జైశ్రీరామ్
తిలక ధారణ
బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటారు పెద్దలు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,
ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు..
రెండూ కూడా స్మశానంతో సమానం..అని పెద్దలు చెబుతూ ఉంటారు.
కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి...అని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు కూడా ఉంటాడు.
కుంకుమ ఎఱుపు రంగు. రంగులలో ఎఱుపునకు అత్యంత ప్రాధాన్యత. ఎఱుపు కరుణకు (దయ) గుర్తు. శక్తిని సూచిస్తుంది. అరుణాం కరుణాం....... అమ్మవారి ధ్యాన శ్లోకం. అలాగే .అమ్మ వారికి కుంకుమ రాగ శోణే అనే ప్రార్ధన ఉంది కదా..
స్త్రీలు కుంకుమ ధరిచడం వేద కాలము నాటి ఆచారం. పురాణతనమైనది..
వివాహిత స్త్రీ పాపిట (రెండుగా విభజించిన తల కేశములు మొదలు ) నుదిటి మధ్య కుంకుమ ధరించుట సంప్రదాయం గా వస్తున్న పరంపర.
స్త్రీకి నుదిటి కుంకుమ ఒక శోభను ,నిండుతనమును కలుగచేస్తుంది.
మహిళలకు పెళ్లయింది అని గుర్తుకోసం పాపిట బొట్టు పెట్టుకోవడం, పక్క పాపిడి కాకుండా మధ్య పాపిడి తీసుకోవడం, పరికిణీ కాకుండా చీర కట్టుకొని ముఖాన పెద్దగా ఎర్ర బొట్టు పెట్టుకోవడం, మెడలో నల్లపూసలు , మంగళ సూత్రాలు వేసుకోవడం, కాలికి మట్టెలు పెట్టుకోడం చేస్తారు. . కనీసం అవన్నీ చూసి అయినా, పరాయి మగవారు ఈవిడకి పెళ్లయింది ఈవిడ జోలికి పోవద్దు అనుకుంటారు . ఇవన్నీ చాలా పాత ఆచారాలు. స్త్రీలని అందరూ గౌరవంగా చూడాలనే ఉద్దేశ్యంతో పెట్టిన ఆచారాలు. పాతకాలం నించీ ఇప్పటికీ ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని గుర్తులు ఉన్నా ఎగబడే కీచకులు రావణాసురులు ఉన్నారు . మగవారికి పెళ్లయింది అని గుర్తుగా ఏమీ లేనప్పుడు మాకు మాత్రం ఎందుకు ఇవన్నీ? అని వీటిని వ్యతిరేకించే మహిళలు కూడా ఉన్నారు.
పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సు అయినా గాని నిష్ఫలము అవుతాయి. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు.
ఇంచు మించుగా చాలామంది భౄమధ్యంలో లేక కాస్త పైన బొట్టు పెట్టుకుంటారు .స్త్రీలు మాత్రమే కాదు పురుషులూకూడా.
ఎందుకూ అంటే అక్కడ ఆఙ్ఞా చక్రం ఉంటుంది . అక్కడే ధ్యానం చేసేటప్పుడు దృష్టి పెట్టాలని చెబుతారు అలా చేస్తే మంచి ప్రశాంతత లభిస్తుంది .
ఏముంటుంది ఆఙ్ఞాచక్రం మీద ?
నమ్మకం ఏమిటంటే సహస్రారంలో మహా కామేశ్వరాంక స్థిత యైన జగజ్జనని ఉంటుంది .వారిపాదాలు ఆఙ్ఞా చక్రం లో ఉంటాయి
బొట్టు పెట్టుకుంటే ఆ శ్రీమాతకు కుంకుమార్చన చేసినట్లే కదా .
అసలు ఆభావన లో ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఆనందతన్మయత్వం కలుగుతుంది.ఆ ఆనందతన్మయత్వంలో కన్నీరు వస్తుంది.
కళ్ళలో నీళ్ళు ఏంటి ఎందుకొచ్చాయీ .ఓహో గంగమ్మ పుట్టింటికొచ్చిందా ఆవిడ నా కళ్ళ లోంచి బయటకొచ్చిందా
ఇలా మధుర మధురభావాల పుట్టినిల్లు ఆ బొట్టు కదా
ఉదయిస్తున్న భాను బింబం చూస్తే జగన్మాత నుదిటి సింధూరం లా ఉండదూ .పరుచుకున్న ఎరుపు కాంతులు అందరినీ బొట్టు పెట్టుకోమని చెప్పడం లేదూ
స్పందించే మనసుంటె అన్నీ అనుభూతులౌతాయి
బొట్టు పెట్టుకున్న ముఖం ఎంత కళగా ఉంటుంది.
జైహింద్.