Tuesday, September 3, 2024

“మాయదారి...” డా. పేరి రవికుమార్ గారి కొత్త కథ

జైశ్రీరామ్.

“మాయదారి...”

     బృందావనంలో గాలి మందగించింది. చడీ చప్పుడు లేకుండా ప్రవహిస్తోంది యమునా నది.

పగలు రాత్రి కూడా కళకళలాడుతూ త్రుళ్ళిపడే ఊరు మొత్తం నిశ్శబ్దంగా కనబడుతోంది

అందరూ ఎవరి పనులలో వారు ఉన్నారు. కాని, మొత్తంగా ఏదో గుబులు మేఘం కమ్ముకున్నట్లు అవుతోంది. 

అవును మరి, ఎందుకు కాదు? కారణమా తెలియదు. అప్పటికి ఒక వారం దినాలు అయి ఉంటుంది. ఏ అల్లరి చేయక కృష్ణుడు బుద్ధిగా ఉన్నాడాయె. ఎవరైనా అల్లరి చేస్తే కష్టంగా ఉంటుంది. కాని, కృష్ణుడు అల్లరి చేయకుంటే నష్టంగా అనిపిస్తోంది. 

యశోద మాత్రం సంతోషంగా ఉంది. కృష్ణుడు పొద్దుటనే, లేపకుండానే నిద్ర లేస్తాడు. అమ్మ పెట్టిన వెన్ననే తింటాడు. చద్ది మూట కట్టుకుని, ఆవులను తీసికొని వెళ్ళి, సాయంకాలం ఇంటికి చేరుకుంటాడు. ఇక ఎక్కడికి పోడు. పెందలకడనే అన్నం తిని పడుకుంటాడు. రాత్రి మధ్యలో ఎప్పుడు చూసినా తన పక్కలోనే ఉంటాడు. అలుక, అల్లరి లేవు. ఇంటి మీదకు తగవులు లేవు. యశోదకు సంతోషమే కదా. 


కాని ఇంకెవరికీ అలాగ లేదు. ఏ ఇంట్లో చూచినా వెన్న కుండలు అలానే ఉంటున్నాయి. పెరుగు కుండలు పగలట్లేదు. కృష్ణునితో తిరిగే పిల్లలు కూడా నెమ్మదిగా ఉంటున్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. అందరూ తేలికపడాలి. అయినా ఎందుకో బరువుగా అనిపిస్తోంది. ముందు రెండు దినాలు బాగుంది. తరువాత అసంతృప్తి మొదలైంది. ఇలా బాగా లేదని ఒకరు అన్నారు, ఆ మాట క్రమంగా వ్యాపించింది. ఇప్పుడు అందరికీ అలాగే అనిపిస్తోంది. 

ఆవులు సరిగా పాలు ఇవ్వటం లేదు. కుండల వంటి పొదుగులతో కుండల నిండుగా పాలు ఇచ్చేవి. ఇప్పుడు ఏమిటో తగుమాత్రంగా ఇస్తున్నాయి.

అత్తలకు తమ కోడళ్ళ గురించి చింతలేదు. రాత్రుళ్లు ఇంటి పట్టున ఉంటున్నారు అని. కోడళ్ళు మాత్రం దిగులుగా ఉన్నారు. వారి కారణం వారికి ఉంది.

రాత్రుళ్లు దొరలిపోతున్నాయి నిశ్శబ్దంగా. వేణుగానం వినబడుట లేదు. హృదయం వెలితిగా, బరువుగా అనిపిస్తోంది. 


కామన్నగారి బొవ్వప్పకు కూడా తెలియని చిరాకుగా ఉంది. ఆవిడ అసలు పేరు ఎవరికీ తెలియదు. ఏనాడో కాలం చేసిన ఆమె పెనిమిటికి తెలుసునేమో. అందరూ ఆమెను బొవ్వప్ప అనే అంటారు. ఆవిడ నోరు విప్పితే నాలుగు వీధులు వినబడాలి. అంత ధాటీగా లంకించుకుంటుంది. అదెందుకో కాని, ఆ ఇంట్లో కృష్ణుడు ఎక్కువగా అల్లరి చేస్తాడు. 

ప్రతిదినం పొద్దుట బొవ్వప్ప తన ఇంటి అరుగు మీద నిలబడటం, అరవటం. ఆమె ఎప్పుడూ యశోద ఇంటి మీదకు పోదు. తన గుమ్మంలో నిలబడి, గొంతు పెద్దగా చేయటమే. తన మాటలు వినబడతాయి అని లేదా విన్నవారు యశోదకు చెప్తారు అని నమ్మకం. ఆవిడ ఎప్పుడూ, మిగిలిన పిల్లకాయలను ఏమీ అనదు. 'వానితో తిరిగి చెడిపోతున్నారు పాపం' అంటుంది. కృష్ణుని మీదనే అన్ని తిట్లూ. 'మాయదారి సంత' అని ఒక మాట చివర్లో  తగిలిస్తుంది.


అవును మరి, కృష్ణుడు చేసే పనులు అలాగే ఉంటాయి.

ఒకనాడు చిట్టి బూరెలు చేసింది బొవ్వప్ప. కొడుకు, కోడలు, తను, ముగ్గురే ఇంట్లో. అయినా హెచ్చుగానే చేసి, చిన్న గంపలో పెట్టి అటకమీద దాచింది. ముందు జాగ్రత్త అనుకున్నది కాబోలు. మధ్యాహ్నం ఒక కునుకు తీసి లేచేసరికి, ఇంటి ముంగిట కృష్ణుడు. 

"బూరెలు తియ్యగా ఉన్నాయి" అంటున్నాడు.

ఉలిక్కిపడి, ఆశ్చర్యపడి, గభాల్న లేచి అటకమీద గంప తీసి చూచింది. మూడంటే మూడే ఉన్నాయి. 

"హారినీ, పగలు కూడా వస్తున్నావూ" అని గొంతు పెంచింది.

"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.

'నువ్వే ఇచ్చి ఉంటావు' అన్నట్లు కోడలి వైపు చూచింది.

అత్తగారి భారీ విగ్రహం ముందు బక్క పలుచని కోడలు భయంగా నిలబడి, 'కాదు' అన్నట్లు తలాడించింది.

"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.

మరింత ఆశ్చర్యం, "అదేమిటి, నేను కారం బూరెలు చేస్తే" అని బొవ్వప్ప గొంతు తడబడుతోంది.

"నాకోసం నైవేద్యంగా పెట్టే ఉంటావు అన్ని బూరెలు. ప్రసాదంగా నీకు మూడు మిగిల్చానులే బొవ్వప్పా ! " అన్నాడు కృష్ణుడు తీపి గొంతుకతో.

"ఏవిటీ నైవేద్యం, ప్రసాదం అంటూ. పైగా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు బొడ్డూడని గుంటడివి"  బొవ్వప్ప గొంతులో మాత్రం కారం వినబడుతోంది.

పకపకమని నవ్వాడు కృష్ణుడు,"నాకు బొడ్డూడితేనే అన్నీ పుట్టుకు వచ్చాయి తెలుసా" అన్నాడు.

ఆ నవ్వులో క్షణకాలం అంతా మరచింది బొవ్వప్ప.

తేరుకొని చూస్తే, కృష్ణుని వైపు పరవశంగా చూస్తోంది కోడలు.

అప్రయత్నంగా ఒక బూరె తీసి నోట్లో వేసుకుంటే, తియ్యగానే ఉంది.

'బెల్లప్పాకం పట్టుకొచ్చి కలిపేసి మరీ తినేసాడు గావాల్ను' అని గొణుక్కుంది.

"మళ్లీ చేసినప్పుడు వస్తాలే" అని పరుగెత్తాడు కృష్ణుడు.

బొవ్వప్ప ఏం చేస్తుంది? మిగిలిన రెండు కూడ నోట్లో వేసుకుంది. తియ్యగా రుచిగా ఉన్నాయి.

కోపం, ఆశ్చర్యం పెరిగిపోయాయి. అరుగు మీద నిలబడి రెండు ఘడియలు తిట్టిపోసింది. "మాయదారి సంత" అని ముగించింది.


యశోదమ్మ చెవికి సోకదూ. అప్పటికి ఇల్లు చేరాడు కృష్ణుడు.

"ఏరా కృష్ణా, నన్ను అడిగితే అవేవో నేను చేయనూ, చూడు ఎలా తిడుతోందో" అన్నది.

"బొవ్వప్ప నోరు చెడ్డది కాని చెయ్యి మంచిదే అమ్మా. బాగా రుచిగా చేస్తుంది. నా కోసమే అన్ని చేసింది" అని నవ్వాడు కృష్ణుడు.

ఆ నవ్వు చూస్తే అన్నీ మరచిపోతుంది యశోద.

బొవ్వప్ప మాత్రం ఏదీ మరచిపోదు. ఒకటి జరిగినప్పుడల్లా పాతవి అన్నీ తలచి ఏకరువు పెడుతుంది.

అలాగ బొవ్వప్పకు నోరు చేసుకునే అవకాశం ఇస్తాడు కృష్ణుడు.

ఇప్పుడు బొవ్వప్ప నోటికి పనిలేనట్లు అయింది. గంపలు, కుండలు అన్నీ పెట్టినవి పెట్టిన చోటనే ఉంటున్నాయి నిండుగా. 

మంచిదే కదా, కాని కానట్లు ఉంది. ఏమీ తోచట్లేదు బొవ్వప్పకు. ఏదైనా వండబోతే, 'చాలులే మన ముగ్గురికి అంతంత ఎందుకు' అని గదమాయిస్తోంది. ఊరకే అరుగు మీద కూర్చుంటుంది. ఇంటి లోపలికి బయటకు తిరుగుతుంది. 

అత్తగారి అవస్థను చూసినా ఏమీ అనదు కోడలు. ఆమె దిగులు ఆమెకు ఉంది.

బొవ్వప్ప మునుపటిలా నిద్రలో ఏ అలికిడి విన్నా, వెంటనే లేచి చూడట్లేదు. అసలు సరిగా నిద్ర పట్టడం లేదు. ఏమిటో ఊపిరి ఆడనట్లు ఉంది.


చంపావతికి ఊపిరి తీసుకోవటమే బరువుగా ఉంది. రాత్రి నిశ్శబ్దంగా కదలకుండా ఉంది. తన ఒంటరితనాన్ని  పరిహసిస్తున్నట్లు రాత్రి, వెన్నెలతో నవ్వుతోంది.

కృష్ణుడు ఎక్కడ అని ప్రతిరేయి వెదుకులాట. అదే మధురం అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు వెదకనక్కర లేదు. 

మల్లెపొదల చెంత నిలిచి ఏమని అడుగను? 

'మీ పొదల మాటున ఎందుకు లేడు చెప్పరే' అని అడుగనా.

భృంగములను ప్రశ్నింతునా.

కృష్ణుడు తన ఇంటి లోనే ఉన్నాడు. ఇక్కడ ఎక్కడా లేడు.

కృష్ణుని ఎల్లప్పుడూ చూడకుండా చేస్తున్నాయి ఈ కనురెప్పలు అని ఒకనాడు అనుకున్నాను. నేడు విచ్చిన కన్నులు. కనుపాపలలో లేడే ఆ పాపడు.

అక్కడే కూలబడింది చంప. కొంతసేపటికి పక్కన కదలిక తెలిసి చూస్తే, కుముద. ఇద్దరూ ఏమీ మాటాడుకోలేదు. మౌనంగానే వేదన పంచుకున్నారు. 

రాత్రి గడచిన కొద్దీ, అష్టమి నాటి వెన్నెల చల్లగా చిక్కగా కమ్ముకుంటోంది. ఆకాశంలో తారలు ఒకటొకటిగా బయటపడి మెరుస్తున్నాయి. 

పద్మ, కుసుమ, రమణి ఇలా ఒకరొకరుగా చేరుకున్నారు.

"ఈ వెన్నెల..." అన్నది ఒకామె గొంతు పెగల్చుకొని. 

"శుక్లపక్షమే కాని మనం ఇప్పుడు కృష్ణపక్షంలో లేము కదా" అన్నది ఒకామె.

సహింపలేని చల్లని వెన్నెలను పంచలేక రాత్రి గడచింది. నులివెచ్చని సూర్యుడు తొంగి చూచేవేళ అందరూ కాళ్ళీడ్చుకొని ఇళ్ళకు మళ్ళారు.

పగలు రాత్రి మరల అదేవిధంగా తిరిగాయి.

మధ్యాహ్న వేళ.

తాటితోపులో ఒక చెట్టు మొదట్లో పడుకొని ఉన్నాడు బలరాముడు.

మనిషి పొడుగు. పెద్ద పంచను గోచీలాగ చుట్టుకొని ఉన్నాడు. 

అసలే ఎర్రని వాడు. చెట్ల ఆకుల మధ్యనుండి పడే ఎండకు మరింతగా కంది ఉన్నాడు. 

పక్కనే ఒక ముంత. ఉండుండి కదులుతోంది, గాలికి కాబోలు.

ఎండ, మాటుపడి, నీడ తగిలేసరికి కనులు తెరచాడు. 

చుట్టూ నిలబడిన వారిని చూచి, లేచి కూర్చున్నాడు.

'ఏమిటి' అన్నట్లు చూపు.

"రామా" అంది వల్లి.

"ఏంటి నా దగ్గరకు వచ్చారు? " బలరాముని మాట స్థిరంగానే ఉంది. 

"ఏం లేదు, తమ్ముడు... కనబడట్లేదు..." అని గొంతు సవరించింది ఒకామె.

"నాతోనే వస్తున్నాడుగా. ఇవాళ ఇంట్లో ఉన్నాడు, అంతే " అని పెళుసుగా అన్నాడు అన్న.

"అది కాదూ..." తలవంచుకుని అంటోంది ఒకామె.

లేచి నిలుచున్నాడు బలరాముడు. చేతిలో ముంతను ఎత్తి మిగిలిన నాలుగు గుక్కలు నోట్లో వేసుకొని, పారేసాడు. 

"నాకేం తెలుసు? తమ్మునే అడగండి" అని వెళ్ళిపోతున్నాడు. 

"ఆగవయ్యా కోపం తెచ్చుకోకు" అన్నది చంప. ఆమె గదమాయింపుతో తగ్గాడు రాముడు.

చిన్నవాడే కాని మనిషి ఎత్తరి.

అతని ముఖంలోకి చూస్తూ అంది చంప

" నీ తమ్ముని గురించి అంతా తెలిసేది నీకే అని మాకు తెలుసు.

నువ్వే చెప్పాలి.. ఏమయ్యింది?"

ఒక నిమిషం ఆగాడు అన్న.

"చెప్పు రామూ" మరొకరి లాలన.

"ఏంలేదు, మొన్నెపుడో అమ్మ కన్నీరు పెట్టుకుంది తమ్ముని దగ్గర "

"అయ్యో ఎందుకని " నాలుగైదు గొంతుకలు.

"ఇంటి మీదకు తగవులు తేవద్దురా, భరించలేకున్నాను, అంది. సరేనమ్మా అన్నాడు తమ్ముడు. అదీ సంగతి " అని బయలుదేరుతున్నాడు రాముడు.

"ఆగాగు" అని అడ్డుకుంది చంప, " మరి మేమేం చేసాము? " 

'అవును సుమా ' అన్నట్లు అందరి చూపులు.

బలరామునికి నేల చూపులు.

"ఒరే మల్లా" అంది కుముద.

అప్పటివరకు ఆమె వెనక ఉన్న మల్లడు ముందుకు వచ్చాడు.

సన్నగా పొట్టిగా ఉన్నాడు. ఒక గోచి,  వాని కన్న పొడుగ్గా ఉన్నట్లు వేలాడుతోంది.

చిన్న ముంతను సందేహంగా అన్న చేతులో పెట్టి తుర్రుమని పరుగెత్తాడు.

నేలమీద కూర్చున్నాడు రాముడు. కొత్త ముంతను పక్కన పదిలంగా పెట్టుకున్నాడు. ఏ ఒక్కరిని కాక అందరినీ చూస్తున్నట్లు మెల్లగా అన్నాడు, "మీరు కూడా ఏమైనా అనుకున్నారేమో"

"ఏమీ అనలేదే" చప్పున ఒక గొంతుక.

"పైకి అనకున్నా, లోపల ఏమైనా అనుకున్నారేమో, ఆలోచించుకోండి" 

"అదికాదు..." ఎవరో అనబోయారు.

"చెప్పానుగా, ఇంక వెళ్ళండి" అని ఎర్రని కనులతో అందరినీ చూసాడు. 

ముంతను నోట్లో ఒంపుకొని రెండు గుటకలు వేసి, కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

అతను చెప్పగలిగినది చెప్పాడని, ఇంక మాటాడడు అని అందరికీ అర్థం అయింది.

దగ్గరలో చెట్ల వద్దకు వెళ్ళి నీడలో కూర్చున్నారు. ఎవరికి వారికే ఆలోచనలు.

ఎండ ఉంది. కాని వేడి లేదు, తాపం లేదు. తాపం అంతా లోలోపలే ఉంది. చెట్టు నీడ ఇచ్చే చల్లదనం తెలియనట్లు, చాలనట్లు అనిపిస్తోంది. గాలి రివ్వున వీస్తోంది. అంతకన్న ఎక్కువగా ప్రశ్నలు, సమాధానాలుగా తలపుల కదలిక.


"ఒకసారి నేనే అనుకున్నాను... ఎందుకు అని..." గొంతు పెగల్చుకొని అన్నారెవరో.

"..‌. నేను కూడా... ఎందుకో..." మరొకరు.

"సంసారం ఒక పక్క.. అని సందేహం"

"మొగుడు, ఇల్లు..."

"రాత్రి నిద్ర ఉండట్లేదని..."

"... ఎందుకో తప్పు అనిపించి... "

ఇలా ఒకటొకటిగా మాటలు పైకి వచ్చాయి.

"కాని, ఆ వేణుగానం... "

"కృష్ణుడు... "

" లేకుంటే ఎలా? "

సంశయ స్వరాలు.

లేచి నిలబడింది చంప, " అందరమూ ఏదో ఒకటి అనుకున్నవారమే, అందుకే ఇలా..." అంది.

"మరి ఇప్పుడు ఏం చేద్దాం" ఆత్రంగా, ఆశగా అడిగింది కుసుమ.

"కృష్ణుని ఇంటికి వెళ్దామా? " చిన్నపాటి ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూండగా అంది పద్మ.

"వెళ్ళి... ఏమని చెప్పాలి? " ఎదురు ప్రశ్న.

నిశ్శబ్దం.

"కృష్ణుని ఇంటికే పోనక్కరలేదు" అని, ఏదో తెలిసినట్లు చెంగున లేచింది కుముద.

'అయితే ఏమిటి ' అని అడిగే లోపలే, " మనం ఇళ్ళకు పోదాం. కృష్ణుడే వస్తాడు" అంది ధీమాగా.

మెల్లగా అందరికీ అర్థం అయింది.

"అవును"అన్నారెవరో, "మనం లోపల అనుకున్నాం. ఇప్పుడు పైకే మాటాడుకున్నాం... చాలు" 

'సరియే' అన్నట్లు అందరూ లేచారు. కదిలారు వడివడిగా.

చెట్లను, లతానికుంజములను చూస్తూ, 'రాత్రి వస్తాం' అనుకుంటూ, వాటిని చేతులతో  నిమురుతూ నడిచారు.

ఎక్కడనుండో కోయిల కూత వినవచ్చింది.

కృష్ణుని ఇంటికి ఎవరూ వెళ్ళలేదు కాని, అక్కడ వేరొక గుంపు కనబడుతోంది.

కారణం బొవ్వప్ప.

మధ్యాహ్న వేళకు ఇంటి ముంగిటికి వచ్చి నిలబడింది. 

వీధి అంతా కనబడుతోంది. ఎవరి అలికిడి లేదు.

ఎందుకనో ఆమె అడుగులు ముందుకు పడ్డాయి.

తనకు  తెలియకుండానే నడుస్తోంది.

ఎప్పడో కాని బయటకు రాదు. ఇవాళ ఎండ ముదురుతున్న వేళ రావటం! 

చూస్తూనే ఆవిడ వెనుక ఒకామె.

'ఎక్కడికి' అని అడగలేదు.

మరో నాలుగు అడుగులు వేసేసరికి ఇంకొకరు. మొత్తానికి యశోద ఇంటికి చేరేసరికి ఒక గుంపులా తయారయింది.

ఇందరిని చూడగానే యశోద కంగారు పడింది. 'కృష్ణుడు ఇంటిపట్టునే ఉన్నాడే' అనుకుంటూ నిలుచుంది.

"కృష్ణుడు లేడా ఇంట్లో" అని ముందుగా బొవ్వప్ప పలకరింపు.

"ఉన్నాడూ " అని మెల్లగా" ఏమయింది " అంది యశోద.

"ఏంలేదు, నాలుగు నాళ్ళనుండి కనబడలేదు ఎక్కడానూ "

"అవును" అంది మరొకతె, "ఏమిటో కృష్ణుణ్ణి చూడకుంటే ఏదోలా ఉంటేనూ... " అని సాగదీసింది.

"బావుందమ్మా" చప్పున అందుకుంది యశోద, తనవంతు వచ్చింది కదా, గొంతు పెరిగింది, "మావాడు వస్తే ఇవి చేసాడూ అవి చేసాడూ అని తగవుకు రావటమా? మీ జోలికి రాకుంటే, ఇలా అడగటమా? విడ్డూరం " అన్నది.

ఆమె చెప్పింది నిజమే కదా, ఎవరూ ఏమీ అనలేకపోయారు వెంటనే.

నెమ్మదిగా మాట కలిపింది పక్కింటి రంగనాయకి, " అది కాదే యశూ, పిల్లాడికి ఏమైనా ఒంట్లో బాలేదేమో అని... "

"ఏం లేదు " మధ్యలోనే మాట ,తుంచివేసింది యశోద," చక్కగా ఇంటిపట్టునే ఉన్నాడు. మీరింక వెళ్ళచ్చు"

"ఓసారి పిలుద్దూ, చూచి పోతాము"

"ఎందుకూ, ఇంట్లో నేను చేసిన మా ఇంటి వెన్న వేసుకొని తింటున్నాడు. మీ చూపులు పడక్కర్లేదు"  అంది యశోద.

ఇన్నాళ్ల తగువులకీ చెల్లింపు చేసే అవకాశం వచ్చింది కదా. ఆమె మాట సూటిగా పుల్లవిరుపుగా ఉంది. దాంతో ఎండ మరింత వేడిగా తగులుతోంది. 

ఆమెకు దగ్గరగా వచ్చి, నచ్చచెప్తున్నట్లు 

"మాట వినవే" అంటోంది ఇంకొకతె, "మా పిల్లలు కూడా ఏమిటో మందకొడిగా అయ్యారు..." 

"అయితే కానీ నాకేంటి" అని యశోద ఇంకేదో చెప్పేలోగా మెల్లగా వచ్చాడు కృష్ణుడు. తల్లి వెనకే నిలబడ్డాడు.

కృష్ణుని చూడగానే, ఎండ చల్లగా అనిపించింది అందరికీ.

"ఏవిరా కిట్టయ్యా! మా ఇంటికి రావట్లేదు? " ఎవరో గబుక్కున అన్నారు.

అదే ప్రశ్న అక్కడ ఉన్న అందరి చూపులలో కనబడుతోంది.

"ఎందుకూ" అన్నాడు కృష్ణుడు.

ఏమని చెప్తారు. నిశ్శబ్దం.

నవ్వాడు కృష్ణుడు.

'వస్తానులెండి' అన్నాడా!?

ఆ నవ్వులో అలా వినిపించిందో, అనిపించిందో. 

"ఇంక వెళ్ళండి" అంది యశోద.

ఒకరొకరు వెనక్కు తిరిగారు. ముందుకు నడుస్తున్నారు కాని అందరికీ వెనకచూపులే. కృష్ణుడు అక్కడే నిలబడి ఉన్నాడు. తన మీదనే కృష్ణుని దృష్టి ఉన్నట్లు ఎవరికి వారికే అనిపిస్తోంది.


ఇంటికి వచ్చింది బొవ్వప్ప. కోడలు ఇంట్లోనే ఉంది.

 "ఎక్కడికి వెళ్ళారూ, గుమ్మం తలుపు గడియ కూడా పెట్టకుండా... " అంది కోడలు.

"దొంగ, తన ఇంటిలోనే ఉన్నాడు. ఇంక మన ఇంటికి ఎందుకు గడియలు, తాళాలు?" అంటూ లోపలికి నడిచింది బొవ్వప్ప.

ఆశ్చర్యంగా చూసింది కోడలు.

అదే విస్మయం అన్ని ఇళ్ళల్లో, ఊరిమీద మేఘంలా కమ్ముకుంది. ఉండీ ఉండీ నాలుగు చినుకులు పడ్డాయి.


పొద్దు వాటారింది. రాత్రి కొరకు అందరి ఎదురుచూపును అర్థం చేసుకున్న భానుడు, గబగబా పడమటి కొండలలోకి జారుకున్నాడు.

మినప్పిండి, బియ్యప్పిండి నానబెడుతోంది కోడలు.

"మరికాస్త వెయ్యి" అంటోంది బొవ్వప్ప వీధి అరుగు మీదనుండి, "మరీ మూడోనాలుగో కాదు, ఎక్కువ చెయ్యి"

మాటాడకుండా చెప్పినట్లు చేసింది కోడలు. కారం బూరెలు తయారయ్యాయి.

గంపలో అటకెక్కి కూర్చున్నాయి.

రాత్రి చల్లగా సాగి వచ్చింది. 

మింట చుక్కలు తమతమ స్థానాలలో ప్రకాశిస్తున్నాయి.

చంద్రోదయమే ఇంకా కాలేదు.

తొందరగా భోజనం చేసి, నిద్రకు చేరింది బొవ్వప్ప.

రాత్రి, చీకటి, వెన్నెల, నిద్ర... ఆన్నీ కలిపి ప్రసరిస్తున్నాయి.


రాత్రి ఏ జాములోనో, అలికిడికి మెలకువ వచ్చింది. అటకమీద గంప కదిలినట్లు, పక్కింట్లో పెరుగుకుండ పగిలినట్లు, పరుగులు పెట్టిన అడుగుల సవ్వడి... వినవచ్చాయి.

'మాయ' అనుకుంటూ ఒత్తిగిలి పడుకుంది బొవ్వప్ప.

కోడలి గురించి చూడలేదు.

మరి, అత్తకు కూడా ఇప్పుడు వినబడుతోంది... నిద్దట్లో...  వేణుగానం!

శుభం.

ఇంత చక్కగా రచించి అందించిన శ్రీమానా పేరి రవి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్.


No comments: