జైశ్రీరామ్
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
శ్రీ కొట్టే కోటారావు శ్రీమతి సత్యవాణి దంపతుల
వైవాహిక స్వర్ణోత్సవము సందర్భముగా
అందఁజేసిన
అభినందన మందారమాల.
రచన, సమర్పణ .. చింతా రామకృష్ణారావు. తే. 11 - 4 - 2026.
౧ శా. శ్రీమన్మంగళ భారతీ జనని! మా శ్రీ సత్యవాణీ ద్యుతిన్
క్షేమంబొప్పఁగ వెల్గుచుండిరిచటన్ శ్రీ కోటరా విద్ధరన్
శ్రీమంతంబుగ నేబదేండ్లొకటిగా చెల్వొంద, స్వర్ణోత్సవం
బీమాధుర్యపు పెండ్లిరోజుననె, నీవే వచ్చి దీవింపుమా.
ఉ. అప్పలకొండయున్, ధర మహత్తరవేంకట రత్నమాంబయున్
గొప్పగ నిన్ను గాంచిరి, యకుంఠితరీతిని విద్యనేర్పి, నీ
మెప్పులు చూచి లోకమున మెచ్చిరి, నీకల సత్యవాణియే
నప్పునటంచు పెండ్లిని యనంతశుభంబుగ చేసినారయా!
సీ. బాలగంగాధర భాగవతారు నీ బావయె మామయై పడతినొసగె,
అక్కయే యత్తయై చక్కఁగా నిను చూచి, సంతోషమును గొల్పె సన్నుతముగ,
శ్రీకాంతు పుత్రుఁడై చెలగ, సత్యవతియె కోడలై నిలిచిరి తోడుగాను,
రేష్మ, సుష్మ, కరిష్మ, ప్రియతమ మనుమరాండ్రై మీకొసంగిరి హాయినెలమి,
గీ. కొడుకు రాజేషు, చిన్ని మీ కోడలగుచు
హారికాసారికలనిచ్చి రద్భుతముగ,
శైలజారామచంద్రులు చక్కనైన
ప్రణతి, హసితలనిచ్చిరి వాసిగాను.
శా. సాటే లేరయ సత్యవాణి యుతుఁడా! సౌమ్యుండ! మీకిద్ధరన్
కోటారావు! శతాబ్దిలో సగమె సత్ కూర్మున్ గతించెన్, శతం
బేటేటా జరిపించు పెండ్లిదినముల్, హృద్యంబుగా నీశుఁడే,
బాటై మీ యమృతోత్సవంబు శిశులన్ బాలించు నూరేండ్లిటుల్.
ఉ. మంగళమౌత మీ జతకు, మంగళముల్ తమ సంతుకిద్ధరన్,
మంగళమౌత బంధులకు, మంగళముల్ తమ మన్మరాండ్రకున్,
మంగళమౌ వధానులకు, మంగళమౌనిల పండితాళికిన్,
మంగళమౌత భారతికి, మంగళముల్ మన దేశ మాతకున్.
మంగళమ్ మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైహింద్.
No comments:
Post a Comment