Friday, August 15, 2025

శ్రీ కృష్ణ జన్మాష్టమి - విశిష్టత

జైశ్రీకృష్ణ 

శ్రీ కృష్ణ జన్మాష్టమి - విశిష్టత

ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభణ కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది. ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు .

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు

 "పైకొని చూడరె వుట్ల పండుగ నేడు

ఆకడ గొల్లెతకు ననందము నేడు

అడర శ్రావణబహుళాష్టమి నేడితడు

నడురేయి జనియించినాడు చూడ గదరే.

మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి.

హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం.

శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది.

దేవాలయ సందర్శన వేళ శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంధాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం.

కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణుని దేవాలయ నిర్వాహకులు సైతం శ్రీకృష్ణుని లీలలను తెలిపే వివిధ నృత్య నాటకాలను, శ్రీకృష్ణుని చరితకు సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటుచేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు... దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రమున ... కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. 

కృష్ణ జన్మాష్టమి పర్వదినం:

కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

జన్మ తిథి:

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది

కృష్ణాష్టమి పండుగ విధానం:

 చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ

బంగారు మొలతాడు పట్టుదట్టి

సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు.

శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.

పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

యశోదకృష్ణ !భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత 

వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

శ్రీకృష్ణాష్టమీవ్రతకల్పము విశిష్టత

నేడు శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం ఒకటే కాదు. మాయమ్మ యోగమాయ జన్మోత్సవం కూడా నేడే.*

శ్రీకృష్ణ

కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి  వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.

కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంశమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.

శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.

శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం

ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి  యుగేయుగే  [1.3.28 ]

ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. 

కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. 

ధర్మ  విరోధుల చేత లోకం వ్యాకులం చెందినపుడు. రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.

కొన్ని అవతారాలలో  పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా  భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది.

శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు

 ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన  అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం.

 రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే.

మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది.

కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు జతల సప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుదుము.

జైశ్రీరామ్.

జైహింద్.

No comments: