మమతల మందిరమ్ము, తరమా పరమాత్మకునైననిట్టి త్యా
గమయ ప్రజానురంజనము? గౌరవ కల్పక కల్పకమ్మదే.
సమరస భావ శోభితము. సంతత సంతతి యోగ దాయి తాన్.
తల్లిని మించు నట్టి పర దైవము లేదిల సృష్టి నెందు. రా
గిల్లుచు, ముద్దు పెట్టుకొను, క్షేమము కోరును. దైవ సన్నిధిన్
జల్లగ కావుమంచు మనసార పదింబది మ్రొక్కు చుండు. నా
తల్లి పదాబ్జముల్ శిరము తాకి నుతింతును భక్తియుక్తునై.
తల్లి పాలు త్రాగి తనువును పెంచిన
ధర్మవృత్తి నున్న తనయుడెపుడు
తల్లి ఋణము తీర్చ తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?
మల్లె మరిమళమ్ము, మహనీయ కస్తూరి,
ఘనత కన్న యట్టి కప్పురమ్ము
తల్లి ఘనతఁ బోల తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?
తల్లి దండ్రి లేని దైవంబు భూమిపై
తల్లి ప్రేమ గ్రోల తనయుఁడగుచు
పుట్టు చుండె కాదె పొంగుచు పలు మార్లు.
తల్లి కన్న గొప్పదైన దేది ?
మా అమ్మగారు దైవాంశ సంభూతురాలైన చింతా వేంకట రత్నం పాదారవిందములకు ప్రణమిల్లుతూ,
దైవాంశ విరాజితులైన పుడమిఁ గల మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.
మాతృ దేవోభవ.
జై శ్రీరాం.
జై హింద్.