జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏻
నవరత్నమాలిక.
ఐం. క్లీం. సౌ. నుత బీజవర్ణ కలితాం ఐశ్వర్య సంధాయినీమ్,
ఐం. క్లీం. సౌ. జగదేక రక్షణచణాం ఆరోగ్య సంవర్ధినీమ్,
ఐం. క్లీం. సౌ. వరపాదపద్మయుగళాం ఆర్యాం మహాదేవతామ్,
ఐం. క్లీం. సౌ. నిజభక్త పాలనపరాం, ఆత్మస్థితాం భావయే. 1
అమ్మా! బ్రహ్మమమ్మా! మాయాతీత ప్రశాంత రూపమా!
అల్లూరి వంశ రత్నదీపమా! నమో నమః.
శా. శ్రీమన్మంగళ మానవుండుగ నిలన్ శ్రీకార రూపంబునన్
బ్రేమన్ దల్లి కనంగఁ బుట్టి, గతమే జిత్రంబుగా మాయచే
నేమాత్రంబును గుర్తు లేక, మదిలో నెన్నెన్నియో యోచనల్
భూమిన్ బుట్టిన హేతువున్ గనుటకై పుట్టున్, విచిత్రంబిదే. 2
భావము
ప్రాణి శుభప్రదమయిన మానవునిగా శ్రీకారరూపములో తల్లి ప్రేమతో ప్రసవించగా
పుట్టి, భూమిపై తనను క్రమ్ముకొనిన మాయ కారణముగా తన గతము ఏమాత్రము
గుర్తు లేక పోవుటచే, భూమిపై తన జన్మకు కారణము తెలుసుకొనుప్రయత్నములో
ఎన్నెన్నో ఆలోచనలుచేయును. ఇదే విచిత్రము.
ఉ. బంధు జనంబుతో పెరుగు బంధములన్ విడిపోవ నేరమిన్
సంధి వశంబునన్ మనసు సత్యము గానగలేక, మాయలో
బంధనమొంది, బంధములు వాయక హెచ్చగుచుండ, దుఃఖముల్
పొందుచు తల్లడిల్లి, గురు పూజ్యపదంబుల నెన్ని జేరునే. 3
భావము.
పుట్టుకతో సంభవించిన బంధువులతో పెరుగుచున్న బంధనములను వీడిపోవుట
తెలియఁజాలక, ఈ పూర్వాపరముల సంధి కారణముగా సత్యమును కనఁజాలక
మాయకారణముగా ఐహిక బంధమునమునకు లోనగుచు దుఃఖించుచు
పరిష్కారమునకై పూజ్యమయిన గురుపాదాశ్రయము పొంద యత్నించును.
ఉ. బ్రహ్మమె యమ్మ రూపమయి భక్తిగ వచ్చిన వారిఁ గాతువే,
బ్రహ్మవివేక సంపదను భక్తులకందఁగఁ జేయుచుందువే,
బ్రహ్మ నిజస్వరూపముగ భక్తులకున్ గనిపించు మాత వా
బ్రహ్మమె నీవు, భీమవర పట్టణమందలి కల్పవృక్షమా! 4
భావము.
భీమవర పట్టణములో వెలసిన ఓ కల్పవృక్షమా! బ్రహ్మం అమ్మా!. సాక్షాత్
బ్రహ్మమే అమ్మ స్వరూపమని భావించుచు భక్తితో నీ వద్దకు వచ్చు
భక్తులను కాపాడుదువుకదా తల్లీ! భహ్మజ్ఞానము అనెడి సంపదను భక్తులకు
అందించు దయామూర్తివి. అమ్మగా ఉండియున్న నీవు బ్రహ్మం గా
సాక్షాత్కరించు తల్లివైన నీవు బ్రహ్మకదా.
ఉ. బాధలఁబాపు బ్రహ్మవిల, వచ్చెడి పీడిత మానవాళికిన్
సాధన చేయు మార్గమును చక్కగ చెప్పెడి అల్లురి ప్రభా!
మోదముతోడ మాయతెర పూర్తగ వీడగఁ జేసి, శాంతితో
నీదుచు జీవితమ్ము నడిపించగ జేతువు నీదు వాక్కులన్. 5
భావము.
అల్లూరి వంశమునందలి తేజస్స్వరూపమా! ఐహికమైన ఈతిబాధలను పోఁగొట్టు
బ్రహ్మమే అని నిన్ను భావించుచు నీ దగ్గరకు వచ్చెడి మానవులకుచక్కని
కమ్మని మాటలతోనే మాయను వీడు సాధన మార్గమును చూపించుదువు.
మాయ అనెడి తెరను పూర్తిగా పోవునట్లుగా చేసి, జీవితమును శాంతముగా
సాగునట్లుగ చేయుదువు.
ఉ. నీటనె యుండు తామరకు నీర మొకింతయు నంటనట్లుగా
సాటియెలేని నీకిల నసత్యపు బంధములంటఁ బోవుగా,
చేటును గొల్పు బంధములు శీఘ్రమె పాయువిధంబు దెల్పుచున్
నోటను బల్కు మాటలనె నొవ్వును బాపుదు వమ్మ మాకిలన్. 6
భావము.
నీటిలో ఉండే తామరాకునకు నీరు అంటని విధముగా సాటిలేని అమ్మకు
అస్త్యమైన ఐహికబంధములేవియు అంటఁబోవు.ఈ తల్లి చెడునే కలిగించెడి
ఈ ఐహిక లంపటములను వెన్వెంటనే వీడఁ జేసుకొను పద్ధతిని కేవలము
మాటలతోనే తెలుపుచు, బాధితుల బాధలన్నిటిని భక్తులకు పోగొట్టు బ్రహ్మము.
ఉ. ఐహికమందె బ్రహ్మమును హాయిగ చేర్చెడి మార్గ మీవెయై,
మోహము పాపి భక్తులకు పూర్తిగ ముక్తికిని గొల్పు శక్తివై,
స్నేహముతోడ శాంతముగ నిత్యము గాచెడి బ్రహ్మమమ్మవై,
మోహవిదూరవైన గురుమూర్తి! స భక్తి నమస్కరించెదన్. 7
భావము.
ఈ శరీరముతో ఈలోకములో ఉండగనే బ్రహ్మస్వరూపమును చేర్చెడి
మార్గమే నీవయి, మోహమునకు దూరమగునట్లుగా ఆశ్రయించినవారిని చేసి,
ముక్తిని పూర్తిగా కలిగించు గొప్ప శక్తివి అయియుండి, భక్తులను నిత్యము
స్నేహభావముతో శాంతముతో చూచుచు కాపాడెడి, మోహమంటని ఓ
గురుమూర్తివయిన బ్రహ్మమమ్మా! నీకు భక్తితో నమస్కరించెదను
స్వీకరింపుము.
ఉ. మా గురుపూజ గైకొనుము, మాయని బ్రహ్మ నిజస్వరూపమా!
యోగమె మాకు నీదు పదయుగ్మము గొల్చుట ధాత్రి నిత్తరిన్,
రాగల ముక్తి చూపితివి, రమ్య మనోహర వాఙ్నిధానమా!
హే గురు రూపిణీ! జయమహీన శుభప్రద! బ్రహ్మమమ్మరో! 8
భావము.
రమ్యమయినట్టియు మనోహరమయినట్టియు వాక్కులకు నిధివయిన
ఓ బ్రహ్మమ్మా! మేము చేయుచున్న గురుపూజను స్వీకరింపుము. ఈ భూమిపై
ఇట్టి విధముగా నీ రెండు పాదములకు ఈ విధముగ సేవించుట అన్నది మాకు
లభించిన యోగమే సుమా. మేము పొందబోయే ముక్తినే మా కనులకు చూపించిన
తల్లివమ్మా నీవు. ఓ గురుస్వరూపిణీ! అంతులేని శుభములు కలిగించు తల్లీ!
నీకు జయమగుగాక.
ఉ. మంగళమమ్మ నీకు, జయమంగళ సద్వర బోధ గొల్పు నీ
మంగళ పాదపద్మ నిగమంబులకిద్ధర మంగళంబగున్,
మంగళమౌత నీ చరణ మార్గము పట్టిన భక్తపాళికిన్,
మంగళమమ్మ సర్వశుభమంగళ భారత దేశ మాతకున్. 9
భావము.
అమ్మా నీకు మంగళమగుగాక. జయప్రదమై మంగళమును కూర్చుమంచి
శ్రేష్టమైన జ్ఞానమును కలుగజేయు నీ పాదములనెడి వేదములకు ఈ భూమిపై
మంగళమగుగాక. నీ పాదములనాశ్రయించిన భక్తకోటికి మంగళమగుగాక.
సమస్త శుభమంగళ స్వరూపిణియైన భారతమాతకు మంగళమగుగాక.
జైహింద్.
No comments:
Post a Comment