జైశ్రీరామ్.
సోదర భారతీయులారా!
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అని ఆర్యోక్తి.
స్త్రీకి ఎనలేని గౌరవం ఇవ్వడమన్నది ఆర్య భూమి అయిన భారత దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం.
ఐతే నేటి పరిస్థితిని మనం గమనించినట్లైతే వయస్సుతోనిమిత్తం లేకుండా ఎక్కదపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీలను అవమానాలకు గురి చేయడమే కాక, నిత్యము వారిపై శారీరక మానసిక అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు.
ఏమిటి దీనికి కారణం?
మనకు సమాజంలో స్త్రీలను పరిరక్షించడానికి సరైన చట్టాలు లేకనా? లేక ఆ చట్టాలలో ఉండే లొసుగులను ఆసరాగా చేసుకొని ఆ చట్టాలను అధిగమించడం చేతనా?
ప్రభుత్వములోనున్న పాలకులు కాని, సభ్య ప్రజానీకము కాని ఇటువంటి దౌష్ట్యాలను సహిస్తున్నారని భావించరాదు. ఈ దుస్థితిని అధిగమించడానికి ప్రతీ వ్యక్తీ తమంత తాము కృషి చేయాలని ఆశిస్తూనే ఉన్నారు.
ఐతే మరి లెక్కకు మిక్కిలిగా ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటారు?
మేధావులు ఈ విషయమై మూలాలను అన్వేషించ గలగాలి. పరిష్కార మార్గాలను అన్వేషించ గలగాలి.
మనలను కన్న తల్లి అమ్మ ఒక స్త్రీ.
అపరిమితమైన అనురాగాన్ని పంఛే అక్కచెల్లెళ్ళు స్త్రీలే.
భగినీ హస్తభోజనం మనకు లభిస్తోందంటే అది మన సహోదరి మన క్షేమాన్ని కోరుతూ పెట్టే భోజనమే. అట్టి భోజనము మనకు ప్రసాదిస్తున్న మన సోదరి ఒక స్త్రీయే.
అమృత హృదయంతో అపర మాతృమూర్తిగా మనలను గౌరవించే పంచ మాతృకలలో ఒక్కతె అయిన సోదరుని భార్య ఒక స్త్రీయే.
నాన్నా...నాన్నా అంటూ తండ్రి ఒడియే ప్రపంచంకన్నా మిన్న అని భావించి మన ఒడిలో సేదతీరే మన కన్న కూతురు ఒక స్త్రీయే.
తన తల్లి దండ్రులకన్న కూడా మిన్నగా అత్తమామలను చూచే మన ఇంటి కోడలు కూడా ఒక స్త్రీయే.
ఎక్కడో మనం ఆపదలో ఉన్నట్టు గమనించితే తరతమ భేదాలు లేక మనలను అత్యంత ఆత్మీయతతో రక్షించ చూచే స్త్రీమూర్తులెందరో మనకు కనిపిస్తూ ఉంటారు. వారంతా ఆత్మీయులైన స్త్రీలే.
ఇలా సమాజంలో ఏ స్త్రీని చూచినా అసాధారణ ఆత్మీయాభిమానాలకు మారు రూపుగా మనతో పాటు సంచరించుతూ మన అస్తిత్వానికి కారకులౌతున్నవారే.
అట్టి స్త్రీలు నిరాదరణకు గురి అవుతున్నరన్నా, అత్యాచారాలకు లోనౌతున్నారన్నా ఆనందించే మూర్ఖులు ఉంటారని నేననుకోను.
ఐతే ఈ అత్యాచారాలకు మూలమేమిటి?
ఈ అఘాయిత్యాలను నేతలు చేస్తున్న చట్టాలు ఎందుకు నిరోధించ లేకపోతున్నాయి?
అత్యాచార నేరాలకు శిక్షలను విధించినంత మాత్రాన అత్యాచారాలు నిరోధింపబడుతున్నాయా?
మొన్నను ఢిల్లీలో ఐదేండ్ల వసి వాడని పసి కూనపై మానవ మృగం చేసిన అత్యాచారం చూస్తే లేదని స్పష్టమౌతోంది .
ఐతే మనం ఏం చెయ్యాలి. కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవడమేనా?
అయ్యో పాపం అని మాటాడినంత మాత్రాన సరిపోతుందా?
ధర్నాలు చేసినంత మాత్రాన, ప్రభుత్వానికి మన గళం వినిపించినంత మాత్రాన ఏదైనా సాధ్యం చేయ గలుగుతున్నామా?
ఐతే మరేంచెయ్యాలి?
మేధావులు చాలా తీవ్రంగా స్పందించాలి.
ఏ సన్నివేశాలు, ఏ సంఘటనలు సహృదయుడైన మానవుని మృగంగా మారుస్తోందో అన్వేషించాలి.
మానాభిమానాలతో సభ్య సమాజంలో గౌరవ సంప్రదాయ సంస్కార పూరితులైన కుటుంబంలో పెరుగుతున్నా కూడా ఈ మాయ రోగం ఎలా వస్తోందో గుర్తించ గలగాలి.
తల్లి పొలంలో పడి మేస్తే పిల్ల గట్టున మేయదని గ్రహించాలి.
పిల్లలలో ఈ కుసంస్కృతి జన్మతః వచ్చినది కాదనే సత్యాన్ని మరువ కూడదు.
ఆచార్యాత్ పాదమాదత్తే - పాదం శిష్య స్వమేధయా - పాదం సబ్రహ్మచారిభ్యః - పాదం కాల క్రమేణతు. అని ఆర్యోక్తి.
నిజమే. జ్ఞానములో పాతిక పాళ్ళు గురువుద్వారా - పాతిక పాళ్ళు శిష్యుని ఆలోచద్వారా - పాతిక పాళ్ళు తోటివారితో కలిసి తిరగడం వలన - మిగిలిన పాతిక పాళ్ళు అనుభవం ద్వారా వస్తుందంటారు. ఇది చాలా నిజం.
పిల్లలకు మొదటి గురువు తల్లి దండ్రులు కాగా మిగిలిన వారు బోధన చేసేవారు.
వీరు ఎంత ఆదర్శమూర్తులైతే శిష్యులు అంత ఆదర్శవంతంగా తయారవతారు.
ఇప్పటి మన గురువులకే తెలుసు వారెంతటి ఆదర్శవంతులైన శిష్యులను తయారు చేస్తున్నారో.
బహుమతులు గ్రహిస్తున్న వారియొక్క మాటలలోనే మనం వింటుంటాం. మా గురువుగారి ప్రోత్సాహమే నా యీ అభివృద్ధికి కారణం అని చెప్పడం.
అట్టి గురువులు చరితార్థులు. అట్టి వారికి పాదాభివందనం చేస్తున్నాను.
మరి
అనేక నేరాలకు పాల్పడుతూ, అనేక అత్యాచారాలకు ఎగబడుతున్నవారు కూడా ఒకప్పుడు గురువు.
ఇక్కడ మనం ఒకటి మరచిపో కూడదు. వారికి పాఠం చెప్పిన గురువులు ఈ చెడుగు యొక్క నేటి ఈ ప్రవృత్తికి అలనాడు నేను కారణమా? వీనిలో మంచి బీజం నాటలేకపోయానా అని ఆలోచించుకోవాలి.
తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి వీడిలో మంచి నడవడిక మప్పలేకుండా స్వేచ్ఛనిచ్చి సమాజానికి ఒక చీడపురుగును చేశామా? అని.
సామాజికులు ఆలోచించాలి. ఈ దుష్టుని దౌర్జన్యాన్ని చూస్తూ కూడా నాకేమిలే అని ఉపేక్షించడం ద్వారా ఈ పాపంలో నాకూ భాగం ఉందా అని.
ఇక అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది.
ఒక మొక్కను తగిన వాతావరణం కల్పించి పెంచినట్లైతే వంకరటింకరలు లేకుండా అందంగా పెరుగుతుంది. ఇది ప్రకృతి ధర్మం.
అదే విధంగా
తెల్ల కాగితం వంటి శిశువు దినదినాభివృద్ధి చెందేటప్పుడు సరయిన మార్గంలో వాని బుద్ధి వృద్ధి పొందేలాగ మనంకాని - మన పాఠ్య ప్రణాళికలు కాని, మన నీతి కథలు కాని, - మన ప్రత్యక్ష ప్రవృత్తి కాని, మనవ్యక్తిత్వ ప్రభావం కాని, వాడిపై పడ కుండా ఉంటాయా?
ఈ నాడు దౌష్ట్యానికి వడికట్టుతున్న వారు కూడా మనం తిరుగుతున్న సమాజంలోనే తిరుగుతున్నారు, పెఱుగుతున్నారు. వారికి వేరే ప్రపంచం లేదు కదా? మరి ఈ దౌష్ట్యం వారిలో ఎలా పుట్టుకొచ్చింది.
అంటే సమాజమే కారణం అన్నది నగ్న సత్యం.
గుండెలపై చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతీవారూ కూడా.
నా ద్వారా ఎటువంటి మంచి చెడ్డలు సామాజికులకు అంటుతున్నాయని.
నాద్వారా ఎవరెవరెటువంటి భావావేశాలకు లోనౌతున్నారని,
నా మాటలు ఎవరెవరిపై ఎంతెంత ప్రభావం చూపుతోదో? అని.
ఔనో కాదో మీరూ ఆలోచించండి.
అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు
శ్లో:-యద్యదా చరతి శ్రేష్ఠః - తత్తదేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే - లోకస్తదనువర్తతే.
క:-ఉత్తముడు నడచు మార్గమె - యుత్తమమని తలచి నడచుచుండెద రితరుల్.
ఉత్తమమని దేనిని గొను - నుత్తము డదెగొనెదరయ్య.! యుర్విని లోకుల్.
భావము:-
లోకములో ఉత్తమ వ్యక్తి ఎట్లు నడచుచున్నాడో ఇతర జనులునూ అట్లే నడుస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం కూడా అనుసరిస్తుంది.
స యత్ ప్రమాణం కురుతే - లోకస్తదనువర్తతే.
క:-ఉత్తముడు నడచు మార్గమె - యుత్తమమని తలచి నడచుచుండెద రితరుల్.
ఉత్తమమని దేనిని గొను - నుత్తము డదెగొనెదరయ్య.! యుర్విని లోకుల్.
భావము:-
లోకములో ఉత్తమ వ్యక్తి ఎట్లు నడచుచున్నాడో ఇతర జనులునూ అట్లే నడుస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం కూడా అనుసరిస్తుంది.
అని.
ముందుగా పిల్లల తల్లిదండ్రులు శ్రేష్టులుగా ఉండ గలగాలి.
ఉపాధ్యాయులకు వేరే చెప్పనవసం లేదు.
తల్లిదండ్రులు చెడ్డవారైతే వారి పిల్లలు మాత్రమే చెడిపోతారు.
కాని ఉపాధ్యాయులు చెడ్డవారైతేమాత్రం అతని వద్ద విద్యనభ్యసించిన విద్యార్తులు కొన్ని సంవత్సరాలపాటు చెడిపోతారనేది నగ్న సత్యం.
తమ మాటల మూలమున గాని, ప్రవర్తన మూలమున గాని, జీవన సరళి మూలమున కాని, పిల్లలలో సత్ప్రవృత్తినే ప్రేరేపించ గలగాలి.
ఇక అతి ముఖ్యమైనది అన్నిటికీ మూలమైనది ప్రభుత్వము నిర్దేశించే పాఠ్య ప్రణాళిక.
నేటి పాఠ్యప్రణాళికలు సంసిద్ధము చేయుచున్నప్పుడే అనేకమైన ప్రతిబంధకములు. ఏలనన
మనది లౌకిక వాదము అగుట చేత సమాజంలో అందరికీ సమ్మతమైన ప్రణాళికయే ఉండాలి.
భాగవతంలో ప్రహ్లాదుని సత్ ప్రవృత్తిని "కన్నుదోయికి నన్య కాంతలడ్డంబైన మాతృభావము చేసి మసలు వాడు" అని పాఠ్య ప్రణాళికలో చేరిస్తే.... అదిగో హిందువులకు సంబంధించిన భాగవతాన్ని పిల్లలపై రుద్దుతున్నారు అనేవారు కొందరు.
విద్యా వివాదాయ ధనం మదాయ - శక్తిః పరేషాం పర పీడనాయ
ఖలస్య. సాధోః విపరీత మేతత్ - జ్ఞానాయ దానాయచ రక్షణాయ.
అని సంస్కృత శ్లోకాలను ప్రణాళికలో చేరిస్తే ఇది ఒక పెద్ద కుట్ర, సామాన్యులకు అర్థం కాకూడదని ఇలాంటివి పెట్టుతున్నారని వ్యతిరేకించేవారు కొందరు లేకపోరు.
యత్ సార భూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం.అన్నది గుర్తుంచుకోవాలి.
ఒక్కటి మాత్రం యదార్థం
పసితనంలో పిల్లలకు నీతి బోధన తప్పని సరి. అది కూడా పూర్వం ఉండే ప్రణాళిక ఏ విద్య్హంగా ఐతే చిఱుత ప్రాయం నుండి నైతిక విలువలను పెంపొందించే విధంగా శ్లోకాదులుండేవో అవి నేడు తప్పక అమలు చేయ గలిగితే ఇటుపై తరాలలోనైనా నైతిక ప్రవృత్తిని వృద్ధి చేయుట సాధ్యమగుననుటలో ఏమాత్రం సందేహంలేదు.
విద్యా ప్రణాళికలలో ఒకటవ తరగతి నుండి - పదవ తరగతి వరకూ కూడా నీతి బోధ అనే ఒక పిరిడు ఉండేది ఒకప్పుడు.
ఇప్పుడు అది తప్పక ఉండాలి. తప్పక నీతి బోధ జరగాలి. తప్పక నీతిశ్లోకములు - నీతి కథలు - చెప్పుతూ బోధిస్తూ ఉండడమే కాక - ఆయా అంశములపై వ్యాస రచన వక్త్రుత్వము పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులలో ఆలోచనా సరళిని పెంచ హలగాలి.
ఇట్టి ప్రణాళికలను నిర్ద్వంద్వంగా ప్రతిపాదించాలి.
కఠినమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకో గలగాలి.
ఇట్టివి తీసుకో వలసిన అవసరాన్ని ఎంత వేగంగా మేధావులు ప్రతిపాదించగలిగితే అంత వేగంగా ప్రభుత్వం కార్యోన్ముఖమౌతుందని నమ్ముతున్నాను.
కొన్నాళ్ళకైనా ఈ సమాజంలో మంచి పెరుగుతుంది. ఈ విషయమైన అలసత్వమే ఇన్ని అనర్థాలకు కారణ మని గ్రహించాలి.
సమాజంలో నైతికసామర్థ్యాన్ని పెంచలేని ప్రభుత్వం ఎంత కఠినమైన శిక్షలు ప్రతిపాదిస్తున్నా ప్రయోజన శూన్యమే అని నేటి ఈ దుస్సంఘటనలు నిలువెత్తు నిదర్శనంగా ప్రత్యక్షమౌతున్నాయి.
నా మాటలలో సత్యం ఉందో లేదో మీరే ఆలోచించండి.
ముఖ్యంగా అంతర్ జాలం ఎంతటి బహుళ ప్రయోజనకరమో చెప్పనలవి కాదు.
ఐతే దుర్మార్గ ప్రవృత్తుల చేతిలో పడి సమాజాన్ని సమూలంగా నాశనం చేయడంలో కూడా ఈ అంతర్జాలం చాలా ముఖ్య పాత్ర వహిస్తున్న మట యదార్థం. ఈ అంతర్జాలంపై నైతికసామర్ధ్యము గల ప్రభుత్వ నిర్దేశిత సంస్థయొక్క నియంత్రణ ఉండాలి. అలాగని నేటి సినీమా సెన్సార్ బోర్డు వంటిదయితే మాత్రం అది వ్యర్థమే.
సినీమాలపై సెన్సార్ బోర్డు ఉన్నప్పటికీ సకుటుంబంగా చూడతగిన సినీమాలకై వెతుకుకున్నా నిరుపయోగమే ఔతున్న మాట అబద్ధమనగలరా?
ఇక T.Vల విషయానికొస్తే సమాజంపై T.V.ప్రభావం చాలా వాలా తీవ్రంగానే ఉంటుంది.
T.V. నిర్వాహకులు తలచుకుంటే నందిని పందిగాను, పందిని నందిగాను చేసే సామర్త్ధ్యం కలవారనుటలో ఎట్టి సందేహమూ లేదు.
వీరి కారణంగా అత్యద్భుత అనామక కళాకారులు ఉన్నత శిఖరాలకు చేర గలుగుతున్నారు.
అదేవిధంగా అప్రమత్తంగా ఉండగకపోతే మాత్రం చెడును వ్యాపింప చేయడం విషయంలో కూడా వీరికి వీరే సాటి ఔతారు అనడంలో విప్రతిపత్తి లేదు.
వీరు ఎన్ని మంచి కార్యక్రమములు చూపుతున్నప్పటికీ సూదంటురాయి ఇనుమును ఆకర్షిస్తున్నట్టు సామాజిక రుగ్మతా హేతువులనతగే అశ్లీల, అసంఘిక కార్యకలాపాలను చూపించేటప్పుడు అవి విత్తనాలుగా కొందరి హృదయాలలో నాటుకు పోయి, చెడు నడతకలవడ చేస్తున్నాయి. కాన T.V. నిర్వాహకులు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ సమాజంలో మన పిల్లలు కూడా ఉంటున్నారు అనే ఆలోచన ఉండాలి.
స్త్రీల వస్త్రధారణలోగల విలువలు ధరించేవారికే తెలియాలి. ఇది స్వేచ్ఛా భారతం. మాయిష్టం మాది అంటూ పిల్లలు, వారిని వెనకేసుకొస్తున్న పెద్దలకు శతకోటి నమస్కారాలు.
నా ప్రవర్తన నాయిష్టమే. సందేహంలేది. అలాగని అది నేను సంచరించే సమాజంలో ఉండేవారిపై దూష్ప్రభావం కలిగించేదిగా ఉండకూడదనే ఇంగితం నాకుండాలే కాని మీరేం చేస్తారు?
మాహానుభావులారా! నామొరను అర్థం చేసుకోండి. నా ఆవేదనను గమనించండి. మన ఆడుబిడ్డలను గౌరవంగా బ్రతికే విధంగా సమాజం ఉండేందుకు మీ వంతు కృషి మీరు చెయ్యండి.నాకు నిజంగా ఏడుపు వస్తోంది. ఏమీ చేయలేకపోతున్న భీష్మాచార్యులులాగా బ్రతుకవలసి వస్తోందే అని చాలా ఆవేదన చెందుతున్నాను.ప్రతీ వ్యక్తీ మనస్పూర్తిగా దృష్టి సారించి ఉద్యమిస్తే ఇది అసాధ్యమేమీ కాదని మీకూ తెలుసు.
మీరేమి చేయగలరో అది చేయడానికి వెనుకాడరని విశ్వసిస్తున్నాను. ఈ నా భావనలలో ఎవరికైనా అభ్యంతరకరమైనవి ఉన్నాయని భావిస్తే మన్నించండి.అమ్మలారా! సోదరీ సోదరులారా! భారతీయ మఃహిళామణులారా! బెంగపెట్టుకోకండమ్మా. తప్పక ఈ భారతాంబ సంతతిలో పురుషులు అందరూ చావ చచ్చి లేరు.తప్పక నీ మీ మానాభిమాన రక్షకులున్నారమ్మా. తప్పక మంచిగా మీరు గౌరవస్థానంలో ప్రముఖులౌతారమ్మా. నా మాటలు సత్యమవాలని మనసారా కోరుకొంటున్నానమ్మా.
నమస్తే.
జైహింద్.
No comments:
Post a Comment