జైశ్రీరామ్.
సుజ్ఞాన సంపన్నులారా! అబ్రహం లింకన్ తన కుమారుని పాఠశాలలో చేర్చుతూ, ఆ బాలునికి విద్య గరపు విషయంలో ఎటువంటి మెలకువలు అవసరమో ఉపాధ్యాయులకు లేఖారూపంలో తెలియజేసారు. ఆ లేఖ చదివినట్లైతే ఒక ఉత్తమ ఉపాధ్యాయునకుండవలసిన నైపుణ్యమును సూచిస్తున్నట్టుగా ఉందండి. మీరూ చదివి మీ మనోగతాన్ని తెలియజేయండి. రాబోతున్న సెప్టెంబరు 5వ తేదీన ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులందరూ అభినందనీయులు కావున ఉత్తమ ఉపాధ్యాయ లక్షణ గ్రహణ కొఱకు తగు సూచనలు మీ నుండి వారికి అందుతాయని ఆశిస్తున్నాను.
ఇక చదవండి.
అబ్రహం లింకన్
ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు.
కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను.
ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చును.
చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్ధాలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి.
కానీ, జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.
ప్రియమైన ఉపాధ్యయులారా ! నా కొడుకుని మీ చేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి, కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.
మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ
మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ
వాడు నేర్వాలని నాకు తెలుసు.
కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని
ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ధ నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి.
ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి.
ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి.
మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.
ఎదుటివారి మీద ఆధారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి.
మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి.
సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి.
అయితే అదే సమయంలో "
ఆకాశంలోని పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో,
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి.
ప్రకృతిని వాడు ఆరాదించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి
వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి.
దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి.
వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి.
వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే
సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.
అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు
గుడ్డిగా అనుసరించక, ప్రకక్కు నిలబడ గలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి.
ఎవరు ఏది చెప్పిన, వినడాన్నిభోదించండి.
అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.
మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి.
ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి.
కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి.
వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి.
అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి.
అలాగే బలాన్ని బుద్దిని అత్యధిక ధరకు అమ్ముకోవటం భోదించండి.
కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.
సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు
లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి.
వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాబము, ఎత్తుకు తిప్పటము చేయకండి.
వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి.
ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.
ఇదంతా పెద్ద పట్టికే, తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి. వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు జాగ్రత్తగా చూసుకోండి.
చూచారు కదండీ?
మరి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యగా వ్రాయటానికి ఆలస్యమెందుకు?
జైహింద్.