జైశ్రీరామ్.
సంధ్యావందనం - వైదికార్థం. ... ఏ.సీ. పీ. శాస్త్రి
బ్రహ్మశ్రీ ఏ.సీ. పీ. శాస్త్రి .
వైదికజీవన విధానంలో అతి ముఖ్యమైన సంధ్యావందనాన్ని గురించి తెలియని వారు, దాదాపు ఎవరూలేరు. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే దృశ్యం బొమ్మలలో చూసినా, దూరాన నదిలో ఎవరైనా అర్ఘ్యం ఇస్తున్నపుడు చూసినా అది సంధ్యావందనమని అర్థమయిపోతుంది.
ఇంకా కొద్దిగా తరచి చూస్తే, ఎవరైనా పంచపాత్ర, ఉద్ధరిణె ముందర పెట్టుకు కూర్చున్నా లేక ప్రాణాయామం కోసం ముక్కు పట్టుకుకూర్చున్నా మనకు వాళ్ళు సంధ్యావందనం చేస్తున్నారని అర్థమవుతుంది. ప్రజలలోకి ఇంత గాఢంగా, విస్తృతంగా వచ్చి చేరింది ఈ అనాది సంధ్యావందన సంస్కృతి.
ఆ తరువాత పెద్దవాళ్ళు చెప్పటం వింటూ ఉంటాము. "సంధ్యచేసే టైములేక పోతే కనీసం గాయత్రైనా చేయండిరా' అని. నిజానికి ఈ విషయం మనుస్మృతిలో గూడా చెప్ప ఐడింది. కనుక సంధ్యావందనంలో గాయత్రీ జపం చాలాముఖ్యమైనది అని ఒక ఆచారం వచ్చింది.
ఇందులో మరి అర్ఘ్యమూ, ప్రాణాయామమూ, గాయత్రీజపమూ అన్ని ముఖ్యంగానే కనబడుతున్నాయ్యే ఇందులో సంధ్యకి చేసే వందనము ఏమిటి? సంధ్యావందన మంటే సంధ్యాసమయంలో చేసే స్మార్త క్రియనా? మరి మధ్యాహ్నంలో సంధ్యఉన్నదా. ఉంటే ఏ సమయాల మధ్యసంధి అది? ఇట్లా ఎన్నోప్రశ్నలు మన మనసులో తడుతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ చర్చిస్తూ ఎన్నో గ్రంథాలు వ్రాయబడి నాయి. అందులో కృష్ణపండితుడు ఆయన రాసిన తైత్తిరీయ సంధ్యా వందన భాష్యమే అతి ప్రామాణికంగా తీసుకోబడుతున్నది. ఆ తరువాత గాయత్రీ జపప్రాశస్త్యము కర్మిష్ఠుల మనసులలో బాగా నాటుకున్న తరువాత గాయత్రి ఒక ప్రత్యేక దేవతగా (శక్తిగా) నిరూపింపబడి గాయత్రీ పూజా విధానము, తత్వము మొదలయిన వచ్చాయి. మహానుభావులు ఎంతో మంది గాయత్రీ ఉపాసన చేశారు, చేస్తున్నారు.
అయితే మనం ఆలోచించవలసినది ఏమిటంటే, ఈ స్త్రీ దేవతా ఉపాసన వేదములో నుండి వచ్చిందా? లేక వేదంలో ఒక భాగాన్ని గ్రహించి, దానిని శక్తి ఉపాసనగా రూపొందించారా? (ఋగ్వేదంలో ఉషాదేవతాసూక్తం ఉంది. ఇదిగూడా అదేవిధంగా వచ్చిందా). ఈవిషయం చాలా పెద్దది. మనం అంతలోతుకు పోయి చర్చించలేము. కాకపోతే సంధ్యావందనంలో గాయత్రీ ప్రమేయము ఎంతవరకు అని ఆలోచించగలిగితే, వేదము గాయత్రి సంబంధముగా ఏమి చెప్పింది అని అర్ధం అవుతుంది. వేదము అంటే కృష్ణ యజుర్వేదమే అని అను కోవాలి. ఎందుకంటే మనవైదిక సంస్కృతంతా యజుర్వేదములో నుండి వచ్చినదే అని పండితులు చెబుతారు. చివరకు (లేక మొదటగా) 'ఓం' కారమునకు కూడా యజుస్త్వము ఉన్నది అని పండితులు చెబుతారు. గాయత్రిని (ఇది సంస్కృతంలో 'గాయత్రీ' అని దీర్ఘాంత, స్త్రీలింగ శబ్దముగా చెప్పబడినది.) గురించిన కథ యజుర్వేదము 2వకాండలోనూ, 6వ కాండలోనూ కనబడుతుంది. మొదటి కాండలో సోమయాగములో ఆహవనీయాగ్నికి సంబంధించిన ఉపస్థాన మంత్రాలలో ఇప్పుడు మనము గాయత్రీమంత్రము అని చెప్పే 'తత్స వితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, దియోయోనః ప్రచోదయాత్' ఉన్నది. పూర్వాపరాలు చూస్తూ గాయత్రి కథ 6వ కాండలో చెప్పినది మొదటగా జరగటానికి అవకాశం ఉంది. ఆ 6వ కాండంలో కథ ఏమిటంటే.... కర్రూ (తెలుగులో కద్రువ), సుపర్జీ అనే ఇద్దరు సవతులు తమ సౌందర్య విషయంలో పోటీపడ్డారు. (కద్రూవై సుపర్ణీ ఆత్మరూపయో రస్పర్ణేతామ్) అపుడు సుపర్ణి (భారతంలో ఈమె పేరు వినతగా చెప్పాడు వ్యాసుడు) కద్రువకు దాసి అయింది. దాస్య విమోచనం ఎలా అని సుపర్ణి అడిగితే, 'ఇక్కడనుండి (భూమినుండి) మూడవ లోకంలో (ద్యులోకంలో) సోమరసము ఉన్నది. అది నీ పుత్రులచేత తెప్పించి నట్లయితే నీకు దాస్యవిమోచనం అవుతుంది' అని చెబుతుంది.
సుపర్ణికి ముగ్గురుపుత్రులు. వారు జగతీ, త్రిష్టుప్పు, గాయత్రీ అనే ఛందస్సులు. ఇక్కడ గాయత్రీ శబ్దము సంస్కృతములో స్త్రీలింగ రూపంలో ఉన్నా, ఆపేరు ఉన్నది మగవాడికే (మనకు ఎలకూచి బాల సరస్వతి ఉన్నట్లు). ఈ ముగ్గురూ ఛందస్సులు - అంటే మాత్రా విశేష అక్షర రూప గమనము కలవారు, అందులో జగతికి 14అక్షరాలు, త్రిష్టుప్పుకు 13 అక్షరాలు, గాయత్రికి 4 అక్షరాలు. గాయత్రికి నాలుగక్షరాలే.... చాలాచిన్నది.
తల్లి ఆజ్ఞాపించగా, ముందు జగతీ ఛందస్సు ద్యులోకానికి వెళ్ళి, అక్కడ సోమరసం కోసం యుధ్ధం చేసి, 2 అక్షరాలు పోగొట్టుకొని, ఓడిపోయి తిరిగి 12 అక్షరాల రూపంలో తిరిగివస్తాడు. అందుకే జగతీ ఛందస్సుకు 12 అక్షరాలు. (ఈ సంఖ్య ఆధారంగానే ఆదిత్యులు 12 మంది అని నిర్ణయించబడినది). తరువాత త్రిష్టుప్పు ఛందస్సు 13 అక్షరాలతో వెళ్ళి యుద్ధంలో ఓడిపోయి, రెండు అక్షరాలు పోగొట్టుకొని 11 అక్షరాలతో తిరిగివస్తాడు. (ఈ సంఖ్య ఆధారంగానే రుద్రులు 11 మంది అనిచెప్పారు) తరువాత గాయత్రీ ఛందస్సు నాలుగక్షరాలతోద్యులోకానికి వెళతాడు. అయితే గాయత్రి, అన్నలవలె ఒంటరిగా కాకుండా, తనతో పాటు అజ (బ్రహ్మత్వము, మేక), జోతిస్సును తీసుకొని వెళతాడు. (ఆజయా, జ్యోతిషా... అని మంత్రము) అక్కడ ఉన్న స్వానభ్రాజ, అంగార, బంభార.... మొదలయిన రక్షకులతో యుద్ధము చేసి, వారిని ఓడించి, సోమరసాన్ని తీసుకొని వస్తాడు. అంటే, తనకు ఉన్న 4 అక్షరాలూ, జయించితెచ్చిన నాలుగక్షరాలు కలిపి 8 అక్షరాల స్వరూపంతో తిరిగివస్తాడు.
అందుకే గాయత్రీఛందస్సు 8అక్షరాలు. (వీరిని అష్టవసువులు ఱ తరువాత నిర్ణయించారు). బ్రహ్మవాదులు (వేదపాఠకులు, "బ్రహ్మ అం వేదము) వారిలో వారు ప్రశ్నించుకున్నారట. 'అందరికంటే చిన్నదయి గాయత్రి ఛందస్సు (చిన్నవాడైన గాయత్రి) సోమరసం ఎలా తేగలిగాడ అని. దానికి వాళ్ళే సమాధానం చెబుతారు. 'బ్రహ్మత్వంతోనూ జ్యోతిస్సుతోనూ వెళ్ళుటవలన అని.
ఇందులో ప్రధానాంశము ఏమిటంటే 'గాయత్రీ' మగవాడు అని. గాయత్రి ద్యులోకమునుండి సోమ రసాన్ని తీసుకొని వస్తూ, మూడ సవనాలకు (ప్రాతః, మధ్యాహ్న, సాయం) సరిపోయిన యథోచిత సవన పరిమాణాలను తీసుకొని వచ్చాడట. ఏ విధంగా నంటే, రెండ సవనాలకు సంబంధించిన రసాన్ని రెండు పాదాలతోనూ, మూడవ సవనానికి సరిపడేది, నోటిలో పుక్కిట పట్టి తెచ్చాడుట. 'అంటే గాయత్రి ఛందస్సు మూడు సవనాలకు సరిపడే సోమరసం తెచ్చింది' అని అర్థం. దీనిని బట్టి చూస్తే గాయత్రికి రెండుపాదాలు, ఒక శిరస్సు ఉన్నట్టు రూపం ఊహచేయాలి. లోకంలో ఓ ప్రాణికి రెండుపాదాలు, ఒక శిరస్సూ ఉంటాయి? పక్షికి ఉంటాయి.అందులో ఎత్తుకు ఎగురవలసిందికదా. (భూమినుండి ద్యులోకము వరకు, అంటే స్వర్గము వరకు). ఆ పక్షి డేగ అని మనము ఊహించాలి. (ఈ రహస్యమే వ్యాసుడు గరుత్మంతుని పాత్రలో చెప్పాడు. గరుత్మంతుడు ఖగేంద్రుడు). గాయత్రి ద్యులోకం నుండి సోమరసం తెస్తూ, మార్గమధ్యంలో, నోటితో పుక్కిట పట్టి తెస్తున్న సోమరసాన్ని మ్రింగేశాడుట.
అంటే ఒక సవనానికి కావలసిన సోమరసం, గాయత్రి కంఠంలోఉంది. ఈ కథ యజుర్వేదం 6వ కాండలో ఉంది. ఇక రెండవ కాండలో కథ. గాయత్రీ కంఠంలో సోమరసం ఉన్నదని తెలుసుకున్నాం కదా. ఆ సోమరసం మీద వషట్కార దేవత దృష్టి పడ్డదట. గాయత్రినుండి సోమరసం సంపాదించాలంటే ఎలా! ఆ గాయత్రి కంఠాన్ని నరికితే లభిస్తుంది. అందుకని వషట్కార దేవత గాయత్రి కంఠాన్ని నరికాడుట. ఇది "వషట్కారోవై గాయత్ర్యా శీరో.. చ్ఛినత్ అనే మంత్రంలో ఉంది.
గాయత్రి కంఠంనుండి రసం స్రవించినదట. అందులోనుండి ఏకవర్ణముగల 'వశా' అంటే వంధ్యగోవు పుట్టినదట. 'వంధ్య'గోవు ఏమిటి! సామాన్యమైన చూడిగోవునే ఇవ్వవచ్చును గదా. అంటే దానికి వేరే కారణం ఉంది. అదేమిటంటే యజ్ఞంలో పశువును బలి ఇచ్చేటప్పుడు వంధ్యగోవు (అంటే ఒక సంతానాన్నికని, ఆ తరువాత కననిదానినే) ఇవ్వాలిట. మొదటిసారి రసం స్రవించిన తరువాతగాయత్రి శిరస్సు మళ్ళీ మొలిచిందట. అంటే కంఠంలో ఇంకా సోమరసం (అమృతం) ఉన్నది. అందుకని వషట్కార దేవత రెండవసారి గాయత్రి తల నరికిందట. అప్పుడు కారిన రసంలోనుండి 'ద్వివర్ణ' అంటే రెండురంగుల కల వంధ్యగోవు పుట్టిందట. ఆ తరువాత మళ్ళీ తల మొలిచిందట. అంటే గాయత్రి కంఠంలో సోమరసం ఉన్నంత కాలమూ ఎన్నిసార్లు తలనరికినా మళ్ళీమొలుస్తుందని మనం ఊహించాలి. అలాగే మూడవసారి నరకగా, 'బహువర్ణ' అనగా అనేక రంగులుకల వంధ్యగోవు పుట్టిందట. అలాగే నాలుగవ సారి నరకగా ఒక వృషభము, ఎఱ్ఱని రసము (బహుశ నెత్తురు కావచ్చు) పుట్టినదట. అయిదవ సారి శిరస్సు మొలిచిన తరువాత సోమరసము అయిపోవటం వలన (సరిపోవటం వలన) వషట్కార దేవత గాయత్రి శిరస్సు నరకలేదట. ఇప్పుడు గాయత్రికి ఎన్ని శిరస్సులు? ఐదు శిరస్సులు. అందుకే గాయత్రి స్వరూపంలో మనకు ఐదుశిరస్సులు కనబడతాయి. ఉపనయనంలో వటువుకు ప్రథమంగా గాయత్రీ ఉపదేశానికి ముందర పంచశిఖలు పెట్టటానికి కూడా బహుశ ఇదే కారణం కావచ్చు.
అందుకనే, గాయత్రీ మంత్రార్థం చెప్పే స్తోత్రంలో 'సర్వవర్ణే మహాదేవి' అని ఆవాహన చేస్తారు.
దీనిని బట్టి మనకు అర్ధం అయ్యేదేమిటంటే, గాయత్రి అనగా కంఠమునందు సోమరసము కలిగినది అని అర్ధము. అందుకనే గాయత్రి ధ్యానంలో 'ఇందునిబట్టి రత్నమకుటామ్' అని ప్రార్థిస్తాము. 'ఇందు' అంటే సోముడు. అనగా చంద్రుడు, సోమరసానికి గుర్తు. మనకు రసాన్ని అనుగ్రహించటానికి ఆ దేవత అభిముఖముగానూ (ఇష్టంగాను) సుముఖంగానూ (అనుగ్రహపూర్వకంగానూ) అని చెప్పటానికి ఆమె చేతిలో 'శుభ్రం కపాలం' అని ధ్యానిస్తాము. కపాలము అంటే వైదిక భాషలో పాత్ర అని అర్థము. శుభ్రము అంటే కాంతివంతమైన అని అర్థము. ఈమాట 'శుభదీప్తే' అనే ధాతువులో నుండి వచ్చింది. సోమయాగములో రసగ్రహణము చేసే పాత్రలను,'కపాలము' అంటారు. బహుశ గాయత్రికి శిరస్సులో సోమ రసం ఉండటం వలన ఈమాట వచ్చిందేమో. సంధ్యావందనంలో కూడా మనముపాసించేది ఈ 'సోమరసము కంఠమునందు గల గాయత్రీ దేవతనే'. అయితే, గాయత్రి శిరస్సు భేదించి మనము ఏ దేవతకు ఇస్తాము? సూర్యునికే, లేక ఆదిత్యునికి, స్థూలంగా సంధ్యావందనంలో జరిగేదేమిటంటే-
"సూర్యుడు ఆహవనీయాగ్ని, అంటే స్వర్గమే. అనగా ఇంద్రుడే. 'అసౌ ఆదిత్యః ఇంద్రః వా' అనే మంత్రం ఉంది. మనకు స్వర్గం కావాలి. కాని మనస్సు లోపలగానీ, మనసు వెలుపలగానీ ( శరీరంలో గానీ) పాపం ఉంటే ఆ స్వర్గం రాదు. ఎందుకంటే స్వర్గము (సువర్గము) 'సుకృతాం లోకః' అని వేదం చెబుతున్నది. అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళకుదక్కే లోకము. అందుకని దురితక్షయము (పాపం నశించటము) సాధిస్తాము. ఆ తరువాత మనని మనం మార్జనము (స్నానము లేక పవనము) చేసికొని, ఆదిత్యుని మన హృదయం మీదికి ఆహ్వానిస్తాము. దానికి మాత్రము 'అసావాదిత్యోబ్రహ్మా'. ఆదిత్యుడు మన హృదయంలోకి (వైశ్వానరాగ్ని-గార్హపత్యాగ్ని మీదికి) వచ్చిన తరువాత, అతనితో (సవిత్రునితో) గాయత్రీ ఛందస్సు కూడా వస్తుంది. ఎందుకంటే గాయత్రి 'సవితృసంబద్ధా' అని వేదం చెప్పింది. ఆ ఛందస్సుతో మనముగాయత్రీమంత్రము (మూడుపాదాలు-పాదానికి ఎనిమిదక్షరాలు) కూర్చుతాము. ఈ సందర్భంలో గాయత్రిని మూడు పాదాలు గలిగిన స్త్రీ దేవతగా భావిస్తాము (త్రిపదా) ధ్యానం చేసినపుడు కంఠంలో సోమరసం కలిగిన గాయత్రి ఉద్భవిస్తుంది. ఇది మొదటి జన్మగాయత్రికి. జపం చేయటం సవనం. అంటే సోమలతను నలగ గొట్టటము. అదే గాయత్రి జపము. ఇలా చేసినపుడు గాయత్రి తనసారాన్ని కోల్పోతుంది.(సోమరసాన్ని) అప్పుడు మళ్ళీ ధ్యానిస్తాము. అప్పుడు గాయత్రి తన రస సమృద్ధమైన స్వరూపంలో మళ్ళీ పుడుతుంది. ఇది రెండవజన్మ. అందుకనే గాయత్రీ దేవతను 'ద్విజాతా' అంటే రెండుసార్లు పుట్టినది అని అంటాము. ఆ తరువాత సూర్యుడికి నమస్కరించి, ఆయనకు ఉపస్థానము చెబుతాము. ఉపస్థానము అంటే అనుగ్రాహక, అనుగ్రాహ్యసంబంధము అని వేదార్థము. అంటే ప్రసన్నుడవు కమ్ము అని ప్రార్ధించటము. సహజంగా, ఈ ప్రార్ధన తరువాత ఆదిత్యుడు తన నిత్యగమన విధి నిర్వహణకై వెళతాడు. అందుకని ఉపస్థానము అంటే ఉద్వాసని అనికూడా అర్థం చెప్పవలసి ఉంటుంది. (అందుకనే గాయత్రీ ఉపస్థాన మంత్రంలో, ఆ దేవతను తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళమని ప్రార్థిస్తాము) సూర్యోపస్థానము అయిన తరువాత సదోమండపంలో విచ్చేసి ఉన్న సర్వదేవతలకు నమస్కారము చేస్తాము. ఆ తరువాత గాయత్రికి ఉపస్థానము (ఉద్వాసన) చెబుతాము. ఇంకా ఇందులో సోమయాగంలో చెప్పిన సమోవాకము (సమో స్వనంతాయా) సూక్తవాకము (ఇదం ద్యావా పృధివీ) చెబుతాము. చివరకు సదోమండపం వైపు తిరిగి గోత్రము, ప్రవర చెప్పుకొని, 'భో అభివాదమే' అని నమస్కరించి, ఆశీర్వచనము అడుగుతాము.సదోమండవ ప్రస్థావనతో స్వర్గమును పొందినట్లు అని అర్ధము. ఎందుకంటే స్వర్గము సదోమండపంలో ఉంటుంది అని సోమయాగంలో చెప్పబడినది.
ఒక విధంగా చూస్తే, సంధ్యావందనము లఘుసోమయాగము. దానికే అగ్నిష్టోమమని పేరు. స్వర్గం కోరే వాళ్ళు అగ్నిష్టోమము చేయాలి అని వేదం చెబుతున్నది. స్వర్గకామో అగ్ని ష్టోమేనయజేత' అని విధి. ఇది సంధ్యావందనానికి వైదికార్థము.
జైహింద్.
No comments:
Post a Comment