్రమధగణాల మనసు చెదిరిపోతుంది. అది చూసిన నంది ప్రమధగణాలని మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపిస్తాడు. ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్న శివుడి ముందరికి వస్తాడు. అదే సమయానికి పార్వతి శివుడికి సేవలందించటానికి అక్కడకు వస్తుంది. శివునికి నమస్కారం చేసి లేవబోతున్న పార్వతి వస్త్రం కొద్దిగా పక్కకు తొలుగుతుంది. అదే సమయంలో మన్మధుడు శివుని మీదకు బాణం సంధిస్తాడు. దానితో శివుని మనస్సు చెదురుతుంది కాని వెంటనే ఆ మార్పుకు కారణమేమిటని చుట్టూ పరికించి చూస్తాడు. పొదల మాటున దాగి ఉన్న మన్మధుడు కనిపించగానే శివుడు మూడవ కన్ను తెరుచుకొని ఆ అగ్నిజ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు. అది చూసిన పార్వతి భయంతో కళ్ళు మూసుకొని కొద్ది సేపటి తరువాత తెరిచి చూసేటప్పటికి శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. హిమవంతుడు వచ్చి కూతురిని ఓదార్చి తనతో తీసుకొని వెళ్ళుతాడు. శివుడి ఆగ్రహానికి గురై బూడిదగా మారిన భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరైపోతుంది. వసంతఋతువుకు అధిపతైన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు.
***********************************
సుందోపసుందులను అంతం చేయటానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు. కాని మన్మధుడు చిలిపిగా తన బాణం బ్రహ్మ వైపు సంధించేటప్పటికి ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయం విస్మరించి వ్యామోహంతో ఆమె వెంటపడతాడు. అది చూసిన తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది. బ్రహ్మ కూడా మగలేడిగా మారి ఆమె వెనక పోతాడు. ఆ దృశ్యం చూసిన దేవతలు భయభ్రాంతులౌతారు. రాబోతున్న ప్రమాదం పసిగట్టిన శివుడు ఒక వేటగాడిగా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. శివుని భయంకర రూపం చూసిన బ్రహ్మ వాస్తవానికి వచ్చి తను చేయబోయిన ఘోరం తెలుసుకుంటాడు.
ఈ సంఘటన తరువాత మన్మధుడు చేసిన చిలిపితనం తెలుసుకున్న బ్రహ్మ అతనిని పిలిపించి, "నీకు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేసిన అనర్థం శివుడి రాకతో నివారింపబడ్డది. ఏదో ఒకనాడు నువ్వు శివుడి ఆగ్రహజ్వాలలకు భస్మమౌతావు." అని శపిస్తాడు. శాపం విన్న రతీమన్మధులు భయంతో శాపవిమోచన కోసం బ్రహ్మను ప్రార్ధిస్తారు.
"ఆదిపరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడిని వివాహమాడుతుంది. ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపం పొందగలుగుతాడు." అని శాప విమోచనం తెలుపుతాడు.
ఆ వృత్తాంతం వినిపించిన వసంతుడు, "అమ్మా! ఎంతటివారైనా శాపఫలితం అనుభవించక తప్పదు. ఏది ఏమైనా బ్రహ్మ చెప్పినట్టు నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడుతాడు. అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు." అని ధైర్య వచనాలు పలుకుతాడు.
********************************
రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు. అట్లా తయారు చేసిన బొమ్మను శివుడి వద్దకు తీసుకెళ్ళి చూపిస్తాడు. శివలీలలు అనిర్వచనీయం కదా! శివుడి వద్దకు వెళ్ళుతూండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గెంతుతో శివుడికి, చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు. చిత్రకర్మ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. ఆ బాలుడు అదే విధంగా మంత్ర పఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలెడతాడు. తపస్సు చివరిదశకు చేరుతూండగా శివుడు ప్రత్యక్షమౌతాడు. బాలుడు ఆనందంతో "నాతో యుద్ధం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి. ఆ శక్తి నా శక్తిలో చేరాలి. నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధమూ నన్ను బంధించకూడదు." అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు. శివుడు వెంటనే వరాలు ప్రసాదించటమే కాక, అరవై సంవత్సరాలు రాజ్యం ఏలేటట్టు మరో వరం కూడా ఇస్తాడు.
ఇదంతా గమనించిన బ్రహ్మ విసుర్గా "సిగ్గు, సిగ్గు" అని అర్థం వచ్చేలాగా "భండ భండ" అంటాడు. రాక్షస ప్రవృత్తి వున్నవాడవటం చేత భండాసురుడు అన్న పేరు వస్తుంది.
మహేశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టటం వలన భండుడు మహా బలవంతుడు అయ్యాడు.
ఈ లోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విశుక్ర, విషంగ అన్న ఇద్దరు రాక్షసులు పుడ్తారు. వారిద్దరూ భండాసురుడి ముఖ్య అనుచరులౌతారు. వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు. వారంతా కలిసి భండాసురుని 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడుతారు.
అట్లా అన్ని వేలమంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్న అసుర గురువు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకొని నిత్య అనుష్టానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు. దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము (శూన్యక పట్టణం) అనే నగరాన్ని నిర్మింపచేస్తాడు.
మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువ అందంగా తీర్చి దిద్దుతాడు మయుడు. బ్రహ్మ చేత హిరణ్యకశిపుడికి ఇవ్వబడిన కిరీటము, చామరాలు, గొడుగు, విజయము అనే ధనువు, సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడైతాడు.
రాక్షసులను ఆ నగరానికి రప్పించి భండాసురుడిని రాజుగానూ, విశుక్రుని, విషంగుడిని యువరాజులుగా నియమిస్తాడు.
భండాసురుడికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అన్న నలుగురు భార్యలు వుంటారు.
శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హెూమాలు వేదపఠనం తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి.
అతను ధర్మపరుడై శివారాధన తత్పరుడై యఙ్ఞయాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతని బలం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం తరిగి పోతూ ఉంది.
అది గ్రహించిన నారాయణుడు మాయను సృష్టించి, "నీవు భండాసురుని వద్దకు వెళ్ళి అతన్ని మోహించి, విషయ సుఖాలలో ఉండేట్లు చూడవలసింది" అని ఆజ్ఞాపిస్తాడు.
విష్ణువు ఆనతి మీద మాయ భండాసురుని మోహంలో ముంచెత్తి, విషయ సుఖాల్లో పడేసి, యజ్ఞాలు శివారాధన మరిచి పోయేలాగా చేస్తుంది.
అదును చూసుకొని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి, "ఇంద్రా! భండాసురుడు మాయామోహితుడై ఉన్నాడు. దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది" అని చెప్తాడు.
నారదుని సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తి పూజిస్తాడు.
**********************************************
శుక్రుడు భండాసురుని కలుసుకొని, "రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులను చేయటానికి మాయామోహితుడిని చేసాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమయింది. ఇంద్రుడు మిమ్మల్ని జయించటానికి తపస్సు మొదలు పెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకు దండెత్తవలసింది." అంటాడు. శుక్రుడి ఆజ్ఞ ననుసరించి భడాసురుడూ ఇంద్రుని పైకి యుద్ధానికి వెళ్తాడు. కాని వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది.
భండాసురుడు పగల కొట్టిన కోటగోడ తిరిగి రావటంతో భండాసురుడు విచారంతో నగరం వైపు మరలి పోతాడు.
భండాసురుడు తమ్ముళ్ళతో, మంత్రులతో సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్పుతాడు.
"దేవతలు మనకు శత్రువులు. మన్మధుడు బ్రతికి ఉన్నంత వరకు ఏ సమస్యా లేకుండా అన్ని సుఖసౌఖ్యాలు అనుభవించారు."
"అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుడి బూడిదలో నుండి జన్మించాము. ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు మనము అడ్డుకోవాలి."
"మనం ఈ రూపాలలో వెళ్ళితే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వారి శరీరాలలో ప్రవేశించాలి. అట్లా వారి శరీరాలను మన ఆధీనం లోకి తెచ్చుకొని కృశింపచేస్తే వారిని అంతం చేయటం అంత కష్టం కాదు. కనుక ముల్లోకాలలోని జీవుల శరీరాల లోకి మనం వాయు రూపంలో చేరుదాము."
భండాసురుని మాటలు విన్న అసుర సైన్యం ఆనందంతో చిందులు తొక్కుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడా భండాసురుడు వాయురూపంలోకి మారి దేవలోకపు దేవతల మనసుల్లో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి, మొహాలను వికారంగా చేస్తాడు. వికృతాకారాలలో ఉన్న దేవీదేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించి పోతుంది. వారందరూ నిర్వీర్యులగా అయిపోతారు. ఏ పనీ చేయటానికి అశక్తులైపోతారు. చివరలు వృక్షాలు జంతువులకు కూడా అదే గతి పడుతుంది.
అనుచరులతో కూడి విశుక్రుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు. మనుష్యులు చిరునవ్వు కూడా మరిచిపోతారు. సంతోషాలన్ని హరించుకు పోయి ఒకరి మీద ఒకరు గౌరవం కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలన్న భావన కోల్పోతారు. నిత్య కార్యాలలో ఆసక్తి నశించి నిర్వికారులై శిలల లాగా ప్రవర్తించటం మొదలెడతారు.
రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు. నాగలోకంలో ఏ కారణమూ లేకుండా విచారంలో మునిగి ఒకరినొకరు ద్వేషంచు కుంటూ రసహీనులై పోతారు. అట్లా ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి.
స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరు దేవతలు జరుగుతున్న పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు. శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని సుషుప్తావస్థలో ఉన్నట్టు కనిపిస్తాడు. దేవతలందరు స్తోత్రపాఠాలు చేసిన కొంత తడవుకు ఆయన కళ్ళు తెరుస్తాడు.
"ఏమిటిది? మీరందరూ శక్తులు నశించినట్టు ఎండి పోయి కనిపిస్తున్నారు?" అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు. "మీరందరు కూడా ఆ భండాసురిని మాయకు బలైపోయారా? నాకు కూడా లక్ష్మిదేవి మీద ఆసక్తి తగ్గుతున్నది. నేను బ్రహ్మ రుద్రులు కారణపురుషులము. మేము కూడా భండాసురిని దుష్కృత్యాల నుండి తప్పించుకోలేక పోతున్నాము. మనల్నందరిని కాపాడ గలిగిన శక్తి కలవారు ఒక్కరే. ఆయన మహాశంభు. పరాశక్తి ఆయనని వెన్నంటే ఉంటుంది. ఆయనకు రూపం లేదు. దేని మీద ఆధార పడడు. అన్నిటికీ అతీతుడు. కనుక ఆయనను ఈ భండాసురుని మాయ ఏమీ చేయలేదు. అందరమూ కలిసి ఆయనను శరణు వేడుదాము." అని శ్రీహరి దేవతలను వెంటబెట్టుకొని బయలుదేరుతాడు.
*********************************
వారంతా కలిసి బ్రహ్మాండం అవతలి అంచుకు చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. దేవతలు దేవలోకం లో ఉన్న ఏనుగులన్నిటిని రప్పించి గోడ బద్దలు కొట్టటానికి ప్రయత్నం చేస్తారు. గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది. అందులో నుండి లోపలికి వెళ్ళీన వారికి నిరాలంబం, నిరఙ్ఞానం, పంచభూత రహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది. ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ చిదాకాస రూపంలో ఉన్న మహాశంభుని స్తోత్రం చేస్తారు. మబ్బువంటి నల్లని రూపంతో, ఒకచేతిలో శూలం, ఒక చేతిలో కపాలం, త్రినేత్రుడు అయిన మహాశంభు దర్శనమిస్తాడు. చేతులలో అక్షమాల పుస్తకంతో చంద్రుని వలె వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది.
"మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఒడ్డెంకించటం నా బాధ్యత. సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు. కాని ఇప్పుడు వచ్చింది భండాసురుని వలన సంభవించిన కామ ప్రళయం. అందు నుండి కాపాడగలిగింది లలితా పరమేశ్వరి మాత్రమే. లలితా పరమేశ్వరిని కేవలం పరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి." అంటాడు మహాశంభు.
ఆ మాటలు విన్న దేవతలకు ఏమి చేయాలో అర్ధం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాలిని చేసుకోవాలో తెలుపమని మహాశంభును వేడుకుంటారు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాలిని చేసుకొనే యజ్ఞ యాగాదుల విధివిధానము, ఆ తరువాత జరుగబోయే పరిణామాలు వివరించి, దేవతలు చేయబోయే యాగానికి హెూతగా ఉండటానికి అంగీకరిస్తాడు.
మహాశంభునాధుడు వాయురూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. క్రియాశక్తిగా మారిన పరాశక్తి సహాయంతో వాయు శక్తినంతటిని ఉపయోగించి జలసముద్రం పూర్తిగా ఎండిపోయేలాగా ఊదుతాడు. నిర్జలమైన సముద్రంలో ఏర్పడ్డ గుంటలో తన మూడవ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింప చేస్తాడు. అట్లా వెలుగుతున్న అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది. హెూమకుండం నక్షత్రాలతో అలంకరిస్తాడు. ఆ తరువాత వేదాలలో చెప్పబడినట్టు యాగం మొదలెడుతాడు. పుష్కల ఆవర్తక అన్న ప్రళయ మేఘాలను హెూమంలో నేయి వేసే గరిటలగా ఉపయోగిస్తాడు. హెూమకుండంలో ఆరు సముద్రాలను సమర్పిస్తాడు. యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్నదేవతలు ఆ గరిటలలో కూర్చొని తమను తాము హెూమాగ్నికి సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది. తాను వచ్చిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంభునాథుడు వాయు రూపం వదిలేసి స్వరూపంలోకి మారిపోతాడు.
ఆ విధంగా పూర్తి అయిన చిదగ్ని హెూమకుండం నుండి వివిధ ఆయుధాలతో తొమ్మిది అంతస్తులతో ఉన్న శ్రీచక్రరాజ రథం అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది.
ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుడిని సృష్టిస్తుంది. ఇక్షుధనుస్సు, పంచబాణాలు, పాశం, అంకుశం అన్న నాలుగు ఆయుధాలను చేతులలో ధరించి "చతుర్బాహు సమన్విత" అవుతుంది. ఉదయిస్తున్న సూర్యుడి లాగా ఎర్రని కాంతితో, "నిత్యాషోడశికారూపా", నిరంతరం పదహారేళ్ళ వయస్సులో ఉన్న అందం రూపలావణ్యంతో ఉంటుంది. ఆమె శరీరంలోని అంగాంగాల నుండి వివిధ దేవతా మూర్తులు ఉద్భవిస్తారు.
************************************
అపురూప దృశ్యం కనులారా చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలమరల తల్లికి నమస్కారం చేస్తారు.
ఆ అదే సహస్రనామ పారాయణలో చెప్పిన "చిదగ్నికుండసంభూత", "చక్రరాజరథారూఢ". దేవకార్య సముద్యతా" అన్న పదాలకు వివరణ.
శ్రీచక్రరాజరథం 4 యోజనాలు (ఒక యోజనం 9 మైళ్ళు) వెడల్పు, 10 యోజనాల ఎత్తు, 9 పర్వాలు, నాలుగు చక్రాలగా నాలుగు వేదాలు, చతుర్విధ పురుషార్థాలు నాలుగు అశ్వాలగా, బ్రహ్మానందభరితమైన పతాకం, అన్నిటికన్నా ఉచ్చ స్థానంలో బిందు పీఠం, మేరుప్రస్తార రూపం కలిగి తేజస్సు అనే పదార్థంతో నిర్మించబడి ఉంటుంది.
త్రివిధములైన సృష్టి, స్థితి లయలైన "దేవకార్యం" అంటే దేవతల శక్తులకు మించిన భండాసుర వధ ద్వారా ముల్లోకాలను కాపాడటం.
ఇక్కడ నుండి లలితా సహస్రనామాలలో అమ్మ వర్ణన ఉంటుంది. ఉదయిస్తున్న వేయి కిరణములు కల సూర్యుడి కాంతితో, నాలుగు చేతులతో, ఆ చేతులలో ధరించిన ఆయుధాలు ఆమె అందం ఒక్కొక్క నామంలో వివరించబడి ఉంటుంది.
*********************************
"సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవితా" లలితాదేవి చేతిలో ఉన్న అంకుశము అన్న అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది. ఆమె రణకోలాహలమనే మత్త గజము నధిరోహించి ఉంటుంది.
"అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా." పాశము నుండి అశ్వారూఢ అనే దేవత ఉద్భవిస్తుంది. ఆమె అపరాజిత అన్న అశ్వం అధిరోహించి ఉంటుంది.
"చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృత" తల్లి తాను స్వయంగా అన్ని ఆయుధలతో నిండి ఉన్న చక్రరాజమనే రధం ఎక్కి ఉంటుంది.
"గేయచక్ర రధారూఢ మంత్రిణీ పరిసేవితా" మంత్రిణీ దేవి గేయచక్రమన్న రథం ఎక్కి ఉంటుంది. శ్రీ చక్రము చుట్టూ ఉన్న త్రికోణమే గేయచక్రము.
"కిరిచక్ర రధారూఢ దండనాథా పురస్కృతా" వరాహములచే లాగబడుతున్న రధము మీద చేతిలో దండము దాల్చి దండనాథ దేవి ఉంటుంది.
ఆ తరువాత లలితాదేవి కోపంతో చేసిన హూంకారం నుండి ఆరు కోట్ల మంది యోగినులు, మరో ఆరుకోట్ల మంది బైరవులు పుట్టుకొస్తారు. అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది.
**********************
అవివాహితులు ఈ సింహాసనం పై ఆసీనులు కావటానికి అనర్హులు. మహాపురుష లక్షణాలు కలవారినే కూర్చుండబెట్టాలి. ఈమె ఉత్తమ స్త్రీ. శృంగార దేవతలాగా ప్రకాశిస్తున్నది. ఈమెను వివాహమాడటానికి పరమేశ్వరుడు తప్ప మరొకరు అర్హులు కారు అని బ్రహ్మ ఆలోచిస్తున్న సమయంలో పరమేశ్వరుడు తన రూపం మార్చి జగన్మోహనాకారంలో బ్రహ్మ ఎదుట నిలబడతాడు. బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అని పేరు పెడ్తాడు.
పరాశక్తికి తగిన వరుడు కామేశ్వరుడే అని తలచిన దేవతలు దేవి వద్దకు వెళ్ళి స్తుతిస్తారు.
కామేశ్వరుడు దేవి పరస్పర ఆకర్షితులౌతారు.
పరమేశ్వరి తన చేతిలో ఉన్న హారం ఆకాశంలోకి విసిరేస్తుంది. ఆ హారం కామేశ్వరుని కంఠంలో పడుతుంది. దేవతల ప్రార్ధనను మన్నించిన శ్రీహరి లలితాకామేశ్వరుల వివాహం చేస్తాడు.
(కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కందరా)
దేవతలు చెరుకు విల్లును. శ్రీహరి పుష్పాయుధాన్ని, వరుణుడు నాగపాశాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని అగ్నిదేవుడు కిరీటాన్ని సూర్యచంద్రులు కర్ణాభరణాలను, మధురపాత్రను, కుబేరుడు చింతామణిని లక్ష్మీదేవి ఛత్రాన్ని చంద్రుడు వింజామరలను లలితాకామేశ్వరులకు బహుకరిస్తారు. బ్రహ్మ కుసుమాకరం అనే విమానాన్ని ఇస్తాడు.
దేవతలందరూ పరాశక్తిని పలువిధాలగా కీర్తిస్తారు. నారదుడు నమస్కరించి, "తల్లీ, నీవు పరబ్రహ్మవు. సాధుజన రక్షనకే ఆవిర్భవించావు. భండాసురుడు ముల్లోకాలను హింసకు గురి చేస్తున్నాడు. దేవతలంతా భయభ్రాంతులై ఇక్కడే నివాసాలు ఏర్పరుచుకున్నారు. నీవు అభయమిస్తే వారు తమతమ గృహాలకు తిరిగి పోతారు." అని విన్న వించుకుంటాడు. పరాశక్తిఅభయముతో సంతుష్టులైన వారు తిరిగి గృహాలకు మరలి పోతారు.
*****************************************************
మహాశంభుడి ప్రశంసలతో లలితాదేవి సృష్టి కార్యక్రమం కొనసాగిస్తుంది.
1. ఎడమ నేత్రము నుండి చంద్ర తత్వంతో బ్రహ్మాండ లక్ష్మి,
2. కుడినేత్రము నుండి సూర్య తత్వంతో విష్ణు పార్వతి
3. మూడవనే త్రము నుండి అగ్ని తత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మి విష్ణులు, మరియు శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు దంపతులౌతారు. వారివారి సృష్టి కార్యం కొనసాగించమని ఆదేశిస్తుంది.
పొడవైన కేశాల నుండి అంధకారం, కనులలోనుండి సూర్యచంద్ర అగ్నులు, నుదుటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిటి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమల నుండి, న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్య నాటకాలు, చిబుకము నుండి వేదాంగాలు, కంఠం మీదనున్న మూడు మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది.
వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందము, హస్తనఖముల నుండి విష్ణు దశావతారములు. అరచేతుల నుండి ఉభయసంధ్యలు అద్భవిస్తాయి.
హృదయం బాలాదేవి, ఙ్ఞానం శ్యామలాదేవి, అహంకారం వారాహిదేవి. చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపు దిద్దుకుంటాయి.
అంకుశం నుండి సంపత్కరీదేవిని, పాశం నుండి అశ్వారూఢదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది.
చక్రరాజ రధానికి ఉన్న ఎనిమిది చక్రాల నుండి ఎనిమిది మంది దేవతలు పుడుతారు.
తొమ్మిదవ ప్రాకారం, బిందు పీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది.
చివరకు చక్రరాజ రథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది.
లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి శివకామసుందరుని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది.
ఆయన చేసిన హూంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు.
ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి, పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు. చక్రరాజ రథం నుండి సృష్టింపబడ్డ రథాలలో ఒకటైన ఏడుపర్వాలు కలిగిన గేయచక్రరథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కనఉంటుంది. (గేయచక్ర రధారూఢ మంత్రిణీ పరి సేవితా)
అదే విధంగా వరాహములచేత లాగబడుతున్న కిరిచక్రరథం మీద అధిరోహించిన వార్తాళీ దేవిని పన్నెండుమంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహి దేవి, దండనాథదేవి అని కూడా అన్నారు. లలితాదేవి తన కనుబొమల నుండి గద సృష్టించి దండనాథ దేవికి ఇస్తుంది. (కిరి చక్ర రధారూఢ దండనాథా పురస్కృతా).
శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి భండాసురుని మీద యుద్ధానికి బయల్దేరుతుంది. ఆమె అంకుశం నుండి సంపత్కరీ దేవి తనతో పాటు పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో లలితాదేవి వెనకనే ఉంటుంది. అమ్మ తన గజయూధమునకు సంపత్కరీదేవిని అధికారిణిగా నియమించింది. పాశం నుండి వచ్చిన అశ్వారూఢాదేవి అపరాజిత అశ్వం ఎక్కి గుర్రాల సమూహముతో కూడి, లలితాదేవి ముందర ఉంటుంది. యుద్ధభేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతున్నది. దండనాథదేవి తన రథం మీద నుండి దిగి వజ్రఘోషం అన్న సింహం మీద కూర్చుంటుంది.
సైన్యం లలితాదేవి ద్వాదశనామ స్తోత్రం చేస్తూ సాగుతుంది. గేయచక్రరథం మీద ఉన్న మంత్రిణీదేవిని ఆమె అనుచరులు షోడశనామకీర్తన చేస్తూ సాగుతారు.
మంత్రిణీదేవి హస్తం మీద ఉన్న పక్షి నుండి చేతిలో ధనుస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. "మాతా! ఇది చిత్రజీవం అనే ధనుస్సు. ఇది అక్షయతూణీరం. అసుర సంహారానికి వీటిని ఉపయోగించు." అని ఆమెకు అందచేస్తాడు.
******************************
లలితాదేవి వార్తాళీదేవి, శ్యామలాదేవిని సేనానాయకులగా నియమించిన తరువాత చేసిన హూంకారం లోనుండి 64000000 మంది యోగినులు, అంత మందే బైరవులు, లెక్కలేనంత శక్తిసేన పుట్టుకొస్తారు.
ఆమె నుండి ఉత్పన్నమైన నాలుగు సముద్రాల ఘోష రణభేరిగా, మరిన్ని వాద్యవిశేషాలు వెన్నంటగా భండాసుర వధకు రణరంగానికి బయలు వెడలింది.
కిరిచక్ర రథం నుండి దిగి వజ్రఘోషం అన్న సింహాన్ని అధిరోహించిన దండనాథ దేవిని సేన ద్వాదశనామాలతో స్తోత్రపాఠం చేస్తుంది.
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ
తథా సమయాసంకేతా వారాహీ పోత్రిణీ తథా
వార్తాళిచ మహాసేన ప్యాఙ్ఞా చక్రేశ్వరీ తథా
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం యూనే అన్న స్తోత్ర గానం చేస్తూ బయలుదేరుతారు.
గేయచక్రరథంలో బయలు దేరిన మంత్రిణీ దేవి యుద్ధకవాతు వాయిద్యాలు మోగిస్తుంది. ఆమె సేన చక్కగా అలంకృతులై వీణ మొదలైన వాయిద్యాలతో గానం చేస్తూ కొనసాగుతారు.
మంత్రిణీ దేవిని, సంగీతయోగినీ, శ్యామా, శ్యామలా, మంత్రనాయికా, మంత్రిణీ, సచివేశానీ, ప్రధానేశీ, కుశప్రియా, వీణావతీ, వైణికీ, ముద్రిణీ, ప్రియకప్రియా, నీపప్రియా, కదంబవేశ్యా, కదంబవనవాసినీ, సదామలా అనే పదహారు నామాలతో ఆమెననుసరిస్తున్న సేన షోడశనామ స్తోత్రపాఠం చేస్తుంది. ( ఈ స్తోత్రము పఠించిన వారు ముల్లోకాలు జయించ గలరు.). ఆమె చేతిలో ఉన్న చిలుక పిల్ల నుండి ధనుర్వేదం ఆవిష్కరింపబడింది.
నాలుగు చేతులు, మూడు తలలు, మూడు కన్నులు కల వీరుడు ఆమెకు నమస్కరించి, "తల్లీ, భండాసురునితో యుద్ధానికి బయల్దేరుతున్నావు. చిత్రజీవమనే ఈ ధనస్సు స్వీకరించు. అక్షయ బాణంలా ప్రకాశిస్తుంది." అని చెప్పి దనుస్సును. రెండు అమ్ములపొదులను శ్యామలాదేవికి ఇస్తాడు. ఆమెకు యంత్రిణి, తంత్రిణి అనేవారు చెలికత్తెలగా ఉంటారు. వారు చిలుకను, వీణను ధరించి ఆమె వెంట బయల్దేరుతారు.
స్తోత్రపాఠాలు గానాలతో సైన్యం అనుసరిస్తూండగా నాలుగు చేతులలో చెరుకుగడ, బాణాలు, శూలము, అంకుశము ధరించిన లలితాదేవి కదన రంగంలోకి బయలు దేరుతుంది. రథము మీద తెల్లటి గొడుగులతో, విజయ మొదలైన పరిచారికలు చామరాలు వీస్తుండగా దేవతా స్త్రీల సంగీత వాయిద్యాలతో, బ్రహ్మాది దేవతల స్తోత్రాలతో, కామేశ్వరీ మొదలైన శక్తులు పాదాలు సేవిస్తూ కదిలి వస్తారు.
ఇక్కడ తల్లిని పంచవింశతి (ఇరవైఐదు) నామాలతో కీర్తిస్తారు.
సింహాసనేశి లలితా మహారాఖీ వరాంకుశా
చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరి మహాదేవీ కామేశీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటిగా చక్రవర్తినీ మహావిద్యా శివానంగా వల్లభా సర్వపాటలా
కులనాథామ్నాయనాథా సర్వామ్నాయనివాసినీ
శృంగారనాయికా చేతి పంచ వింశతి నామభిః (ఈ నామాలు పఠించిన వారికి అప్లైశ్వర్యాలు కలుగుతాయని హయగ్రీవుడు చెప్తాడు)
ఈ విధంగా లలితాదేవి శక్తిసేనతో భండాసురుని వధించాలన్న ఉత్సాహంతో బయలు దేరుతుంది.
(భండసూర వధోద్యుక్తా శక్తిసేనా సమన్వితా)
చక్రరాజ రధేంద్రి అయిన లలితాదేవి కదన రంగానికి బయలు దేరింది.
********************************
ఆ రథము తొమ్మిది అంతస్థులు కలిగి ఉంటుంది.
అది తొమ్మిది అంతస్థులు రథము. వాటినే నవావరణాలు అంటారు. వాటిలో నాలుగు శివ ఆవరణాలు, ఐదు శక్తి ఆవరణాలు ఉంటాయి. వాటిని చక్రాలు అని కూడా అంటారు.
బిందు...... సర్వానందమయ చక్రం
త్రికోణ.....సర్వసిద్ధి ప్రద
అష్ట కోణ.....సర్వ రోగ హర
అంతర్దశార.....సర్వ రక్షక
బహిర్దశర ...... సర్వార్ధ సాధక
చతుర్దశార..... సర్వసౌభాగ్యదాయక
అష్టదళ......... సర్వ సంక్షోభన
షోడశ దళ...... సర్వాశాపరిపూరక
భూపుర త్రయం......త్రిలోక మోహన
శ్రీ చక్ర ప్రధమ ఆవరణ అయిన భూపుర త్రయ త్రిలోక మోహన చక్రంలో
అధి దేవతగా త్రిపురాదేవి, యోగినీదేవతగా ప్రకట యోగినితో సహా అణిమాది సిద్దులు, బ్రాహ్మీ మొదలుకొని అష్టమాతృకలు, సర్వసంక్షోభిని మొదలైన దశముద్రా శక్తులు ఉంటాయి.
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్చాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరీ. సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ
రెండవదైన షోడశ దళ సర్వాశాపరిపూరక చక్రంలో
త్రిపురేశీ అధిదేవతగా గుప్తయోగిని యోగినీదేవతగా కామాకర్షిణీ మొదలగు షోడశ ఆకర్షణా దేవతలు ఉంటారు.
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ.సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ, మూడవదైన అష్టదళ సర్వసంక్షోభణ చక్రం అధి దేవత త్రిపురసుందరి, యోగినీ దేవత గుప్తతరయోగిని తో కూడి అనంగ కుసుమా మొదలుకొని అష్ట దేవతలు ఉంటారు.
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,
సర్వసౌభాగ్యదాయక చక్రం చతుర్థ ఆవరణం ఇందులో త్రిపురవాసిని అధి దేవత సంప్రదాయయోగిని యోగినీ దేవతగా సర్వసంక్షోభిణి మొదలుగా పదునాలుగు మంది దేవతలు ఉంటారు.
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వసమ్పత్తిపూరిణీ, సర్వమంత్రమయీ,సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సమ్రృదాయయోగినీ,
దశకోణముల బహిర్థశారమైన సర్వార్థక్సాధక చక్రంలో త్రిపురాశ్రీ అధిదేవతగా, కులోతీర్ణ యోగిని యోగినీదేవతగా, సర్వసిద్ధిప్రదాదేవి మొదలుగా పది మంది దేవతలు ఉంటారు.
సర్వసిద్ధిప్రదే, సర్వసమ్పత్ప్రదే. సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ,కులోత్తీర్ణయోగినీ, దశకోణముల అంతర్దశారమైన సర్వరక్షాకర చక్రమైన ఆవరణలో త్రిపురమాలిని అధిదేవత, నిగర్భయోగిని యోగినీ దేవతగా సర్వఙ్ఞా దేవి మొదలగు దశ దేవతలు ఉంటారు.
సర్వజ్ఞే, సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,
అష్టకోణ సప్తావరణం సర్వరోగహర చక్రం. అధిదేవత త్రిపురాసిద్ధాంబ, రహస్యయోగిని తో కూడి వశిని మొదలుగా ఎనిమిది మంది వాగ్దేవతలు ఉంటారు.
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే. జయినీ, సర్వేశ్వరీ, కౌలిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
శ్రీచక్ర అష్టమావరణ దేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ,
అతిరహస్యయోగినీ,
నవమావరణము సర్వానందమయి చక్రము బిందువు.
అధిదేవత మహాత్రిపుర సుందరి. యోగినీదేవత పరాపర రహస్యయోగిని.
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,
**********************
లలితాదేవి వెనక ఏడు అంతస్థుల గేయచక్రరథం, ఐదు అంతస్థుల కిరిచక్ర రథం బయలు దేరుతాయి.
లలితాదేవి దండయాత్రకు బయల్దేరిందన్న వార్త విన్న భండాసురుని శూన్యక నగరవాసులు భయభ్రాంతులౌతారు. భవనాలు అకారణంగా బీటలు వారుతుంటాయి.
లలితాదేవి దండయాత్రకు బయలు దేరిందన్న వార్త విన్న శూన్యక పట్టణవాసులు భయభ్రాంతులౌతారు. అకారణంగా భవనాలు బీటలు బారుతాయి.ఉల్కలు పడటం ప్రారంభమవుతుంది. భూకంపం, భూమి మండిపడటంతో ప్రజలంతా వణికి పోసాగారు.
చారుల ద్వారా ఈ సమాచారము విన్న భండాసురుడు భయపడక తమ్ములు విశుక్రుడు విషంగుడిని పిలిపిస్తాడు. సామంత రాజులంతా సభాస్థలికి చేరుకుంటారు.
లలితాదేవి యుద్ధసంరంభంలో ఉన్న సమయంలో భండాసురుడి నగరమైన శూన్యకపట్టణంలో అనేక అపశకునాలు గోచరిస్తాయి. వెంటనే అతను విశుక్ర విషంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. విశుక్రుడు పరిస్థితి విశ్లేషిస్తూ,
"దేవతలు అందరూ అగ్నికుండంలో పడి మరణించారు. ఆ అగ్ని కుండం నుండి మాత ఉద్భవించి అందరిని పునరుజ్జీవులను కావించింది. మహిళాసేనతో మనమీదకు యుద్ధానికి బయల్దేరింది. వారంతా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్ళను పగులకొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పట్టికి మనము అప్రమత్తులయి మన సైన్యాన్ని వారిని ఎదురుకోవటానికి పంపించాలి." అంటాడు.
ఆ మాటలు విన్న విషంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు.
1."ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి.
2. ముందుగా మన గూఢచారులను పంపించి వారి సైన్యం యొక్క బలం అంచనా వేయాలి.
3. ఏ పరిస్థితిలోనూ వారిని తక్కువ అంచనా వేయకూడదు.
4. గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు.
5. శంబనిశంబులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు.
6. కాబట్టి వారి గురించి మరింత సమాచారం సంపాదించాలి.
7. అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నవారెవరు? ఆమెకు కావలసినది ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలి." అని వివరంగా చెప్తాడు.
అంతా విన్న భండాసురుడు ఆ మాటలను కొట్టి పారేస్తూ, "దేవుళ్ళు అందరూ ఆమె వెనక ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. మన సైన్యంలో ఉన్న సేనాధిపతులు స్వర్గాన్నైనా కాల్చి వేయగలరు. వారందరూ హిరణ్యకశిపుడితో సమానమైన వారు. అటువంటిది ఒక అబలను జయించటం ఎంత సేపు? పనికిమాలిన ఆలోచనలతో బుర్రలు పాడుచేసుకోవద్దు." అంటూ విషంగుడిని మందలించి,
సింహాసనం నుండి లేచి, "కుటిలాక్షా సైన్యాన్ని సిద్ధం చేయి శూన్యక పట్టణానికి రక్షణగా ఉండు. ఆమెను జుట్టు పట్టుకొని తీసుకు రావాలి." అని సేనాధిపతి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తాడు.
మంత్రులను పురోహితులను పిలిపించి అభిచారహెూమం అనే క్షుద్రపూజ నిర్వహించమని ఆజ్ఞాపిస్తాడు.
**********************
భండాసురుడి చేత లలితాదేవి కేశాలు పట్టుకొని లాక్కు రమ్మని ఆదేశించబడ్డ కుటిలాక్షుడు దుర్మదుడనే రాక్షసుడిని నాయకుడిగా నియమించి మొదటి సేనను యద్ధరంగానికి పంపిస్తాడు. శూన్యకపట్టణ రక్షణ కోసం నాలుగు దిక్కులలో నలుగురిని పదిపది అక్షౌహిణుల సైన్యంతో నియమిస్తాడు. తూర్పుకోటను తాళజంఘుడు, దక్షిణకోటను తాళభుజుడు, ఉత్తరకోటను తాళకేతు పడమటికోటను తాళగ్రీవుడు తమతమ సైన్యాలతో రక్షణగా ఉంటారు.
శక్తిసేనను ఎదుర్కోవటానికి వచ్చిన దుర్మదుడి సైన్యాన్ని, లలితాదేవి శూలం నుండి ఆవిర్భవించిన సంపత్కరీదేవి తన ఏనుగుల సమూహంతో ఎదిరిస్తుంది. తను పంపించిన సైన్యం పరారవటం చూసిన దుర్మదుడు స్వయంగా ఉష్ట్ర (ఒంటె) వాహనుడై యుద్ధరంగ ప్రవేశం చేస్తాడు. రణకోలాహలం అన్న ఏనుగును అధిరోహించిన సంపత్కరీ దేవి అతనిని ఎదుర్కుంటుంది. అప్పుడు జరిగిన భీకర పోరాటంలో సంపత్కరీ దేవి కిరీటంలోని ఒక వజ్రపురాయిని దుర్మదుడు పడగొట్టగలుగుతాడు. దాంతో ఇంకా ఆగ్రహించిన దేవి దుర్మదుడిని గుండెలో బాణాలు నాటి చంపుతుంది. దుర్మదుడి మరణంతో భయపడ్డ అతని సైన్యం వెనుతిరిగి పారిపోతుంది.
ఈ విషయం తెలుసుకున్న భండాసురుడు కోపోద్రిక్తుడైస్వయంగా ఖడ్గం తీసుకొని రణరంగానికి బయల్దేరుతాడు. అది చూసిన అతని వద్దకు వచ్చిన కుటిలాక్షుడితో, "దేవతలు కాని, యక్షులు కాని దుర్మదుణ్ణి జయించలేక పోయారు. అటువంటి వీరుడు ఒక అబల చేతిలో మరణించాడు. ఆమెను వధించటానికి కురండకుని వెంటనే పంపించ వలసింది." అని ఆజ్ఞాపిస్తాడు.
కురండుకుని పిలిపించిన కుటిలాక్షుడు, "నీవు మాయా యుద్ధంలో ఆరితేరిన వాడవు. వెంటనే సైన్యం తీసుకొని వెళ్ళి శత్రువును వధించి రా." అని ఆజ్ఞాపించగానే, కురండకుడు ఇరవై అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగానికి బయలుదేరుతాడు.
సంపత్కరీదేవి సైన్యం లోని చండి, "చెలీ యితనితో నేను యుద్ధం చేస్తాను. నీవు చంపలేవని కాదు. కాని ఈ దుష్టుడు నా చేతుల్లో మరణించాలి" అని వేడుకొనటంతో, సంపత్కరీ దేవి తన సైన్యాన్ని పక్కకు తప్పిస్తుంది.
చండి కురండుకుని పై బాణాల జడివాన కురిపిస్తుంది. ఆమె గుర్రపు సకిలింపుకు కురండుని సైన్యం మూర్చ పోతుంది. చండి చేతిలోని పాశాయుధం నుండి కోట్లాది సర్పాలు వెలువడి సైన్యాన్ని బంధించి వేస్తాయి. కురండకుడి బాన ప్రయోగంతో చండి యొక్క వింటి నారి తెగిపోవటంతో ఆమె కోపంతో అంకుశాన్ని విసిరి వేస్తుంది. ఆ దెబ్బకు కురండుడు మరణిస్తాడు. అంకుశం తరువాత రాక్షస సైన్యాన్ని కూడా సంహరిస్తుంది.
ఈ విషయం విన్న భండాసురుడు ఉగ్రుడై 100 అక్షౌహిణుల సైన్యాన్ని అయిదుగురు సేనాధిపతులతో పంపిస్తాడు.
కరంకుడు పరివారంతో యుద్ధభూమిలోకి ప్రవేశించగానే సర్పిణీ అనే మాయను ప్రయోగిస్తాడు. ఆ మాయ నుండి రణశంభరి అన్న సర్ప సైన్యాన్ని సృష్టించి శక్తిసేన మీదకు పంపుతారు. దానవులు ఇంతకు ముందు కూడా ఇటువంటి మాయాయుద్ధంతో ఎందరో దేవతలను హతమార్చారు. కోటానుకోట్ల సర్పాలు శక్తిసేనను హింసించటం మొదలెడుతాయి. ఆ సర్పాలు మరణించి కూడా మళ్ళీమళ్ళీ పుడుతూ ఉంటాయి.
కరేంద్రి నూరు గాడిదలను పూన్చిన రథం మీద చక్రంతో, వజ్రదంతుడు ఒంటెనెక్కి బల్లెంతో, అదే పేరుకుల మరొక సేనాధిపతి రెండు గద్దల రథం ఎక్కి బాణాలతో శక్తి సైన్యాన్ని సంహరించటం మొదలెడతారు. నకులీదేవి గరుడవాహనారూఢురాలై రణరంగంలోకి ప్రవేశిస్తుంది. ఆవిడ నోటి నుండి 32 కోట్ల ముంగిసలు ఉద్భవించి పుట్టిన పాములను పుట్టినట్టే మింగేయటం మొదలెడుతాయి. నాగదేవత రణశంభరిని నకులి దేవి గరుడాస్త్రం ప్రయోగించి చంపేస్తుంది.
అది చూసిన మిగిలిన అయిదుగురు సేనాధిపతులు ఒక్కసారిగా నకులీదేవి మీదకు విరుచుకు పడతారు. వెనక నుండి నకులీదేవి ముంగిస సైన్యం వారి మీదకు దాడి చేస్తుంది. గగన మార్గం నుండి నకులీదేవి గరుడారూఢురాలై చేసిన యుద్ధంలో అయిదుగురు సేనాధిపతుల తలలు నరికి హతమారుస్తుంది.
సేనాధిపతుల మరణానంతరం ఇద్దరు సోదరులను చర్చలకు పిలిపించిన భండాసురుడు, "నా సేన పేరు చెప్పగానే పారిపోయే దేవతలలో ఇంతటి తెగింపు వచ్చింది అంటే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు మనం మూలాల్ని చేధించాలి. గుర్రాలు ఏనుగులు ముందు నడుస్తుండగా ఆమె సైన్యాని కంతటికి వెనకగా ఉన్నదని చారుల ద్వారా తెలుస్తున్నది. అందుచేత ఆమె మీదకు వెనక నుండి విషంగుడు దాడి చేయవలసి ఉంటుంది" అని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
లలితాదేవి వద్ద సైన్యం తక్కువగా వుండటం వల్ల వెనక భాగం వద్ద రక్షణ లేకపోవటం వల్ల ఆ విధంగా దాడి చేయటం లాభదాయకంగా వుంటుందన్న నమ్మకంతో విషంగుడు పదిహేను అక్షౌహిణుల సైన్యంతో శక్తిసేన మీద దాడికి ఉపక్రమిస్తాడు.
మొదటిరోజు యుద్ధానంతరం సాయం సమయంలో విషంగుడు కొద్దిపాటి సైన్యంతో నిశ్శబ్దంగా శక్తిసేన వెనుక భాగానికి చేరుకుంటాడు. ఆ పాటికి శక్తిసేన పడమటి దిక్కు వైపు సాగిపోతున్నది. విషంగసేన ఉత్తర దిక్కుగా కదిలి తూర్పువైపు తిరిగారు. దగ్గరలోనే శ్రీచక్రరాజ రధం కనిపిస్తున్నది. లలితాదేవి చుట్టుపక్కల చాలా తక్కువ సైన్యం ఉన్నట్టు తెలుస్తున్నది.
లలితాదేవి తన పరిసరాలలో ఉన్న సైన్యాన్ని గమనిస్తూ ఉన్న అవకాశం చూసుకొని విషంగుడు హఠాత్తుగా రధం వెనక వైపు నుండి విపాటవం అన్న ఆయుధంతో దాడి చేస్తాడు. అక్కడే ఉన్న అణిమాదేవితో సహా ఇతర దేవతలు ఒక్క క్షణం అవాక్కయి మరుక్షణమే తేరుకొని తిరుగుదాడికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కుటిలాక్షుడు 10 అక్షౌహిణుల సైన్యంతో ముందు నుండి దాడి చేయ ఉపక్రమిస్తాడు.
రెండు పక్కల నుండి జరుగుతున్న దాడిని చూసిన లలితాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈ లోగా విషంగుడు సంధించిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది.
అది చూసిన కామేశ్వరి మొదలైన దేవతలు కోపించిన వారై మాతను సమీపించి, వహ్నివాసిని జ్వాలామాలిని అన్న నిత్యదేవతలకు స్వయం ప్రాకాశన శక్తి కలదని, వారే కనుక తమ ప్రకాశం ప్రదర్శిస్తే అంధకారంలో ఉన్న రాక్షసులు వెలుగులోకి వస్తారని విన్నవించుకుంటారు. లలితాదేవి అనుమతితో వహ్నివాసిని జ్వాలామాలిని అగ్ని గుండాల వలె ప్రకాశించ సాగారు. చీకటి మాటున దాక్కొని యుద్ధం చేస్తున్న రాక్షసులందరు ఆ ప్రకాశం ఫలితంగా వెలుగులోకి వస్తారు. లలితాదేవి యొక్క షోడశ నిత్యాదేవతలు వారిని హతమార్చి వేస్తారు. మిగిలిన సేనాధిపతులందరు మరణించటంతో విషంగుడు శరీరమంతా గాయాలతో నిర్లజ్జగా రణరంగం నుండి పారిపోతాడు.
************************
విషంగుడు రణరంగం నుండి వెనుతిరగటం చూసిన కుటిలాక్షుడు కూడా పారిపోతాడు. నిత్యాదేవతల పరాక్రమం చూసిన లలితాదేవి ఆనందం పొందుతుంది. (నిత్యాపరాక్రమతోప నిరీక్షణ సమత్సుక)
అనుకోకుండా రాత్రి సమయంలో జరిగిన దాడి చూసిన మంత్రిణీ దేవి, దండనాథ దేవి దుఃఖితులౌతారు. అంత పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసినా అసురుల దాడి నుండి తట్టుకోలేక విఫలమయిపోయిందని బాధ పడతారు.
(అగ్ని ప్రాకారము)
ఇరువురు కలిసి లలితాదేవి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనకు తమ బాధ వ్యక్తపరిచి, కోట రక్షణకై మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారు.
లలితాదేవి, జ్వాలామాలిని దేవిని,"ఓ వత్సా. నీవు అగ్నిస్వరూపవు. జ్వాలామాలలే నీ ఆకారము. కనుక సైన్యం చుట్టూతా 100 యోజనాల వెడల్పు, 30 యోజనాల పొడవు ఉన్న ఒక అగ్ని ప్రాకారం నిర్మాణము చేయి." అన్న ఆజ్ఞతో జ్వాలామాలిని అగ్ని ప్రాకారం నిర్మిస్తుంది.
(ఒక యోజనము షుమారుగా 8 మైళ్ళు).
దేవి సైన్యం రాకపోకలకు వీలుగా శూన్యపురానికి అభిముఖంగా గోడకు దక్షిణ కొస వద్ద ఒక యోజనం భాగం వాకిలి ఏర్పాటు చేస్తుంది.(జ్వాలామాలనికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా).
దండనాథ దేవి కూటమిలో ఒకరైన స్థంభినీదేవి 20 అక్షౌహిణి సేనతో వాకిలి వద్ద కావలి ఉంటుంది. శత్రువుల కోట ఆక్రమణకు విఘ్నకారిణి అయినందున ఆమెను విఘ్నదేవి అని కూడా అంటారు.
ఏర్పాట్లన్ని పూర్తయ్యే సరికి సాయం సమయం అవుతుంది.
ఈ సమాచారం తెలిసిన భండాసురుడికి భయం ఆవరించి తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. ఈ మారు చతుర్భాహు మొదలుకొని ఉపమాయుడి వరకు తనకున్న 30 మంది కొడుకులను యుద్ధరంగంలో దింపుతాడు. "కుమారులారా, ఈ సృష్టిలో మీతో సమానమైన వారు మరెవ్వరూ లేరు. మాయావి యైన ఒక స్త్రీ మనవారినందరినీ సంహరిస్తోంది. మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి." అని ఆదేశిస్తాడు.
యుద్ధరంగంలో దేవికి కుడి ఎడమలలో శ్యామలా దండనాయికలు, ముందు వెనుక సంపత్కరీ అశ్వారూఢలు సైన్యసమేతులై వ్యూహాలు పన్ని రక్షణగా ఉన్న సమయంలో భండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనక నుండి ముట్టడి చేస్తారు.
ఆ సమయంలో ముమ్మూర్తులా తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాదేవి తల్లి సమీపంలో ఉంటుంది. ఆమె నిత్య బాలాస్వరూపిణి. భండాసురుని కొడుకులు యుద్ధ రంగంలోకి ప్రవేశించిన వార్త తెలిసి ఆ బాలిక వారిని తాను ఎదుర్కొంటానని అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచినా, కుమార్తె శౌర్యం ఆత్మశక్తి తెలుసుకొని భండపుత్రులను ఎదుర్కోవటానికి అనుమతించి కవచాన్ని బహుమతిగా ఇస్తుంది.
నూరు హంసలచే లాగబడుతున్న కర్జీ అన్న రధం ఎక్కి బాలాదేవి యుద్ధరంగంలోకి ప్రవేశించటం చూసిన మంత్రిణీ దండనాయకలు ఆశ్చర్యచకితులౌతారు. కాని వెను వెంటనే కర్తవ్యం తెలుసుకొని ఆమెకు సంరక్షణకు అంగరక్షకులుగా నిలబడతారు.
బాలాదేవి భండాసురుడి 30 మంది కొడుకులతో చేస్తున్న భీకరమైన పోరాటం చూసిన వారంతా విస్తుపోతారు. యుద్ధం రెండవరోజు పూర్తిగా బాలాదేవి పోరాటం కొనసాగించి ఆ సాయం సమయంలో ఒకేసారి 30 బాణాలు ప్రయోగించి 30 మంది భండాసుర పుత్రులను ఒక్కసారిగా హతమారుస్తుంది.
ఆ దృశ్యం చూసిన లలితా దేవి ఆనందంతో కుమార్తెను ఆలింగనం చేసుకుంటుంది.
(భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా).
*****************************
విఘ్నయంత్ర నాశనం.
భండాసురుడు దుఃఖాక్రాంతుడౌతాడు.
"ఆ దుష్టురాలిని నా ఖడ్గంతో సంహరించి బంధువులతో విశ్రాంతి పొందుతాను." అని నిస్సహాయుడై స్వయంగా యుద్ధరంగానికి తరలి వెళ్తాడు.
అతనిని సముదాయించిన విషంగుడు విశుక్రుడు తాము స్వయంగ శత్రువులను ఎదుర్కోవటానికి ఉద్యుక్తులౌతారు.
భండాసురుడు ముందుగా విషుక్రుడిని పోరుకు పంపిస్తాడు.
"విశుక్రా, శత్రువుల స్థావరమ్లోకి ప్రవేశించి జయవిఘ్నం అన్న యంత్రాన్ని స్థాపించు." అని ఆజ్ఞాపిస్తాడు.
రాత్రి అంధకారంలో విషుక్రుడు చుట్టూ కట్టబడ్డ వహ్నిప్రాకారం సమీపిస్తాడు. లోపలికి వెళ్ళటానికి మార్గం కనిపించక ప్రాకారానికి బయటే ఉండి శిలవట్టం అనే యంత్రాన్ని రచించి, బలిపూజలు చేసి, ఆ యంత్రం పై నుండి ప్రాకారం లోపలికి దూకుతాడు. ఒక చదునైన రాతి మీద ఒక తాంత్రిక గుర్తు రచించి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. అనంతరం మంత్రించిన శిలవట్టం అన్న రాతిని బలమంతా ఉపయోగించి విసిరేస్తాడు.
అగ్నిప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది. వహ్నిప్రాకారంలో జయవిఘ్న యంత్రాన్ని స్థాపిస్తాడు. ఆ మాయా యంత్ర ప్రభావం వల్ల శక్తిసేనలో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవటం మొదలెడుతారు.
ఈ యుద్ధం చేయటమే తప్పు.
దేవతల పక్షాన యుద్ధం చేయవలసిన అవసరం మనకు ఏముంది?
అసలు ఈ లలితాదేవి ఎవరు? మనమీద పెత్తనం చెలాయించటానికి ఆమెకు ఎవరు అధికారం ఇచ్చారు?
మనమందరమూ యుద్ధం చేయటానికి నిరాకరిస్తే ఆమె ఏమి చేయగలుగుతుంది?
అజ్ఞానపు నిద్ర ఆవహించిన వారు ఈ విధంగా తమలో తామే వాదించుకోసాగారు.
విశుక్రుడు అర్ధరాత్రి దాటిన తరువాత తన 30 అక్షౌహిణుల సైన్యంతో వహ్నిప్రాకారం ఆక్రమించుకుంటాడు. అప్పటికి కూడా శక్తిసేన విఘ్నయంత్రం కలిగించిన మాయనిద్ర నుండి లేవలేక పోతారు.
అంత జరిగినప్పటికి యంత్ర ప్రభావం దండనాథ మీద కాని మంత్రిణీదేవి మీదగాని పడదు. ప్రమత్తులై ఉన్న వారిరువురు శక్తిసేనకు పట్టిన దుస్థితి చూసి బాధపడతారు. ఏమి చేయాలో పాలుపోక తమ కర్తవ్యం ఏమిటని లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వులో నుండి గణపతి ఉద్భవిస్తాడు.
(కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా).
దేవి ఆదేశం ఇచ్చిన వెనువెంటనే గణపతి అగ్నిప్రాకారంలో వెతుకగా శక్తిసేనకు పట్టిన దుస్థితికి కారణమైన జయవిఘ్న మహా యంత్రం కనిపిస్తుంది. దానిని తన పళ్ళతో కొరికి ఛిన్నాభిన్నం చేస్తాడు.
(మహాగణేశనిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత).
గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలగా మార్చి ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త అని ఆరుగురు విఘ్నకర్తలను సృష్టిస్తాడు.
వారు ఏడు కోట్ల సైన్యానికి నాయకులుగా రాక్షసుల పైకి దాడి చేస్తారు. విఘ్నయంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమను ఆవహించిన మాయ నిద్ర నుండి బయటబడి తిరిగి యుధ్ధానికి సన్నత్తులౌతారు. శక్తిసేన సహితుడై విఘ్నేశ్వరుడు వహ్నిప్రాకారం నుండి వెలుపలకు వచ్చి విషుక్రుడితో పోరు ఆరంభిస్తాడు.
ముందుగా గణపతి మీదకు పంపించిన గజాసురుడు అంతం అవటం చూసిన విషుక్రుడు రణరంగం నుండి పారిపోతాడు.
************************************
విశుక్ర విషంగ వధ
గజాసురుడు మరణించిన వార్త విన్న భండాసురిడితో చర్చలనంతరం తమ్ముడైన విషంగుడు, మేనల్లుడు ఉలూకుడూ వెంటరాగా విశుక్రుడు తిరిగి యుద్ధ రంగానికి చేరుకుంటాడు. దీనితో మూడవరోజు యుద్ధం ఆరంభమవుతుంది. మరో పక్క దండనాథ, మంత్రిణి శత్రువులపై తమ పోరు కొనసాగిస్తారు. చేతబూనిన హలాయుధాన్ని భీకరంగా తిప్పుతూ కిరిచక్ర రధం అధిరోహించిన దండనాథదేవి ముందుగా దారి తీయగా, విల్లంబులు ధరించిన మంత్రిణీదేవి గేయచక్ర రథం ఆరోహించి ఒక యోధుడి వలె వెనకనే అనుసరిస్తుంది.
దండనాథదేవి విశుక్రుడిని ఎదుర్కొనగా, అశ్వారూఢ, సంపత్కరీ దేవతలు వారి అల్లుళ్ళను ఎదుర్కొంటారు. రాక్షస సేన బలహీనమవటం గమనించిన విశుక్రుడు తృషాస్త్రం అన్న ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడ సాగింది. ఇంద్రియాలన్ని శక్తిని కోల్పోయాయి. అస్త్రాలను విడిచి పెట్టి మూర్చ పోతారు.
దండనాథ వారాహిని పిలిచి, "దేవీ ఇది రాక్షస మాయ. వారు ప్రయోగించిన తృషాస్త్ర ప్రభావం. మన సైన్యానికి దాహం తీరే మార్గం ఆలోచించాలి." అనగానే దానికి ప్రతిచర్యగా తృష్ణ బాధితులకు ఉపశమనం కొరకు దండనాథదేవి కీరిచక్ర రధం నుండి మదిరా సింధువును ఆహ్వానిస్తుంది. మద్య సముద్రదేవత ఏనుగు తొండపు ధారలతో కురిపించిన మధ్య వర్షంతో శక్తిసేన తమ దాహం తీర్చుకొని రెట్టింపైన ఉత్సాహంతో యుద్ధం కొనసాగిస్తారు. సముద్రుడు చేసిన సహాయానికి సంతో షించిన దేవి, "సముద్రుడాదేవకార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. నా అనుగ్రహం వలన ద్వాపర యుగంలో యజ్ఞం చేసే వారికి నీవు సోమపాన రూపంలో ఉపయోగ పడతావు. మంత్ర యుక్తంగా నిన్ను స్ఇకరించతంతో జనులు సిద్ధిని, బుద్ధిని బలాన్ని పొందుతారు." అని వరాన్ని ఇస్తుంది.
సాయం సమయానికి శత్రు సైన్యంలో భండాసురుని అల్లుళ్ళతో సహా చాలా భాగం మరణిస్తారు. ఈ లోగా శ్యామలాదేవి (మంత్రిణి) విషంగుడితో పోరాడి, బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుడిని సంహరిస్తుంది.దండనాథాదేవి (పోత్రిణి) విశుక్రుడిని హలాయుధంతో సంహరిస్తుంది. (మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత)
ఆ పాటికి అర్ధరాత్రయింది. భండాసురుడిని ఓదార్చటానికి ఇంక మిగిలింది కుటిలాక్షుడు మాత్రమే.
"కుటిలాక్షా లలితాదేవి తన చూపుతోనే నా సోదరులను సంహరించింది. ఆమె కంఠం నుండి రతం ప్రవహిచేలాగా చేసి నా సోదరులకు శాంతి కలిగేలా చేస్తాను." అని ఆవేశంతో కుటిలాక్షుడి సమేతంగా భండాసురుడు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాడు. అతని వెనక 2185 అక్షౌహిణుల సైన్యం 40 మంది సేనాపతులు ఉంటారు.
అతను అభిలము (భీకరమైన) అనే రథం ఆ'రోహిస్తాడు.
అతను ఘాతకం (నరకంలో హింస) అన్న కత్తి చేపూనుతాడు.
రణరంగంలో ప్రవేశించిన భండాసురుడు వజ్రఘోషతో సమానమైన మేఘనాదం చేస్తాడు.
ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగానికి బయలుదేరుతుంది. ఆమె వెనక గేయచక్ర రథంలో మంత్రిణీ దేవి, కిరిచక్ర రథంలో పోత్రిణి దేవి అనుసరిస్తుంటారు. ఆ వెనుక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తారు. ఆ దేవతలు శస్త్రాలు (మంత్రపూరితమైన ఆయుధాలు) ప్రత్యస్త్రాలు (శత్రువులు ప్రయోగిస్తున్న ఆయుధాలను ఎదుర్కొనే ఆయుధాలు) ప్రయోగించటంలో ఒకరి కన్నా ఒకరు ఏ మాత్రమూ తీసిపోరు.
( భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి)
భండాసురుడు ప్రయోగించిన మంత్ర తంత్ర ఆయుధాలలో అంధతామిస్రం అన్న అస్త్రం లలితాదేవి గాయత్రి అస్త్రం అంతకాస్త్రమును మృత్యుంజయాస్త్రంతో, సర్వాస్త స్మృతిని ధారణ అస్త్రం తో ఎదుర్కుంటుంది. ఈ విధంగా ఇరువురూ అనేక శస్త్రప్రత్యస్త్రాలు ప్రయోగిస్తూ భీకర పోరాటం చేస్తూంటారు.
శక్తిసేనను ఆయుష్షును తగ్గించటానికి ప్రయోగించిన ఆయుః అన్న అస్త్రం ఎదుర్కోవటానికి లలితాదేవి ధనుస్సు నుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయల్దేరి వారి హూంకారంతో భండాసురుడికి అస్త్ర ప్రభావం లేకుండా చేసి తల్లికి నమస్కరించి భూలోకానికి తిరిగి వెళ్ళిపోతారు.
మహాసురాస్త్రం నుండి పుట్టుకొచ్చిన మధుకైటభులను మహిషాసురుడిని రక్తబీజుడిని మరి ఇతర అసురులను పునర్జీవితుల చేస్తాడు. లలితా దేవి పెద్దగా వికటాట్టహాసం చేస్తుంది. అట్టహాసం నుండి చండీ సప్తశతిలోని ఇతర దేవతలతో సహా దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది.
ఆమెకు పరమేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, అగ్ని శక్తిని, వాయువు ధనుస్సును, కుబేరుడు పానపాత్రను యముడు కాలదండాన్ని, పాశాన్ని ఇస్తారు. ఆమె సింహాసనారూఢురాలై మహిషాసురాది రాక్షసులను సంహరిస్తుంది.
పిదప భండాసురుడు సోమకుడుని మరి కొంతమంది రాక్షసులని పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన వేళ్ళ గోళ్ళ నుండి విష్ణు యొక్క పది రూపాలను ఆవిర్భింప చేస్తుంది.
(కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః)
నారాయణుడి దశావతారాలు ఆయా రూపాలలో వధించిన రాక్షసులనందరినీ భండాసురుడు సృష్టించటం ఆరంభిస్తాడు. లలితాదేవి. రెండు చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు.
భండాసురుడి అర్జవాస్త ప్రభావం వలన నీటిలో మునిగిన శక్తి సేనను కుడిచేతి చూపుడు వేలి నుండి ఉద్భవించిన కూర్మరూపము నీటినంతటిని త్రాగి శక్తిసేనను రక్షిస్తాడు. హైరణ్యాక్షాస్త్రము నుండి వేలకొలదిగా జన్మించిన హిరణ్యాక్షులను దేవి కుడిచేతి నడిమి వేలి నుండి పుట్టిన వరాహ రూపి సంహరిస్తుంది.
కనుబొమల నుండి జన్మించిన హిరణ్యులు ప్రహ్లాదుణ్ణి పీడిస్తుండగా, దేవి కుడి చేతి ఉంగరపు వేలి నుండి సృష్టింప బడ్డ నరసింహుడు వారిని తన వాడిఐన గోళ్ళతో చీల్చి చంపుతాడు.
బలీంద్రాస్త్రాన్ని వామనాస్త్రం నుండి వచ్చిన వామనులు బలీంద్రులను బంధిస్తారు.
హైహయాస్త్రం నుండి పుట్టిన కార్తవీర్యులను లలితాదేవి ఎడమచేతి నుండి పుట్టిన పరశురాములు సంహరిస్తారు.
భండాసురుడు ఆగ్రహంతో చేసిన హూంకారము నుండి పుట్టుకొచ్చిన చంద్రహాసఖడ్గము నుండి కుంభకర్ణుడు, మేఘనాధుడు వెంటరాగా పుట్టుకొచ్చిన రావణాసురుడిని లలితాదేవి ఎడమచేతి చూపుడు వేలి నుండి రామలక్ష్మణులు సంహరిస్తారు.
భండసురుడు సృష్టించిన ద్వివిదాస్త్రుడు అనేక మైన కోతులను పుట్టించగా తల్లి ఎడమచేతి నడిమి వేలి నుండి ఉద్భవించిన బలరాముడు ఆ కోతులను సంహరిస్తాడు.
రాజాసురాస్త్రము నుండి పుట్టిన శిశుపాల దంతవక్త్ర శాల్వులను లలితాదేవి ఎడమచేతి ఉంగరం వేలి గోటి నుండి ఉద్భవించిన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు సంహరిస్తారు.
కల్వస్త్రము నుండి పుట్టిన రాజులను లలితాదేవి చిటికిన వేలు నుండి ఆవిర్భవించిన జనార్దనుడు హతమారుస్తాడు.
ఆ పాటికి సూర్యాస్తమ సమయం అవుబోతున్నది. ఇంక లలితాదేవి ఏ మాత్రమూ ఉపేక్షించ దలచుకోలేదు. నారాయణాస్త్రము ఇరవై నాలుగురు సేనా నయకులను సంహరిస్తుంది. రాక్షసులను, వారి సేనాధిపతులను హతమారుస్తుంది.
(మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైన్యక).
ఇంక చివరకు మిగిలింది భండాసురుడు మాత్రమే. లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి భండాసురుడిని సర్వనాశనం చేస్తుంది. ఫలితంగా శూన్యక పట్టణం దహించుకు పోయి బూడిద కుప్పగా మారిపోతుంది.
(కామేశ్వరాస్త్రనిర్దగ్ధ సభండాసుర శూన్యక)
దేవతలు ఆనందంతో దుందుభులు మ్రోగించి పూలవర్షం కురిపించి కర్పూరం వెలిగించి జయజయనాదాలు చేస్తారు.
(కామ సంజీవనం) కాముడు తిరిగి జీవించటం.
భండాసురుడు మరణించిన తరువాత లలితాదేవి తన చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నిటినీ పోగొట్టుతుంది.యుద్దం వల్ల కలిగిన శ్రమ నుండి సేద తీరుస్తుంది. బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవినిదర్శించుకోవటానికి వస్తారు. సింహాసనం మీద కూర్చున్న తల్లిని స్తోత్రం చేస్తారు.
బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు,
నమో నమస్తే జగదేక నాథే నమోనమః శ్రీ త్రిపురాభిధానే నమోనమః భండ మహాసురాఘ్నే నమోస్తు కామేశ్వరి వామకేశి అంటూ లలితా దేవి ఘన కీర్తి, కొనియాడుతారు.
(బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ).
ఆ శ్లాఘనలో,
"తల్లీ! భండాసురుడైతే మరణించాడు. కాని అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే వుండి మమ్మల్ని హింసలపాలు చేస్తున్నాడు.
అతనిని అంతమొందించాలంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి. మేమంతా అందుకోసమే ప్రయత్నాలు చేస్తూ ఉండగా మన్మధుడు దహించబడటం ఆ తరువాత ఈ సంఘటనలు చోటు చేసుకోవటం జరిగింది." అని తల్లికిజరిగిన సంఘటనలు వివరిస్తారు.
"రతీదేవి మన్మధుడి మరణంతో దుఃఖితురాలై రోదిస్తూ వున్నది." అని దేవతలు రతీదేవిని లలితాదేవికి చూపిస్తారు. రతీదేవి మాతకు నమస్కరిస్తుంది.
ఆ మాటలు విన్న లలితాదేవి ప్రేమ పూరిత దృక్కులతో కామేశ్వరుడి వైపు చూపు సారిస్తుంది. ఆ కనులలో నుండి మన్మధుడు పునరుజ్జీవుడౌతాడు.
(హరనేత్రాగ్ని సందరా కామసంజీవనౌషధిః) హరుని చూపుల అగ్నిలో దహింపబడ్డ మన్మధుని జీవితుడిని చేసిన సంజీవని ఆ తల్లి.
రతి మన్మధులు మాత పాదాలకు నమస్కరిస్తారు.
"రతీదేవిని అలంకరించి తీసుకురండి రతీ మన్మధుల వివాహం చేద్దాం" అని శ్యామలా దేవి చెలికత్తెలకు ఆజ్ఞాపిస్తుంది.
ఆ దంపతులను తల్లి ఈ విధంగా ఆశీర్వదిస్తుంది.
"మన్మధా, నీకు ఇంక ఏ భయమూ లేదు. వెళ్ళు. మరొక్కసారి నీ పూలబాణం పరమేశ్వరునిపై సంధించు.
శివుడు నీకు లొంగిపోయి పార్వతిని వివాహమాడుతాడు. నా ఆశీస్సులతో శివుడు నీకు ఏ విధమైన హానీ కలిగించడు. ఈ క్షణం నుండి నీవు ప్రతి ఒక్కరి శరీరం లోకి ప్రవేశించి రాగ మోహాలను ఉత్పన్నం కలుగ చేయి. నాభక్తులను కాపాడు."
తల్లి ఆశీర్వాదాలు పొందిన మన్మధుడు సతీ సమేతంగా తన మిత్రులైన వసంతుడు మొదలైన వారిని వెంటబెట్టుకొని శివుడు తపస్సు చేస్తున్న స్థాణ్వాశ్రమానికి వెళ్ళి తన ప్రభావం చూపిస్తాడు. శివునికి తపోభంగమై విరహవేదనతో పార్వతికై వెతకటం మొదలెడుతాడు. ఈ లోగా మన్మధుడు తన బాణాలు పార్వతి మీద కూడా ప్రయోగిస్తాడు. పార్వతి చేస్తున్న తపస్సుతో సంతుష్టుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెను వివాహమాడుతాడు. ఫలితంగా కుమారస్వామి జన్మించి దేవ సేనకు అధిపతై తారకాసుర సంహారం చేసి ఇంద్రుని పుత్రిక అయిన దేవసేనను పెళ్ళాడుతాడు.
మన్మధుడు తాను వచ్చిన పని నిర్విఘ్నంగా పూర్తి చేసినవాడై లలితాదేవి సేవకు శ్రీపురం చేరుకుంటాడు.
*******************************
శ్రీ నగరం
భండాసురుడు అంతమయిన తరువాత త్రిమూర్తులు దేవ శిల్పి అయిన విశ్వకర్మను రాక్షసుల శిల్పి అయిన మయుడిని పిలువనంపుతారు. లలితాదేవి, శివకామేశ్వరుల నివాసయోగ్యమైన 16భవంతులు, 16 పుణ్య క్షేత్రాలలో నిర్మించమని ఆదేశిస్తారు. ఆ 16 స్థావరాలు. మేరు, నిషధ, హేమకూటము,హిమగిరి, గంధమాదన, నీల, మేష, శృంగార మహేంద్ర పర్వతాలు (9 అత్యున్నత పర్వతాలు), జలసముద్రముతో సహా, లవణ, చెరుకు, పాల,సురా, నేతి, పెరుగు సప్త సముద్రాలలో, మొత్తం 16 క్షేత్రాలలో
అమ్మవారి కోసం నిర్మించిన భవంతులే శ్రీపురము. ఈ భవనాలలో అమ్మవారు పదునాలుగు రూపాలలో నివసిస్తుంది. లలితాదేవి నివసించే భవనం దేవ శిల్పులు నిర్మించాలి. అని, ఇక మిగిలిన భవనాలు కామేశ్వరపురి, భగమాలాపురి, నిత్యక్లిన్నాపురి అనే పేర్లతో నిర్మాణం జరగాలి అని త్రిమూర్తుల ఆదేశం విన్న విశ్వకర్ముడు మయుని సహాయంతో ప్రాకారాల నిర్మాణం చేస్తాడు.
*****************************
బ్రహ్మలోకానికి ఊర్ద్వ భాగాన ఉన్న సర్వలోకమే మణిద్వీపం. పరాంబిక తన ఇచ్చానుసారం మనస్సుతో సంకల్పించుకొని ఈ లోకం నిర్మించుకున్నది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా గోలోకం కన్నా అత్యధికం. ఈ ద్వీపానికి చుట్టూ అమృత సముద్రముంటుంది. రత్నాలు దొరికే ఇసుకతిన్నెలు కనువిందు చేస్తాయి. ఆ సముద్రపు ఒడ్డున రత్నద్రుమం అనే మహా వృక్షం ఉంటుంది. దాని పై నుండి చూస్తే కనిపిస్తుంది ఒక మహాప్రాకారం.
(సుధాసాగర మధ్యస్థా)
మేరు పర్వతం 4 శిఖరాలు కలిగి ఉంటుంది. తూర్పు వైపు ఒకటి, నైఋతిలొ ఒకటి వాయవ్యంలో ఒకటి. ఒక్కొక్కటి 100 యోజనాల పొడుగు, 100 యోజనాల వెడల్పు కలిగి త్రిమూర్తుల ఆవాసాలుగా ఉంటాయి. నాలుగవ శిఖరం మధ్యభాగంలో 400 యోజనాల పొడువు 400 యోజనాల వెడల్పులో ఉంటుంది.
షోడశ శ్రీపురాలు, పర్వతాలు "ప్రధమం మేరుపృష్ఠ చ నిషధే చ మహీధరే హేమకూటే హిమగిరౌ పంచమం గంధమాదనే నీలమేషే చ శృంగాఖ్యే మహేంద్రే చ మహాగిరౌ (సుమేరు మధ్య శృంగష్టా శ్రీమన్నగర నాయికా)
సముద్రాలు
లవణాభిక్షుసారాబ్ది ధృత సాగరాః దధి సింధుర్జలసింధుశ్చ సప్తమః
మధ్యనున్న శిఖరంలో ఉన్నదే శ్రీపురం. 7 నలుచదరపు లోహపు గోడలతో, నిర్మించబడి ఉంటుంది. (ఈ గోడలే ప్రాకారాలు కోటలు అని కూడా అనబడుతాయి.)
ఒక్కొక్క ప్రాకారం మధ్య 7 యోజనాల దూరం ఉంటుంది.
మొదటిది అయోధాతు నిర్మితం. ఇనుముతో ధాతు శిలలతో దృఢంగా నిర్మించబడ్డ ప్రాకారం. 16 వేల యోజనాల చుట్టుకొలత కలిగి రకరకాల అస్త్రశస్త్రాలు ధరించిన రక్షకభటులు ఆ ప్రాకారం మీద కావలి తిరుగుతూ ఉంటారు. ఆ మహా ప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలుంటాయి. దేవి దర్శనం కోసం వచ్చిన దేవతలు వారి వెంట వచ్చే గణాలు ప్రతి ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటారు. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళ్ళితే అడుగడుగునా సరస్సులూ రత్నద్రుమవాటికలు కనిపిస్తాయి.
ఆ సుందర వనాలు దాటి వెళ్ళితే కనిపించేది రెండవ ప్రాకారం, కాంస్య ప్రాకారము. ఇది ఇనుప కోటకన్నా నూరు రెట్లు కాంతి కలిగి ఉంటుంది. వీటి రెంటి మధ్యనున్న భాగం రత్న వృక్షాలతో అందమైన వనాలతో నిండి కనుల పండుగగా ఉంటుంది. కోకిలారవాలు, భ్రమర నాదాలు మారుమోగుతూ ఉంటాయి. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. నెమళుల క్రేంకారాలు. కనులకు చెవులకు విందు చేస్తూ ఉంటాయి.
కాలచక్రము అనే సింహాసనము అధిరోహించిన మహాకాళి మాహాకాలుడు అక్కడి రక్షకులు.
మూడవది తామ్ర ప్రాకారం (రాగి కోట) చతురస్రాకారంలో ఉండి కాంస్య ప్రాకారం లాగానే సప్త యోజనాల ఎత్తు. ఈ రెండు ప్రాకారలకు నడుమ కల్పవృక్షాల వనంతో నిండి ఉంటుంది. కనుక దీనిని కల్పవాటిక అని కూడా అంటారు. పండ్లలోని బీజములు కూడా రత్నాలే. వాటి సువాసనలు చాలా దూరము దాకా వ్యాపించి ఉటాయి. ఇది రెండవ ప్రాకారం. మధుశ్రీ, మాధవశ్రీ భార్యలగా ఉన్న వసంతుడు తామ్ర కుడ్యానికి రక్షకుడుగా ఉంటాడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని, పుష్ప కిరీటం ధరించి, పుష్పచత్రంతో పుష్పభూషితుడుగా చిరునవ్వులు చిందిస్తూ భార్యలతో పూలబంతులతో ఆడుకుంటూ ఉంటాడు. వారి గంధర్వ గానం చెవులకింపుగా ఉంటుంది.
ఆ సుందరవనంలో దేవతలూ గంధర్వులూ జంటలుజంటలుగా విహరిస్తూ ఉంటారు.
తామ్రసాల దాటిన తరువాత కనిపించేది నాలుగవదైన సీసనిర్మిత ప్రాకారము. ఈ సీసముతో నిర్మించిన ఏడు యోజనాల ఎత్తు. తామ్రప్రాకారం, సీస ప్రాకారానికి మధ్య ఉన్న ప్రాంతం మొత్తం సంతాన వృక్షాలతో నిండి సంతానవాటిక అనబడుతుంది. బంగారు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. చెట్ల మొదళ్ళో అమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతానకవృక్షాల కింద సేదతీరుతూంటాయి. దేవతలు సిద్ధులూ విలాసినీ మణులతో వనంలో విశ్రమిస్తూ ఉంటారు.
శుక్రశ్రీ శుచిశ్రీ భార్యలుగా ఉన్న గ్రీష్ముడు తోటమాలి.
ఇత్తడితో చేయబడ్డ ఈ నాలుగవ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తు కలిగి, రెండు ప్రాకారాల నడుమ హరిచందన వృక్షవాటిక వర్షరుతువు వనపాలకుడుగా ఉంటుంది. మెరుపులు కన్నులుగా పింగల వర్ణంలో తళతళలాడుతూ, మేఘాలు కవచంగా ధరించి, ఉరుము వంటి కఠధ్వనితో, నిరంతరం వర్షపుజల్లులతో, నభశ్రీ నభ్యశ్రీ మొదలుకొని పన్నెండు మంది భార్యలతో కూడి ఉంటాడు. ఆ ప్రాంతంలో దేవతలూ, సిద్ధులూ దేవీ పూజాతత్పరులు ఈ వనాలలో పత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. నదీ నదములు ఎక్కువగా ఉంటాయి. పచ్చటి లతలతో కళకళ్ళాడుతూ ఉంటుంది.
సీసప్రాకారం దాటిన తరువాత ఆరవదైన పంచలోహప్రాకారము కనిపిస్తుంది. ఈ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తులోనే ఉంటుంది. ఈ రెండు ప్రాకారల మధ్య మందారతరువాటిక ఉంటుంది. ఈషశ్రీ, ఊర్జశ్రీ (ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి) అన్నభార్యలతో శరదృతువు రక్షకుడుగా వనమాలిగా ఉంటాడు.
తరువాత ఏడవ ప్రాకారము రజత నిర్మిత ప్రాకారము. (వెండి కోట). సహశ్రీ, సహస్యశ్రీ అన్న భార్యలతో హేమంతఋతువు ఆ కోటకు రాజు. ఆ ప్రాంతమంతా పారిజాతవనాలతో నిండి ఉండి ఆ పూల వాసన పది యోజనాల వరకు వ్యాపించి ఉంటుంది.
వెండి ప్రాకారం దాటితే ఎనిమిదవ ప్రాకారము కనిపిస్తుంది సౌవర్ణప్రాకారము (బంగారపు కోట), ఏడు యోజనాల ఎత్తు ఉన్న ఈ ప్రాకారం బంగారంతో కట్టబడి ఉండి మధ్యలో కదంబ వృక్షంతో అలరిస్తూ ఉంటుంది.
(కదంబవనవాసినీ)
నిరంతరం పూలతో పండ్లతో నిండి ఉండి నాలుగు పక్కల నుండి తేనెధారలు కారుతూ ఉంటాయి. దేవి భక్తులు ఆ మకరందాన్ని త్రాగి ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. శిశిరఋతువు ఆ ప్రాకారపు అధినేత. తపశ్రీ,తపస్యశ్రీ అనే భార్యలతో శిశిఋడు ఆనంద సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.
తొమ్మిదవదైన పుష్పరాగ ప్రాకారం సౌవర్ణ ప్రాకారము దాటిన తరువాత కనిపిస్తుంది. కుంకుమ వంటి అరుణకాంతులు చిమ్ముతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో నేల కోనేరులతో సహా వనాలు ఉపవనాలు వృక్షాలు ఎగిరే పక్షులు. కదిలే జంతువులు, పారే నీళ్ళు మండపాలు మండప స్తంభాలు అన్ని పుష్యరాగమయాలే. సౌవర్ణసాల కన్నా తేజస్సులో లక్షరెట్లు అధికం.
ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు.
తూర్పు దిక్కున ఉన్న భవంతిలో అమరావతి ఉంటుంది. ఇక్కడ మహేంద్రుడు ఐరావతం అధిరోహించి వజ్రాయుధం చేతబూని, శచీదేవితో సహా కొలువై ఉంటాడు. స్వర్గలోకంలో కన్నా ఇకడ భోగం వేయిరెట్లు.ఆగ్నేయమూలన ఉన్నది వహ్ని పట్టణం. ఆ పట్టణంలో తన ఇద్దరు భార్యలైన స్వాహా స్వధాలతో కూడి కొలువై ఉంటాడు.
దక్షిణ దిక్కున ఉన్నది యమపురి. యమధర్మరాజు దండధారి అయి చిత్రగుప్తుడితో యమభటులు వాహనమైన మహిషం ఇక్కడ దర్శనమిస్తాయి.
నైఋతి కోణం రాక్షస స్థావరం. నిరృతి గొడ్డలి చేతబూని భార్యా సమేతంగా ఇతర రాక్షసులతో కొలువుతీరి ఉంటాడు.
పశ్చిమ దిక్కున వరుణుడి రాజ్యం. భార్య వారుణితో వాహనమైన ఝష (పెద్ద చేప)వాహనం అధిరోహించి పాశం చేతబూని వారుణీ మధువు త్రాగుతూ మత్తులో ఉంటాడు. జలచరాలు చుట్టు నడయాడుతుండగా విహరిస్తూ ఉంటాడు.
వాయవ్య మూలనున్నది వాయులోకం. ప్రాణాయామ సంసిద్ధులైన యోగి సమూహం ఇతడి పరివారము. ద్వజము చేతబూని మృగవాహనుడై, నలబై తొమ్మిది మంది మరుద్గణాలు వెంటరాగా విహరిస్తూ ఉంటాడు.
ఉత్తర దిక్కున ఉన్నది యక్షలోకం. యక్షరాజు కుబేరుడు వృద్ధి ఋద్ధి శక్తులతో నవనిధులకు అధిపతై మణిభద్రాది యక్ష సేనానులు పరివేష్టులై ఉండగా ఈ కోటలో నివసిస్తూ ఉంటాడు.
ఈశాన కోణంలో ఉన్నది రుద్రలోకం అనేక రత్నాలతో అలంకరింపబడిన భవంతిలో రుద్రదేవుడు నివసిస్తాడు. వీపున అమ్ములపొది ఎడమ చేతిలో ఎక్కుపెట్టిన ధనుస్సు ధరించి ఉంటాడు. నేత్రాలు ఎల్లప్పుడూ కోపంతో ఎర్రబడి ఉంటాయి. అతని వెన్నంటి అసంఖ్యాక రుద్రులు వెన్నంటి ఉంటారు. భద్రకాళీతో సహా ఇతర ప్రముఖ మాతృకలు పరివేష్టించి ఉండగా కోట్లాది రుద్రాణులు వీరి వెన్నంటే ఉంటారు.
డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు పరివేష్టియై మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు.
(డామర్యాదిభిరావృతా)
డమరు ధ్వనులు, ప్రమధగణాలు రుద్రగణాలతో బీకర వాతావరణం కనిపిస్తూ ఉన్న ఈ రుద్రలోకానికి భూతసంఘంతో కొలువు తీరి ఉన్న భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. అతని పేరు కూడా ఈశానుడే.
ఈ విధంగా అష్ట దిక్పాలకులతో విలసిల్లుతున్న పుష్యరాగ ప్రాకారం దాటిన తరువాత కనిపించేది పద్మరాగ ప్రాకారం. ఇది కూడా పది యోజనాల ఎత్తులో ఉండి కుంకుమకాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఈ రెండు ప్రాకారాల మధ్య ఉన్న ప్రాంతము నేల చెట్టు చేమలు సమస్తమూ పద్మరాగమయమే. ఈ ప్రాకారంలో రకరకాల ఆయుధాలు ధరించి, వివిధ రత్నాలంకృతులైన చతుషష్టి కళాశక్తులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. ఈ అరవైనాలుగు శక్తులు అమ్మవారి కళాంశ రూపాలు. వీరందరికీ ఎవరి లోకం వారికి ఉంది. ఎవరి వాహనాలు వారికి ఉంటుంది. ఆగ్రహంతో ఊగిపోతూ జ్వాలామాలికల్లాంటి నాలుకలు చప్పరిస్తూ, అంతటినీ సర్వనాశనంచేస్తాం యుద్ధం యుద్ధం అంటూ నినాదలు చేస్తూ ఉంటారు. వీరి శిరోజాలు రాగి వర్ణంలో ఉండి రాగితీగల్లాగా నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. ఈ జగత్తులో వీళ్ళు తలుచుకుంటే చేయలేనిదేమీ ఉండదు.
(మహాచతుషష్టికోటి యోగినీగణ సేవితా)
పద్మరాగప్రాకారం దాటిన తరువాత కనిపించేది పది యోజనాల ఎత్తు ఉన్న గోమేధిక రత్నమయమైన ప్రాకారం గోమేధికప్రాకారం.
కొత్తగా వికసించిన జపాపుష్ప వర్ణంలో ఉంటుంది. నేల చెట్లు, తటాకాలు, ఇళ్ళు స్తంభాలు, ఇది అది అనేమిటి సర్వం గోమేధికమణులతో నిర్మించబడి కనిపిస్తాయి.
ఈ ప్రాకారంలో ముప్పై రెండు మహాశక్తులు గోమేధికమణులతో చేయబడ్డ ఆభరణాలు ధరించి, రకరకాల ఆయుధాలు చేతబూని, నిరంతర యుద్ధాసక్తులై కనిపిస్తారు. కళ్ళు కోపంతో ఎర్రబడి ఉంటాయి. పిశాచ వదనాలతో, చక్రాల వంటి చేతులతో ఎవరినో ఒకరిని చంపు నరుకు అంటూ నినాదాలు చేస్తూ వుంటారు. ప్రతి ఒక్కరి వద్ద పరాజయము ఎరగని అత్యంత బలమైన పది అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. వారు తలుచుకుంటే బ్రహ్మాండాలన్నిటిని గెలిచే శక్తిగలవారు. ఈ ప్రాకార వాసులు ఈ మహాశక్తులను ఆరాధిస్తూ ఉంటారు.
లెక్కలేనని రధాలు ఏనుగులు ఇతర వాహనాలు ఇక్కడ కనిపిస్తాయి.
దేవి యుద్ధానికి సంబంధించిన సామాగ్రి మొత్తం గోమేధిక ప్రాకారంలో నిలవ వుంటుంది.
గోమేధిక ప్రాకారం దాటితే కనిపించేది వజ్రమయప్రాకారము. ముందటి ప్రాకారాలవలె ఇక్కడ అంతా వజ్రమయం. ప్రాకారంలో అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల, అన్న ఎనిమిదిమంది భువనేశ్వరీదేవి పరిచారికలు లక్షలాది సేవకులు చుట్టుముట్టి కనిపిస్తారు. ఒకరిని మించి ఒకరు సౌందర్యవంతులు. రకరకాల సౌందర్య సాధనాలు చేత బట్టి ఉంటారు. వివిధ కళలలో ఆరితేరినవారు. అమ్మ కరుణాకటాక్షం ముందర ఇతరమేవీ కంటికి కనిపించవు. విద్యుల్లతల వంటి కాంతితో ప్రకాశిస్తూంటారు.
దేవి పరిసరాలలో వారు నడయాడుతున్నప్పుడు నాలుగు పక్కలా మెరుపుల కాంతి కనిపిస్తుంది.
ప్రాకారపు ప్రహరీ గోడ బయటి భాగాన ఎనిమిదిమంది సఖుల నివాస గృహాలు ఉంటాయి. ఆ గృహాలలో వివిధ ఆయుధాలు వాహనాలు నిండి ఉంటాయి.
వజ్రమయ ప్రాకారము దాటిన తరువాత కనబడేది వైదూర్య మణితో నిర్మించబడ్డ పది యోజనాల ఎత్తైన ప్రాకారము. నాలుగు దిక్కుల ద్వారాలు కలిగి ఉంటుంది. ప్రాకారంలోని సమస్తమూ వైడూర్యమణితో నిర్మించబడి ఉంటాయి.
అష్ట దిక్కులలో బ్రాహ్మి, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీ, చాముండా, మహాలక్ష్మి, అన్న అష్టమాతృకలు నివసిస్తారు. వారి రూపాలు పేర్లకు తగ్గట్టు బ్రహ్మ రుద్రుడు మొదలైన వారి వలె ఉంటుంది. లోక కళ్యాణం కోసం నిరంతరం నిమగ్నులై ఉంటారు. తమతమ వాహనాలతో ఆయుధాలతో ఈ గృహాలలో నివసిస్తూ ఉంటారు.
నాలుగు ద్వారాల వద్ద భగవతి వివిధ వాహనాలు ఎల్లప్పుడూ సజ్జీకరించి సిద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల కోట్లానుకోట్ల ఏనుగులు, మరి కొన్ని చోట్ల అన్నే గుర్రాలు, మరి కొన్ని ప్రాంతంలో శిబిరాలు, గృహాలు, ఒక ప్రాంతాన హంసలు, సింహాలు, గరుడపక్షులు, నెమళ్ళు, ఇంకా అనేకానేక జీవాలు పద్ధతి ప్రకారం సజ్జీకరించి కనిపిస్తాయి.
ఆకాశమార్గాన లెక్కకు మించిన విమానాలు పతాకాలు ఎగురుతూ వివిధ వాయిద్య పరికరాలతో వరుసలలో కనిపిస్తాయి.
వైడూర్యప్రాకారం దాటితే కనిపించేది పది యోజనాల ఎత్తున పద్నాలుగవదైన ఇంద్రనీలమణి ప్రాకారం. గృహాలు ఆవరణలు చెట్లు కోటలు వనాలు అన్ని ఇంద్రనీలమయమే.
ఎన్నో యోజనాల దూరం విస్తరించిన పదహారు దళాల పద్మం తటాకంలో కనువిందు చేస్తుంటుంది. రెండవ సుదర్శన చక్రమా అన్నంత కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. పదహారు దళాలలో ఒక్కొక్క దళం మీద ఒక్కొక్కరు చొప్పున భగవతి యొక్క షోడశ శక్తులు నివసిస్తూ ఉంటారు. వారు, కరాళీ, వికారాళీ, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధా, మతి, కాంతి, ఆర్యా,
షోడశ శక్తులు నిండు నీలి రంగులో నీటితో నిండిన మబ్బుల కాంతిలో కనిపిస్తూంటారు. చేతుల్లో డాలు, గొడ్డలి ధరించి నిరంతరం యుద్ధాసక్తులై కనిపిస్తారు. ఇతర బ్రహ్మాండాలలో ఉన్న అన్ని శక్తులకు అధిపతులు వీరు. వీరందరూ శ్రీదేవి సైన్యం.
పదిహేనవ ప్రాకారం ముత్యాల ప్రాకారం (మౌక్తిక), అన్య ప్రాకారాలవలె పది యోజనాల ఎత్తు, సర్వం ముత్యాలమయం. ఈ ప్రాకారంలో అష్టదళ ముత్యాల పద్మం యొక్క ప్రతి దళం మీద అష్ట శక్తులు నివసిస్తారు. వీరు శ్రీదేవికి మంత్రులు, సలహాదారులు. వారి రూపురేఖలు, వస్త్రధారణ, ఆయుధాలు భోగభాగ్యాలు, సమస్తం శ్రీదేవిని పోలి ఉంటాయి. బ్రహ్మాండంలో జరుగుతున్న విషయాలు తల్లికి నివేదించటం వీరి కర్తవ్యం.
అన్ని శాస్త్రాలలో కళలలో ఆరితేరినవారు. తల్లి మనసులో ఏ క్షణాన ఏముందో తెలుసుకొని అది నెరవేర్చే తెలివి చాకచక్యం కలవారు. బ్రహ్మాండంలో ఉన్న జీవులలో ఏమి జరుగుతున్నదో తెలుసుకొనే జ్ఞానశక్తి కలవారు.
వారు, అనంగ కుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ.
ఉదయిస్తున సూర్యకాంతి అరుణవర్ణంలో ఉన్న వీరి నాలుగు చేతులలో పాశం, అంకుశం, వరప్రాదానము, అభయ ముద్రలు ఉంటాయి.
****************************
పదహారవ ప్రాకారము, పది యోజనాల ఎత్తు ఉన్న మరకతమణి ప్రాకారము. అంతర్భాగం మరకతమణిమయమై షడ్కోణాకారంలో ఉంటుంది. ప్రతి కోణంలోనూ ఒక దేవత నివసిస్తూ ఉంటారు.
తూర్పు కోణంలో చతుర్ముఖ బ్రహ్మ గాయత్రీ సహితుడై ఉంటాడు. నాలుగు చేతులలో కమండలమూ, అక్షమాల, అభయ ముద్ర దండము ధరించి ఉంటాడు. గాయత్రి దేవి కూడా బ్రహ్మ వలెనే ధరించి ఉంటుంది. గాయత్రీ చతుర్ముఖుల సర్వ రూపాలైన నాలుగు వేదాలు, స్మృతులు, పురాణాలు, మూర్తి ధరించి ఈ ప్రాంతంలో సేవిస్తూ ఉంటాయి.
నైరృతి కోణంలొ శంఖ చక్ర గదా పద్మాలు ధరించిన సావిత్రీ విష్ణుమూర్తులు కొలువై ఉంటారు. అన్ని బ్రహ్మాండాలలో వెలిసిన విష్వావతారాలు, మత్స్య కూర్మ మొదలైనవి. ఇతర బ్రహ్మాండంలో ఉన్న సావిత్రి యొక్క రూపాలు ఇక్కడే నివసిస్తూ ఉంటారు.
వాయవ్య దిశలో పరశు, అక్షమాల, వరద, అభయ హస్తాలతో సరస్వతీ మహారుద్రులుంటారు. వీరి భిన్నరూపాలు కూడా కొలువై ఉంటాయి. అరవై ఆగమాలు అన్నీ రూపు దాల్చి సేవిస్తూ ఉంటాయి.
ఆగ్నేయ కోణంలో రత్నకుంభం, మణికమండలాలు ధరించిన మహాలక్ష్మీ కుబేరులు నివాసముంటారు.
పశ్చిమకోణంలో పాశం అంకుశం ధనుర్బాణాలు ధరించి రతీమన్మధులు ఉంటారు. ఇక్కడ వివిధ శృంగార భేదాలు మూర్తీభవించి కొలువై ఉంటాయి.
ఈశాన్యకోణంలో పాశాంకుశధరుడైన పుష్టి దేవితో కూడిన విఘ్నేశ్వరుడు ఉంటాడు. బ్రహ్మాండాలలోని గణేశుని యొక్క వివిధ రూపాలు ఇక్కడ కొలువై ఉంటాయి.
ఈ విధంగా ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్న బ్రహ్మాది దేవతల సమిష్టి రూపాలైన వీరందరూ తమతమ స్థావరాలలో నివసిస్తూనే తల్లిని సేవిస్తూ ఉంటారు.
షట్కోణ మరకత ప్రాకారం దాటాక కనిపించేది ప్రవాళ ప్రాకారం (పగడము). కుంకుమ వర్ణంలో పది యోజనాల ఎత్తులో అంతా పగడాలతో నిర్మితాలు. ఈ ప్రాకారంలో, పంచభూతాల స్వామినులు ఉంటారు. వారి పేర్లు,హృల్లేఖ, గగన, రక్త కరాళిక, మహెచ్చుష్మ. పాశం అంకుశం, వరద, అభయ హస్తాలు. అమితభూషణులు, దేవితో సమాన వేషధారిణులు, నవయవ్వన గర్వితలు.
ప్రవాళసాలం దాటిన తరువాత నవరత్న ప్రాకారం. ఇది మహా ప్రాకారం. ఎన్ని యోజనాలో లెక్కే లేదు. ప్రాకారం గోడ ముందటిప్రాకారాలకన్నా అత్యుత్తమమైనది. నాలుగు పక్కలా లెక్కకు మించి నవరత్నాలతో నిర్మించబడ్డ గృహాలు, తటాకాలు, కనిపిస్తాయి. ఈ ప్రాకారంలో అమ్నాయ దేవీబృందం ఉంటుంది. మహాదేవి అవతారాలన్ని ఉండేది ఇక్కడే. సప్తకోటి మహామంత్రాల అధిష్టాన దేవతానీకం ఉండేది ఇక్కడే తల్లి యొక్క దశమహావిద్యలు. కాళీ, తార మొదలైన వారు వారి వివిధ అవతారాలు వారివారి ఆవరణ దేవతలు, (దేవతల పరిచారికలు) వాహనాలు ఆభరణాలతో ఇక్కడ కొలువు తీరి ఉంటారు.
దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు దేవి రూపుదాల్చిన అవతారాలన్ని ఈ నవరత్న ప్రాకారంలో నివసిస్తుంటాయి. వారు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భువనేశ్వరి, అంకుశ భువనేశ్వరి, ప్రమద భువనేశ్వరి, శ్రీ క్రోధ భువనేశ్వరి, త్రిపుటాశ్వారూఢ, నిత్యక్లిన్న,
అన్నపూర్ణ, త్వరిత, సర్వదేవీ సమూహము, కోటి సూర్యప్రభలు విరజిల్లుతూ ఉంటుంది. సప్తకోటి మహా మంత్రాల అధిష్టాన దేవతానీకమూ ఉండేది.
2.
నవరత్న ఖచిత ప్రాకారం తరువాత కనిపించేదే అఖిల బ్రహ్మాండానికంతటికి మూలస్థావరమైన చింతామణి (కోరిన కోరికలిచ్చెడు దేవమణి) గృహం.
*************************************
ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క అధిష్టాన దేవత పరిపాలిస్తుండగా చింతామణి గృహంలో లలితాదేవి స్థిర నివాసి అయి కొలువుంటుంది.
గోమేధిక ప్రాకారంలో కాల సంకర్షిణి దేవి యోగినులు బైరవులు సేవిస్తుండగా, వజ్రప్రాకారంలో అప్సర గంధర్వులు జపంలో నిమగ్నులై సేవిస్తున్న వజ్రేశ్వరి ఉంటుంది. భండాసురినితో జరిగిన యుద్ధంలో ఇంద్రుని వజ్రాయుధం భండుడు మింగేయగా వజ్రేశ్వరిని కృప వల్ల ఇంద్రుడు తన ఆయుధం తిరిగి పొందగలుగుతాడు.
ఇవే కాక తారాదేవి మనోన్మయ ప్రాకారం, వారుణి దేవి బుద్ధి ప్రాకారం, కురుకుళ్ళా దేవి అహంకార ప్రాకారం, మార్తాండ భైరవ సూర్యబింబ ప్రాకారము, సోమనాథుని చంద్రబింబ ప్రాకారము, మన్మధుని శృంగార ప్రాకారము దాటిన తరువాత కనిపించేది శ్రీచక్రమైన భువనేశ్వరి గృహము.
తూర్పు భాగంలో ఒక యోజనం వెడల్పుతో ఆర్ఘ్య పాత్ర,,
ఈశాన్య కోణంలో జ్ఞాన కుండము, (చిదగ్ని కుండం),
వాయవ్యంలో శ్రీచక్ర రథం,
నైఋతిలో మంత్రిణి దేవి యొక్క గేయ చక్ర రథం,
ఆగ్నేయమందు దండనాథ దేవి యొక్క కిరిచక్ర రథాలు తలి ఆఇకె జాగరూకులై ఎదురు చూస్తున్నట్టు నిలబడి కనిపిస్తాయి.
తూర్పు ఈశాన్య మధ్య భాగాన మంత్రిణీ దేవి నివాస గృహం
తూర్పు ఆగ్నేయ మధ్య భాగాన దండినీ దేవి గృహం, నిర్మింపబడి ఉంటాయి.
(చింతామణి గృహాంతస్థా)
అదిగో ఆ కనిపించేదే చింతామణిగృహం. బ్రహ్మాండానికి పైభాగాన వేయి యోజనాల పరిమితిలో ఉన్న తల్లి నివాసం. మూల
ప్రకృతికి ఆలవాలము రత్నగృహం.
(సహస్ర యోజనాయామే చింతామణిమయే గృహే)
ఆమె నివాసమైన అంతర్భాగంకు ముందు శృంగార మండపం. ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అనే నాలుగు వేయిస్తంభాల మండపాలు కోటి సూర్య తేజస్సుతో తేజరిల్లుతూ ఉంటాయి. ఈ మండపాల ముందర అనేకమైన మణులతో నిండిన అరుగులు ధూప పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. నాలుగు పక్కలా కాశ్మీరవనం, మల్లికావనం, కుందవనం నిరంతరం పుష్పాలతో విరాజిల్లుతూ కనువిందు చేస్తూ తుమ్మెదలతో కూడి ఉంటాయి. అన్నివైపులా రత్న నిర్మిత సోపానాలతో మహా పద్మముల వనాలు ఉంటాయి.
ఈ విధంగా అసంఖ్యాకములైన వనాలతో ఉపవనాలతో మణిద్వీపం పరిమళభరితమై ఉంటుంది.
శృంగార మండపం మధ్య భాగములో ఒక దివ్యసింహాసనం మీద దేవి విరాజమానురాలై సభాసదుల రూపంలో వున్న ప్రముఖ దేవతలు దేవాంగనలు, సకల అప్సరసలు ఆలపించే సంగీతగానాలు ఆలకిస్తూ ఉంటుంది.
ముక్తిమండపములో భగవతి శివాదేవి బ్రహ్మాండములో ఉన్న సకల జీవులకు, తపస్వులకు, దేవీ ఆరాధన తత్పరులకు, యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది.
మూడవమండపం జ్ఞాన మండపంలో వెలుగులు చిందుతూ, భగవతి ఙ్ఞానం ఉపదేశిస్తూంటుంది.
చివరిదైన ఏకాంత మండపంలో అనంగకుసుమ మొదలైన అష్ట మంత్రిణులతో కూడి జగత్రక్షణకై సమాలోచనలు జరుపుతూ ఉంటుంది.
అంతర్భాగమైన చింతామణి గృహంలో కొలువై ఉంటుంది పరమేశ్వరి.
తల్లి కొలువైన మండపమే శ్రీదేవి సదనం. త్రికోణాకారంలో ఉన్న మేరు పర్వత మధ్య ప్రదేశంలో ఉన్నది.
(సుమేరుశృంగ మధ్యస్థా)
******************************
కనులు మిరుమిట్లు కొలిపే చింతామణి రత్నాలతో నిర్మించ బడ్డ అద్భుత గృహమే జగదంబ నివాస సదనం.
(శ్రీమన్నగర నాయుకా)
భవనానికి ఇచ్చాశిఖర, క్రియాశిఖర, జ్ఞాన శిఖర అన్న మూడు శిఖరాలు, ఆమ్నాయ (వేదాలు) దేవతలైన, పూర్వ దక్షిణ పశ్చిమ
ఉత్తర అనే నలుగురు దేవతలు నాలుగు ద్వారాలు,
భవనానికి మద్యలో బిందు పీఠం శ్రీచక్ర ఆకారంలో నిర్మితమై ఉంటుంది.
శ్రీచక్రం లోని దేవుళ్ళు దేవతలూ ఇక్కడ కొలువై ఉంటారు.
ఈ బిందు పీఠాన్ని, శ్రీ పీఠం, మహా పీఠం, విద్యా పీఠం ఆనంద పీఠం అని కూడా అంటారు.
నవరత్న ప్రాకారాల మధ్య చింతామణి గృహంలో కొలువై వేయి కిరణములు కల ఉదయింస్తున్న సూర్యుని యొక్క కాంతి వంటి
కాంతి కలిగిన తల్లి అందాలు చూడటానికి వేయి కళ్ళు చాలవు. రత్న కాంతులను మించిన కాంతి స్వరూపిణి.
(ఉద్యద్భాను సహస్రాభా)
నాలుగు చేతులలో రాగస్వరూపములను పాశంగా, కుడి వైపున పైన ఉన్న హస్తంలో క్రోధమును అంకుశంగా, పై భాగాన ఉన్న
ఎడమ హస్తంలో మనస్సను స్వరూపంలో చెరకుగడను ధనుస్సుగా, పంచేంద్రియాలను బాణాలగా నాలుగు చేతులలోనూ ధరించి ఉంటుంది.
(చతుర్బాహు సమన్వితా, రాగస్వరూప పాశాడ్యా, క్రోధాకారాంశుజోజ్వలా, మనోరూపేక్షు కోదండా, పంచతన్మాత్ర సాయకా)
అమ్మ ఆసీనురాలైన ఫలకం ఎంతో విశిష్టమైనది.
మంచానికి తూర్పు భాగాన ఆధ్యాత్మికకు ప్రతీకలైన ముప్పై ఆరు మెట్లు కనిపిస్తాయి.
భగవతి దశ శక్తితత్వాలు సోపానాలగా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు నాలుగు కోళ్ళగా సదాశివుడు పలకగా అమర్చిన సింహాసనం.
అయిదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన దేవి ఆసనము చింతామణి అంతర్భాగాన కనిపిస్తుంది.
(పంచ బ్రహ్మాసనస్థితా)
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః
ఏతే మంచే పురా ప్రోక్తాః పలకస్తు సదాశివః
తస్యోపరి నిషణ్ణా సా దేవీ భువనేశ్వరీ
*****************************
భగవతి దశ శక్తితత్వాలు సోపానాలగా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు నాలుగు కోళ్ళగా సదాశివుడు పలకగా అమర్చిన సింహాసనం.
అయిదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన దేవి ఆసనము చింతామణి అంతర్భాగాన కనిపిస్తుంది.
(పంచ బ్రహ్మాసనస్థితా)
పాదాలు మోపటానికి ఆసనం ముందు ఒక పీఠం ఉంటుంది.
హంస ఆకారంలో తల వైపు ఒకటి పాదాల వైపు ఒకటి దిండ్లు అమరించిన పడక ఏర్పాటు చేయబడి ఉంటుంది.
పడక మీద ఎర్రటి వస్త్రం పరిచి ఉంటుంది.
కామేశ్వరుడు తూర్పు వైపుకు ఆసనం మీద కూర్చొని ఉంటాడు. నిత్య సోడశ బాలుడు. చతుర్బాహు, ముక్కంటి, శృంగార భరిత వస్త్ర ధారణుడు.
షోడశ బాల లలితాదేవి శృంగార దేవత వలె ఆభరణాలంకృతై కామేశ్వరుని వామాంకాన ఆసీనురాలై ఉంటుంది. (శివకామేశ్వరాంకస్టా)
సదాశివుని లాలించినదై, లోకములను అతిక్రమించి క్రీడించునదై లలితాదేవి అయింది.
(లోకానతీత్య లలతే తేన చోచ్యతే)
ఆ విధంగా సర్వాభరణ భూషితురాలైన లలితాదేవి చుట్టూ, ఆమె సఖులు నాలుగు పక్కలా ఉంటారు.
ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి క్రియా శక్తి నిరంతరం ముందు వైపు ఉంటారు.
లజ్జా, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమా, దయా, బుద్ధి, మేధా, శ్మృతి ఇంకా లక్ష్మి, వారివారి రూపాలలో కొలువై ఉంటారు.
తొమ్మిది పీఠశక్తులైన జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోర్రి, అఘోర మంగళ నిరంతరం సేవిస్తూ ఉండటం కనిపిస్తుంది.
తల్లి పార్శ్యంలో ఉన్న శంఖ పద్మ నామక నిధుల నుండి నవరత్నాలు, సప్తధాతువులు స్రవించి నదుల రూపము దాల్చి, అమృతసాగరంలో కలిసిపోతాయి.
అన్ని బ్రహ్మాండాలలో ఉన్న దేవ దానవ నాగ మానవ లోకాల్లో ఉన్న ఉపాసకులందరూ దేవి సన్నిధికి చేరుకుంటారు.
ఏడు కోట్ల మహామంత్రాలు, మహావిద్యలు. తమ నిజ రూపాలలో బ్రహ్మ స్వరూపిణి అయిన దేవిని సేవించుకుంటూ ఉంటాయి.
వింజామరలు వీచుచూ, లక్ష్మీ సరస్వతులు ఇరుపక్కలా వేవిస్తూ ఉంటారు.
(సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా)
చెరుకుగడ విల్లు పాశాంకుశాలను నాలుగు చేతులలో ధరించిన త్రిగుణాతీతమై, పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా దారిద్ర్య దుఃఖాలను దూరం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి.
సింహాసనారూఢురాలైన తల్లి లలితాదేవి వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలా, కౌళినీ అరుణా, జయనీ, సర్వేశ్వరీ, అనెడి వాగ్దేవతలను పిలిచి, నా ప్రసాదము వలన మీరందరూ సద్వాక్ విభూతిని పొంది ఉన్నారు. ఇదే విధంగా నా భక్తులు కూడా వాగ్విభూతి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యానికి మీరు ఉపయోగ పడవలెను. శ్రీ చక్ర రహస్యములు నెరిగి, నామ పారాయణాసక్తి కలవారు. కనుక మీకు నా నామ పారాయణ చేయమని ఆనతి ఇస్తున్నాను. అంటుంది.
అట్లా తల్లి చేత ఆజ్ఞాపించబడ్డ వశిన్యాది వాగ్దేవతలు శ్రీదేవి రహస్య నామాలతో అనుష్టుప్ చ్చందంలో స్తోత్ర రచన చేస్తారు. ఆ స్తోత్రమే రహస్యనామ సాహస్రమని ప్రసిద్ధమైనది.
(వశిన్యాది వాగ్దేవతా ఋషయః)
(అనుష్టుప్ చ్చందః)
ఒకసారి లలితాదేవి సభలో సింహాసనాసీనురాలై ఉండగా, తనను దర్శించుకోవటానికి వేచి ఉన్న దేవీ దేవతలందరకూ దర్శనానికి అనుమతి ఇస్తుంది. వారిలో బ్రహ్మసరస్వతులు, లక్ష్మీనారాయణులు, గౌరీరుద్రులు, మంత్రిణీ దండినీ దేవులు నానా రూప నామములు కల అనేక శక్తి సముదాయము తల్లిని సేవించుకొనటానికి వేచి ఉంటారు.
వచ్చిన వారందరూ, తల్లిని దర్శించి తమతమ స్థానాలలో కూర్చొని ఉండగా లలితాదేవి కనుసైగతో, వశిన్యాది వాగ్దేవతలు లేచి నిలబడి తాము రచించిన సహస్రనామాలతో దేవిని స్తుతిస్తారు.
ఆ స్తోత్రము విన్న తల్లి సంతుష్టురాలౌతుంది. ఆ స్తోత్రపాఠము విన్న సభాసదులు విస్మితులౌతారు.
లలితాదేవి సభాసదుల నుద్దేశించి,
"దేవతలారా వినండి. వశిన్యాది వాగ్దేవతలు నా ఆజ్ఞ చేత ఈ స్తోత్రం రచించారు. నాకు సంతోషము కల్గించే ఈ దివ్యనామ యుక్తమైన స్తోత్రము నా ప్రీతి కొరకు మీరందరు పఠించవలెను. అంతే కాక నా భక్తులకు ఉపదేశించ వలసింది. ఒక్కసారైనా నామము పఠించిన భక్తుడు నా అనుగ్రహ పాత్రుడౌతాడు. శ్రీ చక్రమున నన్ను పూజించి, పంచదశాక్షరీ మంత్ర జపము చేసి తరువాత నామ పారాయణము చేయ వలసింది.
కాని శ్రీచక్రార్చన మంత్ర జపము చేసినా చేయలేక పోయినా సహస్రనామ స్తోత్రము మాత్రము నా ప్రీతి కొరకు సదా పఠింపవలెను. అన్ని కోరికలు నెరవేరుతాయి. అందుకు సందేహము లేదు. అని లలితాదేవి దేవతలకు పారాయణ అనుమతి ప్రసాదిస్తుంది.
అది మొదలు శ్రీదేవి ఆఙ్ఞ మేరకు బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు, మంత్రిణి మొదలగు శక్తులు, ఈ సహస్రనామ స్తోత్రము లలితాదేవి ప్రీతి కొరకు పఠించ సాగారు.
లలితోపాఖ్యానములో వివరించిన భండాసుర వధ శ్రీపుర వర్ణన హయగ్రీవుడు చెప్పగా విన్న అగస్త్యుడు. సంతుష్టుడై శ్రీదేవి పుట్టుకను, భండాసుర వధను చెప్పి ఉన్నావు.. పంచదశాక్షరి మంత్రమహిమ, శ్రీపురము యొక్క వైభవము వివరించినారు. మంత్రిణి దండినీ దేవుల నామముల వివరణ తెలుసుకున్నాను. అదే విధముగా లలితాదేవి సహస్రనామముల ఉపదేశము కూడా చేయమని వేడుకుంటాడు.
హయగ్రీవుడు, ఆ సహస్రనామ స్తోత్రము రహస్యమైనదగుట చేత ఇంత కాలమూ చెప్పలేదు. ఇప్పుడు భక్తితో అడుగుతున్నావు కనుక చెప్తాను విను అంటాడు.
మంత్రాలలో శ్రీవిద్య ఎంత ముఖ్యమో, పురములలో శ్రీ పురము ఏ విధముగా శ్రేష్టమో, శక్తులలో లలితాదేవి ఏ విధముగా పరమైనదో, శ్రీ విద్యోపాసకులలో పరమశివుడు ఏ విధంగా ప్రధముడో, అదే విధంగా సహస్రనామాలలో లలితా సహస్ర నామాలు శ్రేష్టం. లలితా సహస్ర నామపఠనం వల్ల తల్లి ప్రీతి చెందినట్టు మరే స్తోత్రాల వల్ల శ్రీదేవి ప్రీతి చెందదు. ఇది నిత్యము పఠించ వలసినది.
మంగళాచరణ శ్లోకాలు
శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం
నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం
పాశాంకుశేక్షు కోదండ ప్రసూన విశిఖాం స్మరేత్
ఉద్యత్కోటి రవిప్రఖ్యాం మహాత్రిపుర సుందరీం
ఈ విధంగా వివరించిన హయగ్రీవుడు, "అగస్త్యా భక్తుని చేత ఈ సహస్రనామ పారాయణము చేయించ వలెను. ఈ సహస్ర నామము యొక్క విశిష్టతను వివరించాను. ఇంక ఆ నామాలు వివరంగా చెప్పుతాను విను."అంటూ లలితాసహస్ర నామ ఉపదేశము చేస్తాడు.
బ్రహ్మాండ పురాణమందలి హయగ్రీవ అగస్త్య సంవాదంలోని లలితా సహస్రనామ పూర్వభాగం
*******************************
జైహింద్.
No comments:
Post a Comment