జైశ్రీరామ్.
శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఏప్రిల్, 30, 1910 న జన్మించారు.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి, శ్రీశ్రీ గా ప్రసిధ్ధి చెందారు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందారు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు.. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించారు.. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసారు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించారు.
1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించారు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయం గా రాసారు. అందులో ఇలా రాసారు:
"..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది."
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించారు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసారు.
ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించారు. ప్రగతి వారపత్రిక లో ప్రశ్నలు,జవాబులు (ప్రజ) అనే శీర్షిక ను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవారు.. శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. ఆయన మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి ఆయన అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు ఆయన జీవితాన్ని తాకాయి. ఆయన గురించి జీవితచరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి.. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు అంటూ స్వభావాన్ని గురించి వ్యాఖ్యానించారు.
దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. పైగా ఆయన రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా ఆయన ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు.
జైహింద్.