Monday, August 31, 2026

రేనాటి సూరీడు. ... ప్రథమాశ్వాసము.

 రేనాటి సూరీడు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర.చారిత్రక ప్రబంధము. 

రచన  ...  చింతా రామకృష్ణారావు 

ప్రథమాశ్వాసము.

శ్రీ నృసింహ ప్రార్థన.
శా.  శ్రీమన్మంగళ భవ్య భాగ్య నుత లక్ష్మీయుక్తుఁడై నిత్యమున్
క్షేమంబిచ్చెడి నారసింహుఁడు జగజ్జేగీయమానంబుగా
నీ మాన్యోజ్జ్వల భారతావనికి సాదృశ్యంబె లేనట్లుగాఁ
బ్రేమన్ గాచుత, భారతీయత నిలన్ బెంపొందఁగాఁ జేయుతన్.   1.
శ్రీ గణేశ ప్రార్థన.
శా.  శ్రీ మార్గంబున శ్రీగణేశ! శుభముల్, శ్రేయంబు నిత్యంబుగాఁ
బ్రేమన్ వెల్గెడి భారతప్రజలకున్ విఖ్యాతిగా నిమ్ము,  దే
వా! మాన్యుండగు వీరుఁడైన నరసింహారెడ్డి శౌర్యప్రభన్ 
ధీమంతుల్గన వ్రాయుచుంటి కృపతో దీవింపుమయ్యా! ననున్.  2.
శ్రీ భారతీ ప్రార్థన.
శా.  శ్రీమద్వాక్ప్రద! భారతీ! పలుకులన్ శ్రీమంతమౌ వాగ్ఝరిన్
బ్రేమన్ నా కృతిలోన వెల్గ నిడుమా, రేనాటి సూరీడు, మా
యా మోహంబు లెఱుంగనట్టి నరసింహారెడ్డి వృత్తాంతమున్
శ్రీమద్భారత కీర్తిగా నుడివెదన్, నీ పాదముల్ సాక్షిగాన్.   3.
శ్రీమాతృ ప్రార్థన.
శా.  శ్రీమంతంబగు భారతావనిని రాశీభూత ధీశక్తియై
క్షేమంబున్ గనఁ జేయ దేశమునకున్  శ్రీమన్నృసింహుండు, తాన్
నీమంబొప్ప విజృంభణన్ నిలిచె దుర్నీతిన్ ధరన్ మాప, నా
శ్రీమత్సైర నృసింహునిన్ నుడివెదన్ శ్రీమాత! దీవింపుమా.      4.
గురుప్రార్థన.
.  ఆర్యుని, కల్వపూడి కుల హారము వేంకట వీర రాఘవా
చార్యుని, మద్గురూత్తముని, సన్నుతి చేసెద వారి నెన్నుచున్,
శౌర్యనృసింహరెడ్డి కథఁ జక్కఁగ వ్రాసెడి వేళలోన నీ
కార్యము చేయు శక్తినిడ, గౌరవమొప్పగ నంజలించుచున్.    5.
జననీజనకుల సంస్మరణము.
శా.  చింతావంశ్య మనోజ్ఞతేజ విలసచ్ఛ్రీరత్నమాంబాంబనున్,
శాంతోద్భాసితుఁడైన తండ్రి యగు శ్రీ సన్యాసిరామాఖ్యునిన్
జింతల్ బాపి, రచింపఁ జేయమనుచున్ శ్రీమన్ నృసింహద్యుతిన్,
బ్రాంతిన్ వేడుచు నంజలింతును మహౌన్నత్యంబునే గూర్పఁగన్.    6.
సుకవి స్తుతి.
.  మహితులు నన్నయాదిగ సమస్త జగన్నుత సత్కవీంద్రులన్
మహిమఁదలిర్చు చిత్రకవి మాన్యుల నెన్నుచు నంజలించెదన్,
మహిఁగల పండితోత్తముల మండలినెంచి ప్రశంసఁ జేసెదన్,
గుహన దురాత్ములున్ శివులె, కూర్మిని వారికిఁ జేసెదన్ నతుల్.   7.
ఉయ్యాలవాడనరసింహారెడ్డి స్మరణ.
గుప్త పంచమ పాద త్సాహ వృత్తము.
మూలమై ప్రకాశమిచ్చు పూజ్యధాత్రి కివె నతుల్,
క్రాలనీయ నర్జుకట్టు రాజ్యపాలన నితరం
బేల? మర్త్యలోక నాథుఁ డీవె, రెడ్ల గణ నలోన్
బాలవెల్లి వీవె, ముఖ్య భవ్య రెడ్డివర! నుతుల్.  
(అర్జుకట్టు = పునఃపరిశీలన)                          8.
కావ్యరచన  ప్రస్తావన.
శా.  శ్రీమన్మంగళ కావ్య సద్రచన భాసించంగ వ్రాయన్ ననున్
ధీమంతుల్ పురికొల్పిరిద్ధరణిపై స్నేహార్ద్రచిత్తంబులన్,
నీమంబొప్పఁగ వ్రాయుబూను తరి సన్మిత్రుల్  ననున్ గోరిరా
శ్రీమంతున్ నరసింహరెడ్డి చరితన్ చెల్వొందఁగా వ్రాయగన్.     9.
.  అర్థశతాధికంబుగ మహత్తర సత్ శతకాదులన్ భువిన్
స్వార్థవిహీన భక్తియుత సద్వర గ్రంథములల్లినాడ,  ని
స్స్వార్థ నృసింహరెడ్డి కథ చక్కని దేశపు భక్తిఁ గొల్ప, ది
వ్యార్థ సచిత్ర వృత్త పరమాద్భుత బంధ ములొప్ప వ్రాసెదన్.     10.
శా.  స్వాతంత్ర్యోద్యమ మూలకారకుఁడు, నిస్స్వార్థుండు, దివ్యాత్ముఁడున్,
భీతిన్ గొల్పి బ్రిటిష్షు దుష్టులకు, సంప్రీతిన్ రచింపంగ వి
ఖ్యాతిన్ భారతమాతకిద్ధరణిపై నాశించి ప్రాణంబులే
ప్రీతిన్  వీడి మహత్వ కీర్తిఁగనె తా రేనాటి సూరీడుగాన్.       11.
.  రాయలసీమ పౌరుషము ప్రాకెను శ్రీనరసింహరెడ్డిచే,
ధ్యేయముతోడ స్వేచ్ఛ భరతేందిరకున్ గలిగించు దీక్షతో,
న్యాయము నిల్పఁ బూనిన మహత్తర మూర్తి చరిత్ర వ్రాసెదన్
వ్రాయఁగఁ జేయఁగా జనని, భక్తిని గొల్పఁగ దేశమాతపై.        12.
. దోషములుండవచ్చు, వినుతుల్గొను  చిత్ర కవిత్వ తత్త్వ వి
న్యాసమునొప్పియుండి, సుగుణంబులతో నలరారుచుండి, సం
తోషము పాఠకాళి కను త్రోవను వృత్తచయంబునొప్పి, స 
ద్భాష మనోజ్ఞ భావమున వాసిని గాంచఁగ వ్రాసెదన్ గృతిన్.     13.
శా.  శ్రీరమ్యంబగు చిత్రబంధకవితాచిద్రూప సత్కావ్యమీ
ధీరోదాత్త నృసింహరెడ్డి కథ భక్తిన్ మాతృ దేశంబుపై
ప్రేరేపించుచు పాఠకాళికి, లసద్రేనాటి సూరీడు స
ద్ధారంబై వెలుగొందుఁ గాత భువిపై నాచంద్ర తారార్కమున్.      14.
అంకితము.
శా.  ఈ కాలంబునఁ బ్రాణ మాన ధనముల్ హృద్యంబుగా భక్తితో
నే కల్యాణ గుణాత్మకుల్ విడిచిరో యీ దేశపున్ స్వేచ్ఛకై,
లోకంబందున గొప్పఁగా మహిత సుశ్లోక ప్రభన్ వెల్గిరో, 
యీ కావ్యంబును వారికంకితముగా నే వ్రాయుచుంటిన్ దమిన్.   15.
రేనాటి సూరీడు కథా గమనము.
భారతదేశ మహౌన్నత్యము.
.  శ్రీమదనంత విశ్వమున శ్రీకర భారతదేశ దీప్తి సు
త్రాముని లోకమందునను గ్రాలఁగఁ బోదు గణించి చూచినన్,
క్షేమము, దీప్తి, ముక్తి నిడు చిద్వర దేశ, మిటన్ జనించుటే
నోముల పుణ్య సత్ఫల మనోహర భాగ్యము ధాత్రి నెంచినన్.     16.
.  సమశీతోష్ణ మనోజ్ఞ దేశమిది, ధీశక్తిన్ బ్రసాదించు, సత్
ప్రముదంబున్ జనపాళికిన్ గొలుపు, ధీరత్వంబునే గూర్చు, లో
కమునందెన్న ననన్య దీప్తి విలసత్ ఖండంబు, శ్రీభారతం
బమలోదాత్త మహత్వ తత్త్వఖని, శోభాపూర్ణ వారాశియే.     17.
.  క్షతినెన్నంగను లేనిదై, నిరత వాసంతంబునై, నిత్యస
న్నుతమౌ సారస పూర్ణదీప్త హ్రదమై, దుర్నీతికిన్ దూరమై,
ధృత జీమూత సముచ్చయంబునయి, కీర్తిన్ వెల్గు భూలక్ష్మియౌ,
క్షితినొప్పారెడి తల్లి భారతము, భాసించున్ జగత్ఖ్యాతమై.   18.
.  ధర్మము నాల్గుపాదములఁ దప్పక నొప్పుగ వెల్గుధాత్రి యీ
మర్మవిదూర దేశము, సమస్త శుభప్రద కర్మ భూమి, స
న్నిర్మల భావనాక్షర పునీత చరిత్ర మనింద్య వర్తులై
కర్మలనాచరించు శుభకాములకున్ నిలయంబు చూడగన్.   19.
మ.కో.  శ్రీమదంబ ధరాతలంబున శ్రీకరంబగు భారతం,
బేమి యీధర భాతి? నెన్నఁగ నేరికౌను? మహేశ్వరీ!
యీ మనోజ్ఞ ఋబుక్ష దీప్తి గణించి దుష్టులు దోచఁగాఁ
బ్రేమఁ జూపుచు నన్యదేశ్యులు విస్తరింపఁగ నెంచిరే.        20. 
.  సమతలమైన భూతలము, చక్కని పచ్చికబీడులున్, వృధా
శ్రమ కలుగంగఁ బోదు, నిలఁ జక్కని సద్వ్యవసాయమార్గమున్
బ్రమదముతోడఁ జేకొనిన వారలకిద్ధరపైన, దివ్య మా
ర్గము కద భారతావని? పరంబు నిహంబును గొల్పుధాత్రియే.  21.
.  కలిగిన వెన్నొ రాష్ట్రములు, కల్గెను భాషలు పెక్కు లిచ్చటన్,
గలిగె సరస్సులెన్నొ, నుతిఁ గన్న మహానదులెన్నొ కల్గె, ని
స్తుల జలధారలెన్నొ వినుతుల్ గనె నీ భరతావనిన్, మహా
ఫలము జనించుటిచ్చటను, భక్తియు ముక్తియుఁ గల్గు నిచ్చటన్.   22.  
.  కళలకు, వేదసంపదకు, గాఢతరంబగు భక్తి శక్తికిన్,
సులలిత మైన భావనల శోభకు, సుందర గాత్ర శుద్ధికిన్,
కళకళలాడుచున్ జెలగు గణ్యనదీనదపాళికెన్నగా 
నిలయము భారతావనియె, నిర్భరభక్తిని గొల్వు మిద్ధరన్.   23.
.  వేదములుద్భవించెనిట, వేదమయంబగు సర్వ శాస్త్రముల్,
బోధను గొల్పు కావ్యములు, పూర్ణఫలంబిడు దేవళంబులున్,
సాధనఁ జేయ యోగముల సంపదనందఁగఁ జేయు సద్గురుల్
శ్రీధరు భక్తకోటియునుఁ జెన్నుగ నొప్పుచునుండి రీ ధరన్.   24.
.  ఋతుధర్మంబులు తప్ప వీ ధరణిపై,  శ్రీమంత వాసంత సం
స్తుతమౌ సత్కళనొప్పునెప్పుడును, సంశోభిల్లు నీదేశమున్
గితవుల్ దుర్గుణ భారతేతరులు ప్రాకృద్ధర్మదుష్టాత్మకుల్
గతమున్ వర్తకమన్ నెపంబుఁగొని, వేగన్ జేరి రర్థార్తుల్.(ప్రాకృత్=నీచము) 25.
భారతీయులలో సమైకతాభావమును ఆంగ్లేయులు చెడఁగొట్టుట .
.  భారతదేశపాలకులు భవ్యులు పూర్వము, భక్తియుక్తులన్
గారవమొప్ప పాలన మగణ్యశుభాస్పదరీతిఁ జేసి రీ
వీరు లనారతంబు ప్రభవింపఁగఁ జేసిరి శోభ లేకతన్
జేరుచునాంగ్లవర్తకులు, చేసిరి మైత్రిచెడంగ వీరిలోన్.     26.
.  ఇంతటి గొప్పదై మను మహిన్ గని, పశ్చిమదేశవాసు లిం
తంతనరాని యీర్ష్యఁ గొని, యద్భుత సైన్యముతోడ వచ్చి, వా
సంతమహత్వ శోభనిలఁ జంపుచు గోరిని కట్టనెంచి, ది
గ్భ్రాంతిని గొల్పుచున్ సమరరంగ విజృంభణఁ జెల్గి రీ ధరన్.  27.
భారతదేశ స్వాతంత్ర్య సమర శంఖారావము.
.  భారతదేశ పాలనకుఁ బట్టుబిగించి రనన్యరీతిలో
ధీరత నాంగ్లజాతి, నినదించెను భారతజాతి స్వేచ్ఛకై,
వీరుఁడు నర్సరెడ్డి ప్రభవించెను రాయలసీమలోన  నా
క్రూరులతోడ యుద్ధమును కోరి యొనర్చెను నాందిఁ బల్కుచున్. 28.
రాయలసీమ.  పాలెగాండ్ర వృత్తాంతము.
.  ధరణిని భారతావనిని దక్షిణ భారతదేశమందునన్
వరలె ననన్యరీతి వరభాసుర రాయలసీమ,  రెడ్డి రా
డ్వరు లట పాలెగాండ్రు, పరిపాలన ధర్మనిబద్ధ చిత్తులై
కరుణ దలిర్పఁ జేసిరి, ప్రగణ్యముగా వర భక్తినొప్పుచున్.       29. 
రాయలసీమ...రాజకీయపరిస్థితులు.
.  రాయలసీమ ప్రాంతమున, రాజులు చేసెడి పాలనంబునన్
ధీయుతులైన రెడ్డికుల ధీరులు వారికి పాలెగాండ్రుగా
సాయముచేయ వారికడ సైన్యముకల్గి ప్రశస్తినొప్పుచున్
ధ్యేయముతోడ పాలన యథేచ్ఛ నొనర్చిరి గ్రామసీమలన్.         30. 
.  బలసంపన్నులు పాలెగాండ్రు, పురముల్ పాలించు సామంత రా
జులుగాఁ జెప్పగ నొప్పు వారలను, రాజుల్ రాజ్యముల్ కోల్పడన్,
బలమున్ బెంచి స్వతంత్ర పాలకులుగాఁ బన్నుల్ ప్రజల్ కట్ట నా
ఫలితంబందున కొంత పంపుదురు కప్పంబున్ నిజాం వారికిన్.   31. 
.  ప్రవిమల చిత్త సంస్కృతిని భాసిలి రెన్బదిమంది పాలెగాం
డ్రు, వినుత పాలనంబునఁ గడుంగడు వృద్ధి నొనర్చి రాజ్యముల్
భువిని ప్రసిద్ధి గాంచునటు, పూర్తిగ రక్షణ గొల్పు కోటలన్
దివియన వెల్గునట్టులుగ తీరుగ కట్టిరనేకముల్ ధరన్.            32. 
కుందేరు (కుముద్వతీనది) - రేనాటి సీమ
సీ.  కుందూ మహానది నందియాలనుగల  యోర్వకల్ మండలి నుప్లపాడు,
గ్రామమందునఁ బుట్టి, గడివేములను, నోర్వకల్ నందియాలను కలయఁబారి,
కోయిలకుంట్లను గూడి యుయ్యాల్వాడ, జమ్మలమడుగుతో జతగఁ గూడి,
ప్రొద్దుటూరునఁ బారి, పొరలుచు కమలాపురంబున పెన్నను రహిని గలియు
గీ.  చుండు, నీ ప్రాంతమంతయున్ నిండు వెలుగు
లీను రేనాడుగా పేరు నెలమిఁ గనెను,
రేగడిని యొప్పు నాడంచు ప్రీతితోడఁ
గనుదు రీనాడు రేనాడుగా ధరిత్రి.                    33.
మ.కో.  కాలమద్భుత శక్తి నొప్పి ప్రకాశ పూర్ణ మహాంధ్ర ర
త్నాల సీమ సృజించె, నందు ననంత భక్తి విరాజితుల్,
హేలగా మహనీయ కార్యము లెల్లవేళలఁ జేయు ను
య్యాలవాడ పురద్యుతుల్ మహిమాన్వితుల్ గల రిద్ధరన్.      34.
.  రాయలసీమ ప్రాంతము ధరాతలమందున ధర్మశక్తితో,
మాయ నెఱుంగనట్టి యభిమాన ధనాఢ్యుల కాలవాలమై,
న్యాయ నిబద్ధులౌచు తనరారు జనాళినిఁ గల్గి యొప్పు, న
న్యాయము నోర్వనట్టి జననాథులతో విలసిల్లె గొప్పగాన్.      35.
ప్రాతః కాల ప్రకృతి వర్ణనము.
శా.  ప్రాతః కాలము వేగుచుక్క యొడమెన్ బ్రాచీదిశన్,  జీకటుల్
ఖ్యాతిన్ గ్రోల్పడి మాయుచుండ, ద్విజ సంఘాతంబు లక్ష్యంబుతోఁ
బ్రీతిన్ సద్రుతితోడ పంకజవిభున్ వేదోదయున్ గొల్వ, వి
ఖ్యాతిన్ గాంతలు వాకిళుల్ దుడుచుచున్ గళ్ళాపులన్ జల్లిరే.             
(ద్విజసంఘాతములు = బ్రాహ్మణులు - పక్షులు. శ్లేష)     36.
స్త్రీల పూజలు.
ఇంద్రవజ్ర.  (త త జ గగ.   యతి 8.)
కాంతామణుల్ పూజలు గణ్యరీతిన్,
శాంతంబుగాఁ జేయుచు సత్యదేవున్
భ్రాంతిన్ విడన్ జూచుచు రమ్యరీతిన్
జింతించుచున్ ధాత్రిని చేయువారే.                 37.
ప్రాతఃకాలమున రమణులు వేయు మ్రుగ్గులు.
అష్టదళ పద్మబంధ సుదర్శన వృత్తము.
సుదర్శనవృత్తగర్భ  మత్తకోకిల వృత్తము.
రామలందరు వేసిరావిధి రాజిలంగల మ్రుగ్గురా,
రామ రూపము వెల్సెరా యట రాడ్ధృతిన్ విలసిల్లెరా
రామ రామయనంగ రాయిటు, రాక్షసారినిఁ గొల్వరా,
రామ సింహమె పుట్టురా యిక రాజ్యభారము మోయురా.    38.
సూర్యోదయ వర్ణన.
.  తూరుపునున్న మబ్బుతెర తూలుచు వీడె నిశావసాన సం
చార దివాకరాగమన సంస్తుతదీప్తి చెలంగు వేళలోన్,
గోరుచు రెడ్డివంశమునఁ గూర్మిని బుట్టెడి శ్రీనృసింహు సు
స్మేరముఖాబ్జమున్ గనఁగ శీరుఁడు తానుదయించె ప్రాగ్దిశన్.    39.
గీ.  బాల సూర్యుండు రేనాటివారి శాంతి,
పగటి సూర్యుండు రేనాటి పౌరుషాగ్ని
యన క్షణక్షణమున సూర్యుఁడతిశయించి
నారసింహునికిలఁ బ్రతిగా రహించె.                    40.
రేనాటి నగరముల వర్ణన.
.  తెలతెలవారుచుండగనె దీక్షగ కర్షకులెల్ల సిద్ధమై
పొలములకేగి సేద్యమును పొందికగా నొనరింపఁ బూని, పం
కిలమును లెక్క చేయక తెగించి పొలంబులఁ బెంట జల్లుచున్,
చెలమల నీరు పైరులకు చేదుచు నుండిరి ఘర్మదేహులై.      41.
.  అంగడులందు వస్తువులనమ్మగ సిద్ధము చేయువారలున్,
బొంగుచు దేవళమ్ములకు పూజలొనర్చగ నేగువారలున్,
సంగడినెక్కినావలికిఁ జక్కఁగ కాలువ దాటువారలున్,
సింగములట్లు పౌరుషము చిందెడి వారు, రహించిరాపురిన్.   42.
శా.  ప్రాతః కాలము సందడించె పురిలో, పాఠ్యాంశ సద్బోధనా
చేతస్కుల్ బడినున్న బాలకులకున్ చెప్పంగఁ జేరన్ బడిన్,
చైతన్యంబలరారు బాలకులు నాశన్ జేరిరచ్చోటికిన్,
ఖ్యాతిన్ వెల్గు పురోహితుల్ గుడుల కేగన్ సిద్ధమై సాగిరే.     43.
రేనాటి పౌరుషము.
సీ.  రేనాటిపౌరుషం బీనాటికిని యట్టులే యుండె నిచటనజేయులైన
వారిలోనున్నట్టి ప్రత్యణువునఁ గూడ పౌరుషాగ్నియె యుండి, ప్రబలుచుండు,
నాత్మాభిమానంబు నలరారుచుందురు, న్యూనతన్ గాంచిన నొప్పుకొనక,
యాబాల గోపాల మట్టులేయుందురు, స్వస్వభావంబునన్ వర్ధిలుదురు,
గీ.  వినుత రేనాడులోపుట్టి వెలుగువారు
చచ్చుటో చంపుటోయని కచ్చితముగ
శత్రువులతోడ పోరుచున్, మిత్రులయెడఁ
బ్రేమ కురిపింత్రు, రేనాడు వీరనాడు.                    44.
రేనాటి సీమ పల్లెవాసులు.
మానిని.  (భ భ భ భ భ భ భ గ.  యతి 13. అప్పకవీయము)
పల్లెజనంబుల మల్లెమనంబులు భక్తికి రక్తికి పెన్నిధులే,
కల్లలెఱుంగక గ్రామములందునఁ గర్షకవృత్తిని గ్రాలెదరే,
యుల్లము పొంగును వారిని గాంచిన, యూహను కూడ చెడున్ గనరే,
చెల్లును వారికె దానము చేసెడి చిద్వర సద్గుణ మెన్నినచోన్.    45.
రూపనగుడి.
కుసుమిత లతావేల్లిత వృత్తము.  (మ త న య య య.  యతి 12.)
కుందూతీరంబందున నుతిగనెన్ గోమలంబైన గ్రామం
బెందున్ జూడన్ రూపనగుడియె రాణింప నందంబు ధాత్రిన్,
కుందే రా తీరంబును విడిచెనా గుందరే తీర వాసుల్ ?
సౌందర్యంబున్ వీడ దటులనె ధ్యాసన్ మదిన్ గుందు సాగున్.   46.
.  రూపన భక్తియుక్తులకు, రూపన ధర్మ మహత్వశక్తికిన్, 
రూపన పౌరుషంబునకు, రూపన జ్ఞానమనోజ్ఞదీప్తికిన్,
రూపన ప్రేమ భావనకు, రూపన భారతదేశ భక్తికిన్,
రూపన పేరు నొప్పు గుడి రూపునొసంగె నృసింహ దీప్తికిన్. (రూపు + అన=రూపన)   47.             
సైరా నరసింహారెడ్డి వంశ వృత్తాంతము.
చంచరీకావళి వృత్తము. (మ మ ర ర గ.  యతి 7వ అక్షరము.)
ప్యారావంశంబందున్ వర్ధిలెన్ లక్ష్మిరెడ్డన్
ధీరోదాత్తుం డేలెన్ ధీవరుం డుప్పులూరున్,
శ్రీరమ్యంబౌ వంశశ్రీయె మూలంబు చూడన్
వీరోత్తంసుల్ కాంతిన్ వెల్గు మజ్జారినెన్నన్.              48.
సైరా నృసింహారెడ్డి మాతామహుఁడు జయరామిరెడ్డి చరిత్ర.
మ.కో.  పిక్కపాలెము పాలెగాఁడుగ పేరుపొందిన చెంచుమ
ల్లక్కజంబగు వంశ జాతుఁ డనన్యుఁడౌ జయ రామిరె
డ్డిక్క డీతని పాలనంబుననెట్టి బాధలు లేక పల్
చక్కగామనుచుండిరందరు, సన్నుతించుచు నీతనిన్.        49.
గీ.  జమ్మలమడుగు మొదలుగా చక్కనైన
వినుత కోయిలకుంట్లయన్ వేల్పునగరి
వరకుఁ బాలించినాడు ధీవరుఁడు రామ
రెడ్డి, శుభకరమ్ముగ ప్రజల్ ప్రీతిఁ గనఁగ.               50.
గీ.  నొస్సమేలునాతఁడు సద్గుణుండు, చెంచు
మల్ల జయరామి రెడ్డి తా మణులవంటి
కూతులిద్దరిన్ మజ్జారి కులజుఁడయిన
పెద్దమల్లన్నకొసఁగెను పెండ్లి చేసి.                     51.
సైరా నరసింహారెడ్డి జననము.
.  మదమెక్కి యొప్పు నాంగ్లుల
మదమున్ దగ నణచఁ బుట్టె మహి నల పద్దె
న్మిదివందలైదులోననె 
గుదెగా నరసింహరెడ్డి కుంభినిపైనన్.                   52.
శా.  శ్రీ మోటాటి ప్రసిద్ధ రెడ్డికులజుల్ చెల్వొందు మల్లన్నకున్,
ధీమాతృప్రభ వెల్గు నీలమకు సద్దేదీప్యమానంబుగా 
భూమిన్ మూడవ పుత్రుఁడై కలిగె నీ పూజ్యుం డసాధ్యుండుగాఁ,
బ్రేమోదార నృసింహరెడ్డిగ, ధరన్ రేనాటి వెల్గై మనన్.       53.
.  ప్రమదంబున్ గలిగించు రూపనగుడిన్ బ్రఖ్యాత శ్రీమన్నృసిం
హ మహాతేజ విరాజితుండు ప్రభవంబయ్యెన్, జనానీకమున్
గమనీయంబగు మార్గమున్ నడుపగా, కల్యాణ సద్భావనా
సముదంచిత్ప్రభ వెల్గె లోకమున ధీశక్తిన్ విజృంభించగన్.      54. 
ఉయ్యాలవాడ లో పెరిగిన నరసింహారెడ్డి.
గీ.  వరలె నుయ్యాలవాడలో పాలెగాఁడు,
నిధిగ పెద్దమల్లారెడ్డి, నీలమసతి
తోడుగా వాని పత్నియై పాడినొప్పి
యుండ, నరసింహుఁడచటనే యుండి పెరిగె.             55.
గీ.  పుట్టి రూపనగుడిలోన, పుడమిపైన
పెరిగెనుయ్యాలవాడలో పెంపు తనర,
రెడ్డి సైరానృసింహుండు, ప్రీతితోడఁ
గష్టసుఖములన్ గ్రహియించు గణ్యగుణుఁడు.               56.
సహకుటుంబీకులు.
.  చినమల్లన్నయె పిన్నతండ్రి, కనగా శ్రీమంతుఁడీతండు, నే
లను తోడై నడయాడిరన్నలగు మల్లారెడ్డి, బాస్రెడ్డియున్,
వినుతింపన్ దగు వంశవర్ధనులు భావిన్ స్ఫూర్తినే గొల్పు నీ
ఘనులం దా నరసింహరెడ్డి యొకఁడే గణ్యుండుగా వెల్గెనే.     57.
కుందేరు నీటి మహిమ.
దీ ప్రఘోష వృత్తము (చతిర్విధ వృత్త సమ్మేళనము)
పాడికిన్ బంటకున్ వారియే ముఖ్యమౌన్, 
మడిన్ జలంబుల్ వరమై మనోజ్ఞమౌన్
వడిన్ బారుచుండున్ ప్రభావంబుతోడన్
జూడంగఁ గుందేరది సోమధారయే.                    58.
నరసింహారెడ్డి  బాల్య క్రీడలు.
సీ.  కుందు పేరున వెల్గు నందాల నదిలోన నన్నదమ్ములు క్రీడలాడినారు,
మంద మారుతముల నందరున్ గ్రోలుచు తీరంబునందునఁ దిరిగినారు,
యిసుకతిన్నెలపైన నసమానముగ నాటలాడుచున్ బాటలు పాడినారు,
సుందరంబైన యా సుకుమార గాత్రులు గరిక తాకిన కాని కందువారు ,
గీ.  బాల్యమందుననత్యంత పరవశమున
బేలతనమున నాడెడి వేళలందె
నారసింహుండు సూర్యుండునాన్ వెలింగె
ధీమహత్వంబు లోకాన తేజరిలఁగ.                     59.
నరసింహారెడ్డిపై ఏనుగు దాడి చేయగా జయరామరెడ్డి బంటు గజ్జి(యోధుఁడు) ఇనుపరోకలితో దానిని తరిమి రక్షించుట.
గీ.  చెంచురామ్ రెడ్డి బంటు భాసించు గజ్జి
యినుప రోకలిఁ జేఁ బట్టు, నేనుఁగొకటి
జలక మాడెడి రెడ్డిపై  కలియఁబడఁగఁ
గొట్టి తరిమెను, రక్షణ కొఱకు నిలిచి.                   60.
నొస్సం జయరామిరెడ్డి కుటుంబము.
.  ఖ్యాతిని గన్న నొస్సమున గణ్యుఁడు శ్రీ జయరామిరెడ్డికిన్ 
కూతురులిద్దరున్, కొడుకు, కోల్పడెరాజ్యమునాంగ్లనేతచే,
ధాతృ విచిత్ర కేళిని వదాన్యుఁడు పుత్రుఁడు నర్సరెడ్డి, స
న్నేత, బ్రిటిష్షువారల కతీతుఁడె  బందిగ నాయె దుర్విధీ!      61.
1800లో క్యాంబెల్ జయరామరెడ్డి కుమారుఁడగు నరసింహారెడ్డిని ఖైదీ చేయుట.
.  కప్పము కట్టలేదనుచు క్యాంబెలు నొస్సము నర్సరెడ్డినే
యొప్పరికింప కత్తరిని యోపని బాధలు పెట్టి, గుత్తిలోఁ
జప్పున ఖైదునందు నిడ, సత్వగుణుండగు నర్సరెడ్డి యీ
తిప్పల చేతఁ గ్రుంగి గణుతింపఁగ రాని నిరాశ మున్గెనే.       62.
.  అచటనె నర్సరెడ్డి యడియాసను గ్రుంగి, కృశించి, శల్యమై,
విచలిత చిత్తుఁడై, యనుభవించుచు బాధల, నాంగ్లపాలకుల్
సుచరితుఁడైన వీనియెడఁ జూపెడి దాష్టికమున్ దలంచుచున్,
బ్రచురత దేశభక్తునిగఁ బ్రాణము వీడి ప్రసిద్ధిఁ గాంచెనే.        63.
.  తీరని వేదనాభరిత దీన సమావృత దుస్స్థితిన్ మహో
దారుఁడు రామిరెడ్డి గుణధాముఁడు పొందెను పుత్రశోక మే
పారగ,  నేమి పాపము నవారిత రీతినొనర్చియుంటినో
కోరి? యటంచు దుఃఖమున కూరె నయో, విధిఁ దాట శక్యమే?   64.
దౌహిత్రుఁడగు నరసింహారెడ్డిని తన వారసునిగా రామిరెడ్డి ప్రకటించుట.
.  తనయుఁడు పోయెనం చతఁడు తల్లడమంది, నృసింహరెడ్డియే
తనదగు రాజ్యభారమును తప్పక మోయఁగలాడటంచు, పె
త్తనము నొసంగ నెంచి, తన దత్తునిగా నరసింహరెడ్డినే
గని జయరామిరెడ్డియె ప్రకాశముగా ప్రకటించెఁ బుత్రుగాన్.     65.
తాతతో మనుమఁడు.
.  జననికి తండ్రియై, తనను సన్నుతిఁ గాంచెడి తాత, దేశపా
లనమున నైపుణిన్ గొలుపు లక్ష్యము నొప్పెడి రామిరెడ్డితో
మనమునఁ బొంగుచున్ నిలిచి, మాన్య గుణంబుల నొప్పుచుండె నీ
ఘనుఁడు నృసింహరెడ్డి, ధర గణ్యులలో మహనీయ మూర్తిగాన్.  66.
.  మనుమఁడు దత్తపుత్రుఁ డభిమానముతోఁ దనచెంతనుండగా,
తనదగు రాజ్యపాలనము తప్పక చేయఁగ నున్నవాఁడటం
చనితర ధీమతిన్ వెలుగ, నద్భుత విద్యల సాధనార్థమై
ఘనముగఁ జేర్పనెంచె వర గౌరవమొప్పఁగ గుళ్ళదుర్తిలోన్.      67.
.  కనఁగాఁ గానగ రావు బళ్ళు చదువన్ గాంక్షింప, నుయ్యాలవా
డను, శోభిల్లెడిదైన రూపనగుడిన్, డంబంపు శ్రీయింజివీ
డుననైనన్, నుత గుళ్ళదుర్తి యను వీడున్ గల్గె విద్యాలయం
బనవద్యంబగు విద్య నేర్పుటకునై యానంద సంవర్ధియై.        68.
.  మనుమని నడ్డ దారిని సమంచితరీతిని గుళ్ళదుర్తికిన్
దనదగు నశ్వమెక్కి, వినుతంబుగఁ జేర్చుట కుద్యమించగ
మనుమడు ప్రశ్నవేసె, ఋజు మార్గము వీడుచు నడ్డదారిలో
మన మరుగంగ నేల? ననుమానము తీర్చుము తాతయా! యనెన్. 69.
.  మనుమఁడు "గుళ్ళదుర్తికి సమంచిత రీతిని పోవనొప్పు రూ
పనగుడి మీదుగా, నటులవద్దని యడ్డుగ పోవుటేలనన్,"
మనుమఁడ! యాంగ్లపాలకులు మార్గములోఁ గనిరేని నన్ను, నిన్,
చెనఁటులు గుఱ్ఱమున్ గనుచు, శిక్షలు వేయుదురంచుఁ బల్కె తాన్.  70.
శా.  తాతా! గుఱ్ఱము వారిదా? యనగ, సంస్థానాశ్వమేయంచనెన్,
ఖ్యాతిన్ గాంచిన రెడ్డివంశజుఁడవే,  యాంగ్లేయులన్ జూచి, యీ
రీతిన్ భీతిని పొందుటేలనన, ధాత్రిన్ వారి దౌష్ట్యంబులన్,
ఖ్యాతిన్, జూచి, యుపేక్ష తప్పదని, మార్గంబందుఁ బోఁ జొచ్చె తాన్.71.
గీ.  గుళ్ళదుర్తికిఁ జేర్చెను కొమరు మిగుల
నిటుల జయరాముఁ డాతనిన్, జటిలమైన
విద్యలన్నియున్ నేర్పింప, విజయ పథము
నందు మనుమనిన్ నడుపంగ సందడిగొని.              72.
తాత జయరామిరెడ్డి మనుమడు నరసింహారెడ్డికి 
విద్యలు నేర్పించ దలచిన గుళ్ళదుర్తి గ్రామ శోభ.
.  కోయిలకుంట్లకున్ దరిని గుళ్ళొకవేయికి పైనఁ గల్గి, య
న్యాయ విరుద్ధ బోధనల నద్భుతరీతిని చేయునట్టి, స
ద్ధ్యేయమునొప్పు విద్యలను తీరుగఁ జెప్పెడి పాఠశాలలన్
రాయలసీమనొప్పి తనరారెడి గ్రామము గుళ్ళదుర్తియే.       73.
.  ఘనతర సచ్చరిత్రను ప్రకాశము, పేరును గన్నభూమి, సా
ధనమున సర్వవిద్యలు నుతంబగు శక్తిని గొల్పు భూమి, శో
ధనమున స్తుత్య విద్యల యథార్థము బోధనఁ జేయు భూమి, వే
దనలను మాపు భూమిగ నితాంతము వెల్గెను గుళ్ళదుర్తియే.   74.
.  పేరును గన్న పెద్ద లట వేలకు వేలుగ వెల్గినారు, వి
స్తార చరిత్రఁ గల్గిన విశాల మనస్కుల వేది యద్ది, సు
స్మేర ముఖారవిందులయి చేసెడివా రఁట బోధ సద్గురుల్,
పారమునంటు భక్తి పరివర్ధకులే కన గుళ్ళదుర్తిలోన్.        75. 
ప్తవింశత్యధిక ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల.
మును కనుమా! లసద్ గుణ విమోహిని చూడఁగ గుళ్ళదుర్తి యే.
వన మనుమా మదిన్ గురు ప్రభాఘృణి ధాత్రిని గుళ్ళదుర్తియే
తన మన వాక్కులన్ గుల విధాయి నయాన్విత గుళ్ళదుర్తి యే
తన ఘనతన్ గనన్ గుశల దాయిని సన్నుత గుళ్ళదుర్తియే.   76.
.  సతము గతించు కాలమున సత్యచరిత్రలు కాల గర్భమం
దతులిత రీతి మాయమగునట్టి చరిత్రము గుళ్ళదుర్తికిన్,
గతమున గుళ్ళు వేయి యిఁట కల్గుటచేతనె గుళ్ళదుర్తియై,
క్షితినది గుండ్లదుర్తిగఁ బ్రసిద్ధివహించెను నేడు సీమలోన్.     77.
గుళ్ళదుర్తిలో తన మనుమనికి  తాత జయరామిరెడ్డి  బుద్ధులు గరపుట.
.  విద్యలు నేర్చుకొందువని ప్రీతిని నే నినుఁ జేర్చినాడ నీ
విద్యలనెల్ల నొప్పఁ బ్రభవింపఁగఁ జేసెడి గుళ్ళదుర్తికిన్,
సద్యశమిచ్చు విద్య,  మనసారఁగ నీవు గ్రహించి గణ్యమౌ
విద్యలలో రహింపవలె, విస్తృత కీర్తి గడింపఁగావలెన్.       78.
.  మాన ధనాఢ్యులై చెలగు మాన్యులు నీ గురుదేవులెన్నగా,
జ్ఞాన మనోజ్ఞ విత్తమును కాదనకిత్తురు కోరినంతగా,
నీ నయవర్తనన్ గొలిచి నేర్పుగ నీ గురుదేవులన్ సదా,
ప్రాణ సమాన విద్యలను భక్తిగ నేర్చి, రహించు, మన్మఁడా!  79.
ప్రమాణి వృత్తము. (జ . ర . వ. యతి లేదు.)
ప్రమాణమీవె నీకు, నీ  -  సమానులైనవారితో
క్షమన్ రహించుచుండుమా! -  ప్రమాదమందబోకుమా!      80.
.  చూచుటకందరున్ ఘన యశోమయులట్టులనుందు రందుచేఁ
జూచినదెల్ల సత్యమని చూడగఁబోకు, గణించి చూడు,  స
ద్రోచులు కానిపించు గణుతుల్ గనువారల నుండి నీకిలన్,
నీచుల నమ్మఁబోకు, గుణనీయుల సన్నిధినే మెలంగుమా.    81. 
.  నేర్చిన విద్య మిత్రులకు నేర్పుచునుండుము పెక్కుమా, ర్లదే
యర్చన విద్యలమ్మకు, మహత్తర రీతిని వంటపట్టు, నా
యర్చన బోధనం బదియె యద్భుత రీతిని సాధనంబగున్,
జర్చలొనర్చుచుండినను చక్కఁగ జ్ఞానసమృద్ధి కల్గెడున్.      82.
ణిగణనికర వృత్త గర్భ కందద్వయము.
క1.  కితవుల నెఱుఁగుము,  కృపణుల , 
గతిఁబోకయ! తెలిసి నీవు  ఘనుఁడుగనిలు, నీ
కతులిత శుభముల నరయఁగ 
సతమున్ నుతులౌ ఘనులకు సరసన నిలుమా!             83.
క2.  స్తుతమతు లను కనుచు మెలఁగు 
మతితో నీవెపుడు కూడ, మాన్యుఁడ వగుచున్
జితరిపువుగ నిలు క్షితిపయి 
నతులా! నినుఁ గాచుత హరి, యనుపమ రీతిన్.           84.
.  ఇట్టులనేక సూక్తులు మహిన్ విలసిల్లఁగఁ జేయు మాటలన్
బట్టుగ తాత చెప్ప నవి భక్తిగ శ్రద్ధగ నాలకించి, రా
పుట్టువు నందియుండిన విభుండయి దేశము నేలు సింహమ
ట్లొట్టుగఁ జెప్పుచుంటి మతినుంతును  నీ యుపదేశమం చనెన్.  85.
.  కాలము చిత్రమైనది, ప్రకాశము గొల్పునొ కొల్పకుండునో?
చాలము దానినెన్న,  గుణసాంద్రులు సూచనలిచ్చుచుండ తా
మేలను చూచుచున్ పరిగణింపరు పెద్దల సూచనల్, భళీ,
బేలగ నీ నృసింహుడు సువిస్తరరీతి గ్రహించెనన్నిటిన్.        86.  
లకంఠ వృత్తము. (స జ న జ భ న ర న గ.  ప్రాసయతి -  2 - 10 - 18 అక్షరములు. ) 
జయరామరెడ్డి తన ప్రియమైన మన్మనికి నయమెన్ని నీతి ఫణుతుల్
ప్రియమారఁ దెల్పఁగ, వినయచిత్తుఁడై మనుమడయినట్టి యా నృహరి యా
ప్రియవాక్యముల్ వినెను, జయమార్గమున్ నడుతునయ తాతయా! యనుచు న
క్షయదీప్తితోఁ బలికి, భయమన్నదే విడిచి, జయకాంక్షతో నిలిచె తాన్.  87.
సైరా నరసింహారెడ్డి విద్యాసముపార్జన.
.  తరగతిలోననందరికి తాను ప్రియమ్మయినట్టి మిత్రుఁడై,
పరమ దయాపరుండునయి, పావన సచ్చరితుండునై, మహ
త్తరమగు జ్ఞానదీపమయి, ధర్మమహోన్నతమార్గవర్తియై,
పరమగురుప్రబోధ ములు భక్తినెఱుంగు నృసింహుఁడచ్చటన్.    88.
నరసింహారెడ్డి ఆప్తమిత్రులు.
గీ.  అసమ సుగుణుఁడై వర్తించు నొసము ప్రాంత
పొడ్డె యోబన్న మిత్రుఁడై యొప్పె, నటులె
నరసరెడ్డికి మిత్రుఁడై పరఁగె నాకు
మళ్ళ వెంకయ్య గోసాయి మహితుఁడునిల.               89.
మ.కో.  ఇట్టి మిత్రులనేకులచ్చట నీ నృసింహుని తోడుగాఁ
బట్టుపట్టి మహోత్తముండయి వర్ధిలెన్ బహు విద్యలన్,
బట్టుగా నహమందు నాతఁడు పాఠముల్ పఠియించుచున్,
జిట్టచీకటిలోన సామును చేయుచుండె సముద్ధతిన్.           90.
.  తనతోడన్ బ్రతివాదమున్ సలుపు నేతన్మాత్రులన్ మైత్రితో
తన మిత్రత్వసుఖంబునే కనునటుల్ తా ప్రేమతోఁ బల్కుచున్,
క్షణమందే తనవైపు త్రిప్పుకొనుచున్, గణ్యాత్ముఁడై యొప్పుచున్,
దన తాతన్ మురిపించు మంచితనమున్ దాన్ బెంచు కొంచున్ ధరన్.91.
.  భారతదేశమాతృ హితవాఙ్మయతేజ మటంచు, ధాత్రిపై
ధీరవరేణ్యులౌ సుగుణ దీధితులన్ గనునట్టి తల్లిగా
నీ రమణీయ దేశమె గణింపఁగ నాక మటంచు, నిచ్చటన్
గోరుచు విష్ణుదేవుఁడును కూర్మిని బుట్టునటం చెరింగె తాన్.     92.
.  చోరులు లేని దేశమని,  చూడగ యాచకుఁ డొక్కఁడైన నీ
భారతదేశమందు దురవస్థను గన్బడు వాఁడు లేడటం
చారసి, విస్తుఁ బోయిన నిరర్థక జీవను లాంగ్ల దేశ సం
చారులు, చోరలక్షణు లసంగత చేష్టులటం చెఱింగె తాన్.   93.
గురువులు నేర్పిన విద్యలు.
.  గురువులు శాస్త్రవిద్యలను,  గూఢతరంబగు వేదవిద్యలన్,
నిరుపమ వైద్యవిద్యలను, నిస్తులరీతి నెరుంగఁ దెల్పి,  స
ద్వర పరమార్థవిద్యల ప్రభావము తెల్పి, రహింపుడంచు, సు
స్థిరవరభావనాధృతిని తృప్తిగ వెల్గుట నేర్పి రుద్ధతిన్.        94.
గీ.  దేహదార్ఢ్యము, ధిషణ, సుధీవివృద్ధి,
సాహసోపేత నిర్ణయ శక్తి, యుక్తి,
మోహపాశవిముక్తి, ప్రపూజ్యులయిన
గురువులే కల్గఁ జేసిరి కూర్మితోడ.                     95.
.  నేర్చెననేక విద్యలను, నేర్చెను నేర్పగ మల్లయుద్ధమున్,
నేర్చెను కత్తి సాము, గడినే తగఁ జేసెడి కర్రసాము, తా
నేర్చె నమోఘభాషణము, నేర్చుకొనెన్ విలువిద్యలన్నియున్,
నేర్చె నివన్నియున్ గృషిని,  నేర్వడు వెన్నును చూపుటొక్కటే.  96.
.  శత్రులనెట్లెఱుంగుటయొ, శత్రుల చిత్తము లెట్లు దోచుటో,
శత్రు జనాళి భీతిలఁగ సంస్తుతరీతిని జేయుటెట్లొ, యా
శత్రులు చిక్కఁబట్టినను, చక్క మొఱంగి గమించుటెట్లొ తా
నాత్రముతోడ నేర్చె గురునాథులు నేర్పగ నైపుణీప్రభన్.       97.
.  కత్తిని బట్టి శాత్రవుల కంఠములెట్టుల త్రుంచుటో వడిన్,
విత్తమునెట్టులార్జనము వేగమె చేయుచు దాచియుంచుటో,
క్షుత్తును బాప పేదలకు కోరినభోజనమెట్లు పెట్టుటో,
పెత్తనమొంది పాలనము పేర్మిని చేయుటదెట్లొ నేర్చె తాన్.     98.
కాంతి వృత్తము.   (త జ జ వ.  ..  యతి 8.) 
శాంతిన్ బరివర్ధన సన్నుతిగా  
శాంతంబుగఁ జేయుఁ బ్రశస్త విధిన్
బంతంబున నేర్చెను బాలనలోఁ  
గొంతైనను మేలును గూర్చుటకై.  99.
బాలసింహము మజ్జారి నరసింహారెడ్డి.
శా.  ధీ నొప్పారెడు జ్ఞానసుందర మతిన్ దీపించు దామోదరుం
డౌ, నా సింగపు హుఙ్కరిం పతఁడు మాటాడన్, చలింపండు తాన్
దీన జ్యోతిగ నెంద రో పలుకు రీతిన్,  రక్ష వా సింప ప్లా
టూనౌ రుద్రుఁడె, యీ మహామహుఁడు, కీడు న్బాప రేనాటికిన్. 
{ప్లాటూన్=సైనికులతో కూడిన ఉపవిభాగము}    100.
.  అల మజ్జారి కులాన వెల్గు నరసింహారెడ్డి ధీశాలియై,
ఫలవంతంబగు గుళ్ళదుర్తి చదువున్  బ్రఖ్యాతిగా నేర్చి, ని
స్తులధీమంతుఁడుగా వెలింగె ధరణిన్ శోభింపనాంధ్రావనిన్,
గులదీపంబని మన్మనిన్ బొగడుచున్  గూర్మిన్ గనన్ దాతయున్.  101.
.  జీవితపరమార్థంబును
భావించుచు, సఖులతోడఁ బలుకుచు, ఘన శో
భావహ భారత మాతకు
సేవలతో మెలఁగుటొప్పు, చేయుదు మనె తాన్.             102.
.  ఎక్కడనున్నగాని మన మీ ధరణిన్ బరిరక్ష చేయుటం
దొక్కటియై రహించుచు సముజ్వల తేజము నిల్పగావలెన్,
జక్కగఁ బల్కి తీరుదము జైభరతాంబ యటంచు భక్తితోన్
రక్కసు లాంగ్లసైన్యము, పరాకు వహింపక కావగా వలెన్.      103.  
.  అనుచు పరస్పరంబు పరమార్థముగా వర దేశరక్షణన్
ఘనతరమైన బాధ్యతగ గౌరవమొప్పగ స్వీకరించి, ప్రే
రణమును బొంది, సద్గురుల రమ్యమహత్తర దీవనల్ గొనన్
వినయముతోడ మ్రొక్కి రల వేడిరి యాజ్ఞనొసంగ నేగఁగన్.      104.
.  బాలురు చిన్నవారె, గురుబాధ్యత లా గురుదేవు లాప్తితో
మేలుగ బోధ చేయఁగ నమేయ శుభప్రద ప్రేరణంబిడెన్,
బేలలు కారు వారు, కనిపెంచిన పెద్దల గౌరవంబు నల్
మూలలఁ బ్రాకఁ జేయుటకు మూలములై వెలుగంగ నొప్పిరే.     105.
.  గురువులనుజ్ఞనిచ్చి రనుకూలమహత్తరవిద్యలొప్పుగా
నిరుపమ రీతి నేర్చిరి, గణింపునుఁ గాంచుఁడులోకమందు మో
హరమున పొందు విశ్రుతి  వియత్తలమున్ విహరించు సూర్యులై,
వరలుత, పోయిరండు శుభవర్ధనమీకు సతంబు కల్గుతన్.     106.
.  నరసింహారెడ్డీ! నీ
వరుగకుముయ్యాలవాడ  కరుగుము నీవీ
వరకిటకు వచ్చినట్టులె,
మరువకు మా మాట నీవు, మహిత గుణాఢ్యా!            107.
.  నీకు మేలు కలుగు నిత్యంబు, నీవు ను
య్యాలవాడ పోకు మయ్య ! వినుము
పరిగపాటి కరిగి యరుగుము కుందేరు 
దాటి రూపనగుడి, తప్పకుమిది.                      108.
.  గురువుల మాటలన్ విని, యకుంఠితరీతిని విద్యనేర్పి, మా
గురువులు నాకు నాంక్షలను కూర్మినిఁ జూపుచుఁ బెట్టినారు,  మే
లరసెడి తాతయున్ బలికె నాదిశ వెళ్ళగ రాదటం చహో! 
అరయఁగ నేదొ కల్గెనిట, నయ్యది యేమిటొ? యెట్లెఱుంగుటో?   109.
.  అనుచు నృసింహరెడ్డి మనమందున చింతన చేయుచుండి, యిం
దున కల దానినే యెఱుఁగుదున్, గ్రహియించెద నేనదిప్పుడే,
యనుచు నుయాలవాడ కతఁ డప్పటికప్పుడెఱుంగ నన్నియున్,
సునిశిత భావనాబలుఁడు శుద్ధమనంబున నేగె నుద్ధతిన్.        110.
ఆశ్వాసాంతము.
భుజంగప్రయాతము.
నమోనారసింహా! మనంబందు నీవే
ప్రమోదంబుతోడన్,  నివాసంబుఁ జేయన్,
విమోహంబులన్ బాసి, విశ్వేశ! నిన్ నే
నమేయంబుగా నిత్యమర్చింతు దేవా!                   111.

కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున ప్రథమాశ్వాసము సమాప్తము.

No comments: