Tuesday, February 18, 2025

ఆలయలలో…తీర్థం .... సేవించే విధానం తెలుసుకుందాం.

 ఆలయలలో…తీర్థం

ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు రాయొద్దు..?

తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!

గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు.

శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ శిలలకు... రుద్ర నమక చమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి (తులసీదళ సహితమై, పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును)ఇస్తారు.

శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు.

ఈ తీర్ధమును అర్చన పూర్తి అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికి, సన్యసించిన వారికినీ, అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

తీర్ధమును ఎలా తీసుకోవాలి 

అనే ప్రశ్నకు సమాదానం మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి.

తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.

తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం.

తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి.

తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి‌.

అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.

1). మొదటిసారి తీర్థం శారీరక,                                    

    మానసిక శుద్థి జరుగుతుంది.

2). రెండోసారి తీర్థం న్యాయ ధర్మ

    ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.

3). మూడోది పవిత్రమైనపరమేశ్వరుని 

    పరమ పదం అనుకుంటూ 

    తీసుకోవాలి.

**తీర్థాల రకాలు:-*

1). జలతీర్ధం

2). కషాయ తీర్ధం

3). పంచామృత తీర్ధం

4). పానకా తీర్ధం

*1. జల తీర్ధం:-* 

ఈ తీర్ధం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు నివారించబడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.

*2). కషాయ తీర్ధం:-*

ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయములో ఇస్తారు.

రాత్రి పూజ తరువాత తీర్థమును కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనికనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.

*3). పంచామృత అభిషేక తీర్థం:* పంచామృత సేవనం ద్వారా...                    చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

*4). పానకా తీర్ధం:-*

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.

పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంబందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

*ఇతరమైన రకాలు:-* 

ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు.

వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.

సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం - పాటిద్దాం. 

మంచి విషయాన్ని పది మందికి పంచుదాం. 

మన సంస్కృతీ సాంప్రదాయాలను మన పిల్లలకు, భావితరాల వారికి చేరవేద్దాం.


Monday, February 17, 2025

అబ్రహామ్ లింకన్ తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ టీచర్ కి రాసిన లేఖ.

అబ్రహామ్ లింకన్ తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ టీచర్ కి రాసిన లేఖ. ఒక అద్భుతమైన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేఖ. 

ఇది ప్రతి తల్లికి,తండ్రికి, టీచర్ కి, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.

ప్రముఖ అనువాదకురాలు శ్రీమతి శాంతసుందరిగారు దీనిని తెలుగులోకి అనువదించి మనకి అందించారు.

*

" మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు.ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకి రావచ్చు.అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుచేత,దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి.అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.కానీ ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ , జిత్తులమారి రాజకీయ నాయకుడు ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నాయకుడు కూడా ఉంటాడనీ చెప్పండి.అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి.స్కూల్లో మోసం చేసి పాసవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం నేర్పండి.

అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.అసూయకి వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి.కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి.క్రూరులని ఎగతాళి చెయ్యటం నేర్పండి.

పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి,కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షుల గూఢమైన రహస్యాల గురించి,ఎండలో ఝుమ్మనే తేనెటీగల గురించి, పచ్చని కొండలమీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి.అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ ,వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి.

అందరూ మందని అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి.అందరు చెప్పేదీ వినమనీ,సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.

తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కాని తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ,అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.

ఇదీ క్రమం టీచర్, మీకు వీలైనంత వరకూ ప్రయత్నించండి.వాడు మంచి పిల్లవాడు. వాడు మా అబ్బాయి.